సాహిత్య, రాజకీయ సవ్యసాచి


Sun,November 4, 2018 10:58 PM

ఎప్పుడో 30 ఏండ్ల క్రితం రద్దయిన సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడ మీలను పునరుద్ధరించిన కేసీఆర్ నిజంగా అభినవ కృష్ణదేవరాయలని ప్రశంసలు పొందారు. ఏడాదికొకసారి రాష్ట్రస్థాయిలో తెలుగు మహాసభలు నిర్వహించాలని అప్పుడే సంకల్పించారు.
KCR-politics
సాహిత్యంలో అభినివేశం ఉన్న రాజకీయనేతలు అరుదుగా ఉంటారు. ప్రాచీన కాలంలో భోజుడు, కృష్ణదేవరాయలు, రఘునాథ నాయకు డు ఇలా వేళ్ళ మీద లెక్కపెట్ట గలిగే రాజులు, సంస్థానాధీశులు అటు సాహిత్యాన్ని ఇటు రాజకీయాన్ని సవ్యసాచులై నడిపిన చరిత్ర తెలిసిం దే. అదే క్రమంలో నాటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రధానులు పి.వి.నరసింహారావు, వాజ్‌పేయి పాలనాదక్షులుగా, రచయితలుగా, సాహిత్యవేత్తలుగా, బహుభాషా కోవిదులుగా, రాణకెక్కినవారే. వారిదారిలో వర్తమాన రాజకీయాల్లో ఉద్యమనేత కేసీఆర్ నిరంతర అధ్యయనశీలి. సాహిత్యంలోనూ, సందర్భోచితంగా పద్యాలు సంధించడంలోనూ దిట్ట. ఉద్యమ సమయంలో పాటలు రాసిన కవి. ఇతర కవుల పాటలకు తుదిమెరుగులు దిద్దిన క్రాంతదర్శి. ఆయనకు అత్యంత ఇష్టమైన పద్యం..
ఆరంభించరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై
ఆరంభించి పరిత్యజింతురురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్ననిహన్య మాన్యులగుచున్ ధృత్యున్నతోత్సాహులై
ప్రారబ్ధార్థమునుజ్జగింపరు సుమీ ప్రజ్ఞా నిధుల్ గావుతన్
అవాంతరాలకు భయపడి అల్పుడు ఏ పనిని ప్రారంభించడు. మధ్యముడు విఘ్నాలకు భయపడి ప్రారంభించిన కార్యాన్ని మధ్యలోనే వదిలేస్తాడు. ధీరోదాత్తు డు మాత్రమే ఆటంకాలకు భయపడకుండా లక్ష్యాన్ని ముద్దాడే దాకా ఉత్సాహంతో సాగిపోతాడు అన్నది ఆ పద్య సారాంశం. ఈ స్ఫూర్తితోనే కేసీఆర్14 ఏళ్ళు అవి శ్రాంతంగా పోరాడి ఉద్యమించి తెలంగాణ సాధించారు.
ఉద్యమ సమయంలో వివిధ సభల్లో రెండు చాటు పద్యాలు ఉదాహరించి సభికులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేవారు. పిట్టకథలు, సామెతలు సరేసరి. తానే పండితుడనన్న అహంకారముతో విర్రవీగే ఒక పరాయి ప్రాంత పండితుడు తెలంగాణలో ఒక ఇంటికి వచ్చాడట. ఆ ఇంటి ఇల్లాలు ఆదరించి ఆతిథ్యం ఇచ్చిందట. కడుపునిండా భోంచేసిన పండితుడు ఆ ఇల్లాలును అజ్ఞానిగా భావిం చి ఈ పద్యం చదివాడట.
పర్వత శ్రేష్ఠ పుత్రిక పతివిరోధి
అన్న పెండ్లాము అత్తను కన్న తండ్రి
ప్రేమతోడుత కన్నట్టి పెద్దబిడ్డ
సున్నమిప్పుడు తేగదే సన్నుతాంగి
తాత్పర్యం ఏమిటంటే- పర్వత రాజ పుత్రిక పార్వతి. ఆమె భర్త శివుడు. శివు ని విరోధి మన్మథుడు. మన్మథుని అన్న బ్రహ్మ. బ్రహ్మ పెండ్లాము సరస్వతి. సరస్వతి అత్త లక్ష్మి. లక్ష్మిని కన్నతండ్రి సముద్రుడు. సముద్రుని పెద్ద బిడ్డ జ్యేష్ఠాదేవి (దరిద్ర దేవత). ఓ దరిద్ర దేవతా తాంబాలంలోకి కాస్త సున్నం ఇస్తావా అని పద్యం ఆమెకు అర్థం కాదన్న గర్వంతో ఎకసెక్కమాడాడట. తెలంగాణ ఇల్లాలు సామాన్యురాలా? ఆ పండితునికి సున్నం ఇస్తూ పద్యంతోనే దీటైన సమాధానం ఇలా ఇచ్చిందట.
శతపత్రంబుల మిత్రుని
సుతుచంపిన వాని బావసూనునిమామన్
సతతము తలపై దాల్చెడి
సుతువాహనవైరి వైరి సున్నంబిదిగో... అన్నదట.
శతపత్రముల మిత్రుడంటే సూర్యుడు. అతని సుతుడు కర్ణుడు. కర్ణున్ని చంపినవాడు అర్జునుడు. అర్జునుని బావ కృష్ణుడు. కృష్ణుని సూనుని మామ చంద్రుడు. చంద్రుని సతతము తల దాల్చేవాడు శివుడు. శివుని కొడుకు గణపతి. గణపతి వాహనం ఎలుక. ఎలుకకు వైరి (శత్రువు) పిల్లి. పిల్లికి వైరి కుక్క. ఓ కుక్కా! సున్నం ఇదిగో అంటూ కుక్క కాటుకు చెప్పు దెబ్బలాంటి సమాధానం ఇచ్చిందట. తెలంగాణ ప్రజలు తెలివిలేని వాళ్ళు అని ఎవరైనా అనుకుంటే వారికి సమాధానం ఇట్లాగే ఉంటుందని కేసీఆర్ చెప్పగానే సభ అంత నవ్వులతో నిండిపోయేది. చప్పట్లు, ఈలలతో మారుమోగి పోయేది. దాశరథి పద్య పాదాలు నా తెలంగాణ కోటి రత్నాల వీణ నా తెలంగాణ తల్లి కంజాత వల్లి వంటి వాటిని కేసీఆర్ ప్రస్తావించిన సందర్భాలెన్నో.
2012లో కరీంనగర్‌లో కేసీఆర్ మేధోమథన సమావేశాన్ని నిర్వహించారు. సమకాలీన రాజకీయాలు పరిణామాలను టీఆర్‌ఎస్ శ్రేణులకు వివరించారు. ఇక అంతి మ పోరాటం చేయాల్సిందే అంటూ టీఆర్‌ఎస్ నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. వారందరిని అనునయిస్తూ చక్కటి పద్యాన్ని చదివి వివరించారు.
ఐనను పోయి రావలయు హస్తినకచ్చటి సంధిమాట ఎ
ట్లైనను శత్రురాజుల బలాబల సంపద నెన్నవచ్చు మీ
మానసమందు కల్గు అనుమానము దీర్పగవచ్చు తత్సమా
ధానము మీ విధానమును తాతయునొజ్జయు విందురెల్లరున్
మహాభారత కథలో పాండవుల అరణ్య అజ్ఞాతవాసాల తర్వాత ఒప్పందం ప్రకా రం అర్ధరాజ్యం ఇవ్వడానికి దుర్యోధనుడు నిరాకరించాడు. యుద్ధం అనివార్యమని తేలిపోయింది. ఇంకా రాయబారాలేమిటి యుద్ధం చేద్దామన్నారు భీమార్జునులు. అప్పుడు శ్రీకృష్ణుడు వారిని వారిస్తూ హస్తినాపురం వెళ్ళాల్సిందే. సంధి కుదిరినా కుదరకపోయినా శత్రువుల బలాలు, బలహీనతలు తెలుసుకోవచ్చు. మీ అనుమానాలు తీర్చుకోవచ్చు. కౌరవుల సమాధానం మీ విధానం భీష్మద్రోణాది ప్రముఖులు వింటారు..అనేది పద్యభావం. అదే దౌత్యనీతితో కేసీఆర్ ఢిల్లీలో బలాన్ని కూడగట్టి తెలంగాణ వ్యతిరేకుల కుట్రలను పసిగట్టి వారి అభ్యంతరాలను పూర్వపక్షం చేసి విజయం సాధించారు.ఆ సందర్భంలో అయినను పోయి రావలయు హస్తినకు అని ప్రయోగించని పత్రికలు, టీవీలు లేవంటే అతిశయోక్తి కాదు.
తెలంగాణ వ్యతిరేకులపై ఓ సందర్భంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ..
జెండాపై కపిరాజు ముందు సితవాజిశ్రేణియున్ గూర్చినే
దండంబున్ గొని తోలు స్యందనము మీదన్ నారి సారించుచున్
గాండీవంబు ధరించి ఫల్గుణుడు మూకన్ చెండుచున్నప్పుడొ
క్కండున్ నీ మొర ఆలకింపరు కురుక్ష్మానాథ సంధిల్లగన్
రాజ్యం ఇవ్వకుండా సంధికి అంగీకరించకుండా విర్రవీగిన దుర్యోధనుని గతి ఎలా ఏమయ్యిందో కేంద్రానికి అదే గతి పడుతుందని హెచ్చరించారు. ఈ పద్యంలో రాయబారానికి వెళ్ళిన కృష్ణుడు అన్నదీ అదే. నా సారథ్యంలో అర్జునుడు నీ సైన్యా న్ని చండాడుతుంటే, ఓ దుర్యోధనా! అప్పుడు నీవు సంధికి ముందుకొచ్చినా నీ మాట ఆలకించే వాళ్ళు ఎవ్వరు ఉండరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అదే జరిగింది.
కేసీఆర్ తెలంగాణ రాష్ర్ట తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రసంగిస్తూ ఒక చక్కని శ్లోకాన్ని పేర్కొన్నారు.
సర్వేభవంతు సుఖినః
సర్వేసంతు నిరామయాః
సర్వేభద్రాణి పశ్యంతు
మాకశ్చిత్ దుఃఖ భాగ్భవేత్
అందరు సుఖంగా ఉండాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందరూ క్షేమంగా ఉండాలి. ఎవ్వరికి దుఃఖం కలుగకూడదు అని ఆ శ్లోక తాత్పర్యం. కేసీఆర్ శుభసంకల్పమూ అదే.
గత డిసెంబర్‌లో హైదరాబాద్‌లో వారం రోజుల పాటు నభూతో న భవిష్యతి అన్న రీతిలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. అన్నీ తానై నడిపించిన కేసీ ఆర్ ప్రపంచ తెలుగు ప్రజల ప్రశంసలు పొందారు. సందర్శకులందరికీ మంచి విం దు భోజనం ఏర్పాట్లు, ఎక్కడికక్కడ సభావేదికలు, సాయంత్రాలు లాల్ బహదూర్ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు, కవులకు, పండితులకు, కళాకారులకు సత్కారాలు, దేశవిదేశాల నుంచి వచ్చిన వారికి అతిథి మర్యాదలు. మన తెలంగాణము తెలుగు మాగాణము అన్న నివాదం ప్రపంచ శిఖరం మీద ప్రతిధ్వనించిన సందర్భమది. స్వాగత తోరణాలతో, సంరంభాలతో, హైదరాబాద్ ఒక పెళ్లిపందిరిగా మారిపోయింది. ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ సభలో ప్రసంగించిన కేసీఆర్ నోట అలవోకగా పద్యాలు, పాటలు ప్రవహించాయి.
నల్లనివాడు పద్మనయనమ్ములవాడు..
బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్..
పలికెడిది భాగవతమట..
ఇందుగలడందు లేడని.. (బమ్మెర పోతన)
పాలసంద్రమందు పవ్వళించినవాడు..
అనగననగ రాగమతిశయిల్లుచు నుండు.. (వేమన)
సిరితావచ్చినవచ్చును..
అక్కరకి రాని చుట్టము.. (బద్దెన)
ఇవి గాక అవధానవేదికపై అటచనికాంచె భూమి సురుడు.. అన్న కఠినమైన పెద్దన పద్యం, నను భవదీయ దాసుని.. అన్న తిమ్మన పద్యం అలవోకగా చదివి అవధానులనే ఆశ్చర్యంలో ముంచెత్తారు.
ఎప్పుడో 30 ఏండ్ల క్రితం రద్దయిన సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడ మీలను పునరుద్ధరించిన కేసీఆర్ నిజంగా అభినవ కృష్ణదేవరాయలని ప్రశంసలు పొందారు. ఏడాదికొకసారి రాష్ట్రస్థాయిలో తెలుగు మహాసభలు నిర్వహించాలని అప్పుడే సంకల్పించారు. స్వపర భేదం లేకుండా దేశవిదేశాలలో ఉన్న తెలుగువారందరినీ ఆహ్వానించి ఆత్మీయ ఆతిథ్యాన్ని, అరుదైన జ్ఞాపకాలను అందించారు. కాళోజీ, దాశరథి పురస్కారాలను సాహితీవేత్తలకు అందించారు. నాలుగేళ్ళుగా రవీంద్ర భారతి సహా వివిధ సభావేదికలపై తెలంగాణ సాహిత్య కీర్తిపతాకం రెపరెపలాడుతూ ఉన్నది. ఈ మధ్య టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాల్లో తానేంటో ఒక పద్యం లో ఆవిష్కరించారు కేసీఆర్.
ఒకచో నేలను పవ్వళించు నొకచో నొప్పారు పూసెజ్జపై
ఒకచో శాకములారగించునొకచో ఉత్కృష్ట శాల్యోదనం
బొకచో బొంత ధరించు నొక్కొక తరిన్ యోగ్యాంబరశ్రేణి లె
క్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్
నేలమీద పడుకున్నా పూల పాన్పు మీద పడుకున్నా పచ్చి కూరలు తిన్నా, పంచ భక్ష్యాన్నాలు తిన్నా పాత బట్టలు ధరించినా పట్టు వస్ర్తాలు ధరించినా దుఃఖమైనా, సుఖమైనా కార్యసాధకుడు లెక్క చేయడు అని ఆ పద్య సారాంశం. కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం అంతే.
- డాక్టర్ అయాచితం శ్రీధర్, 96669 51258

1436
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles