వెలుదండవారి వ్యాస శేముషి


Mon,December 10, 2018 12:54 AM


acharyae
నిత్యాన్వేషణ పేరులోనే సత్యశోధకుడు, నిరంతర శ్రామికుడు ఉన్నాడు.నేటితరంలో కొరవడుతున్న ఈ రెండు పార్శాలు మెండుగా కలిగి ఉన్నవారు వెలుదండ నిత్యానందరావు. వీరి వ్యాస సమాహారమే ఈ గ్రంథం. పరిశోధక విద్యార్థులకు దారిదీపం. సాహిత్యాభిమానులకు పాండిత్య దీపం. పది వ్యాసాలు పదింతల ఆలోచింపజేయగల వ్యాసాలు. కవులందరూ మనుషులే కాని మనుషులందరూ కవులు కారు అని చెప్తూ ఉండే నిత్యానంతరావుగారు కవులెవరు, కుకవులెవరు, ఆకవులెవరు అనేది పసిగట్టి, విమర్శ చేయగల సమర్థులు. చమత్కార వచో విలాసం అనేది అందరికీ ఉండదు. సూకా్ష్మతి సూక్ష్మ విషయాలను పసిగట్టి సాహిత్య చర్చ చేయగల ఈ వ్యాసాల్లోకి వెళ్దాం.

తెలంగాణ ప్రాచీన కవుల భావుకతా వైశిష్ట్యం అనే వ్యాసం కవి అంటే ఎవరు, భావ కవులెవరు చెప్తూనే ప్రాచీన కవులు అందించిన పద్యం విలువను విప్పి చెప్పారు. కవిత్వం రాయగలిగే శక్తిలేనివాడు ఎంతో కష్టపడి అర్థశ్లోకం రాశాట్ట. భోజ నం దేహి రాజేంద్ర ఘృతసూపసమన్వితమ్ (భోజనం పెట్టు రాజా! నెయ్యి పప్పు వేసి) ఇంకా సగం పాదం రాయాలి. రాయడానికి అవస్థలు పడుతున్నాడు. కానీ రావడం లేదు. అప్పుడు కాళిదాసు ఎదురుపడి తక్కిన సగం శ్లోకం, ఇలా పూరించాడు. మహిషం చ శరత్ చంద్ర చంద్రికా ధవళమ్ ద ధి (శరత్కాల చంద్రుని వెన్నెల లాంటి తెల్లని పెరుగు కూ డ)అని పూరించాడని రాస్తూ నిత్యానందరావు గారు అంటారు. భావుకత లేనిదానికీ, భావుకత ఉన్నదానికీ తేడా ఎలా ఉం టుందో తెలియడం కోసం ఈ చిన్ని శ్లోకాన్ని పేర్కొన్నానంటారు. కవిలోని నవోన్మేషమైన ప్రజ్ఞ చిత్రవిచిత్రంగా సృష్టి చేయగలిగిన సామర్థ్యం కలది అనీ అలాంటి మహోజ్వలమైన భావుకతను ప్రాచీన కవులు సాధించారు ప్రాచీన కవులంద రూ గ్రామీణ జీవన సౌందర్యాన్ని నిండార అనుభవించినవా రే. ప్రకృతితో పూర్తిగా మమేకమైనవారే. సంస్కృతాంధ్రాలను, పురాణాదులను మధించిన వారే. పూర్వ కావ్యరసాస్వాదం చేసి తమ ఊహాపోహలను మెరుగులు దిద్దుకున్నవారే అంటారు. కవిత్వాన్ని రాయాలనుకునేవారు ప్రాచీన సాహిత్యాన్ని చదివి రాస్తే బంగారానికి సువాసన అబ్బినట్లు ఉంటుందన్న భావం తో, ఒక ఉత్తేజాన్ని కలిగిస్తూ పాల్కురికి సోమనాథునిదీ, పోతనదీ కవితామాధుర్యం తెలుపుతూ..

వడిఁబాఱు జలమును కొడలెల్లఁగాళ్లు/వడిఁగాలు చిచ్చున కొడలెల్లనోళ్ళు వడివీచు గాడ్పున కొడలెల్లఁదలలు/ వడిఁజేయుబసవ! నీ కొడలెల్ల భక్తి.. (బసవపురాణం పేజీ.31ద్వీతాయాశ్వాసము) అనే పద్యాన్ని రాస్తూ పాల్కురికి భక్తి భావంలోని భావుకత శిఖరస్థాయికి చేరుకున్నది అంటారు. నీటికి ప్రాణముంటుందో లేదో కానీ ముందుకు కదులుతుంది. మరి కదలడానికి కాళ్ళు ఉండలి కదా? ఒడలెల్ల కాళ్లే. అగ్ని కాలుస్తుంది. దానికి ఒళ్లంతా నోరే. వీచేగాలికి ఒళ్లంతా తలలే. అట్లే బసవేశ్వరునికి ఒళ్లంతా భక్తే అని అర్థాన్ని రాస్తారు. అట్లే పోతన.. రాకేందుబింబమై రవి బింబమై మొప్పు నీర జాతేక్షణనెమ్ముగంబు/కందర్పకేతునై ఘన ధూమకేతువై యలరుఁబూఁబోణి చేలాచలంబు అనే పద్యాన్ని ఉంటంకిస్తారు. భాగవతంలోని భావుకత చందాలన్నీ విశ్లేషిస్తారు వెలుదండవారు.

మహ్మద్ కలీకుతుబ్ షా కాలం నాటి కవి సారంగు తమ్మ య్య రాసిన ఆ విప్రోత్తము వజ్ర పంజర.. నీళ్లకుం బల్చనై అనే పద్యాన్ని వివరించినా, మరింగంటి కవులైన మరింగంటి వెంక ట నరసింహచార్యులు రాసిన తాలాకనందినీ పరిణయం కావ్యంలోని పద్యాలను విశ్లేషించినా నిత్యానందరావు గారి తార్కికతనే వేరుగా ఉంటుంది. ఆలోచనాత్మకంగా ఉంటుంది. అలాగే తెలంగాణలో 500 ఏండ్ల పాటు అప్రతిహతంగా కవితా వ్యవసాయం సాగించిన వారు నల్లగొండ జిల్లాకు చెందిన మరింగంటి కవులు. వారు ప్రబంధాలు, శతకాలు, స్తోత్రాలు ఎన్నె న్నో రాశారు. మా గురువుగారు శ్రీరంగాచార్యులు. వారు మరింగంటి కవుల మీద ప్రశస్తమైన సిద్ధాంత గ్రంథం రాశారు. కొన్ని రచనలు నేటికీ అముద్రితాలు, పరిశోధకులకు ఎంతో పని మిగిలి ఉంటుంది. అనీ అంటారు.

తెలంగాణలో విజ్ఞాన సర్వస్వాలు-సూచీ గ్రంథాలు కోశాలు అనే వ్యాసం వెలుదండ వారి విస్తృత పరిశీలన జ్ఞాన సంపదని పట్టిస్తుంది. ఆనాటి విజ్ఞాన సర్వస్వాలు నేటికీ ఎంతటి స్ఫూర్తినిస్తాయో తెల్పుతారు. నిఘంటువులు, సూచీ గ్రంథాలు వాటి వివరాలన్నీ రాసిన ఈ వ్యాసం ఒక అమూల్యమైన వ్యాసం. రామదాసు సాహిత్య సమీకరణం వ్యాసం రామదాసు భక్తి తత్పరత, సాహిత్య పరిజ్ఞానం, ఆత్మ నివేదన వివరిస్తూనే సాహిత్యాభినివేశం, సంగీత పరిజ్ఞానం సమానంగా ఉన్న వారిని పద కవులని, వాగ్గేయకారులని అంటారు.
శార్గదేవుడు సంగీత రత్నాకరంలో పేర్కొన్నదీ విశ్లేషించారు. అన్నమయ్య, రామదాసు, త్యాగయ్యల గురించి రాస్తూనే వారి ఇతర కృతులు, ఈ కృతులపై నేడు విశ్వవిద్యాలయాలలో వచ్చి న పరిశోధనలు, పరిశోధకుల వివరాలు అన్ని రాశారు.

మరో వ్యాసం వ్యాఖ్యానాల్లో అర్ధ నిర్ణయం సాధక బాధకాలు లో వ్యాఖ్యానం అంటే ఏమిటి? ప్రసిద్ధ వ్యాఖ్యానాలు చేసిన పండితులెవరు, వారి గ్రంథాలు, ఆయా విశేషాలు రాస్తూనే అర్ధ నిర్ణయంలో కవులు చేసే చిన్న చిన్న పొరపాట్లను ఉదహరించారు. అనఘా మూల్య మణి ప్రరోహముల అని వసు చరిత్ర (3-34)లో ఉన్న ప్రసిద్ధ పద్యం అమూల్య శబ్దానికి విలువ కట్టలేని అని చెప్పాల్సిన చోట విలువలేని అని వ్యాఖ్యలు అభిదార్థం రాయడం మూలాన కవి హృదయం దెబ్బతిన్నది అంటారు వెలుదండ వారు. వీరి విశ్లేషణలు ఇంత టి నిశిత పరిశీలనతో ఉంటాయి. తెలంగాణలో ప్రఖ్యాత ప్రాచీ న వ్యాఖ్యాతలు మల్లినాథసూరి రాసిన శ్లోకాన్ని ఉదహరించి అర్థాన్ని రాస్తూ అంతా అన్వయ ముఖంగానే వ్యాఖ్యానిస్తారు. మూలంలో లేనిది, అవసరం లేనిది రాయకు అని చెప్పిన మాటలు సర్వజన సమదరణీయాలయ్యాయి అంటారు. వేదం వెంకటరాయశాస్త్రి, కొత్తపల్లి వీరభద్రరావు, ఉత్పల సత్యనారాయణ, దీపాల పిచ్చయ్యశాస్త్రి, నిడదవోలు వెంకటరావు, వెల్లా ల సదాశివ శాస్త్రి, శేషాద్రిరమణ కవులు వంటి పెద్దల కృషినీ తలుచుకుంటూనే, వారి వారి వ్యాఖ్యాలలోని తప్పిదాలను ఉటంకిస్తూనే, అవ్వి కనుగొన్న వారినీ స్మరించడమైనా 1) ఉద్దేశపూర్వకం 2)అవగాహన లోపం 3)తొందరపాటు లేదా ఏమరుపాటు అనే మూడు విభాగాలు చేసి వ్యాఖ్యాలను విశ్లేషించడమైనా ఎంతో ఆలోచనాత్మకంగా ఉన్నది.

గోదావరీ కవి తరంగిణి వ్యాసంలో అక్కడి కవులను పరిచయం చేయడం వెలుదండ వారి విస్తృత పఠనాసక్తినీ, పరిశోధనాసక్తినీ తెలుపుతుంది. డాక్టర్ రంకిరెడ్డి రామ్మోహనరావు, డాక్టర్ కె.వి.ఎన్.డి. వరప్రసాద్ గార్లు 267 మంది గోదావరి జిల్లా రచయితల పేర్లలో పట్టికను విడుదల చేయగా స్ఫూర్తి చెంది అందులో తమకు తెలిసిన, ఆ పట్టికలో చేరని మరో యాభై మంది కవులను గురించి ఒక వ్యాసాన్ని రాశారు. ఈ వ్యాసం పచ్చిమగోదావరి జిల్లా పెనుగొండ డిగ్రీ కళాశాల సదస్సులో ప్రసంగించినది. సాహిత్య భారతి గ్రంథంలో ప్రచురించబడినది. నాడు అక్కడి పండితులందరూ ఆశ్చర్యపోయా రు వెలుదండ వారి ప్రతిభను చూసి.

హాస్యచతురుడు విశ్వనాథ వ్యాసమొక్కటి చాలు నిత్యానందరావు గారి చాతుర్యం, రచనా పాటవం తెలియడానికి. అమాయక హాస్యం, మనస్తత్వ ప్రదర్శకం, వర్ణనాత్మక హాస్యం, అజ్ఞాన ఖండనం, తార్కిక హాస్యం, ప్రణయ హాస్యం, పేరడీ, హస్యం, మిత్ర సల్లాపం, బంధు సల్లాపం, శాబ్దిక హాస్యం, అధిక్షేపాత్మక హాస్యం చేష్టాగత హాస్యం అంటూ విభజించి, ఉదాహరణలతో సహా విశ్వనాథ వారి సాహిత్య విశ్వరూపాన్ని చూపించారు వెలుదండ వారు.
జాతీయోద్యమ సాహిత్యం అనే వ్యాసంలో విహాంగవీక్షణం చేస్తూ త్యాగధనులకు వినమ్రంగా అంజలి ఘటించడమంటే ఈ దేశవాసులుగా ఆనాటి స్వాతంత్య్ర సమరయోధులను, సాహిత్యంతో ఉత్తేజాన్ని కలిగించిన దేశభక్తులను, పత్రికల ద్వారా ప్రజలను ఉత్తేజపరిచిన వీరులుగా చిత్రించుకోవచ్చని చూపారు. బ్రిటిష్‌వారినెదించిన పోరాటాలు, ఆ సందర్భంలో వచ్చిన కవిత్వాన్ని పరామర్శించారు.

వ్యాస విలాసం అనే చివరి వ్యాసం వ్యాసం, దాని పరిధి, రచనా విధానం, నియమాలు వంటివన్ని రాస్తూనే ప్రసిద్ధులైన వ్యాసకర్తలను పేర్కొన్నారు. సహస్ర కళ పద్మంలా అపూర్వంగా విసకరించి పరిమళాలను వెదజల్లుతుంది వ్యాసం అంటూ విస్తారమైన ఈ ప్రక్రియపై సోదాహరణంగానే రాశారు. పారిశ్రామిక విప్లవానంతరం అచ్చు యంత్రం అందుబాటులోకి రావటం వల్ల గద్యానికి ప్రాధాన్యం లభించింది అంటూ ఈ వచన రూపాన్ని విశ్లేషించారు. వ్యాస రచన అనే ఈ ప్రక్రియకు మూలపురుషులనదగిన రచయితలను గురించి రాస్తూనే, చారిత్రక సామాజిక అంశాలను అన్వేషించే విధానాలు కవుల వ్యక్తిత్వాలను, వారి కృతులను కలిపి పరిశోధించడం అనే విషయ ప్రాముఖ్యాన్ని చేస్తారు.
335 పుటల ఈ నిత్యాన్వేషణం గ్రంథం ఒక కరదీపిక. నిత్యానందరావు గారి సాహిత్య పాండిత్య కీర్తి కిరీటానికి పొదిగిన మరో ఆణిముత్యం, మెరుపుల వజ్రం అని నిస్సం దేహం గా చెప్పవచ్చు. వ్యాస సాహిత్యం వంటి వ్యాస రచనా విశేషమే ఈ గ్రంథం అని కచ్చితంగా చెప్పవచ్చు.
- డాక్టర్ కొండపల్లి నీహారిణి, 9866360082

959
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles