బంతిబువ్వ.. వడ్లకొండ కవిత్వం


Sun,October 21, 2018 10:54 PM

banthi-buvva
తను ఆకాశానికి/ఎగబాకినందుకేమో..
కల్లుకు అన్ని పొంగులు !
తను కత్తితో/మెత్తగా ముద్దాడినందుకేమో..
కల్లుకు అన్ని సొబగులు!
తన చెమటగంధం/చిలకరించినందుకేమో...
కల్లుకు అన్ని రుసులు..!
ఈ మూడు కవితాపాదాలు మనమిప్పుడు మాట్లాడుకోబో యే కవి సామాజికవర్గాన్ని పట్టిస్తుంది. చిన్నప్పుడే దూరమైన బాపు-వడ్లకొండ చంద్రయ్యను యాజ్జేసుకుంటూ పలుకుబడి కవి వడ్లకొండ దయాకర్ తన తొల్సూరు బిడ్డసొంటి కైతల వయ్యి బంతి బువ్వను బాపుకే అంకితమిచ్చిండు.
బాపు గురించి
నేనెవలతో మాట్లాడ
ఒక్క కవిత్వంతో తప్ప.. అని బాపు యాదిలో కవిత సురువైతది. సూత్తానికి అల్కగ కనిపించే బరువైన పదాలు. పాయిరంగ సూసుకునే బాపు పాడెక్కినపుడు ఒంటరితనం పంచిన దుక్కం,ఎడబాటు గొంతులో జీరగా తట్టుకుంటనే వుంటయి.
పోయినోళ్లను యాజ్జేసుకుంటాంటె గుండె తడైతాంటది. గావురంగ గుండెల మీన ఆడిచ్చిన బాపు గదా..ఎప్పటికీ కండ్ల ల్ల మెదులుతనే వుంటడు.

వడ్లకొండ దయాకర్ బహుశా అప్పుడే కవై వుంటడు. బాపులేని లోటును కవిత్వంగా తన చేతుల్లోకి తీసుకుని ముద్దాడివుంటది. కవి హృదయం సున్నితం. మా దయాకర న్న మరీ సున్నితం. సహజంగానే కవి అయిండు. ఊరి భాషలోనే కవిత్వం రాత్తాండు. పలుకుబడులు,నుడికారాలకు కొత్త వ్యాకరణం అందిత్తాండు. సుతిమెత్తని మనసులే తొందరగా గాయపడుతై. దయాకరన్న అందుకు అతీతుడు కాదు. పైగా సందర్భం తెలంగాణ ఉద్యమం. యాదుంచుకో.. కొడుకా అని ధిక్కార స్వరాన్ని వినిపించిండు.
వారీ...ఒక్కటి తెల్సుకో
ఈ న్యాలకు ఉరేసుకునుడే కాదు
ఉరేసుడూ తెల్సు
తగలబెట్టుకునుడే కాదు
తగలబెట్టడం ఎర్కే
కాల్సుకోవడమే కాదు
కూల్చడమూ దెల్సు
జర యాదుంచుకో కొడుకా..అని హెచ్చరించిండు.
బంతిపువ్వు తెలుసు గని గీ బంతిబువ్వ ఏంది? అని అడిగిన వాళ్లున్నరు? బంతి అంటే వరుస. సామూహిక భోజనా లు అని అర్థం. వరుసలో కూర్చుని అందరు కల్సి చిన్నా పెద్దా తేడా తెల్వకుండ భోజనం చేయడం. ఇది తెలంగాణ పల్లెల్లోని ప్రతీ సంబురాన్ని, సంతోషాన్ని విషాదాల్ని సుత బంతిబువ్వ తో పంచుకుంటరు. ఇది ఎప్పుడు ఎక్కడ మొదలయిందో తెల్వదుగని పల్నాటి బ్రహ్మనాయుడు చాపకూడుఅనే పద్ధతిని ఉద్యమంగా ప్రారంభిం చి, కొనసాగించినట్లు చరిత్ర చెబుతున్నది. కుల ప్రస్తావన లేకుండా అందరూ సమానమనే భావన పెంపొందించాలని చేసిన ప్రయత్నం విజయవంతమైందనే ఆధారాలున్నాయి. బంతిబువ్వ కవితలో పల్లెల్లో బంతిలో కూసున్నంక జరిగే తంతు ను మన కండ్ల ముందుంచిండు.

కులమంతగూడి
ఆత్మీయంగా అల్లుకుని
కట్టసుఖం మాట్లాడుకునే తావు..
అని బంతిబువ్వను సూత్రీకరించిండు. ఈ కవితా పాదాలతోటే కవిత ప్రారంభమౌతుంది. పల్లెల్లో జరుగుతున్నదిదే. కుల కట్టుబాట్లను తెంచుకుని వసుధైక కుటుంబ భావనతో ఎటువంటి కలహాలు లేకుండా బంతిబువ్వతినే సంప్రదా యం రావాలని కవి ఆశించి వుంటే మంచి ముగింపు అయ్యేదేమో ! అనిపించింది.
ఊరు ఉన్నదంటే, అది బాగున్నదంటె ఆ ఊరి సెరువు సలువే. జానపద వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న చెరువుపై సక్కని పాటనల్లిండు. గోరేటి వెంకన్నను అమితంగా ఇష్టపడే దయాకరన్న కల్లెడ చెరువు కవితనల్లిండు.
ఆయిటి పూనంగ/మొగులు మురువంగ
వానల తానమాడంగ/ఊరగుట్టపై దున్కిన జలపాతం
వాగులై పారంగ/బంటాలు నిండంగ
సుట్టకుదురుపై కొలువైన/నిండుకుండ నా చెరువు..
ఇలా సాగుతూ..
సద్దుల బతుకమ్మను సాగనంపేయాళ్ల
కొప్పున తామెరలు ముడ్సుకున్న
నిండు ముత్తైద నా చెరువు.. అని ముగిస్తడు.

జ్ఞాపకాలు, అనుభూతులు, అనుభవాలు, తనదైన సొంత గొంతుక. ఒదిగిపోయే పల్లె భాషాసౌందర్యం వడ్లకొండ దయాకర్ కవిత్వానికి బలం. వడ్లకొండ దయాకర్ కవిత్వంలో వస్తు విస్తృతి, విస్తృత అధ్యయనం ప్రస్ఫుటంగ కనిపిస్తాయి. ఒక వస్తువును ఎన్నుకుని దాని మూలాలనుంచి ప్రారంభిం చి, అన్ని కోణాలలో వస్తువును దర్శించడం ఈ కవిత్వంలో చూడవచ్చు. బంతిల కూసున్నంక ఒక్కొక్కటి నిమ్మలంగ సదువుతాంటే పల్లెంతా మన సుట్టూ పర్సుకున్నంత సంబురమైతాంటది. నశ్శెండబ్బను కైగట్టీన మొదటి కవి వడ్లకొండ. ఈ సంపుటిలోని 43 కవితలు పలుకుబడుల రసగుల్లలు. ఆస్వాదించాల్సిందే.అభినందనలతో మనస్సుకు హత్తుకుం టూ...
- బండారి రాజ్‌కుమార్, 9959914956

800
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles