నీళ్లంటే క్యూసెక్కులు కాదు.. జీవితాలు


Mon,October 29, 2018 12:28 AM

తెలంగాణ చెరువులన్నీ జీవం పోసుకుంటున్న వేళ, పాలమూరు జిల్లాలో కూడా పంట చేలు హరిత వర్ణాలను ఆవిష్కరిస్తున్న తరుణా న.. ప్రకృతితో మట్టి మనుషులతో విడదీయలేని బంధాన్ని ఏర్పరుచుకున్న తెలంగాణ కవులు తమ హృదయం నుంచి జాలువార్చిన కవితోత్సవం ఒక అభివృద్ధికి నిలువుటద్దం. ఒక్కొక్క కవిదీ ఒక్కో శైలి. ప్రతి ఒక్కరూ తమ జీవితాలతో ముడిపడి ఉన్న స్మృతులను, జ్ఞాపకాలను ఎంతో హృద్యంగా ఇక్కడ మలిచారు.
jala-kavithotsavam
ఎత్తం గట్టు. పద్నాలుగు వందల అడుగుల ఎత్తు ఉంటది. శిఖరంపై కొలువున్న శ్రీరామలింగేశ్వరస్వామిని చేరుకోవాలంటే రహదారులేం లేవు. మట్టిదారి కూడా ఉండ దు. ఒక్కోబండరాయిని దొరకబుచ్చుకొని పాక్కుంటూ పైకెక్కవలసిందే. ఏటా రెండు రోజులు మాత్రమే దర్శనిమిచ్చే ఈ మూర్తి కోసం (పాత) పాలమూరు జిల్లావాసులు వేలాదిగ వస్తరు. మదిలో మూటలు విప్పి కోరికలు విన్నవిస్తరు. మొక్కులు సమర్పిస్తరు. ప్రతీ సంక్రాంతికి ఇదొక ఆనవాయితీ. గట్టెక్కితే.. చుట్టూ పదికిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలన్నీ కనిపిస్తయి. సస్తే సావు కొర కు.. కంటే కాన్పు కొరకు.. వలసపోయిన జనము వచ్చిపోతుంటరని గోరటి వెంకన్న చెప్పినట్లు.. ఆ పల్లెలు ఏండ్ల సంది పడావు పడినయ్. నీళ్లు లేక బిక్కచచ్చిపోయినయ్. వర్షం పడితే చెరువు నిండితే పంట పండినట్టు లెక్క. లేదంటే మెట్ట పంటలేస్తరు. కాదంటే పొలాలకు సెలవులిస్తరు. వీపున చాకలి మూటలా ఎన్నో కథలను మోసి పిల్లగాండ్ల తో ఈతల కేరింతలు కొట్టించిన చెరువులు కొవ్వొత్తుల్లా కరిగిపోయినప్పుడు గుండెలు పిండుకోని వాళ్లు లేరు. అయితే ఈ సారి సంక్రాంతికి ఎత్తం గటెక్కినోళ్లకు ఒక రమణీయమైన దృశ్యం ఆవిష్కృతమైం ది. కనుచూపుమేరలో ఉన్న చెరువులన్నీ ఒంటినిండా నీళ్లు కప్పుకుని కనిపించినయ్. ఇన్నాళ్లుగా జాడలేని నీటికొంగలు ఒంటికాలిపై కూర్చొ ని జపం చేస్తూ కనువిందు చేసినయ్. ఏండ్లుగా మెట్టకే పరిమితమైన పొలాలు చుట్టూ తడి నింపుకున్నయ్. నిండా ఎదిగిన పైరులతో పచ్చ టి వర్ణాలు అలంకరించుకున్నయ్. దూరంగా కనిపించే సింగోటం చెరువు కృష్ణమ్మతో సంగమించి నిండా నీళ్లు నింపుకున్నది. అవి అక్క డి నుంచి బిరాబిరా కదిలి ఊరూరికి చేరి చెరువుల దాహాన్ని తీర్చినయ్. చేనులల్ల పంటలై ఊగినయ్. రచ్చబండపై నీటి ముచ్చైట్లెనయ్. అలా పల్లెల కడుపులు నింపుతూ కొనసాగిన జల ప్రవాహమే మనోజ్ఞ రసజ్ఞ చైతన్య వితర్దికగా మారి వచనమైంది. కావ్యమైంది. గేయమైం ది. కవితోత్సవమై జలగానమైంది.

వట్టిపోయిన చెరువులకు బీడువడ్డ నేలకు నెలవుగా మారిన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పుడు జలవనరులు వచ్చి చేరుతున్నయి. ఏడాదికోసారి కూడా లేని పంట ఇప్పుడు రెండు పంటలతో రైతింట పసిడి కురిపిస్తున్నది. కారణం తెలిసిందే.. మన తెలంగాణ. మన నాయకత్వపు సంకల్పం. అన్ని చెరువులల్లో కృష్ణా నీళ్లు వచ్చి నిండుతున్నయ్. నీటిగోస నుంచి అన్నదాతకు విముక్తి కలుగుతున్న సంతోష తరుణాన కవులందరూ ఈ ఏడాది మే ఆరున వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి జలకవితోత్సవం పేరున బృహత్ కవి సమ్మేళనం నిర్వహించిండ్రు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ సత్కార్యానికి పూనుకున్నరు. ఈ కార్యక్రమానికి 31జిల్లాల నుంచి కవులు పాల్గొన్నరు. ఈ సమ్మేళనంలో 400మంది కవులు చదివిన కవితలన్నీ తెలంగాణ జల కవితోత్సవం పేరుతో పుస్తకమై వెలువడింది. ఈ నెల(అక్టోబర్) 21న తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ, తెలంగాణ వికాస సమితి, తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిండ్రు. ఈ పుస్తకానికి ప్రధాన సంపాదకులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి. ఎన్.గోపి, నందిని సిధారెడ్డి, ఎల్లూరి శివారెడ్డి, అమ్మంగి వేణుగోపాల్, సుంకిరె డ్డి నారాయణ రెడ్డి, నాళేశ్వరం శంకరం, కందుకూరి శ్రీరాములు, ఏ.జయంతి, ఏనుగు నరసింహారెడ్డి, జూలూరు గౌరీశంకర్, భీంపల్లి శ్రీకాంత్, వనపట్ల సుబ్బయ్య, కొల్లాపురం విమల వంటి తెలంగాణ కవులు, ప్రముఖులందరూ జలమే గళమై కలమై తెలంగాణకు సమర్పించిన కవితా తోరణమై పుస్తకంగా తీసుకొచ్చిండ్రు.

నీలోకి నాలోకి
ఇంట్లోకి చేన్లోకి
ఇరాం లేకుంట ప్రవహిస్తది.. అని నీళ్ల గురించి కవితీకరించిన నందిని సిధారెడ్డి పుస్తక పరిచయం చేస్తూ విలువైన మాటలు మరిన్ని చెప్పిండ్రు.
తెలంగాణ వాళ్లకు
నీళ్లంటే క్యూసెక్కులు, టీఎంసీలు కాదు
జీవితాలు
నిజమే
నీళ్లను కొలవాల్సింది జీవితాలుగానే
జీవితాలతోనే..
ఆధిపత్యం కొల్లగొట్టింది నీళ్లనే కాదు. జీవితాలనూ!అని చెబుతూనే పారినవి పొలాలు మాత్రమే కాదు, కవుల కలాలు,ప్రజల పరవశాలంటూ కవితోత్సవాన్ని ఆయన ప్రశంసించిండ్రు.
ఇనుప తీగలకు పూలు పూచే చోటు
రాళ్లు జవరాళ్లుగా మారి/ రక్తిని పంచే చోటు
మేటి నుండి సుధను/ఒడిసి పట్టిన చోటు
ఒక్క తెలంగాణమే /ఇక్కడి ప్రతి గుట్టకు వందనం
ఈ గట్టుకు నా వందనం
అక్షరాలు ప్రభవించిన పుట్టకు నా వందనం
పచ్చని చిలుకులు చేరిన ఈ పారిజాతానికి వందనం..
అంటూ ..తెలంగాణలో ఇంతమంది కవులు ఒకే చోట చేరి ఒకే అంశంపై కవితాగానం చేయడం చూసి డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి గారు పరవశించి పోయిండ్రు.
చెరువు గురించి నాళేశ్వరం శంకరం రెండు మంచి మాటలిట్లన్నడు
ద్రవించే కాలువై చెరుకుతోటలో అదృశ్యమై
చెరుకు గడై రసమై పంచదారై
పెదాల మీద తీపి స్మృతి గంధమౌతుంది చెరువు
పచ్చటి పంటపొలాల మీది పసిపాపల నవ్వుల పువ్వై పూస్తుంది
ఫలించే విత్తనమై విశ్వమంతా వ్యాపిస్తుంది..

తెలంగాణ చెరువులన్నీ జీవం పోసుకుంటున్న వేళ, పాలమూరు జిల్లాలో కూడా పంట చేలు హరిత వర్ణాలను ఆవిష్కరిస్తున్న తరుణా న.. ప్రకృతితో మట్టి మనుషులతో విడదీయలేని బంధాన్ని ఏర్పరుచుకున్న తెలంగాణ కవులు తమ హృదయం నుంచి జాలువార్చిన కవితోత్సవం ఒక అభివృద్ధికి నిలువుటద్దం. ఒక్కొక్క కవిదీ ఒక్కో శైలి. ప్రతి ఒక్కరూ తమ జీవితాలతో ముడిపడి ఉన్న స్మృతులను, జ్ఞాపకాలను ఎంతో హృద్యంగా ఇక్కడ మలిచారు. నీళ్లను క్యూసెక్కులుగా కాకుండా జీవితాలుగా ఎందుకు కొలవాలో.. బ్లాంక్ చెక్కుల్లాంటి భూములకు అవి ఎలా విలువను రాస్తాయో ఈ జల కవితోత్సవం కళ్లకు కట్టినట్టు చెబుతుంది.
- చిరంజీవి ప్రసాద్ సంతపూరు
9182777007

702
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles