కవితల ‘కాంతి కవాటం’


Sun,October 21, 2018 10:56 PM

అభ్యుదయ భావాల కాంతి కవాటం తెరిచిన వడ్డేపల్లి కృష్ణ కవిత్వ కాంతులు సమాజ శ్రేయోదీపులు కావాలనీ, పైరవీలు ప్రతిబంధకం కాని ప్రతిభ పురస్కారపు కందిలి తనకు అందిరావాలని కోరుకుంటున్నాను.
kanthi-kavitam
సినిమా పాటలు రాసే సినీగీత రచయితలకు జనబాహుళ్యంలో ఎక్కువ పేరు ప్రతిష్ఠలుంటాయి. నిజమే కానీ సాహిత్య ప్రపంచంలో సీరియస్ కవులుగా వారిని గుర్తించటం తక్కువ. కానయితే, సినిమాలలోకి రాకమునుపే తమ కవితా వ్యాసంగంతో కవులుగా పేరొందిన శ్రీశ్రీ, ఆరుద్ర, సినారే, దాశరథి వంటివారికి ఇది వర్తించదు. సినిమా పాటల సాహిత్యాన్ని కూడా గుర్తించాలని శ్రీశ్రీ వంటి కవి ప్రత్యేకించి అన్నాడంటే.., కవిగా గుర్తించబడటానికి సినీగీత రచయిత మాత్రమే కావటం ఒక అవరోధం గా ఉన్నట్లే మరి. సినీ కవికి గ్లామర్ ఎక్కువే. కానీ అసలు సిస లు సీరియస్ కవిగా సాహిత్య చరిత్రలో కవితారంగంలో గుర్తించబడటం విశేష గౌరవ భాజనం.
లలిత గేయ రచయితగా ఆకాశవాణి ద్వారా తొలుత సుప్రతిష్టుడైన డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ ఆ తర్వాత సినీ గేయరచయిత గా మాత్రమే గాక, టీవీ ధారావాహికలు, చలనచిత్రాల రచ న, దర్శకత్వం వహిస్తూ జయ జయ హే తెలంగాణ వంటి నృత్య రూపకాల రచనతో గణుతికెక్కారు. పద్య కవిత్వం, గేయకవిత్వం, వచన కవిత్వం ఇవన్నీ కవిత్వ ప్రక్రియా సం బంధులే. ఒకప్పుడు పద్య కవిత్వం రాజ్యమేలింది. ప్రస్తుతం వచన కవిత్వం ప్రధాన స్రవంతిగా సాగుతున్నది. 1968 నుంచి పలు పత్రికల ద్వారా తన కవితా రచనా వ్యాసంగాన్ని నిరంతరాయంగా సాగిస్తూనే వచ్చిన వడ్డేపల్లి కృష్ణ ఇంతవరకు ప్రచురించిన పాతిక ముద్రిత గ్రంథాలలో అంతర్మథనం, హలాహలం, వడ్డేపల్లి సమగ్రవచన కవిత మాత్రమే పూర్తినిడివి వచనకవితా సంపుటాలు.
1995లో తన సాహిత్య జీవిత రజితోత్సవం సందర్భంగా వెలువరించిన సమగ్ర వచన కవితా సంపుటి తర్వాత, దాదా పు రెండు దశాబ్దాల తన కవితలను కాంతి కవాటంగా సరికొత్త కవితా సంపుటిగా వెలువరించారు వడ్డేపల్లి కృష్ణ. ఈ కవి తా సంపుటి కాంతి కవాటం కందిలి అనే కవితతో ప్రారంభమై తనకు స్ఫూర్తి ప్రధాత అయిన సినారెకు స్మృతిగా రాసిన దివికేగిన దివ్యకవి కవితతో సమాపనమైంది.

కరెంటు లేని ఆరోజుల్లో కందిలియే ఎలా తోడయ్యిందీ చెబుతూ..
రేపటి పరీక్ష ఏమవుతుందో.. అని
రెప్పవాల్చక చదువుతూ
గావరగావరవుతుంటే
భయపడక బుద్ధిగా చదువు-
భద్రుగా నాలాగా వెలుగుతావు!
రేపటి పరీక్షలే కాదు
ఆపై జీవితంలో ఎదురయ్యే
అనేక పరీక్షల్నీ నెగ్గుతావు.. అంటూ
హితోపదేశం చేసేది కందిలి! అంటూ అందువల్లనే తానెంతగా ఎదిగినా
ఆ కందిలి
నా వెలుగుల పందిరి!
దానికి నా స్మరాంజలి.. అంటాడు వడ్డేపల్లి.
కాంతి కవాటం కవితా సంపుటి నామధేయంగా అమర్చుకున్న కవితలో..
ఇంటి కలప కవాటం తెరిస్తే.. వాకిలి వైభవం ప్రత్యక్షం.. అంటాడు కృష్ణ.
వడ్డేపల్లికి హాస్య, చమత్కారాలు అంటే ఇష్టం. ప్రధానంగా గేయకవి కావటం వల్ల ప్రాసలతో క్రీడలు, పదాల ఫన్‌దిరులు సలపడం, నిలపడం చేస్తాడు. వ్యంగ్య వైభవంలోనూ, చురుక్కుల చురకలూ వేస్తుంటాడు. వచనమై తేలిపోవటానికైనా, సంసిద్ధుడే కానీ.. గూఢత, మార్మికత పేరనో, అస్పష్టత పేరనో అభివ్యక్తం కాడు.

ఓ కవీ,సుకవీ, సుఖకవీ
శాలువాలు, సత్కారాలు అందుకుంటున్నా
పండగపూటా పాత కవిత్వమేనా?
నిన్నమొన్నటి పదార్థాల్ని
మైక్రోవేవ్‌లో మళ్లీ వేడిచేసి తిన్నట్లు!
తాజాగా తయారుచేసుకోలేవా
అక్షరాల బొబ్బట్లు.. అంటాడు.
నాలుగు ఉగాది కవితలు, ప్రపంచ కవితా దినోత్సవ కవితలు రెండు,గణతంత్ర, స్వాతం త్య్ర దినోత్సవ సందర్భ కవిత లు..ఇలా పునరావృత్త సందర్భా లకై సమయోచిత భావనలతో, గతానుగతిక ఇతివృత్తాలను సంతరించుకోవటం అనే వైఖరిని మూసను ఛేదిస్తూ మాస్‌ను చేరుకుని చప్పట్లు చరిపించుకునే చేవను వడ్డేపల్లి ఆవాహన చేసుకున్నాడు.

మానవతే మకుటాయమానంగా బతుకులోని కోణాలను ఆవిష్కరించి చూపే ప్రజ్ఞ తనలోని మరో కవితా పార్శం.
పడిపోతే కంటతడితో
పరితపిస్తూ లేవనెత్తుతుంది అమ్మ!
అసలు కంటతడియే కలుగకుండా
అది అనుభవంగా మార్చి
అదనుగా పరిగెత్తేలా చేస్తాడు నాన్న.. అంటాడు అమ్మ-నాన్న కవితలో.
పల్లె తల్లి మారుమూల
తల్లడిల్లిపోతున్నా
పట్నాలకు పంటలనే
కట్నాలుగ యిస్తోంది.. అంటూ మా వూరే తల్లివేరు అన్న ఖండికలో తనదైన గేయధారలో..
సిరినేతలు విలసిల్లిన
సిరిసిల్లా మా వూరు
కాని నేడు కర్మాగాలు
ఉరి సెల్లా మా వూరు.. అని గాయాల దారిని తలచి తల్లడిల్లుతాడు.
అలాగే విశ్వనగరం అన్న కవితలో..
చార్మినార్ చార్మ్‌తోనో
గోల్కొండ పాత గొప్పతోనో
విశ్వనగరం ఏర్పడదు!
ప్రతిపేదవాడి పేట్ గండిపేట్
పరమానందంగా నిండినిప్పుడే
నిజమైన విశ్వనగరం రుజువుగా అగుపిస్తుంది.. అంటూ వీథులు కేవలం విశాలం అవడం కాదు, జీవుల హృదయాలు విశాలం అయినప్పుడే సంపూర్ణత అంటాడు.

చిలక ముక్కు అనే కవితలో..
పండ్లను అదే పనిగా కొట్టడం వల్లనేమో.. చిలకముక్కు చిత్రంగా ఎర్రబడి పోయింది! / ఫండ్లను అదేపనిగా కాజేయటం వ్లనేమో..రాజకీయం పూర్తిగా రంగునే కోల్పోయింది.. అంటూ పండ్లను, ఫండ్లనూ చమత్కరించటంతో బాటు, ఏ ముక్కును రాజకీయంగా ధ్వనింపచేస్తున్నాడో గ్రహించటం కష్టమేమీ కాదు.
తెలంగాణ మాండలికంలో బంగారు బాష-బతుకు అనే కవిత మురిపిస్తది.అలాగే సెల్‌ఫోన్‌కు సెల్యూట్ అనే కవితలో ఆధునిక సాంకేతికతకు ఆహ్వానం పలుకక తప్పదనిపిస్తాడు.
మబ్బులెన్ని కమ్మిననూ
వెలుగొందేవాడు రవి
మరణానంతరం గూడ
మన గలిగినవాడు కవి
అందుకే..
మరో రవిలా నిత్య నూతనంగా ప్రకాశించు
మహాకవిలా సత్యకేతనంగా రాణించు.. అంటాడు రవి-కవి అనే కవితా ఖండికలో.
అభ్యుదయ భావాల కాంతి కవాటం తెరిచిన వడ్డేపల్లి కృష్ణ కవిత్వ కాంతులు సమాజ శ్రేయోదీపులు కావాలనీ, పైరవీలు ప్రతిబంధకం కాని ప్రతిభ పురస్కారపు కందిలి తన కు అందిరావాలని కోరుకుంటున్నాను.
-సుధామ,9849297958

1110
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles