సాహితీ ప్రపంచంలో మణిపూసలు


Sun,November 25, 2018 10:50 PM

వడిచర్ల సత్యం చెప్పిన ఈ కొత్త మణిపూసలు సమకాలీనమైన అంశాలను, జీవిత సత్యాలను, ప్రాసంగికత వున్న విషయాలనే గాక, తాత్విక పరిధిని కూడా స్పృశించటం అభినందనీయం. వీరి ఈ ముక్తకాలు కొత్తగా కవిత్వం రాస్తున్న కవులనే కాకుండా వరిష్ఠులను కూడా ఆకర్షిస్తాయనటంలో అతిశయోక్తి లేదు. అభ్యుదయమార్గంలో నడుస్తూ ప్రజల జీవన చిత్రాన్ని ప్రతిబింబిస్తూ వడిచర్ల సత్యం సృష్టించిన మణిపూసలు అమూల్య వజ్రాలుగా భాసిస్తాయని ఆశిస్తున్నాను.

శ్రీపద అన్న కలం పేరుతో రచనలు చేసే వడిచర్ల సత్యం కవిగా ప్రసిద్ధుడు. ఇప్పటికే అక్షరాలతో ఆడుకుందాం, విప్పి చెప్పు బాల, తెలుగు శత కం, తెలంగాణ గాంధీ కేసీఆర్, చెఱువు నవ్వింది వంటి అనేక కవితా సంపుటాలను రచించి ప్రచురించారు. వారు అచంచల తెలంగాణవాది కావటం మరొక ప్రధానాం శం. అందుకే ఇటీవల 2018 జూన్ 2న జిల్లాస్థాయి విశిష్ఠ కవి గా గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వం వారికి పురస్కారాన్ని ప్రదానం చేసి సన్మానించింది. వడిచర్ల సత్యం ఇప్పుడు మణిపూసలు అన్న కొత్త లఘురూప కవితలు రాసి, సాహిత్య సమాజం ముందుకు తెస్తున్నా రు. మన తెలుగు సాహిత్య చరిత్రలో లఘు కవితారూపానికి శతాబ్దాల నుంచి ఆదరణ ఉన్నది. ముఖ్యంగా ద్విపదలతో తొట్టతొలిసారి కావ్యం రాసిన పాల్కుర్కి సోమన అల్పాక్షరముల ననల్పార్థ రచన
కల్పించుటయ గాదె కవి వివేకంబు అన్నాడు. ఈ మహాకవి లఘు రూప కవితను ఆదరించటమే కాదు, అందులో సామాన్యుల కథలను, అతి సామాన్యుల మనోభావాలను అసలైన తెలుగు భాషలో చిత్రించి చరితార్థుడయ్యాడు. అంటే 13వ శతాబ్దంలోనే సామాన్య ప్రజల గూర్చి రాస్తేనే సాహిత్య ప్రయోజనం నెరవేరుతుందన్న ముందుచూపును ప్రదర్శించినవాడు సోమన. సోమన రాసిన వృషాథిప శతకమే తెలుగులో తొలి శతకం. ప్రతీ శతకం ముక్తక స్వభావం కలిగిన నూరు లేదా అంతకంటే ఎక్కువ పద్యాల సంపుటి. ప్రతి ముక్తకం లఘురూప కవితనే. ఆ తర్వాత సుమతి, వేమన, రామదాసు, శేషప్ప వంటి కవులు ముక్తక ప్రక్రియ అయిన శతకాన్ని ముందుకు తీసుకుపోయారు. విదేశీ భాషల్లో కూడా లఘుకవితా రూపాలున్నాయి. ముఖ్యంగా జపాన్‌లో పుట్టిన హైకూ రూపం అన్ని దేశాల్లోకి విస్తరించిన ఏకైక ప్రక్రియ. దీన్ని తెలుగులో గాలి నాసరరెడ్డి, పెన్నా శివరామకృష్ణ, రూప్‌కుమార్ వంటివారు రాస్తున్నారు. పారసీ, అరబ్బీ, ఉర్దూలలో ఎంతో ప్రాచుర్యం పొందిన గజల్ రూపంలోని షేర్లు కూడా ముక్తకాలే.19వ శతాబ్దానికి చెందిన గాలిబ్ షేర్లు ప్రపంచవ్యాప్తంగా పేరుపొందాయి. సూక్ష్మంలో మోక్షంలాగా చెప్పే పద్ధతికి క్రమంగా ప్రాచుర్యం లభిస్తూ వచ్చింది. మొత్తం రామాయణాన్ని కట్టె కొట్టె తెచ్చె అన్నవాడు ఎవరో తెలియదు. కానీ సారాంశాన్ని మూడు మాటల్లో చెప్పి నిరక్షరాస్యుల మన్ననను కూడా పొందగలిగా డు. అంటే తెలుగువారి స్వభావంలో లఘుకవితా రూపాలకు ముందు నుంచి బీజాలున్నాయని చెప్పవచ్చు.

మినీ కవిత అన్న పేరుతో కాకపోయినా తెలుగు సహజాతిసహజంగా రెండు, మూడు చిన్న పాదాలలో భావాన్ని వ్యక్తం చేసిన ఆధునిక కవులకు లోటు లేదు. పుట్టుక నీది/చావు నీది/బతుకంతా దేశానిది అన్న ప్రజా కవి కాళోజీ కేవలం 17 అక్షరాలలో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ గారి జీవితాన్ని చిత్రించటం జరిగింది. వసీరా అనే కవి కాళ్ళు తడువకుండా సముద్రం ఈదవచ్చు కానీ, కన్ను తడువకుండా సంసారం ఈదలేము అన్నాడు. సంసార సాగరం ఎంత గహనమైందో, సామాన్యులు దైనందిన జీవితంతో చేస్తున్న పోరాటం ఎంత గొప్పదో కవి రెండు పాదాల్లో చెప్తున్నాడు. వీటిని, ఇట్లాంటి వాటిని మినీ కవితలు అన్నారు. ఈ మినీ కవితలకు పాద నియమం కానీ, అక్షర నియమం కానీ లేదు. వచనా కవితా లక్షణం కలిగి ఉంటాయి. నిర్బంధాలు లేని స్వేచ్ఛాయుతమైన వాతావరణం ఉంటుంది. గత ఇరువయ్యేండ్లుగా బాగా ప్రాచుర్యం పొందిన ప్రక్రియ నానీలు దీని సృష్టికర్త డాక్టర్ ఎన్.గోపి. ఇది 20-25 అక్షరాల మధ్య నాలుగు పాదాలు కలిగి ఉండాలి. పాద నిర్బంధం వున్నా అక్షర నియతిలో కొంత వెసులుబాటు ఉంది. డాక్టర్ ఎస్.రఘు, చిల్లర భవానీ దేవీ, చింతకింది శ్రీనివాసరావు వం టి అనేకులు ఇప్పటిదాకా 200 పైగా నానీ సంపుటాలు వెలువరించారు. ఇట్లా ముత్యాల సరాలు, రెక్కలు, గాథ, వ్యంజకాలు, మొగ్గ ల, వంటి పేర్లతో మినీ కవితా రూపాలు ఎన్నో ప్రస్తుతం చెలామణిలో ఉన్నాయి. ప్రతీ రూపానికి ఎంతో కొంతమంది కవుల ఆదరణ, పాఠకాదరణ లభించాయని చెప్పవచ్చు. ఇవిగాక డాక్ట ర్ ఏనుగు నర్సింహారెడ్డి వంటి కవులు రుబాయీలు, సూరారం శంకర్, కిరణ్ కుమారి గద్వాల్ వంటివారు తెలుగు గజళ్ళు రాస్తున్నారు. అట్లా వీరు దాశరథి, సినారెల వారసత్వాన్ని నిలబెడుతున్నారు. ప్రస్తుతం మన వడిచర్ల సత్యం కూడా ఇదే ఒరవడిలో మణిపూసలు అన్న కొత్త లఘురూప కవితకు అంకురార్పణ చేశారు.

గాలి లేకపోయినా
నీరు లేకపోయినా
సృష్టికి చలనంబు లేదు
కాంతి లేకపోయినా అన్న నాలుగు పాదాలు మొట్టమొదటి సారిగా వాల్మీకి నోట అనుష్టుప్ ఛందస్సు పలికినట్లుగా వడిచర్ల సత్యం నోటి నుంచి వెలువడ్డాయి. ఈ అప్రయత్న రూపంలోని లయ కవిని ఆకర్షించింది. ఒకటి, రెండు, నాలుగు పాదాల చివ ర అంత్యప్రాస ఉంది. మూడవ పాదం విలక్షణంగా ఉంది. అంతేకాదు, ఈ నాలుగు పాదాల రచన అచ్చం రుబాయి లాగా ఉందని కూడా వారు గర్తించారు. అయితే రూబాయీలు రూపంలో ఇంకా పెద్దవిగాను, పద్యం లాగా ఉంటాయని కూడా గ్రహించారు.
ఆ తర్వాత 180 దాకా రచించాడు సత్యం. ఈ ముక్తకాలకు మణిపూసలు అన్న నామకరణం చేసి, 2018 ఏప్రిల్ 26 నుంచి వార్తాపత్రికలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ, కవి సమ్మేళనాల్లో వినిపిస్తూ వచ్చారు.
* ప్రతి మణిపూసలో నాలుగు పాదాలుంటాయి.
* 1,2,4 పాదాలకు అంత్యానుప్రాస, 10,11,12 మాత్రలలో ఏదైనా ఒకే సంఖ్యను ఉపయోగించాలి. అనగా 1,2,4 పాదాల్లో మాత్రలు సమానంగా ఉండాలి.
* 3వ పాదానికి అంత్యాను ప్రాస ఉండరాదు. 10 నుంచి 12 మాత్రలుండాలి.
* 3,4 పాదాలలో కవితా మెరుపుండాలి అన్న నియమాల తో మణిపూస రూపొందింది.
ఇప్పుడు వడిచర్ల సత్యం రాసిన కొన్ని మణిపూసలు చూద్దాం.
నీళ్ళు నిండినట్టి చెఱువు
ఊరికదియె కల్పతరువు
సస్యలక్ష్మి నవ్వులు విని
పారిపోవునంత కరువు! ఇందులో చెఱువు, తరువు, కరువు అంటూ 1,2,4 పాదాలలో అంత్యప్రాసను పాటించటం జరిగింది. మూడవ పాదం లక్షణం ప్రకారం విలక్షణంగా ఉంది. అన్ని పాదాలలో 12 మాత్రలున్నాయి. ముఖ్యంగా ఇందులోని వస్తువు సమకాలికమైనది. మన తెలంగాణలో ఉద్యమస్ఫూర్తి తో సాగిన చెరువుల మరమ్మతులు, పూడికల తీసివేత, నిర్మాణాల ఫలితంగా రైతన్నలు సమస్యలు లేకుండా పంటలు పం డించే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పాతకాలపు పాడు కరువురోజులు అంతరించి మంచిరోజులు వచ్చాయన్న స్పృహ ఈ మణిపూసలో కనిపిస్తున్నది. ఇంకో మణిపూస చూద్దాం.
సుతుల పట్ల కన్న తల్లి
హృదయమెప్పుడు పాలవెల్లి
ఆమె ఋణము దీర్చుకొనగ
సేవింపుము మళ్ళి మళ్ళి!
తన పిల్లలకు పాలిచ్చి పెంచే కన్నతల్లి ఆ తర్వాత దశలో కూడా పాల సముద్రం లాగా ఆలనాపాలనా చూస్తుంది. ఆమె రుణం తీర్చుకోవాలనుకుంటే ఆమెను నిరంతరం సేవించటం ఒక్కటే మార్గం. ఒక జీవిత సత్యంతో పాటు, సందేశాన్ని చెప్తు న్న మణిపూస ఇది. తల్లి హృదయాన్ని పాలవెల్లి అనటంలో అది నిర్మలమైనదని, పోషణనిచ్చేదని కవి చెప్పదలచుకున్నా డు. మథనంచేస్తే అది అమృతం అందిస్తుందన్నది అంతరార్థం.

అతి కూడిన వేగము
అనర్థముల భాగము
నిలుకడగల జీవితాలె
అనుభవించు భోగము! అన్న మణిపూస ఎంతో ప్రాసంగికతను కలిగి ఉన్నది. అతివేగంతో ప్రాణాలు కోల్పోతున్న వారి లో యువకులే ఎక్కువ. అందుకే నిలుకడ లేదా నెమ్మది చాలా అవసరం. ఈ తత్వం వున్నవారే జీవన సౌఖ్యాలు అనుభవిస్తా రు. అతి సర్వత్ర వర్జయేత్ అన్న సూక్తి ప్రకారం అతి వేగానికే కాదు జీవన విధానానికి కూడా వర్తించేది. సంయమనం తప్పిన జీవనశైలి అనర్థహేతువన్నది కవి హృదయం.
కలిసివుండ నివ్వదు
కూడితిరుగ నివ్వదు
చంచలమైనట్టి మనసు
మాటలాడ నివ్వదు!
మనసు శరీరాన్ని శాసిస్తుంది. మనసు మంచిదైతే జీవితం మంచిది. ఇది మనోవిజ్ఞాన శాస్త్రంతో పాటు నీతిశాస్త్రం కూడా చెప్పే సత్యం. నీతి, దుర్నీతి అనేవి నడవడికి సంబంధించిన అంశాలే కాదు, సహసం, పిరికిదనం, ప్రశాంత తత్వం, చంచలత్వం వంటి అంశాలను కూడా నిర్ణయించేది మనసే. మనసు కోతిర ఓరి మనిషీ వంటి తత్వాలు పుట్టిందీ ఈ సత్యం చెప్పటానికే. మనసు చేతిలో కీలుబొమ్మ కాకుండా మనసును మన స్వాధీనంలో వుంచుకున్నప్పుడే ప్రగతి సాధ్యం. ఇదీ ఈ మణిపూసలోని తాత్వికత.
ఇట్లా వడిచర్ల సత్యం చెప్పిన ఈ కొత్త మణిపూసలు సమకాలీనమైన అంశాలను, జీవిత సత్యాలను, ప్రాసంగికత వున్న విషయాలనే గాక, తాత్విక పరిధిని కూడా స్పృశించటం అభినందనీయం. వీరి ఈ ముక్తకాలు కొత్తగా కవిత్వం రాస్తున్న కవులనే కాకుండా వరిష్ఠులను కూడా ఆకర్షిస్తాయనటంలో అతిశయోక్తి లేదు. అభ్యుదయమార్గంలో నడుస్తూ ప్రజల జీవన చిత్రాన్ని ప్రతిబింబిస్తూ వడిచర్ల సత్యం సృష్టించిన మణిపూస లు అమూల్య వజ్రాలుగా భాసిస్తాయని ఆశిస్తున్నాను.
- డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్
94410 54637

2153
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles