కదిలేదీ.. కదిలించేదీ..!


Sun,December 2, 2018 11:18 PM

మోహన్ రుషి తన మొదటి కవితా సంపుటికి జీరో డిగ్రీ అని పేరు పెట్టుకున్నాడు. కానీ, అప్పటికే అందులో అతని కవిత్వం డ్బ్బై, ఎనభై డిగ్రీల స్థాయిలో వుంది. ఇప్పుడు వెలువరించిన ఈ పుస్తకానికి స్క్వేర్ వన్ అనే పేరు పెట్టాడు. ఇందులోని కవిత్వమేమో ఆఖరి స్క్వేర్‌కు దగ్గర్లో వుంది. ప్రశంసలకు పొంగిపోయి, తన రాతల్లో డీలాతనం తెచ్చుకునే రకానికి చెందినవాడు కాదు ఈయన. మరింతగా ఎదుగుతూ విశ్వరూపం దాలుస్తాడు, చూడండి.
Mohan-Rushi
చాలా కాలం తర్వాత ఓ కొత్త కలం మొలిచి, కొత్త సువాసనల్ని వెదజల్లుతున్నది తెలుగు కవితారంగంలో. నాలుగేండ్ల కింద మోహన్ రుషి పెద్ద శబ్దం చేస్తూ జీరో డిగ్రీతో కవిత్వంలోకి ప్రవేశించాడు. ఇంగ్లీష్‌లో entered with a bang అంటామే, అట్లా అన్నమాట. ఆ ధ్వని ప్రకంపనలు ఇంకా పూర్తిగా ముగియకముందే, ఇప్పుడు స్క్వేర్ వన్‌తో మళ్లీ ఓ శతఘ్ని పేల్చాడు. దీని శబ్దం కూడా తక్కువగా ఏం లేదు. ఈ రెండింటి మధ్య దిమాక్ ఖరాబ్ పేరు తో కొన్ని తూటాలు పేల్చాడు. ఫేస్‌బుక్‌లో ఇంకా పేలుస్తూనే ఉన్నాడు కూడా. జీరో డిగ్రీ,స్క్వేర్ వన్‌ల లోనిది అల్లాటప్పా కవిత్వం కాదు, అల్లల్లాడించే కవిత్వం. ఈ కవి మన సమాజంలోని చెత్తాచెదారాల కతలను, మన బతుకుల్ని కుతకుతమనిపించే వెతల ను, తనదైన రీతిలో, తలమిన్న అనతగిన శైలిలో వ్యక్తీకరిస్తాడు. మన రోజువారీ జీవితాల్ని డిసెక్ట్ చేసి, లోపల ఉన్న కల్లనూ, డొల్లతనాన్నీ, నిరర్థకత్వాన్నీ, కుహనా తత్వాన్నీ ఎక్స్పోజ్ చేస్తా డు. మన దైన్యాన్నీ హైన్యాన్నీ ఎత్తిచూపిస్తూ, మనం సిగ్గుపడే లా, కొన్నిసార్లు బిగ్గరగా ఏడువాలనిపించేలా చేస్తాడు. అయితే, ఇతని గోడు గొంతు చించుకున్నట్టుగా ఉండదు. కొన్నిచోట్ల ఏదో నవ్వులాట కోసం లైట్‌గా రాసినట్టు, మరికొన్ని చోట్ల మెత్త టి చెప్పును మఖ్మల్ బట్టలో చుట్టి కొట్టినట్టు ఉంటుంది. సెన్సిబిలిటీ, సెన్సిటివిటీ ఉండాలే గానీ, ఈ కవిత్వాన్ని చదివిన పాఠకులు తమ దుర్గతి గురించి సీరియస్‌గా ఆలోచించకుండా ఉం డలేరు. అంటే, ఈ కవితలు చార్లీచాప్లిన్ చిత్రాల్లాగా కళాత్మకం గా ఉంటాయన్న మాట. అరిగిపోయి మురిగిపోయిన పదాల కోసం పాకులాట అసలే కనిపించదు మోహన్ రుషిలో. ప్రపహించకుండా నిలిచిపోయిన నిలువ నీటి గుంట లాగా అతడెక్కడా స్టక్ కాలేదు, స్టాగ్నేట్ కాలేదు. ఫలితంగా స్టేల్ నెస్ ఎక్కడా ఉండదు అతడు రాసేదాంట్లో. తాజా డిక్షన్‌తో, ఎక్స్‌ప్రెషన్ తో రోజాలాగా పరిమళించటం అతని కవిత్వ లక్షణం. అట్లా అని ఎక్కడా ఒక్క సంస్కృతపదం కూడా వాడడా అంటే అదేం లేదు. అరుదుగా వాడినా అది చక్కగా అతికినట్టుంటుంది తప్ప బలవంతంగా తెచ్చి పెట్టినట్టుండదు. శూన్యంలో గిరికీలు కొట్టడం ఆట/అర్ధోక్తిలో ఆగిపోయిందే పాట అంటాడొక చోట. అర్ధోక్తికి బదులు మాటల నడుమ అని రాస్తే అర్ధోక్తితో వచ్చే ఆ కాంప్లిమెంటరీ బ్యూటీని మిస్సవుతామనే విషయం అతనికి బాగా తెలుసు.

మాండలిక పదాలు, అచ్చతెలుగు పదాలు, తత్సమాలు, ఆంగ్ల/హిందీ/ఉర్దూ పదాలు.. ఇవన్నీ ఎంతో సహజసౌందర్యంతో వెలిగేలా, పూర్తిగా నప్పేలా, ఒక క్రూడ్ బ్యూటీతో పురి విప్పేలా ఉపయోగించడమనే విద్య తెలిసినవాడు మోహన్ రుషి. ఈ కవితా శీర్షికలను చూడండి, మీకే తెలుస్తుంది ఈ విష యం. బరిబాతల, వీలు చేసుకొని, స్పష్టాస్పష్టం, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే, నీలె నీలె అంబర్ పర్, పంచనామా, ఎక్లా చోలో అనే బెంగాలీ శీర్షిక కూడా ఉంది ఒక కవితకు! ఇంకా కొన్ని సందర్భాల్లో ఒకే శీర్షికలో రెండు భిన్నభాషల పదా లు అసమాన సౌందర్యంతో అల్లుకుపోయి ఉంటాయి. ఉదాహరణకు, ట్రూలైతో అలైబలై. ఎంతో వెరైటీ ఆ శీర్షికల్లో. చమత్కారాన్నీ, చమత్కారం నిండిన వ్యంగ్యాన్నీ దట్టిస్తూ వాక్యాలను వెలిగించడం ఇతని రచనా సంవిధానానికి ఒక గొప్ప అసెట్ (asset). బాగా రాటు తేలాం కనుక రక్తం బయటకు కనపడనివ్వం అని ఒకచోటా; ఇల్లే ఇలలో హెల్లు అని, ఇల్లాలే దొరికిన సాధువని కవితలల్లిన కచ్రాగాల్లమై, డస్సిపోయిన డల్ హౌసీలమై అని ఇంకొక చోటా; అవసరంలేని చోట అతిగా స్పందించాలి/సాయం చెయ్యాల్సి వచ్చేచోట వ్యక్తిత్వ వికాసం గురించి చర్చించాలి/ఎత్తులకు పై ఎత్తులను వేస్తూ జోన్ గానూ, జోలె తోనూ.. అని మరొకచోటా ఎంతో యూనిక్ గా రాస్తాడు. మనసే అందాల బొందావనం అన్న వాక్యం వ్యం గ్య చమత్కారాలు కలగలిసిన సుందర బృందావనం. ఫేక్‌బు క్‌అనే కవితలో వాట్స్ ఆన్ యువర్ మైండ్? దేర్ ఈజ్ నో మైండ్! ఉన్ననూ అది సెల్ఫీల కుల్ఫీలతో తిమ్మిరెక్కి యున్నది. ఫీలింగ్ స్లీపీ-అంటాడు. అంత్యప్రాసలకన్న అలిటరేషన్ (alli teration)ను ఎక్కువగా చూడొచ్చు మనం, ఇతని కవిత్వంలో. అదికూడా మోతాదును మించలేదు. విశిష్ట భావవ్యక్తీకరణ మామూలు మాటల ద్వారా కూడా సాధ్యమేనని నిరూపిస్తూ రాసిన ఈ వాక్యాలను చూడండి.. నిశ్శబ్దం గడ్డ కట్టినప్పుడు, ఏ దిక్కునుంచీ ఎగిరొచ్చే పావురం కనిపించనప్పుడు, ఒక యాంత్రిక దినచర్య నిన్ను కబళించివేసి కాలందండెం మీద మసిగుడ్డలా ఆరేసినప్పుడు.. పాత తీర్మానాలనే మళ్లీ మళ్లీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.

వీలు చేసుకొని కవితలో.. ఎప్పుడూ కూర్చునే గది కాకుం డా మరొక గది కావాలి. బాల్కనీ తలుపులోకి తెరుచుకోవాలి అనటం అల్యూజన్‌కు మంచి ఉదాహరణ. మామూలు కవి ఇదే భావాన్ని ఇట్లా చెప్తాడు బహుశా: అన్ని ఆలోచనల్నీ ఆహ్వానించే హృదయముండాలి నీకు. బయటి గాలి నేరుగా నీ బెడ్రూ మ్‌లోకే రావాలి. అట్లానే, యాత్రా స్పెషల్ అనే కవితలో నడిచే దారుల్లోంచే అయినా పర్లేదు. నిన్నటిది కాని రోజుని తెరవాలి అంటాడు. పూర్తిగా తెలంగాణ యాసను ఉపయోగిస్తూ రాసిన వాల్లు ఉన్నరు, మనం లేము అనే కవిత అద్భుతం. ఉత్తగనే అటూఇటూ ఉర్కుతరు/చెంగడబింగడ ఎగుర్తరు అంటూ మొదలు పెట్టి ఏ లోకాలకెల్లి వొచ్చి/మన పక్కన జేరిర్రో గాని.. అం టూ ముగిస్తాడు. సుమారు ఇరువై పంక్తులున్న ఈ కవితలో మాండలికం కానటువంటి ఒక్క మాటనైనా పట్టుకోలేం. ఈ ప్రాంతపు యాసతో కవిత్వం రాయాలనుకునే కవులందరూ దీన్ని చదివి, మంచి మాండలిక కవిత్వం రాయడమెలాగో నేర్చుకోవచ్చు. కవితారచన మెళకువలు తెలిసినవాడు కాబట్టే శీర్షికను అట్లా రూపొందించాడీయన. వాల్లు బతికి ఉన్నరు మనం బతికిలేము అనో, వాల్లు పానంతో వున్నరు మనం పానంతో లేము అనో అనటంకన్న ఇతడు పెట్టిన శీర్షిక బాగుందని గుర్తించడం కష్టమేం కాదు. కొన్నిచోట్ల అనవసర పదాలను తీసేస్తే కవిత్వం మరింత బాగా మెరుస్తుంది అనటానికి ఇదొక నిదర్శనం. మోహన్ రుషి వాక్యాల్లోని/పంక్తుల్లోని చివరి పదాలు ఒకే రకమైనవిగా ఉండటం కంటిన్యుటీని అష్యూర్ చేస్తుందనే విషయాన్ని పాఠకులు గమనించవచ్చు. వాక్యాలను విశిష్టంగా, ఇతర కవుల కంటే భిన్నంగా రాయడమనే నేర్పు మోహన్ రుషి లో పుష్కలంగా కనిపిస్తుంది. ప్రాణం పోకపోవడమే చావూ కా దు, శ్వాస వుండటమే బతుకూ కాదు.. అంటాడొక చోట. చాలా అవసరమైతే తప్ప ఆంగ్ల పదాలను వాడకూడదు అనే తీర్మానం ఇటువంటి కవిత్వానికి వర్తించదు. ఎందుకంటే, ఇంగ్లీష్ పదాలను ఉపయోగించడం ద్వారా తన కవిత్వంలో ఒక సహజత్వా న్ని, సౌందర్యాన్ని సాధిస్తున్నాడీయన. అది లేనప్పుడు ఆంగ్లపదాలు అనవసరంగా వాడొద్దనేది సమ్మతించదగినదే. ఇతని కవితలెన్నింటిలోనో ఇదమిత్థమైన ప్రారంభం ఉండకపోవడం ఇంకొక విశేషం. కేవలం వున్నట్లుగా వుండాలి. నీ ఆనవాళ్లు తెలీకుండా ఏదో ఒక మూలన. అనామకంగా - అన్న ది ఫీల్‌గుడ్ కవితకు ప్రారంభం.

ఏం పర్లేదు. ఎక్కడికీ వెళ్లిపోని/శూన్యమొకటి ఎలాగూ వుంటుంది.. ఇవి దిక్కు అనే కవితలోని తొలిపంక్తులు. వ్యవహారంలో వున్న పదాలను, వాక్యాలను కొద్దిగా మార్చి కొత్తదనాన్ని, చమత్కారాన్ని మెరిపించడం కూడా ఇతని పద్ధతుల్లో ఒకటి. కుక్కపిల్లలూ దేవుడూ చల్లనివారే, లైఫ్ ఈజ్ డ్యూటిఫుల్, నీడిల్ ఆఫ్ ది అవర్, ఫేక్ బుక్, అపార్ట్మెంటాల్టీ-మొదలైనవి కొన్ని ఉదాహరణలు. ఎవరి ఖాతావరణంలో వాళ్లు అంటాడొక చోట. మరోచోట గబగబా వచ్చి భగభగా వెళ్లిపోతారన్నాడు. ఇట్లాంటి సహజ ప్రతిభ ఉన్న కవికి వ్యుత్పత్తి (చాలా పుస్తకాలు చదవటం అనే సెన్స్‌లో) అంతగా లేకపోయినా ఫరవా లేదేమో. వేలెత్తి చూపించతగిన లోపం నాకైతే ఒక్కటి కూడా కనిపించలేదు, మోహన్ రుషి కవిత్వంలో. ఇది పూర్తి సిన్సియార్టీతో అంటున్న మాట. సమాజంలో మనచుట్టూ వున్న అవకతవకలను, అన్యాయాన్ని, ఆక్రోశాన్ని పట్టించుకోకుండా వుండలేదు ఈయన. సరళమైన భాష అనే మాయలో పడి అం తటా దాన్నే నింపి, విశిష్ట భావవ్యక్తీకరణకు గండికొట్టే పరిస్థితి ని తెచ్చుకోలేదు. సంకరభాషతో సంకటం ఏర్పడుతుందని జడి సి మడి కట్టుకోకుండా, ఆంధ్రాంగ్ల హిందీ ఉర్దూ పదాలను అం దంగా మిక్స్ చేయటం మానలేదు. భావం అర్థం కాకపోవడమంటూ ఎక్కడా కనపడదు. కొత్తదనం, వైవిధ్యం పుష్కలం గా ఉన్నాయి ఇతని కవిత్వంలో. కవిత్వం పలుచనయ్యే పరిస్థి తి రాకుండా జాగ్రత్తపడ్డాడు. దీనికోసం ఏ ప్రత్యేక ప్రయత్న మూ చేయాల్సిన అవసరం అతనికి రాలేదన్నది వేరే విషయం. ఏ పాత కవినీ అనుకరించిన దాఖలాలు కనిపించడంలేదు. పూర్తిగా తనదైన శైలిని, రచనావిధానాన్ని సాధించాడు. ఏ విషయంలోనూ అతిని చూపించలేదు. చాలావరకు ఏ ముఖ్యవిషయాన్నీ అసలే పట్టించుకోకుండా ఉండలేదని చెప్పొచ్చు. పుస్తకంలో ఎక్కడచూసినా మోహన్ రుషితనమే కనిపిస్తుంది. ఇన్ని సుగుణాలున్న కవులు అరుదుగానే ఉంటారు. మోహన్ రుషి తన మొదటి కవితా సంపుటికి జీరో డిగ్రీ అని పేరు పెట్టుకున్నాడు. కానీ, అప్పటికే అందులో అతని కవి త్వం డ్బ్బై, ఎనభై డిగ్రీల స్థాయిలో వుంది. ఇప్పుడు వెలువరించిన ఈ పుస్తకానికి స్క్వేర్ వన్ అనే పేరు పెట్టాడు. ఇందులోని కవిత్వమేమో ఆఖరి స్క్వేర్‌కు దగ్గర్లో వుంది. ప్రశంసలకు పొంగిపోయి, తన రాతల్లో డీలాతనం తెచ్చుకునే రకానికి చెందినవాడు కాదు ఈయన. మరింతగా ఎదుగుతూ విశ్వరూపం దాలుస్తాడు, చూడండి.

స్క్వేర్ వన్ పుస్తకంలో విషయసూచిక లేదు. ఫలానా కవితలోని ఒక పాయింట్ గురించి రాద్దామనుకునే సమీక్షకుడు, ఆ కవిత ఉన్న పేజీని దొరికించుకోవడానికి కొంత శ్రమ పడా లి. అదే జరిగింది నా విషయంలో. ఏదేమైనా, ఆధునిక వచన కవిత భవిష్యత్తుకు ఆశాదీపం.. మోహన్ రుషి.
- ఎలనాగ, 98669 45424

656
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles