శ్రమలోంచే.. సంస్కృతి


Sun,November 11, 2018 11:05 PM

సంస్కృతి పట్ల అలాంటి దృక్పథంలో నూతన నైతిక పునాది వుంటుందని నా విశ్వాసం. అది ఒక శ్రామికుణ్ణి అతనిలో పాత ప్రపంచపు అవమానకరమైన వారసత్వంగా సంక్రమించి వుంటున్న ప్రతిదాని పట్లా సడలింపులేని పోరాటానికి ఆయ త్తం చేస్తుంది. అది సోమరితనానికి, తాగుడుకి, నిర్దాక్షిణ్యానికి, తన వర్గపు మహత్తర వీరోచిత కర్తవ్యాలకి ఆటంకం కలిగించేటటువంటి సంస్కార విహీన, ఉదాసీన స్థిరత్వ జీవితపు కామనకీ వ్యతిరేకంగా వుండే పోరాటం.

నా దృష్టిలో, సంస్కృతి పట్ల శ్రామికవర్గం ఇక్కడ చెప్పబోయే దృక్పథాన్ని అవలంబించడం మంచిది. సంస్కృతి అని పిలిచేది అంతా ఆత్మరక్షణ అనే సహజ ప్రేరణ నుంచి పుట్టింది. ప్రకృతి అనే సవతి తల్లికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో మానవుడి శ్రమవల్ల సృష్టి అయింది. సంస్కృతి అనేది మానవుడి సంకల్ప, మేధల శక్తి వల్ల అపర సృష్టి కావించే ప్రయత్నపు ఫలితం. తొలి ప్రకృతి అవ్యవస్థిత, ఆదిమ శక్తుల అయోమయం. అవి భూకంపాల్ని, వరదల్ని, తుఫాన్లని, క్షామ పరిస్థితుల్ని, భరింప శక్యంగాని ఉష్ణాన్ని, శీతాన్ని కలిగించే వి. తొలి ప్రకృతి తన శక్తుల్ని వ్యాధికారక సూక్ష్మ క్రిములను సృష్టించడంలో వృధాచేసేది. అది లెక్కలేనన్ని అపాయకర, నిరర్థకమైన మొక్కల్నీ, తృణాలనీ సృష్టించేది. మానవుడికి ఆహారంగా ఉపయోగపడే పళ్లూ, తృణధాన్యాలూ పెరగడానికి అవసరమైన ఆరోగ్యకర ఆవాసాలని పరాన్న జీవుల పునరుత్పత్తిమీద వృథా చేసేది. అసలు మానవుడికి ఉపయోగమైన తృణధాన్యాలని ప్రకృతి యెన్నడూ ఉత్పత్తి చెయ్యలేదనీ, ఇప్పుడు మనకు ఆహారంగా వున్న వాటికి ఆదిమ మానవులు క్రమేపీ ఎంతో కాలం బాధలు పడి, ప్రాణాలు పోయిన మీదట అలవాటు పడ్డారనీ ఎవరైనా అనుకోవచ్చు. మొట్టమొదట సారి బంగాళా దుంపల్ని వాడినప్పుడు యూరోపియన్లకి తీవ్రమైన వ్యాధులు సోకాయన్న వాస్తవం దీన్ని రుజువు చేస్తుంది. ఇది ఒక్క బంగా ళా దుంపలకి సంబంధించే కాక మిగతా వాటి విషయాల్లో నిజమే. ఈ మాదిరిగా మానవుడికి ప్రతికూలంగా నిరర్ధకంగా వుండే పరాన్నజీవి చెత్త మధ్యలో ప్రకృతి మానవుడ్ని సృష్టించింది. కాని అతన్ని మిగతా జంతువుల మాదిరిగానే ఒక జంతువుగా చేసింది.

ఈ జంతువు శారీరక బాధలకి ఎక్కువ చలించేదిగా అయింది. అంచేత ఆత్మరక్ష ణ సామర్థ్యాన్ని మిగతా జంతువులన్నిటి కంటే కూడా ఎక్కువ వేగంగా, నిశితంగా, వైవిధ్యభరితంగా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఆత్మరక్షణ సహజచోదన మానవుడికి తృణధాన్యాలనీ, పళ్లనీ, మొక్కల మధ్యా, గరికల మధ్యా ఔషధ మూలికల్నీ కనిపెట్టేట్టు నేర్పింది. జంతువులను మచ్చిక చెయ్యడం, మృగచర్మాల్ని ధరించడం, గుహల్లో నివసించడం,వేటాడే ఆయుధాలు, ఆత్మరక్షణ ఆయుధాలు, శ్రమను తగ్గిం చే పరికరాలు కనిపెట్టడం నేర్పింది. వివేకపు ప్రతి రెమ్మని వశం చేసుకోడానికీ పరిశీలన, అధ్యయనమూ అందించిన చిన్న, అతి సూక్ష్మ సత్యాంశాలే ఆధారం. జీవితం పట్ల భయమూ, జీవితం కోసం నిర్దాక్షిణ్యమైన పోరాటమూ, తన వ్యక్తిత్వం కోసం నిర్దాక్షిణ్యమైన పోరాటమూ జరిపేటప్పుడు ఆత్మరక్షణ సహజచోదన మానవుణ్ణి యుక్తిగా తాత్వీకరించేటట్టు చేసింది. అందుకనే అతిసామాన్యమైన సత్యపు వెలుతురుని మాయ మాటలు చెత్తా చెదారంతో జనం మసక కమ్మించేశారు. అందుచేత సత్యపు అవరోధాన్ని తొలగించే అవసరం, ప్రతి సత్య అంశమూ ఎలా ప్రత్యక్షమైందీ గుర్తు చేసే అవసరం ఉత్పన్నమవుతోంది. మానవ సంస్కృతి అనేది జీవశాస్త్ర దృగ్విషయం. అది జీవితం పట్ల మానవుడికి గల ఇచ్ఛలో వ్యక్తమవుతుంది, పోషకమవుతుంది, చింతనాత్మకం అవుతుంది. ఆ ఇచ్ఛ సకల జీవానికీ, అంటే మొక్కలకు, క్రిములకు, పక్షులకు, జంతువులకు వుండే చిత్రమైన అంధ ఇచ్చ. మానవుడు తను మిగిలిన జంతువులకంటే దుర్బలుడుగా ఉన్నానని అనుకున్నప్పుడే తన సంస్కృతిని సృష్టించుకో ప్రారంభించాడు. ఈ దౌర్బల్యాన్ని గుర్తించడం అనేది మరింత వేగంగా, విజయవంతంగా అతను తన ఆత్మరక్షణను పెంపొందించుకొనేటట్టుగా అతని సహజచోదనను చేసింది.

ఆత్మరక్షణ సహజ చోదన అనే దాని ఆధారంగానే అత్యంత విలువైన మానవ సామర్థ్యం-పరిశీలిం చే సామర్థ్యం-అభివృద్ధి అయింది. ఓ చీమకి, కాకికి, పెద్ద పులికి కూడా అలాంటి సామర్థ్యం ఉంటుంది. కాని మానవుడు పరిశీలించి పోల్చినప్పుడు ఆ సామర్థ్యాన్ని ఇంకా పెంపొందించుకున్నాడు. జీవితపు అన్ని పార్శ్వాలని గురించిన విజ్ఞానం కోసం చేసే ప్రయత్నంగా అభివృద్ధి చెందింది. తర్వాత ఆ జ్ఞానం కచ్చితమైన విజ్ఞాన శాస్ర్తాలు అయ్యే స్థాయికి చేరింది. మరి ఇవాళ అది క్రమేపీ ఒక సహజాతంగా, మానవుడి స్పష్టమైన భాష లాగా లేదా అతని నవ్వులాగా, అదే జీవశాస్త్ర సంబంధమైన సజీవ విలక్షణంగా మారింది. ప్రేమ, ఆకలి ప్రపంచాన్ని పాలిస్తాయని పూర్వం అనేవాళ్లు. ప్రేమ అంటే పునరుత్పత్తి యత్నం, ఆకలి - శారీరకమైన ఆకలి, కాని ఇవాళ మూడో సహజాతం గురించి కూడా మాట్లాడే హక్కు మనకు వుంది-సంజ్ఞాన సహజాతం, మేధాక్షుత్తు. దాని అంతస్సార ఫలితాలని బట్టి పరిశీలించడం వుండటమనేది ప్రకృతితోటి పోరాటంలో ఆత్మరక్షణ కోసం ప్రధాన ఆయుధంగా, తిరుగులేని ఔషధంగా, సాంస్కృతికాభివృద్ధికి ముఖ్య ఆధారంగా ఉండింది. నిప్పు వెచ్చదనాన్ని ఇస్తుంది. దాని ఉపయోగాన్ని గుర్తించడం సులభం. కాని నిప్పుని చెయ్యడం ఎలాగో తెలుసుకోవడం చాలా కష్టం. కొయ్యని కొయ్యతో రాపిడి చేస్తే కూడా వెచ్చదనం రావడాన్ని చూసి మానవుడు దాన్ని నేర్చుకున్నాడు. ఆ రకం గా రాపిడివల్ల అతను నిప్పును సాధించాడు. ఒక దీపాన్ని, తర్వాత నూనె దీపాన్ని ఎలా కనిపెట్టాడు? ఒక మనిషి జంతు చర్మాన్ని ఒలుస్తున్నాడు. అప్పుడు చీకటి పడింది. బాగా కొవ్వున్న మాంసంమీద ఒక కొయ్య ముక్కతో కొట్టాడు.

కొయ్య వెచ్చబడ్డాక కొవ్వు కరిగి ప్రకాశమానంగా, నిదానంగా వెలగడం అతను గమనించాడు. మానవుడు అలాంటి దీపాన్ని వెయ్యేండ్ల పాటు వాడాడు. విద్యుచ్ఛక్తి వినియోగంలో వున్న ఇప్పుడు కూడా వాడుతున్నాడు. నీళ్లల్లో తేలిపోయే చిప్పనో, గుడ్డుడొల్లనో చూసి మానవుడు పడవని కనిపెట్టాడు. తర్వాత ఉక్కుతోటీ ఇనుముతోటీ నిర్మించిన బ్రహ్మాండమైన ఓడలు నీళ్లల్లో అటూ ఇటూ ప్రయాణించడం అనే వాస్తవాన్ని సాధించాడు. అతను తుఫాన్ వల్ల పెకలించుకుపోయిన చెట్ల వేళ్లు మట్టి పెళ్లలనీ, రాళ్లనీ లేవనెత్తడం చూసి, భవిష్యత్ యంత్రాలకు ఆధారభూతమైన, లీవరు అంతరార్థాన్ని అవగతం చేసుకున్నాడు. సాలెపురు గు గూడు అల్లుకోవడం చూసి నేత నేర్చుకున్నాడు. కొన్ని పక్షులు ఆకులతోటి గూళ్ల ను అల్లుకోవడాన్ని చూసి, చలినుంచి తనని తాను కాపాడుకునేందుకు గాను, అత ను బహుశా జంతు చర్మాలను దగ్గరికి చేర్చి కుట్టడం నేర్చుకుని వుండచ్చు. ఇవాళ మానవుడికి సమకూరిన ప్రతిదాన్నీ ఆవిష్కరించుకోవడానికి మార్గం అలాంటిదే. విజ్ఞానశాస్త్రం సంస్కృతికి మూలం. అపర సృష్టి అంటే సంస్కృతిని, సృష్టించడానికి ప్రధాన శక్తి. నా అభిప్రాయంలో మతమూ, భావనాత్మక తత్వశాస్త్రమూ కళ కి చెందాలి. తన అనుభవాన్ని, అనుభూతుల్ని, కలలని ప్రతిమలుగా మార్చుకుని, తన అనుభూతుల్ని భావాలుగా మార్చుకునే మానవ సామర్థ్యానికి చెందాలి. మానవుడు దేవుణ్ణి తన అత్యుత్తమ ఆకాంక్షలతోటీ, సర్వజ్ఞత్వం పట్లా సర్వశక్తిమంతం కావడంపట్లా తనకు వున్న కలలతోటీ రూపొందించాడు. తనకు ప్రతికూలంగా వున్న ప్రాకృతిక పంచభౌతిక శక్తుల్ని జయించాలన్న తన ప్రయత్నంతో భగవంతుడ్ని రూపు దీర్చాడు.

ఆదిమ మానవులు తమ దేవుళ్లని సంస్కృతీ నిష్ణాతులైన వాళ్ల ప్రతిమలతో సృషించారనడానికి చాలా ఆధారం వుంది. విశ్వకర్మలు వల్కన్, తోర్; గృహిణులు-గెబా, ఫెయా; వేటగాళ్లు, నావికులు మొదలైన వాళ్లు ప్రపంచంలో వున్న ప్రతీదీ మానవ మేధ, ఊహ, సంకల్పం అనే శక్తులవల్ల నిర్మితమయ్యాయి. సంస్కృతిని నిర్మించడానికి వేరే శక్తులు లేవు అనే విశ్వాసం శ్రామికవర్గానికి అతి సన్నిహితంగా, అవగతమయేట్టుగా వుండాలి. ఒక పనివాడు కాల్చిన మట్టి ఇటుకల ముతక ముక్కలతోటి అద్భుతమైన ఆకారాలను, సంస్కృతీ ప్రాసాదాలను, నగరాలను నిర్మిస్తాడు. అసలు ప్రకృతిలో ఎన్నడూ లేని వాటిని గడియారాలు, రైలు వంతెనలు, శస్త్ర వైద్యుని పనిముట్లు, ఇంటర్నల్ కంబశ్చన్ ఇంజన్లు, టైపు యంత్రాలు వగైరా లాంటి వన్నింటినీ రూపం లేని ముడి ఖనిజంనుంచి సృష్టిస్తున్నాడు. తన మేధా సంపత్తివల్ల అతను ఇనుమునీ, ఉక్కునీ ఆత్మ స్వరూపకం చేస్తున్నాడు. అసలు ప్రకృతిలో ఉన్న ప్రతిదాన్నీ పరిశీలించి అధ్యయనం చెయ్యడంద్వారా ఒక శాస్త్రజ్ఞుడు, అసలు ప్రకృతి శక్తుల ఆధారంగా అపర ప్రకృతిని సృష్టించడం గురించి మానవుడికి నేర్పుతారు. అతని ఆరోగ్యాన్ని గురించి శ్రద్ద తీసుకుంటాడు లేదా జీవన ప్రమాణాన్ని పెంచుతాడు. మనుషుల ఆంతరంగిక ప్రపంచాన్ని మనస్తత్వాన్ని పరిశీలించిన కళాకారుడు మానవుడికి అతని ఔన్నత్యాన్ని గురించీ, అతని అల్పత్వాన్ని గురించీ అతని మేధా శక్తిని గురించీ, అతని పాశవిక సహజ ప్రవృత్తుల గురించి తెలియజేస్తాడు.

ముగ్గురు వ్యక్తులు సంస్కృతిని నిర్మిస్తారు- శాస్త్రజ్ఞుడు, కళాకారుడు,శ్రామికుడు. ఏ రకమైన సాంస్కృతిక ప్రాముఖ్యమూ లేని శ్రమ అనేది ఏదీ లేదనీ, శ్రమ పట్ల అనురక్తి ఎంత గాఢమైతే సంస్కృతి అంత ఉన్నతంగా వుంటుందనీ, విజ్ఞాన శాస్ర్తానికీ, కళకీ, శ్రమకీ గల నిర్ణాయక ప్రాముఖ్యాన్ని గనక తను బాగా అవగతం చేసుకుంటే ప్రపంచం మొత్తంమీద త్వరలోనే శ్రామికవర్గం పూర్తి విజయం సాధించగలదనీ మన అభ్యుదయగామి సోవియట్ శ్రామికవర్గం తెలుసుకోవాలి. సంస్కృతి పట్ల అలాంటి దృక్పథంలో నూతన నైతిక పునాది వుంటుందని నా విశ్వాసం. అది ఒక శ్రామికుణ్ణి అతనిలో పాత ప్రపంచపు అవమానకరమైన వారసత్వంగా సంక్రమించి వుంటున్న ప్రతిదాని పట్లా సడలింపులేని పోరాటానికి ఆయ త్తం చేస్తుంది. అది సోమరితనానికి, తాగుడుకి, నిర్దాక్షిణ్యానికి, తన వర్గపు మహత్తర వీరోచిత కర్తవ్యాలకి ఆటంకం కలిగించేటటువంటి సంస్కార విహీన, ఉదాసీన స్థిరత్వ జీవితపు కామనకీ వ్యతిరేకంగా వుండే పోరాటం.
- మక్సీమ్ గోర్కీ
(మక్సీమ్ గోర్కీ సాహిత్య వ్యాసాలు పుస్తకం లోంచి..)

529
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles