సమైక్య రాష్ట్రంలో నిర్బంధాలు


Sun,November 25, 2018 10:49 PM

తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో నిర్బంధాలను, కేసులను ఎదుర్కొన్న అక్షర సైనికులు, ఉద్యమ గాయకుల సంఖ్య తక్కువేమి కాదు. రచయితలపై దాడులు, హత్యలు, అరెస్టులు, ఇళ్ళ సోదాలు, బెదిరింపులు, కేసులు ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రంలోనే సంభవించాయి. బ్రిటిష్, నిజాం పాలనల్లో నాటి ప్రభుత్వాలు సాహిత్యం పట్ల అనుసరించిన విధానాలనే ఆంధ్రా పాలకులు అమలుపరిచారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలుగు సాహిత్యానికి సువర్ణ శకం ప్రారంభమైంది. సాహిత్యకారులు స్వేచ్ఛగా తమ కలాలకు, గళాలకు పదునుపెడు తున్నారు. సమస్యలను, సవాళ్ళను, అస్తిత్వాలను, ఆత్మగౌరవాలను ఆవిష్కరిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ వాతావరణం లేదు. అక్షరంపై ఆంక్షల ఉక్కుపాదం. కలాలకు, గళాలకు సంకెళ్ళు, నిర్బంధాలు, నిషేధాలు. స్వాతంత్రోద్యమకాలంలో దేశభక్తి సాహిత్యాన్ని నియంత్రించడానికి, ప్రజల పక్షం వహించిన రచయితలను నిర్బంధించడానికి బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధ చట్టాలను రూపొందించింది. ఆ చట్టాలనే ఉపయోగించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ప్రజా సాహిత్యాన్ని నిషేధించాయి. 10 పుస్తకాలను, ఒక స్మారక సంచికను, ఒక సాహిత్య పత్రిక ఐదు సంచికలను నిషేధించా యి. రచయితలపై రాజద్రోహ నేరాలు ఆపాదించాయి. కుట్ర కేసులను బనాయించాయి. ఉమ్మడి రాష్ట్రంలో జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, చెరబండరాజులను పీడీ చట్టం కింద అరెస్టు చేశారు. ఖమ్మంలో ఓ పుస్తకాల షాపు యజమాని వీరయ్యను అరెస్ట్ చేశారు. రచయితలు యవ్‌ు.వి.రమణారెడ్డి త్రిపురనేని మధుసూధనరావు, భూమన్‌లపై బాంబు కేసులు, కుట్ర కేసులు, రాజద్రోహం కేసులు పెట్టారు. 1970 దశకంలో 25 మంది రచయితలపై మోపిన సికింద్రాబాద్ కుట్ర కేసు సంచలనం సృష్టించింది. తిరుపతి కుట్ర కేసులో రచయితలపై రకరకాల కేసులు పెట్టారు. 1975-77 మధ్య కాలంలో ఎమర్జెన్సీలో ముప్పైకి పైగా రచయితలను అరెస్ట్ చేశారు. 1975లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రముఖ కవులు శ్రీశ్రీ, చెరబండ రాజు, లోచన్ ప్రభృతులను అరెస్ట్ చేశారు. కేవలం రచనల ఆధారంగా చెరబండరాజు లోచన్‌లను నాటి ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలి గించగా హైకోర్టు ఆ ఉత్తర్వులను కొట్టివేసింది. మార్చ్ ఝంఝ లే కవితా సంకలనాలను 1971 లో, ఇప్పుడు వీస్తున్న గాలి కథా సంకలనాన్ని 1972లో, రక్తగానం, విప్లవ శంఖారావం, బందూక్ కవితా సంకలనాలను 1973లో, విప్లవం వర్ధిల్లాలి కవితా సంకలనాన్ని 1974లో ఆనాటి ప్రభుత్వాలు నిషేధించాయి. వాసిరెడ్డి సీతాదేవి నవల మరీచికను 1982లో కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధించగా వరవరరావు కవితా సంకలనం భవిష్యత్ చిత్రపటంను 1987లో టీడీపీ ప్రభుత్వం నిషేధించింది.

35 కవితలతో వెలువడిన మార్చ్ కవితా సంకలనాన్ని వెలువరించినందుకు వరంగల్‌కు చెందిన ప్రచురణకర్త పెండ్యాల కిషన్‌రావ్‌పై నాటి ప్రభుత్వం రాజద్రోహ నేరం మోపింది. 1970లో విరసం ప్రథమ మహాసల సందర్భం గా ఖమ్మంలో ఆవిష్కరించిన ఝంఝ కవితా సంకలనానికి సారథ్యం వహించిన కె.వి.రమణారెడ్డిపై నాటి ప్రభుత్వం రాజద్రోహ నేరం మోపింది. ముద్రించిన క్రాం తి ప్రెస్ అధినేత ధనికొండ హనుమంతరావును ప్రాసిక్యూట్ చేసింది. 1971లో వెలువడిన తిరుపతి విప్లవ సాహితి ఆధ్వర్యంలో టి.సుభాష్ సంకలనకర్తగా 1971 లో వెలువడిన లే కవిత సంకలనాన్ని నాటి ప్రభు త్వం నిషేధించింది. కానీ ఆ తర్వాత హైకోర్టు నిషేధాన్ని తొలిగించింది. శ్రీశ్రీ, కాళీపట్నం రామారావు, రావిశాస్త్రి ఎస్.ఎస్. ప్రకాశ్‌రావు, సీయస్ రావు, నిఖిలేశ్వర్ వంటి ప్రసిద్ధులైన రచయితల కథలతో కొడవగంటి కుటుంబరావు సంపాదకత్వంలో వెలువడిన ఇప్పుడు వీస్తున్న గాలి కథా సంకలనాన్ని 1972లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధించిం ది. ఈ సంకలనంలోని చెరబండరాజు రాసిన కథ నిషేధానికి కారణంగా చూపింది. ఈ నిషేధం విషయమై నాటి ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో 1972 జూన్ 29న సుదీర్ఘమైన చర్చ కూడా జరిగింది. అంతకు ముందు ఢిల్లీలో జరిగిన ప్రపంచ పుస్తక ప్రదర్శనలో ఇప్పుడు వీస్తున్న గాలి కథా సంకలనం ప్రముఖుల ప్రశంసలు పొందగా రాష్ర్టంలో నిషేధించడంలోని ఔచిత్యం ఏమిటని విపక్షా లు నిలదీసినా కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించలేదు. అనంతపురానికి చెందిన చైతన్య సాహితీ సంస్థ ప్రచురించిన రక్తగానం కవితా సంకలనానికి అదే పరిస్థితి. ప్రముఖ నవలా రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి రచించిన మరీచిక నవలను 1981లో నాటి ప్రభుత్వం నిషేధించింది. ఈ నవల మొదట ఒక వారపత్రికలో సీరియల్‌గా వచ్చింది. పైగా వాసిరెడ్డి సీతాదేవి రాష్ట్ర ప్రభుత్వ అధికారి. ఈ నిషేధాన్ని తర్వాత హైకోర్టు కొట్టివేసింది. ఎన్.టి. రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వరవరరావు రచించిన భవిష్యత్ చిత్రపటం కవితా సంకలనాన్ని ప్రభు త్వం నిషేధించింది. అప్పటి హోంమంత్రి వసంత నాగేశ్వరరావుకు ఈ సంకలనంలోని ఓ కవిత ఆగ్రహం తెప్పించిందని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే 1989లో ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఈ నిషేధాన్ని తొలిగించారు.

తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలు అందించిన సృజన మాసపత్రిక ఐదు సంచికలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1972-74 మధ్యకాలంలో నిషేధానికి గురయ్యాయి. వీటిలో ఒక సంచికలో జార్జ్ ఫెర్నాండెజ్ 1974 లో ప్రారంభించిన రైల్వే సమ్మెను సమర్థిస్తూ ఒక సంపాదకీయం వెలువడింది. సంపాదకురాలు హేమలతపై ప్రభుత్వం రాజద్రోహ నేరం మోపి జైలుకు పంపించింది. కింది కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించగా హైకోర్టు రద్దు చేసింది. రైల్వే సమ్మెకు నాయకత్వం వహించిన జార్జ్ ఫెర్నాండెజ్ తర్వాత కేంద్రంలోని జనతా ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రి కాగా ఆయన నాయకత్వం వహించిన సమ్మెను సమర్థిస్తూ సంపాదకీయం రాసిన హేమలత కోర్టు బోనులో నిలబడవలసి వచ్చింది. తస్లీమా నస్రీన్ రాసిన లజ్జ నవల తెలుగు అనువాదం కూడా ఆంధ్రా పాలకుల ఆంక్షలను ఎదుర్కొన్నది. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో నిర్బంధాలను, కేసులను ఎదుర్కొన్న అక్షర సైనికులు, ఉద్యమ గాయకుల సంఖ్య తక్కువేమి కాదు. రచయితలపై దాడులు, హత్య లు, అరెస్టులు, ఇళ్ళ సోదాలు, బెదిరింపులు, కేసులు ఇవ న్నీ ఉమ్మడి రాష్ట్రంలోనే సంభవించాయి. బ్రిటిష్, నిజాం పాలనల్లో నాటి ప్రభుత్వాలు సాహిత్యం పట్ల అనుసరించిన విధానాలనే ఆంధ్రా పాలకులు అమలుపరిచారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా నాయకుల పాలన ఒక చీకటి అధ్యాయం. రాష్ట్రం ఏర్పడినాక ఆ వాతావరణం లేదు.
- డాక్టర్ అయాచితం శ్రీధర్
98498 93238

541
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles