పరిశోధక ప్రతిభామూర్తి


Sun,November 11, 2018 11:09 PM

నడిచే గ్రంథాలయంగా భాసిల్లిన కపిలవాయి తెలుగు సాహిత్య సర్వస్వం. సంస్ధానాల జిల్లాగా పేరొందిన పాలమూరు జిల్లాలోని అనేక ప్రసిద్ధ స్థలాలపై స్థల చరిత్రలు, క్షేత్ర చరిత్రలను లిఖించి వెలుగులోకి తెచ్చిన పతిభామూర్తి. వీరు రచించిన పాలమూరు జిల్లా దేవాలయాలు అనేది గొప్ప క్షేత్ర చరిత్రల కాణాచి. ఈ గ్రంథం జిల్లా దేవాలయాల చరిత్రనే కాదు జిల్లాలోని శాసనాలను, చారిత్రకతను తెలిపే విశిష్ట గ్రంథం. లింగమూర్తికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టిన ఆణిముత్యం.
kapilavayi
ప్రసిద్ధ సాహిత్యవేత్త, పరిశోధకులు, నిత్యచైత న్య సాహిత్యశీలి కపిలవాయి లింగమూర్తి మరణం సాహితీలోకాన్ని విచారంలో ముం చెత్తింది. 86 ఏండ్ల కపిలవాయి నిత్యం రచనలో మునిగితేలుతూ సమాజానికి ఏదో చేయాలన్న తప న కలిగినవారు. తెలుగు సాహిత్యంలోని అనేక ప్రక్రియ ల్లో అనేక రచనలు చేసినవారు. ఎందరో రచయితలను తయారుచేసిన మహా పండితుడు. ప్రచార ఆర్భాటాల జోలికిపోని నిరాడంబరుడు. పాలమూరు జిల్లాలోని బల్మూరు మండలం జినుకుం ట గ్రామంలో జన్మించిన లింగమూర్తిలో చిన్నప్పట్నుంచే సాహిత్యాభిలాష మెండు. పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలను చిన్ననాటనే నేర్చుకొని సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. పద్యంపై, గద్యంపై సమాంతర స్థాయి లో రచనలు చేసినవారు. పాలమూరు జిల్లాలోని మరుగునపడ్డ అనేక అముద్రిత గంథ్రాలను, తాళపత్ర గంథ్రాలను వెలికితీసి పరిష్కరించిన పరిశోధకులు. తెలుగు సాహిత్యంలోని ప్రతి ప్రక్రి య లోతుపాతులను శోధించినవారు. తెలుగు పలుకుబడులపై సాధికారిత కలిగినవారు. శతాధిక గ్రం థ రచనలు చేసినవారు.

తెలుగు అధ్యాపకుడిగా, ప్రాచ్య కళాశాల్లో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసి ఎందరో విద్యార్థులను కవులుగా, రచయితలుగా, పరిశోధకులుగా తయారుచేసిన విద్వన్మ ణి కపిలవాయి లింగమూర్తి. నడిచే గ్రంథాలయంగా భాసిల్లిన కపిలవాయి తెలుగు సాహిత్య సర్వస్వం. సంస్థానాల జిల్లాగా పేరొందిన పాలమూరు జిల్లాలోని అనేక ప్రసిద్ధ స్థలాలపై స్థల చరిత్రలు, క్షేత్ర చరిత్రలను లిఖించి వెలుగులోకి తెచ్చిన ప్రతిభామూర్తి. వీరు రచించిన పాలమూరు జిల్లా దేవాలయాలు అనేది గొప్ప క్షేత్ర చరిత్రల కాణాచి. ఈ గ్రంథం జిల్లా దేవాలయాల చరిత్రనే కాదు జిల్లాలోని శాసనాలను, చారిత్రకతను తెలిపే విశిష్ఠ గ్రం థం. లింగమూర్తికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టిన ఆణిము త్యం. ఆ తర్వాత జిల్లాలోని స్థల చరిత్రలపై రాసిన మహాక్షేత్రం మామిళ్ళపల్లి, ఉప్పునుంతల కథ, క్షేపాల గంగో త్రి, భైరవకోన మహాత్మ్యం, సోమేశ్వర క్షేత్ర మహాత్మ్యం, ఉమా మహేశ్వరం, మూడుతరాల ముచ్చట మొదలైన గ్రంథాలు కపిలవాయి పరిశోధనకు మచ్చుతునకలు. అలాగే కపిలవాయి రాసిన సాలగ్రామశాస్త్రం, మాంగల్య శాస్త్రం గ్రంథాలు అతని సూక్ష్మ పరిశోధనా దృష్టికి నిదర్శనాలు. సాలగ్రామ శాస్త్రం సాలగ్రామ విశేషాలను, విశేషణలను తెలిపే అద్భుతమైన గ్రంథం. మాంగల్యశాస్త్రం ప్రాచీన ఆభరణాల విశేషాలను తెలిపిన రత్నం. ఈ రెం డు గ్రంథాలు కపిలవాయి పరిశోధన పటిమను ఆవిష్కరిస్తాయి. స్వర్ణశకలాలు, కళ్యాణ తారావళి, రుద్రాధ్యా యం, హనుమచ్చహస్రం మొదలైన గ్రంథాలు కపిలవాయిని వ్యాఖ్యానకర్తగా నిలబెడుతాయి.

కపిలవాయి పరిశోధకుడే కాదు కవిగా, రచయితగా, కథా రచయితగా, బాలసాహిత్య రచయిత గా, నాటకకర్తగా సంకలనాకర్త గా, సంపాదకుడిగా, సంకీర్తనకారుడిగా, శతకకర్తగా, పరిష్కర్తగా, అనువాదకుడిగా, గేయకవిగా బహుముఖీన గ్రంథ కర్త. ప్రాచీన సాహిత్యంలోని అనేక విషయాలను లోకానికి అందించిన కపిలవా యి నిరంతరం సాహిత్య సృజన చేస్తూ కొత్తతరానికి మార్గదర్శకుడిగా నిలుస్తున్నారు. కపిలవాయి తెలుగు సాహిత్యంలోని అనేక క్లిష్టమైన ప్రక్రియలను అవలీలగా పరిష్కరించిన పదాధికారులు. తెలుగు సాహిత్యంలోని చిత్రపది, బంధాలు, శబ్ద పది, అలంకారాలు, యతులతో చమత్కారాలు సాధించినవారు. అంతేకాదు పల్లెటూళ్లలో నానే అనేక మాండలిక పదాలను గ్రంథస్థం చేసిన పాలమూరు పదకోశం. కపిలవాయి రచనలను తిరుమల తిరుపతి దేవస్థానం, తెలు గు విశ్వవిద్యాలయం, ఎమెస్కో పబ్లిషర్స్ వారు ముద్రించడం విశేషం. కపిలవాయి సాహిత్య కృషికి ఎన్నో సంస్థలు సత్కరించాయి. తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, బూర్గుల రామకృష్ణారావు ప్రతిభా పురస్కారం, సి.పి. బ్రౌన్ పురస్కారం, రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం, నోరి నరసింహశాస్త్రి పురస్కారం, కందుకూరి రుద్రకవి పీఠం పురస్కారం, పాల్కుర్కి సోమనాథుని పీఠం పురస్కారం, పులికంటి సాహితి సతృ్కతి పురస్కారం, ప్రపం చ తెలుగు సభల పురస్కారం మొదలైనవి కపిలవాయి అందుకోవడం వారి సాహిత్య సృజనకు అద్దం పడుతున్నది.

కపిలవాయి పరిశోధనకు గుర్తింపుగా అనేక బిరుదులను పొందారు. కవితా కళానిధి, పరిశోధనా పంచానన, కవికేసరి, వేదాంత విశారద, గురుశిరోమణి, సాహిత్య స్వర్ణసౌరభ కేసరి మొదలైన బిరుదులు కపిలవాయికి సార్థకమైనవి. ఆయన అనేక మంది విశ్వవిద్యాలయ పరిశోధకులకు అనధికార మార్గదర్శకం చేశారు. ఎందరినో డాక్టరేట్లుగా తయారుచేసిన సాహిత్య శిల్పి కపిలవాయి. కపిలవాయి నిరంతర సాహిత్యకృషికి నిదర్శనంగా ఆయ న సాహిత్యంపై వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి. ఉస్మానియా, మధురై, తెలుగు, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో కపిలవాయి జీవితం, సాహిత్యంపై అనేక పరిశోధనలు జరిగాయి. ఇప్పుడు ఆయన రాసిన కావ్యాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. కపిలవాయి రాసిన ఒక్కో గ్రంథం పీహెచ్‌డీ స్థాయికి సమానంగా ఉంటుందనడంలో అతిశయోక్తిలేదు. వీరిపై శతకాలు కూడా రచింపబడ్డాయి. ఎందరో కపిలవాయిపై పద్యాలమాలను అల్లారు. గేయమాలికలను అలంకరించారు. వ్యాస సౌరభాలను వెదజల్లారు. సాహిత్యాన్ని వృత్తిగా, ప్రవృత్తిగా శ్వాసించిన కపిలవాయి ఎందరో పరిశోధకుల కు మార్గదర్శకులయ్యారు. తెలుగు సాహిత్యలోతులను మథించి ఎందరికో మార్గదర్శనం చేసినవారు. కపిలవాయి లింగమూర్తి స్వర్గస్థులైనా వారి రచనలు సాహిత్యలోకాన్ని అలరిస్తూ ఉంటాయి. వారి జీవితం, అధ్యయనం ఆదర్శప్రాయం.
-డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, 9032844017

582
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles