నేను రాయడం ఎలా నేర్చుకున్నాను


Sun,November 18, 2018 10:56 PM

Maxim_Gorky
నాకు మాట్లాడే అవకాశం వచ్చిన ప్రతి చోట నన్ను చాలామంది నోటి మాటగానో, రాత మూలకంగానో నేను రాయడం ఎలా నేర్చుకున్నదీ చెప్పమని అడుగుతూ వుంటారు. అదే ప్రశ్నని యు.ఎస్.ఎస్.ఆర్. నాలుగు మూలల నుంచీ రచనలు చెయ్యడం ఆరంభించిన యువకులు తమ ఉత్తరాల్లో అడుగుతూ వుంటారు. కథలు ఎలా రాయాలి అన్నదాని గురించి ఒక పుస్తకం సంకలితం చెయ్యమనో, లేదా సాహిత్య సిద్ధాంతాన్ని అభివృద్ధి చెయ్యమ నో లేదా సాహిత్యంమీద ఒక పాఠ్యగ్రంథాన్ని ప్రచురించమనో నన్ను చాలామంది అడిగారు. నేనలాంటి పాఠ్యగ్రంథాన్ని రాయలేను, అలాంటి పనిని చెయ్యలేనుకూడా. అదీ కాకుం డా అలాంటి పుస్తకాలు యిప్పటికే వున్నాయి. అవి, ఒకవేళ మరీ అంత బాగాలేకపోయినా, అంతో యింతో పనికివస్తా యి. రాయడం నేర్చుకునే వాళ్లకి సాహిత్య చరిత్రని గురించిన పరిజ్ఞానం వుండితీరాలి. ఒక మనిషి వృత్తి ఏదైనా కానీయండి, అతనికి దాని అభివృద్ధి చరిత్ర తెలిసి వుండాలి. ఏదైనా ఒక పరిశ్రమలో వున్న కార్మికులు అది యెలా పుట్టింది, క్రమేపీ ఎలా అభివృద్ధి చెందింది, ఎలా ఉత్పత్తి మెరుగుపడింది తెలుసుకుని వున్నట్టయితే వాళ్లు సాంస్కృతిక చరిత్రలో తమ శ్రమ ప్రాము ఖ్యం గురించిన మరింత అవగాహనతో, మరింత ఉత్సాహంతో యింకా బాగా పనిచేస్తారు. విదేశీ సాహిత్యం గురించిన పరిజ్ఞానం కూడా అవసరం. యేమంటే సాహిత్య సృజన అనేది సారంలో అన్ని దేశాలకీ, అందరు ప్రజలకీ ఒకటే. ఇది వూరికే లాంఛనంగా, పైపై విషయాలకి సంబంధించే కాదు. ముఖ్యమైంది యేమిటీ అంటే, ఏనాటినుంచో ప్రతిచోటా మానవ హృదయాలని వశం చేసుకునే వల యెప్పుడూ అల్లుకుని వుంది, ఇప్పుడు కూడా అల్లుకుని వుంది అనే వాస్తవాన్ని గుర్తించడం. మరో పక్క ఎప్పుడూ, ప్రతి చోటా మానవుణ్ణి మూఢ నమ్మకాలనుంచీ, దురభిప్రాయాలనుంచీ, విముక్తం చెయ్యడమే తమ ధ్యేయంగా పెట్టుకున్న వాళ్లూ యెప్పుడూ వున్నారు, యిప్పుడు కూడా వున్నారు అనీ గుర్తించడం. మనిషికి మురిపం కలిగించే చిన్న విషయాల్లో నిమగ్నమైన వాళ్లున్నట్టే, చుట్టూతా వున్న జీవితంలోని అల్పత్వానికీ, నీచత్వానికీ వ్యతిరేకంగా యెదురు నిలిచిన తిరుగుబాటుదార్లూ ఎప్పుడూ వున్నారనీ, యిప్పుడు కూడా వున్నారనీ గుర్తించడమూ ముఖ్యమే.

మానవులకి ముందుదారి చూపించి, ఆ పథంమీద సాగాలని బోధించి ఒప్పించిన తిరుగుబాటుదార్లు, వర్గ సమాజం సృష్టించిన నీచ పరిస్థితుల తోటి, దురాశ, అసూయ, కల్మశం, శ్రమ పట్ల వైముఖ్యం లాంటి అసహ్యకరమైన చెడుగులతో శ్రామిక జనాన్ని భ్రష్టం చేసిన బూర్జువా సమాజంతోటి రాజీనీ, సామరస్యాన్నీ బోధించిన వాళ్లమీద ఆఖరిపోటీ జరిగే ఆ దినాన పై చెయ్యి సాధిస్తారని గుర్తించడం కూడా ముఖ్యం. మానవ శ్రమ, సృజనల చరిత్ర మానవుని చరిత్రకంటే యెం తో యెక్కువ ఆసక్తికరంగా, ప్రముఖంగా వుంటుంది. ఒక మని షి వంద యేళ్లు రాకుండానే గతిస్తాడు, కాని అతని కృషి శతాబ్దాలు మనుతుంది. విజ్ఞానశాస్ర్తానికీ, సాహిత్యానికీ ఉమ్మడిగా వుండేది చాలా వుంది. రెండింటిలోనూ పరిశీలన, తులనాత్మకత, అధ్యయనం ప్రముఖ పాత్ర వహిస్తాయి. విజ్ఞానశాస్త్రవే త్త, రచయిత యిద్దరికీ కూడా భావనా శక్తీ, సద్యోజనిత జ్ఞానం వుండి తీరాలి. భావనా శక్తీ సద్యోజనిత జ్ఞానం వాస్తవాల గొలుసులోని ఖాళీలని భర్తీ చెయ్యడానికి ఉపకరిస్తాయి. ఆ రకంగా విజ్ఞానశాస్త్రవేత్త పరికల్పనలనీ, సిద్ధాంతాలనీ రూపొందించుకోవడానికి వీలవుతుంది. అవి ప్రకృతి శక్తులలోకీ, దృగ్గోచర విషయాలలోకీ మనసు చేసే శోధనలను కొంచెం యించుమించులో నిర్దిష్టంగా నడిపిస్తాయి. క్రమేపీ ప్రకృతి శక్తులనీ, దృగ్గోచర విషయాలనీ లొంగ దీసుకోవ డం ద్వారా మానవుడి మనసూ యిచ్చా మానవ సంస్కృతిని నిర్మిస్తాయి. అదే వాస్తవానికి మన అపర సృష్టి. పాత్రలనీ, నమూనాలనీ సృష్టించడానికి సంబంధించిన సాహిత్య సృజనాత్మక కళ, భావనా శక్తినీ, నూతన అన్వేషణనీ అపేక్షిస్తుంది. తనకు పరిచయమైన ఒక దుకాణదారునో, ప్రభు త్వ ఉద్యోగినో లేదా శ్రామికున్ని చిత్రించడంలో రచయిత కొం చెం అటూ యిటూగా ఒక వ్యక్తి ఫోటోగ్రాఫ్‌ని మాత్రమే విధేయంగా తయారుచేసినట్లయితే, అది సామాజిక బోధనా ప్రాముఖ్యం యేమీ లేని ఫోటోగ్రాపు తప్ప మరేంకాదు. అది మన జీవిత పరిజ్ఞానాన్ని గానీ, మన మానవ అవగాహననిగానీ విస్తరించడానికి దాదాపు యేమీ చెయ్యదు.
అయితే, రచయిత ఒక 20,50 లేకపోతే ఒక వంద మంది దుకాణదార్లకి, ప్రభుత్వ ఉద్యోగులకి, శ్రామికులకి ప్రత్యేకంగా వుండే అత్యంత విశిష్ట వర్గలక్షణాలని, అలవాట్లని, అభిరుచు ల్ని, హావభావాలని, విశ్వాసాలని, మాటతీరుని సంక్షేపించ గల సమర్థత చూపిస్తే, వాటిని ఒక్క దుకాణదారుడిలో ప్రభుత్వ ఉద్యోగిలో లేదా శ్రామికునిలో కేంద్రీకరించి సూక్ష్మ రూపంలో ప్రదర్శించగల సామర్థ్యం చూపిస్తే ఆ రకంగా అతను ఒక నమూనాని సృష్టిస్తున్నాడన్న మాట.

అదే కళ. ఒక కళాకారుడికి అతని విస్తృత పరిశీలనలూ, పుష్కలమైన జీవితానుభవమూ వాస్తవాల పట్ల అతని సొంత దృక్పథాన్ని దాటిపోగల శక్తిని, అంటే వైయక్తిక స్థితిని, దాటి పోగల శక్తిని తరచుగా యిస్తాయి. రచయితలు తమ వర్గ, కాలాల నిష్పాక్షిక చరిత్రకారులైన సందర్భాలు చాలా వున్నాయి. అలాంటి సందర్భాల్లో వాళ్ల రచనలు, జంతువులు ఆహారం సేకరించుకుని, జీవించిన పరిస్థితుల్ని అధ్యయనం చేసి, అవి పునరుత్పత్తి కావడానికీ, అదృశ్యం కావడానికీ కారణాల్ని అధ్యయనం చేసి, మనగలగడానికి అవి చేసే బర్బర పోరాటాన్ని వర్ణించే పండితులైన ప్రకృతి శాస్త్రవేత్తల నిష్పాక్షికతతో తుల్యమైనట్టుగా వుంటాయి. జీవన పోరాటంలో స్వయం రక్షణ అనే మానవుడి సహజ చోదన రెండు బలమైన సృజనాత్మక శక్తుల్ని అతని లో పెంపొందించింది-అవబోధనా శక్తి, భావనా శక్తి. అవబోధనా శక్తి అం టే ప్రకృతి దృగ్గోచర విషయాల్ని సాం ఘిక జీవిత వాస్తవాలని పరిశీలించి, పోల్చి,అధ్యయనం చేసే శక్తి అన్న మాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే అవబోధనా శక్తి అంటే ఆలోచించడం అని. భావనాశక్తి కూడా సారంలో ప్రపంచాన్ని గురించిన ఆలోచనా విధానమే. కాని అలంకారాల్లో కళాత్మకం గా ఆలోచించడమన్న మాట. భావనా శక్తి అంటే విషయాలకీ, ప్రకృతి మూలశక్తులకీ మానవ లక్షణాలనీ, అనుభూతులనీ, ఆ మాటకొస్తే, అభిప్రాయాలనీ ఆపాదించే శక్తి అన్నమాట. గాలి మూలుగుతోంది లేదా రోదిస్తోంది అనడం, చంద్రుడి వ్యాకులమైన వెన్నెల అనడం, గలగల మనే సెలయేరు అనడం, జలజల మనే నీటిబుగ్గ అనడం లాంటి అనేకమైన మాటలని, ప్రకృతి దృగ్గోచర విషయాలని యింకా స్పష్టంగా చేసేటటువం టి మాటలని అనడం వింటాం. మనం అంటాం. అలా దీన్ని ఆక్రోపోమార్ఫిజంఅంటారు. రెండు గ్రీకు పదాల నుంచి యేర్పడింది. ఆమ్రపస్ అంటే మనిషి, మార్పే అంటే రూపం లేక ప్రతిమ. మానవుడు తనకి గోచరమైన ప్రతిదానికీ మానవ లక్షణాలని ఆపాదించే మార్గం యిక్కడ కనిపిస్తుంది. అతను యీ లక్షణాలని వూహించుకుని వాటిని ప్రకృతి దృగ్గోచర విషయాలలోని, తన శ్రమలోని ప్రతీదానితో జతచేస్తాడు. సాహిత్యంలో ఆక్రోపోమార్ఫిజానికి స్థానం వుండకూడదనేవాళ్లు, ఆ మాటకొస్తే అది సాహిత్యానికి అవరోధంగా వుంటుందని భావించే వాళ్లు వున్నారు.

కాని ఈ మనుషులే ఎముకలు కొరికే చలి అంటారు, సూర్యుడు మందహాసం చేశాడు అంటారు, వసంతం వచ్చింది అంటారు. దుర్మార్గమైన వాతావరణం అని కూడా అంటారు, వాతావరణానికి సంబంధించి నైతికపరమైన ప్రమాణాలని ఉపయోగపెట్టడం కష్టమైనా. జంతువులకి గనక భావనాశక్తి వుండి వుంటే, దేవుణ్ణి సిం హాలు ఒక బ్రహ్మాండమైన అజేయమైన సింహంగానూ, మూషికాలు ఒక మూషికంగానూ, యింకా అలా అలా భావించుకుంటాయని ప్రాచీన గ్రీకు తత్వవేత్త క్సెనోఫేన్ అన్నాడు. మశక దేవుడు బహుశా మశకం గానే వుంటాడు, క్షయ క్రిమి దేవుడు క్రిమిగానే వుండచ్చు. మానవుడు తన దేవుణ్ణి సర్వజ్ఞునిగా, సర్వశక్తివంతునిగా సర్వోత్పాదకునిగా నిర్మించుకున్నాడు. యింకో లా చెప్పాలంటే తన సర్వోత్తమ ఆకాంక్షలన్నింటినీ తన దేముడికి అంటగట్టాడు. దేవుడు కల్పితం మాత్రమే.జీవిత వాస్తవం బొటాబొటీగా బతకడానికి చేసే శ్రమాన్విత పోరాట రంగంగా వుంది. ఆ భగవంతుణ్ణి కూడా సాహిత్య నమూనాల మాదిరిగానే, సంక్షేప నిర్దిష్ట రూప నియమానుసారంగా సృష్టించడం జరిగింది. వైవిధ్యభరిత వీరులు చేసిన విశిష్ట సాహస కృత్యాల ని సంగ్రహించడం లేదా సంక్షేపించడం జరిగి, అప్పుడు ఏకవీరుని మూర్తిలో నిర్దిష్ట రూపం, అంటే ఒక భీముని రూపమో, రష్యన్ కల్పిత రైతు వీరుడు ఇల్యా రూపమో ఇవ్వడం జరిగిం ది. ఇంకోలా చెప్పాలంటే ఒక సాహిత్య నమూనా సృష్టి అయిందన్న మాట. యీ మనుషులు వాస్తవంలో ఎప్పుడూ వున్నవా ళ్లు కారు. కాని అలాంటి వాళ్లు చాలా మంది వున్నారు. వూరి కే యింకా అల్పత్వంతోనూ, యింకా తక్కువ అవిభాజ్య వేషంతోనూ వుంటారంతే. విడివిడి యిటుకలతో శిఖరాలనీ, గుళ్లనీ తాపీవాళ్లు కట్టినట్టే రచయితలు కొన్ని మానవ గుణాలని సంక్షేపించిన సాహిత్య నమూనాలని తయారు చేశారు.

- మక్సీమ్ గోర్కీ

(మక్సీమ్ గోర్కీ సాహిత్య వ్యాసాలు పుస్తకంలోని
నేను రాయడం ఎలా నేర్చుకున్నాను అన్న వ్యాసంలోని
కొంత భాగం..)

4850
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles