విలపించిన వెదురుపొదలు


Sun,November 11, 2018 11:08 PM

Jathasri
తెలంగాణ కథా, నవలా రచయిత జాతశ్రీ ఇక లేరన్న వార్త మనసును కలిచివేసింది. జాతశ్రీ కలం పేరుతో జంగం ఛార్లెస్ గారు ఎన్నో కథ లు, నవలలు రాసిన ఆయన ఈ నెల 4న కొత్తగూడెంలోని వారి స్వగృహంలో కన్నుమూశారు. జాతశ్రీ జన్మించింది నల్లగొండ జిల్లా అయినా పెరిగింది, చదివింది ఖమ్మంలో. బొగ్గుగనుల ప్రాంతమైన కొత్తగూడెంలో, ఉపాధ్యాయ వృత్తి చేపట్టడం వల్ల సింగరేణి కార్మికుల కష్టనష్టాలను స్వయంగా చూసినవాడై, ఆ అనుభవంతో సింగరేణి మండుతోంది నవల రాశారు. నల్లగొండ జిల్లా మట్టంపల్లి మండలం గుండ్లపల్లిలో 1943, ఆగస్టు 4న జాతశ్రీ జన్మించారు. కథా రచయితగా సాహితీవేత్తలకు సుపరిచితులు. నవలా రచయితగా కొద్దిమందికే తెలుసు.

బలిపశువు, వెదురుపొదలు నినదించాయి, సింగరేణి మండుతోందిలాంటి ప్రసిద్ధ నవలలు రాశారు. సుమారు 50 కథలు రాశారు. జాతశ్రీ నవలల్లో మొదటిది బలిపశువు. ఈ నవల 1978 విశాలాంధ్ర నవలల పోటీ లో ద్వితీయ బహుమతి పొందినది. రెండవ నవల వెదురుపొదలు నినదించాయి సాహిత్యం ప్రజా ఉద్యమాలను ప్రతిబింబిస్తూ ఉండాలని, ప్రజలకు మార్గదర్శకత్వంగా ఉండాలనేది రచయిత ఆశయం. 1980 జూన్‌లో ఈ నవలను విశాలాంధ్రవారే ప్రచురించారు. వెదురుపొదలు చైతన్యరహితమైనవి. ఆ విధంగానే అక్కడ బతుకుతున్న కోయజాతికి కూడా చైతన్యం లేదు. అధికారుల అన్యాయాలు సహించలేనివైనపుడు వెదురుపొదలు లాంటి కోయలు పోరుబాట పట్టి నినదించారు. వెదురు మురళిగా మారి రవళులను విన్పించినట్లు కోయల్లో చైతన్యం ఊపిరి పోసుకొని, వారు ఐక్య తా గీతాన్ని ఆలపించారు. వారిలోని సంఘటిత శక్తినీ, త్యాగనిరతిని చూపిస్తారు రచయిత.

బతకడానికి జంకితే బలుసాకు కరువైద్దిఅని నవలలో శీనయ్య పాత్రద్వారా చెప్పిస్తారు రచయిత. నవల రచనా కాలంలో 1979-80-ప్రాంతాల్లో కుటుంబ నియంత్రణ పేరుతో బలవంతాన 60ఏండ్ల ముసలివాళ్ళని, పెళ్ళిళ్ళు కానివాళ్ళనీ తీసుకెళ్ళి ఆపరేషన్లు చేయడం,తద్వారా అధికారులు లాభపడడం వంటి సమకాలీన విషయాలెన్నో నవలలో చోటుచేసుకున్నాయి. తమదైన సంస్కృతితో నాగరిక సమాజంలో ఇమడలేక, అలాగని కొం డ ప్రాంతాల్లో నివసించలేక చట్టాల ఆంక్షల్లోనుంచి బయటపడలేక వేదన పొందుతున్న జాతి కోయలు. వీరిజీవితాన్ని,సంఘర్షణను,వారిలోని మార్పు నూ, చైతన్యాన్నీ సమర్థవంతంగా చిత్రించిననవల వెదురుపొదలు నినదించాయి.ప్రజా ఉద్యమాలే చరిత్ర నిర్మాణానికి కారణమనీ నమ్మిన రచయిత జాతశ్రీ.

మరొక నవల సింగరేణి మండుతోంది. బొగ్గు గని కార్మికులతో మమేకమై వాస్తవ విషయాలనాధారం చేసుకుని రాసిననవల. సింగరేణి కార్మికుల జీవన పోరాటాలు, ఆరాటాల నేపథ్యంగా, 1988లో స్పష్టమైన రూపంతో సింగరేణి మండుతోంది అందించారు. బొగ్గు గని కార్మికులపై వచ్చిన తొలినవలగా చెప్పబడినప్పటికీ, ప్రచురణా కాలాన్ని బట్టి చూస్తే తుమ్మేటి రఘోత్తమరెడ్డి రాసిన నల్లవజ్రం మొదటినవలగా స్వీకరించవలసి ఉన్నది. ఈ నవలలో కార్మికులు ఉద్యమాల వల్లనే వారి సమస్యలకు పరిష్కారం పొందగలుగుతారని రచయిత అనేక సందర్భాలలో చెబుతారు.

కార్మికులు ఐక్యంగా కదలడాన్ని రచయిత శ్రీశ్రీ కవిత తో ఆవేశంగా తెలియచేస్తారు. మ్రోగించకు మరణమృదంగాలను, కదిలించకు సప్త భుజంగాలనుఅని చెప్పి మృదంగాలను దమ్మడ, దిమ్మడ మోగించారు. కర్రలతో పొడిచి భుజంగాలను కదిలించారంటారు జాతశ్రీ. పెట్టుబడిదారి వ్యవస్థ కార్మికోద్యమం వల్లనే అనివార్యంగా పతనమవుతుందని నవల ద్వారా చెప్తారు.
ఇలాంటి సామాజిక ప్రయోజనాన్ని ఆశించి, సాహిత్యా న్ని సృష్టించిన జాతశ్రీ మరణంతో తెలంగాణ ఒక గొప్ప రచయితను కోల్పోయింది.
- డాక్టర్ జి.శ్యామల, 9704175183
(జాతశ్రీకి నివాళిగా...)

585
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles