కాలం వెంట సాగిన పాట


Sun,November 4, 2018 10:58 PM

palapitta-song
సాంఘిక పరిసరాలు కవి భావాలను, రచనలను నిర్ణయిస్తాయి. చరిత్రలో ఇదివరకెన్నడూ లేని సమాజాన్ని, ఇప్పుడు నిర్మాణా వస్థలో వున్న ఒక సమాజాన్ని, ఆ సమాజంలో నిర్మాణ భాగ స్వామిగా వున్న సమాజాన్ని చిత్రించడం మరో ఎత్తు. కవిత్వం అంటే తన ముందున్న ప్రపంచాన్ని కవి అర్థం చేసుకునే పద్ధతి. ఇంకా చెప్పాలంటే ఒక సక్రమమైన శాస్త్రీయ విధానం. ఆ విధానంలోంచి వచ్చిందే సుంకర రమేశ్ పాల పిట్ట పాట. కవిత్వం ప్రపంచాన్ని ఉన్నదున్నట్టుగా వర్ణించదు. కవికి గొప్ప పరిశీలనా దృష్టి ఉంటుంది. ప్రపంచంలో పడి కొట్టుకొని పోడు కవి. దృక్పప్రపంచ వివరాలను, విశేషాలను వాస్తవాలను అవలోకించే శక్తిని కవి కలిగి ఉంటాడు. సమా జంలో ఎల్లప్పుడూ జ్ఞానం పరిమితంగా ఉంటుంది. అజ్ఞానం అపరిమితంగా ఉం టుంది. కవి ఎల్లప్పుడూ జ్ఞానం వైపు నిలబడుతాడు. కవిత్వానికి సీరియస్‌నెస్‌తో పాటు, శిల్ప నిర్మాణ సౌందర్యాలతో, వ్యంగ్య వైభవం తోడైతే ఒక అద్భుతాన్ని సాధించగలుగుతుంది. ఆ వ్యంగ్య వైభవాన్ని కలిగిన కవిత ప్రతిమ తాగిన పాలు.
రండి ఇరవై ఒకటో శతాబ్దంలోకి
తొంగి చూస్తూ
మన కురచతనాన్ని కొల్చుకుందాం
కంప్యూటర్ తెరమీద
మధ్యయుగాల నాటి మనిషిని
పోల్చుకుందాం రండి.. అంటాడు. ఇందులో మరొక విశేషం ఉంది. దేశంలో అభివృద్ధితో పాటు పెరిగిన అజ్ఞానాన్ని పరిహసించాడు కవి. శాస్త్రీయ పరిజ్ఞానంతో పాటు మన దేశ సమాజం అశాస్త్రీయ వికృతత్వాన్ని ఎంత అందంగా పెంచి పోషిస్తుందో తెలియజేస్తుందీ కవిత.
బుద్ధిజీవులది ఆలోచన, హృదయ జీవులది అనుభూతి. కవి ఏక కాలంలో అనేక పాత్రలు పోషిస్తాడు. వాస్తవాలను చెబుతూనే హృదయాలను పులకరింపజేస్తాడు.
ఎంత బంధించుకొన్నా
ఏ కన్నం నుంచో
చలిపాములా దూరి
కాటేస్తుంది.. అని చలిని వర్ణిస్తూ ఒక వర్ణనా ప్రపంచంలోకి మనల్ని వెంట బెట్టుకొని పోతాడు.
రాత్రికాలం
తాబేటి మీద స్వారీ చేస్తుంది.. అంటూ... ప్రకృతిలో కూడా వాతావరణపు మార్పును బట్టి మన హావభావాలు మారిపోతాయి. కవి ఇవి గమనిస్తూ ఉంటాడు.
ఉన్నతమైన రాజకీయ దృక్పథం, సున్నితమైన కళాత్మక నైపుణ్యాల సమన్వ యంలో నుంచే ఉత్తమ రచన ఆవిర్భవిస్తుంది అంటాడు మావో. ఒక దృక్పథానికీ, కళాత్మకతకూ సమన్వయాన్ని సాధించిన కవిత పాలపిట్ట పాట.
సుళ్ళు తిరిగే శోకంలో
చిన్న నీటి బొట్టు
పరుగాపవే పాలపిట్ట
పదనిసల వలలో చికుకున్నది కాలం
దయలేకుండా సాగుతున్నది
జీవన నౌక..!
మానవ జీవన సంవేదనలను, అంతర్లోకాల అలజడులను వినిపించాడు సుంకర రమేశ్. మనిషికి కూడు, గూడు, గుడ్డ బతుకడానికి. కానీ జీవించడానికి సంస్కారం కావాలి. ఈ సంస్కారం కూడా తనవరకు సరిపోతుంది. మరి నలుగురి కోసం స్పందన కావాలి. సాహిత్యం సంస్కారాన్ని, స్పందనలనూ సమకూర్చి పెడుతుం ది. వీటిని అందిపుచ్చుకున్న కవి సుంకర. ఒక పేపర్ బాయ్ పట్ల సేల్స్‌మెన్ పట్ల రైల్లో అడుక్కునే వాళ్ళ వెంటాడే పాట పట్ల ఐస్‌క్రీం పిల్లగాడు వంటి కవితల్లో తన సామాజిక బాధ్యతను సంస్కారవంతమైన స్పందనగా వెలువరించాడు.
హైదరాబాద్ నగరంలో చదువుకుంటూ తిరిగిన పల్లె జీవన నేపథ్యమున్న ఏ కవి అయినా అక్కడి జీవన విధానాన్ని అంత తొందరగా జీర్ణించుకోడు. ఎవరికి వారు ఒంటరి ద్వీపాలై పోయే జీవన శకలాలను నగరం ఒక ఇగ్లూ అన్న కవితలో దృశ్యీ కరించాడు.
కవి వర్తమాన కాలంలో జీవించడమంటే ఆధునిక మానవునిగా జీవించడం. మానవత ను వరించడం. హేతువాదపు వెలుగును దర్శి స్తూ, నూతన సమాజ నిర్మాతగా మారిపోవ డం. ఈ క్రమంలో కవి లోకం పోకడలను గమ నిస్తూ తన భావావేశానికి సరిపోయే వస్తువు లను ఎన్నుకుంటూ తన రచనల్లో కవితగానో, పాటగానో, కతగానో అభివ్యక్తీకరి స్తాడు. సుంకర రమేశ్ కవిత్వంపై మమకారం ఉన్నవాడు. ఈ విషయం అతడు మంచి కవిగా పరిణామం చెందిన క్రమాన్ని తను రాసిన కవిత్వంలో ఉన్న పరిణతిని చూస్తే అవగతమవుతుంది. నిర్దిష్టత నుంచి, విశ్వజనీనత వైపుగా అతని కవిత్వం ప్రయా ణించింది. తెలంగాణ ఉద్యమకాలంలో వెలువరించిన కవిత్వంగానీ జాతీయ, అంతర్జాతీయ ఘటనలను తన కవిత్వంలో దర్శింపజేయడంలో గానీ సుంకర రమేశ్‌ను మనం ఒక నైపుణ్యం కలిగిన వర్తమాన కవిగా చూడవచ్చు.
కవిత్వం మానవుడికి సాంస్కృతిక చైతన్యంతో సంక్రమించే మాతృభాష. ప్రపంచ దుఃఖాన్ని, ఆనందాన్ని సకల సంవేదనలను అభివ్యక్తీకరించగలిగిన హృదయ భాష. సుంకర రమేశ్.. క్రాంతి గీతం.
- తైదల అంజయ్య, 98668 62983

1041
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles