ఆధిపత్య నిరూపణల క్షేత్రం


Sun,November 18, 2018 10:57 PM

కట్టుబాట్లు, బరువు, బాధ్యతల భారంతో కనుపాపల్లో దాచుకున్న ప్రేమను కాల్చుకోలేక, భౌతికంగా శిలగా జీవిస్తున్న శరీరాలెన్నో. దాంపత్య సాఫల్యతకు ఒకరో ఇద్దరో పిల్లలు కలుగటమే ప్రమాణమైన చోట, మనసు ఎక్కడో ఆవిరైపోయింది. ప్రేమ ఎక్కడో మనిషి హృదయపు కుహరా ల్లో పాతి పెట్టబడింది. సరిగ్గా ఈ దుస్థితి నుంచి ఉత్పన్నమైన హింసాత్మక జీవిత గాథలే ఈ కథలు.
husband-stich
స్త్రీలపై అణిచివేత మనిషి చరిత్ర అంత సుదీర్ఘమైనది. మానవ వికాస చరిత్రలో మనిషి దాటివచ్చిన అనేక సామాజిక దశల్లో స్త్రీ పాత్ర అద్వితీయమైనది. మరీ ముఖ్యంగా ఆదిమానవ జీవనం నుంచి వ్యవసాయిక సమాజంగా ఎదిగే క్రమంలో సాగిన వికాసం, ఉత్పత్తి విధానాభివృద్ధికి స్త్రీయే మూలం. మాతృస్వామ్య వ్యవస్థను దాటి బానిస, భూస్వామ్య ఫ్యూడల్ వ్యవస్థలు రూపుదిద్దుకునే క్రమంలో పితృస్వామ్యం వేళ్లూనుకుని స్త్రీని దిగువస్థాయికి దిగజార్చటమే కాదు, భోగవస్తువుగా మార్చేసింది. ఈ క్రమంలో సమాజంలో ఇంటా, బయటా స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలు దశాబ్దాలుగా మాట్లాడుకుంటున్నాం, పరిష్కారాలను వెతుక్కుంటున్నాం. కానీ నానాటికీ స్త్రీ పరిస్థితి మరింత దయనీయంగా మారుతు న్న స్థితి కనిపిస్తున్నది. సమాజ ఆధునికాభివృద్ధిలో సమున్నత మానవీయ విలువలు పాదుకొల్పబడి మహిళకు సమానత, సముచిత గౌరవ మర్యాదలు దక్కాల్సిన చోట, స్త్రీ పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. స్త్రీలపై హింసాదౌర్జన్యాల తీవ్రత పెరుగటమే కాదు, అవి వికృతరూ పం తీసుకున్నాయి. ఆధునిక వస్తుమయ సంస్కృతిలో స్త్రీ విలాసవస్తువే కాదు, భోగ వస్తువుగా మారిపోయింది. ఇవ్వా ళ.. స్త్రీ అంటే.. పురుషుని లైంగిక ఆకలి తీర్చే ఓ మాంసపు ముద్ద.., ఒకే ఒక లైంగిక అవయవం మాత్రమే.
తెలుగు నేలకే పరిమితమైతే.. ఎనభైయవ దశకం నుంచీ స్త్రీ వాదం ఉప్పెనలా దూసుకొచ్చి పురుషస్వామ్యాన్ని ఎదిరిస్తూ, స్త్రీ చుట్టూ అల్లుకున్న అన్నిరకాల భావజాల (కు)సంప్రదాయాలు, విలువల సంకెళ్లను తునాతునకలు చేసింది. కొలతల్లో ఇముడాలనే సౌందర్యాత్మక హింసను ప్రశ్నించి, అందం మాటున దాగున్న అమానవీయతను అన్నివిధాలా ఎదిరించిం ది. కానీ కుటుంబ ఇనుపసంకెళ్లలో నాలుగు గోడల మధ్య జరుగుతున్న బీభత్సమైన లైంగికహింసల దాకా ఆ చూపు, ఆ ప్రతిఘటన కొనసాగలేదు. ఆ వెలితిని, అవసరాన్ని ఇన్నాళ్లకు డాక్టర్ గీతాంజలి తన హస్బెండ్ స్టిచ్ కథల ద్వారా తీర్చారు. ఈ కథలు కల్పితాలు కాదు, యథార్థ గాథలు. డాక్టర్‌గా, ఫ్యామిలీ కౌన్సిలర్‌గా తన దగ్గరకొచ్చిన స్త్రీలు చెప్పుకున్న దయనీయ, హింసాత్మక జీవన చిత్రాలు. సంసార సాగరంలో ఉక్కిరిబిక్కిరవుతున్న మహిళల జీవితాలు.

రచయిత్రి గీతాంజలి తన కథల నేపథ్యం గురించి చెబుతూ.. స్త్రీల లైంగికత, లైంగిక రాజకీయాలకు సంబంధించిన వస్తువు అత్యంత బీభత్సమైన ది. స్త్రీల లైంగికత చుట్టూ పురుష లైంగికరాజకీయాలు పొరలు పొరలుగా ఘనీభవించాయి అనుకుంటే, వాటిని పగులగొడు తూ వెళితే వాటికింద చితికిపోయి రక్తమోడుతున్న స్త్రీల గుండె లో, గర్భసంచులో, యోనులో బీభత్సంగా కన్పిస్తాయి. ఇలాం టి బీభత్స దృశ్యాలను చూసి, వారి కన్నీటి గాథలు విని రాయకుండా ఉండలేని స్థితిలోంచి బాధ్యతగా తప్పక రాసి తీరాలి కాబట్టి రాసానని చెప్పుకున్నారు. జెండర్ స్వేచ్ఛా సమానత్వా ల గురించీ, సహజమైన ప్రేమాభిమానాలతో పరస్పరం గౌరవించుకునే దాంపత్య సంబంధాల గురించీ, సున్నితమైన దేహభాషతో పరిమళించాల్సిన లైంగికత గురించి మగవాళ్లను సెన్సిటైజ్ చేయటానికి రచయిత్రి సాహసోపేత సమరానికి సైరనూదారు. ఆడపిల్లలను శరీరాలుగా చూడొద్దనీ, మగపిల్లలతో సమానంగా మనుషులుగా చూడాలని కథలు, వ్యాసాలు రాసే తను (స్వరూప) తన కూతురు అదీ ఆరేండ్లయినా దాటని పసిదానికి మగవాడి నుంచి తన శరీరాన్ని ఎలా కాపాడుకోవా లో.., మనసుకు గాయం కాకుండా ఎలా చూస్కోవాలో నేర్పా ల్సి రావటం.. ఎంత హింసాత్మకంగా ఉంటుందో ప్రశ్న కథలో రచయిత్రి గీతాంజలి హృద్యంగా చిత్రీకరించిన వైనం గుం డెను బరువెక్కిస్తుంది. హృదయం ద్రవిస్తుంది. కుటుంబ హింసకు బలవుతున్న మహిళల కన్నీటిధారకు అక్షర రూపమిస్తే ఆకృతి దాల్చిన హస్బెండ్ స్టిచ్ కథా సంపుటిలో 13 కథలున్నాయి. ఈ కథల్లో దేనికదే గొప్ప కథ. విష యపరంగా, శిల్పవైవిధ్యంతో మాత్రమే కాదు, ఆయా కథల్లోని రక్తమాంసాలున్న మనుషులు ఎదుర్కొన్న రంపపు కోతలలోం చి విముక్తి కోసం చేస్తున్న ఆరాట పోరాటాలు, పడుతున్న యాతనలు కనిపిస్తాయి. శృంగారమంటే రెండు స్త్రీ పురుష జననాంగాల మధ్య జరిగే రాపి డి మాత్రమే కాదు, దంపతులు ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమను స్పర్శ ద్వారా వ్యక్తపరుచుకునే దేహ భాష అని చెప్పిన గీతాంజలి గారు ప్రేమకు, ప్రేమాస్పద అనురాగ అనుబంధాలకు సశాస్త్రీయమైన, మానవీయమైన నిర్వచనమిచ్చి మగమృగాలకే కాదు, సమాజపు కండ్లు తెరిపించారు.

ఆ క్రమంలో.. వయ స్సు పెరిగేకొద్దీ స్త్రీలు మగవాళ్లకు- వదులవుతారు, ఎండిపోతారు, వొడలిపోతారు, వాడిపోతా రు, వొంగిపోతారు, వొట్టిపోతారు, సడలిపోతారు, జారిపోతారని గీతాంజలి గారు ఆవేదనతో ఆగ్రహంతో స్త్రీల స్థితిని చెప్పిన తీరు సహజ ధర్మాగ్రహమే. లైంగికహింస రంపపు కోత ల్లో విలవిల్లాడుతున్న గొం తుల్లోంచి నాగరికమైన సౌమ్యమైన భాషను ఆశించటం కూడా అన్యాయమే. ఈ నేపథ్యంలోంచి రచయిత్రి ప్రయోగించిన మాటలు కొంత ఘాటుగానో, మొరటుగానో అనిపించవ చ్చుగాక, కానీ ఆ ఆక్రోశాలు న్యాయమైనవి. దుఃఖంలో, కన్నీళ్లలో సున్నితత్వం ఉండదు. ఎప్పుడూ మౌనముద్రతో, ప్రశాంతంగా కనిపించే గీతాంజలి గారు విధి నిర్వహణలో, పనులు చేసే క్రమంలో, ముఖ్యంగా విలువల ఆచరణలో ఎవరైనా వెంట్రుక వాసి పక్కకు జరిగినా తీవ్రంగా స్పందించినప్పుడు ఈమెలో ఇంత ఆగ్రహం దాగున్నదాని ఆశ్చర్యమేస్తుంది. అం తర్గతంగా లావాను దాచుకున్న ఓ అగ్నిపర్వతంలా గీతాంజలి కనిపిస్తారు. కానీ ఆమె ఆగ్రహానికి ఆమెకు తారసపడిన వ్యక్తుల హింసాత్మక జీవన గాథలలోంచి వస్తున్న స్పందనలుగా అర్థం చేసుకోవటమే వివేచన. సామాజిక హింసాదౌర్జన్యాలు అటుంచితే, కుటుంబ నాలుగు గోడల మధ్య దాంపత్యంలో జరుగుతున్న హింసకు కార ణం ఏనాడైనా ఆలోచించారా? అంటే.. లేదనే చెప్పాలి. సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేసే మన దేశంలో పెండ్లీలన్నీ (అరేంజ్‌డ్ మ్యారేజెస్) పెద్దలు కుదిర్చినవే. చేస్తున్న పనిని, ఉద్యోగాన్ని అయినా ఇష్టంతో చేస్తే సంతోషంగా ఉం టుందని పెద్దలు చెబుతారు. కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రం ప్రేమను చిదిమేసే ఆ పెద్దలే బరువు, బాధ్యతలు, కట్టుబాట్ల పేర కలిసి ఉండటాన్ని జీవితమంటున్నారు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటూ నరకంలోకి తోస్తున్నారు. ఈ అమానవీయ వివాహ వ్యవస్థలో మనసుకు, ప్రేమకు చోటులేదు. ఆస్తులు, అంతస్తులు, కులం, మతం, స్థితి, స్థోమ త, పరువు, ప్రతిష్ఠలు అన్నీ ఉంటాయి, ఒక్క ప్రేమ తప్ప. ఇద్ద రు మనుషులు జీవిత భాగస్వాములుగా, సహచరులుగా జీవించటానికి ఇద్దరి అభిరుచులు, ఆలోచనలు ఒకటిగా గల మనసుల మధ్య పెనవేసుకునే మానసిక అనుబంధం భూమి కగా ఉండాలి. అలాంటి మానసికానుబంధం ఉన్న ఇద్దరి వ్యక్తుల మధ్య అంకురించి పుష్పించి, వికసించేదే ప్రేమ. ప్రేమలేని జీవితాలన్నీ యాంత్రికమైనవే. ఈ యాంత్రిక జీవనసహచర్యంలోనే భయంకరమైన హింస నిండి ఉన్నది.

ఈ జుగుప్సాకరమైన వివాహ వ్యవస్థలో అనుబంధాల్లేవు, బంధనాలు మాత్రమే ఉన్నాయి. కట్టుబాట్లు, బరువు, బాధ్యతల భారంతో కనుపాపల్లో దాచుకున్న ప్రేమను కాల్చుకోలేక, భౌతికంగా శిలగా జీవిస్తున్న శరీరాలెన్నో. దాంపత్య సాఫల్యతకు ఒకరో ఇద్దరో పిల్లలు కలుగటమే ప్రమాణమైన చోట, మనసు ఎక్కడో ఆవిరైపోయింది. ప్రేమ ఎక్కడో మనిషి హృదయపు కుహరా ల్లో పాతి పెట్టబడింది. సరిగ్గా ఈ దుస్థితి నుంచి ఉత్పన్నమైన హింసాత్మక జీవిత గాథలే ఈ కథలు. బడి, గుడి, ఇల్లు ఏదీ స్త్రీకి, పసి పిల్లలకు సురక్షితం కాని నేటి సమాజ జాగృతానికి హజ్బెండ్ స్టిచ్ కథలు అవసరం. ప్రేమంటే అందరికీ తెలుస నే అర్థంలో.. ప్రేమంటే లోకంలో తెలియనదీ ఎవరికీ.. అని ఎప్పుడో 70వ దశకంలో ఓ సినీకవి అమాయకంగానే కానీ అద్భుతంగా రాశాడు. ప్రేమంటే ఏమీ తెలియని లోకమని నేడు అడుగడుగునా తెలిసి వస్తున్న వేళ ఈ కథలు ఓ వెలుగు రేఖలు.
- ఎస్.మల్లారెడ్డి, 91827 77255

757
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles