ఓ నెలవంక లైఫ్ @ చార్మినార్


Sun,December 2, 2018 11:18 PM

Life-Charminar
గుండెకు గాయమైనపుడల్లా అగ్నిశిఖలా ప్రజ్వరిల్లి ఆర్ద్రంగా కవిత్వాన్ని అందిస్తుంటారు ఐనంపూడి శ్రీలక్ష్మి. అక్షరమాలలో అందరూ మరిచిపోయి, అస్సలు వాడని ఐనే ఇంటిపేరుగా ఐనంపూ డిఅని రాసుకొని ఐకి గౌరవస్థానం ఇచ్చారు. ఐ అనే ది ఆంగ్ల పరిభాషలో నేనుకు సమానం. నేను అనే ఐడెంటిటీతో ఆమె కవిత్వానికి శ్రీకారం చుట్టింది. వాస్తవ జీవన చిత్రణలో ఒక ప్రత్యేకతను చూపించింది. కవిత్వం ఆమెకు ఆరోప్రాణం. కవిత్వాన్ని ప్రేమించినంతగా బహు శా జీవితాన్ని కూడా ప్రేమించదేమో! అందుకు నిదర్శనం ఆమె సృజించిన దీర్ఘకవిత లైఫ్@చార్మినార్. లైఫ్@చార్మినార్!.. అచేతన వస్తువులో చైతన్యాన్ని నింపి, అమూర్తాలలో జీవాన్ని నింపి అక్షరశిల్పాలలో నిర్మించబడిన ఓ సహజసుందర డాక్యు పోయెవ్‌ు. హైదరాబాద్ మహా నగరానికి సాంస్కృతిక చిహ్నం చార్మినార్. 400 ఏండ్లకు పూర్వం కూడా హైదరాబాద్ నేలకు చరిత్ర ఉన్నది. కానీ కుతుబ్‌షాహీ ప్రభువు నిర్మించిన చార్మినార్‌తోనే హైదరాబాద్ నగరానికి ఒక అస్తిత్వం వచ్చింది. ఈ అంశాన్నే ప్రతిపాదిస్తూ దీర్ఘకవిత మొదలవుతుందిలా..
వేనవేల స్వప్నాల
లక్షలాది ఆకాంక్షల
వెలుగునీడలకు సంకేతం
నాలుగు వందల తరాల జీవితం,
చార్మినార్..
ఒక అర్థవంతమైన, అందమైన ప్రారంభం, ప్రగాఢమై న ముగింపునకు మార్గం వేస్తుంది. తరతరాల జీవనదృశ్యాలే కాదు, మానవ జీవితంలోని సుఖ, దుఃఖాలను, సంఘర్షణలను వెలుగునీడలనే పదబంధంతో వ్యక్తం చేశారు ఐనంపూడి.
చార్మినార్‌కు గల నాలుగు మినార్‌లను నాలుగు అంశాలకు సంకేతంగా చిత్రిస్తూ..
ఒక మినార్- చారిత్రక వారసత్వం
ఒక మినార్-సమకాలీన జీవనం
ఒక మినార్-పర్యాటక చేతనం
ఒక మినార్-వ్యథాభరిత హృదయం.. అని చెప్పి సమగ్ర దర్శనం గావించారు.
చారిత్రక వారసత్వంగా నిలిచి, సమకాలీన జీవనాన్ని ప్రతిబింబిస్తూ పర్యాటక చేతనంగా అలరిస్తూ, వ్యథాభరిత హృదయాలకు నిలయమైన చార్మినార్ దగ్గర గల పలు రక రకాల జీవన చిత్రాలను చూపించడానికి సమాయత్తమైనట్లు ఈ దర్శనంలో తెలుస్తుంది.

Ozymandius పోయెంలో ఓ యాత్రికుడు గ్రీకు చక్రవర్తి Ozymandius విశ్లథశిలను చూసి చలించి కవితో ప్రస్తావించి న పంక్తులు పాఠకులను కదిలించినట్లు, ఐనంపూడి వాక్యాలు మనలను ఆలోచనాపథంలోకి తీసుకెళ్తాయి.
ఇక్కడ ఇంకో విషయం ప్రస్తావించాలి. జీవితాన్ని కవిత్వీకరించడం వేరు. కవిత్వంలో జీవన దృశ్యాలను ఆవిష్కరించడం వేరు. అయితే వేల జీవనవిధానాలకు ఆశ్రయ మై, వేలాది స్మృతులకు సాక్ష్యంగా నిలిచిన చార్మినార్‌ను, ఎన్నో కోణాల్లో హృదయంతో వీక్షించి, భావోద్వేగాలను నియంత్రించుకొని సార్వజనీనంగా చిత్రించడంలో కృతకృత్యులయ్యారు ఐనంపూడి.
ఆధ్యాత్మిక భావ పరిప్లావితమైన పవిత్ర రంజాన్ మాసంలో ఆమె చార్మినార్‌ను దర్శించింది. ఆ దివ్యసాక్షాత్కారానుభూతిలో తడిసి ముద్దయినది. ఆమెలోని కవితాక్షరాలు అక్షరహంసల్లా కదిలాయి. రంజాన్ పరిమళాలను మోసుకొస్తూ చార్మినార్‌ను సరికొత్తగా అలంకరించాయి.
రంజాన్ మాసపు సాయంత్రమది...
నగరమంతటా
తెల్ల మఖమల్‌లా పరచుకొన్న చలిపవనం..
చార్మినార్‌కు
వందల మీటర్ల దూరంలోనే గాయబ్ అవుతుంది..
వాస్తవానికి ఒక్క రంజాన్ మాసమే కాదు, సంవత్సరం పొడుగునా చార్మినార్ వద్ద సందడే ఉంటుంది. మనుషు లు నడిచేందుకే దారి ఉండనంత రద్దీగా ఉంటుంది. అక్క డి ఉరుకుల పరుగుల జీవితాన్ని..
ఆ వైశాల్యం రోడ్డుది కాదు
ప్రజల గుండెల్లోది.. అని తీర్మానించడంలో కవయిత్రి అవగాహన తీరును విశాల దృక్పథాన్ని సూచిస్తుంది. ఇలా ఈ దీర్ఘ కవితలో ఒక అంశాన్ని ప్రతిపాదిస్తూ, ఆ అంశాని కి గల హేతువును కూడా వివరిస్తూ చక్కని శిల్పాన్ని పాటించారు కవయిత్రి.
ప్రపంచ సాహిత్యంలో ప్రాచీన కట్టడాలు, కోటలు, మందిరాలపై స్మృతి కవితలు ఎన్నో వెలువడ్డాయి. ఐనంపూడిది స్మృతి కవితకాదు. చార్మినార్ విస్మృత కట్టడమూ కాదు. నిజానికి చార్మినార్‌కు విస్తృతి ఎక్కువ. అందుకే రేయింబవళ్ళు కాదు, సంవత్సరం పొడుగునా సందడే! అదొక ప్లోటింగ్ లేక్. ప్రతి గడియకు అక్కడ జీవనచిత్రం మారుతుం ది. ఆ మారిపోయే దృశ్యాలను, అలంకారికంగా, అర్థవంతంగా సందర్భానుసారంగా చిత్రించి ఓ ముక్తాయింపునిచ్చింది. మాన వ జీవన సంవేదనలు, సంక్షోభాలు, సం తోష సంతాపాలు, విలాస, వినోదాలను నేర్పుతో పూలజడవోలె అల్లుతూ ఈ దీర్ఘకవితను నిర్మించింది.
నిన్న అనేది నేటి స్మృతి. రేపు అనేది నేటి స్వప్నం అని ఖలీల్ జిబ్రాన్ కాలాన్ని అందంగా నిర్వచించారు. ఖలీల్ జిబ్రాన్‌ను ఎంతో అభిమానించే ఐనంపూడి చార్మినార్‌ను కూడా కాలంతో ముడిపెట్టి వర్ణించిందిలా.

కాల పరీక్షకు నిలిచి గెలిచిన చార్మినార్
కాలాన్ని ఇంకా కొలుస్తూనే వుంది..! (పుట 24)
కాలాన్ని కొలిచే కాలనాళిక వలె చార్మినార్‌ను ఓ కాలాతీత దృగ్విషయంగా చెప్పడం ఆమె తాత్త్విక ధోరణికి నిదర్శనం. ఈ దీర్ఘకవితలో గతితార్కిక స్పర్శ, తాత్త్విక దృష్టి, సౌందర్యారాధనతో బాటు ఒక సౌకుమార్యం దాగి ఉంది.
ఈ కవిత ముగింపులో..
చార్మినార్
నగరం చెక్కిలిపై ఘనీభవించిన కన్నీటి చారిక
నగరం కన్నుల్లో విరిసిన కొత్త ఆశలగీతిక..
అని చెప్పిన తీరు, తాజ్‌మహల్ పోయెంలో రవీంద్రనాథ్ టాగూర్ రాసిన పంక్తులు గుర్తుకుతెస్తాయి. ఆయన
Eternal tear drop on cheek of time అని అన్నాడు. నిజమే! చార్మినార్‌కైనా, తాజ్‌మహల్‌కైనా కాల మే సాక్షి! తాజ్ ప్రేమకు మాత్రమే చిహ్నం. కానీ, చార్మినార్ మానవతకే నిలువెత్తు రూపం.
చివరగా ఒకమాట..
మీలోని వాణ్ణి
కానీ,
నిలువెత్తు తెర వెనుక
నిలబడ్డవాణ్ని..
అని తిలక్ అన్నట్లు.. చార్మినార్ వెనుక, కవిత్వమనే తెరవెనుక నిలబడి దీర్ఘకవితా చార్మినార్‌ను నిర్మించిన ఐనంపూడి నిస్సందేహంగా అభినందనీయురాలు.
- డాక్టర్ వి.వి.రామారావు, 9849237663

614
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles