మబ్బు ముసరకుండా ‘వానొస్తదా..?’


Sun,October 14, 2018 10:58 PM

దేశం కానీ దేశంలో ఉన్నా భాషని యాసని వ్యక్తీకరణని వ్యక్తుల ఆచరణనీ తన శైలిలో అచ్చు పోసినట్టు ఉన్న ఈ కవి తా సంపుటి ఎవరి కళ్ళలోనైనా వానని తెప్పిస్తది.
vanasthodha
మబ్బు ముసరకుండా..
మనసు మురవకుండా..
మేఘమాల పూల పాదాల ఆగమనాన్ని ప్రకృతి చాటింపు వేయకుండా..
కళ్ళపై చేతి మంచెవేసి చూపులు పైకెత్తకుండా వానొస్తదా అని అడిగితే నువ్వైనా, నేనైనా, పల్లెయినా, పైరైనా ఏం చెపుతుంది? కానీ అక్షర దివ్యదృష్టితో ఈ మహాయోగి మాత్రం వానొస్తదీ.. అని భరోసా ఇస్తున్నడు. నారాయణ స్వామి వెంక ట యోగి తెలుగు సాహిత్యంపై పరిచిత సంతకం. ఈయన కురిపించిన కవిత్వ ధార వానొస్తదా..
వానంటే నన్ను నన్నుగా చూపే అద్దం.., వానంటే నేను నేనుగా చెప్పే నిజం.., వానంటే ఇగురం తెలిసిన మాండలీ కం.., ఒంటరితనాన్ని వెలివేసే వెన్నెల సావాసం... ఇలా చెప్పుకుంటూపొతే ఎన్నో. మరి ఆ వానొస్తదా అడుగుతున్నారు నారాయణ స్వామి వెంకటయోగి. అడగటమే కాదు మనమే మొగులై జడివానై కురవాలి అంటున్నరు. ఇందులోని ప్రతి చిత్రం కవిత్వాన్ని మరింత అందంగా మలిచింది.
వానరావాలి దూపతీరాలి. ఇదే ఈ కవిత్వ ముఖ్యుద్దేశం. మొదటి చినుకు పడగానే మన ముక్కుపుటాల్లో కొన్ని చెమరింతల వాసనలు తొలకరిలై పలకరిస్తాయి. బాల్యంలోకెళ్ళి వెతుక్కునే కాగితపు పడవల ఆటలు మనల్ని అలరిస్తాయి. వానంటే నిన్ను తడిపే నది, నువ్వు నడిచె గది, నీలో ఎగసే ఇది, వానంటే నామటుకు నాకు హోరెత్తే నిశబ్ధం. గూటిలోని పక్షుల సమూహం. గుండెలోని వేల స్పందనల పాత్రికేయం.

కవి ఆలోచనలు సామాజికమైనా, సాంస్కృతికమైనా, వ్యక్తిగతమైన అది ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సమయంలో ఎదురుపడుతుంది. నారాయణ స్వామి కవిత్వ పుస్తకం వానొస్తదా లో తాత్వికతను ఎక్కడా మిస్ చేయలేదు. పైగా ప్రతి కవితలో ఏదో కోల్పోయిన తనాన్ని దాన్ని రాబట్టుకొనే క్రమంలో తను పడ్డ తండ్లాటను కళ్ళముందుంచారు.
నారాయణస్వామి కవిసంగమంలో కవిత్వంతో కరచాలనం శీర్షిక ద్వారా పరిచయం. ఆయన రాసే ఆ శీర్షికలో ఆ మాండలికంలో ఏదో మత్తు గమ్మత్తు నన్ను వెంటాడుతుండే వి. మొన్న రొట్టమాకురేవు కవిత్వ అవార్డ్స్‌లో ఈ పుస్తకానికి అవార్డు వచ్చిందని తెలియగానే చాలా సంతోషం వేసింది. పుస్తకం పేరే నన్ను చదివేలా ప్రేరేపించింది. రాబర్ట్ ఫోస్ట్ అన్నట్లు.. పోయెట్రీ ఈజ్ ఎ వే ఆఫ్ టాకింగ్ లైఫ్ బై ద త్రోట్...
ఈయన కవిత్వంలో చిర్నవ్వులు ఆకుపచ్చగా నవ్వుతాయ్. ఆనందంతో పెదవులు పగిలిన కుండలైతాయ్. వియోగంతో ముఖం మీద ముడుతలు తడుముకుంటాయ్. జ్ఞాపకాల ఆనవాళ్ళు దొరికినప్పుడు ఈయన అనుభవాలన్నీ విరబూసిన గులాబీలవుతాయి. ఆ గులాబీలు కలగలిసి నడిచిన ఎన్నో అడుగుల్ని ఇక్కడ కవిత్వంగా నడిపిస్తారాయన.
ఈ సంపుటంలో కవితలు కొన్నిరకాల అన్వేషణలను, నిర్దిష్టమైన మానసికస్థితులను తెలంగాణ మాండలికం ద్వారా చెప్పడం బాగుంది. నారాయణ స్వామీ కవిత్వంలో..ఎవరినై నా గట్టిగా అలముకోవాలి.., ఎన్ని శతాబ్దాలైంది మనిషిని కౌగిలించుకోక.. అంటారిక్కడ కలుద్దామనే కవితలో. ఈ మాటలు ఎప్పుడు చదివినా ఉదయపు సూర్యుడిలా మౌనంగా ప్రశ్నిస్తుంటాయి. అందులోనే రాళ్ళు విసిరే మౌనం.. ఏమి తెలియని నిర్విచారం-ఎవరైనా ఉన్నరా గుండె ఘోష సముద్రమంత ఆవేశంతో ఎగిసిపడినపుడు మాత్రమె ఇలాంటి కవిత్వాన్ని రాయగలం.

ఎప్పుడో ఊపిరి ఆగిపోయిన గడియారపు మృతదేహం పక్కన కుర్చుని ఉద్వేగంతో నిన్నటిని చెక్కుతున్నప్పుడు రాలుతున్న నక్షత్ర ధూళి రేపు, ఇప్పుడు అంటూ ఏమి ఉండదు. ఉన్నదల్లా అప్పుడు, యెప్పుడో (మనం బతికేదెపుడు అప్పుడులోనే) అప్రస్తుతం కవితలో ఇలా వేదాంత ధోరణిలో చెప్పి నా పచ్చి నిజం, అర్థమవ్వనట్లే ఉన్నా అర్థం చేసుకోవడం చాలా సులువు. ఊపిరి ఉద్వేగాలు నిన్ను నన్ను అందరిని ఇక్క డ ఒక లోయలోకి తోసేసి ఇంకెప్పటికి బయటకు రానివ్వవు. సేతిల సేయ్యేస్తే సల్లగ బరఫ్ లెక్క తగులతవి. ఇందులో మాండలికమే కాదు ప్రతి అక్షరం పదునైన గొడ్డలి, విలువైన నినాదం.
తనపొలంలోనే కూలీకి పోయే ఒక సామాన్యుని గొంతు తాడారని ఆర్తితో ఆశతో అడుగుతున్న సహాయం.. కంట్లో నీళ్లు జలజలా రాలిపడ్డం ఖాయం. లోతైన భావన. ఎక్కడ తటపటాయింపులేని నాదం,యాసకు వేల నెనర్లు..
చిన్నప్పుడు నేనెప్పుడు పాలుతాగిన్నో తెలియదు పగిలిన బొమ్మ ముక్కల్ని కూలిన గోడలకు దారాలతో కట్టి నాకు నేనే మాట్లాడుకున్న ఎడతెరిపిలేని సంభాషణలు..
అమ్మలేని చిన్నతనం ఒంటరి సావాసం, పగిలిన బొమ్మలతో రగులుతున్న గుండె ఆ చిన్నతనానిది.
నాలో నేనే అందరికీ వినపడేట్టు వాడచివర తల్లిలేని కుక్కపిల్ల ఏడుపుతో రాగం కలిపి పాడిన పాట అమ్మతనాన్ని రుచిచూడలేని బాల్యం,సుడులు తిరుగుతున్న జ్ఞాపకాల్లో ఎప్పటికి మరిచిపోని తీవ్రానుభూతి.

ఈ పారన్నా వానొస్తదంటావా.. మొగులు మీద ఎండిపోయిన బట్ట పేల్క లెక్క మబ్బులు ఆశలింకని మనకండ్లు పిల్లలాడుకునే గోటీలు ఈ పారి మనమే మొగులైనం..
ఇగ కుండపోతగ కుర్సుతం..
మన దూప తీరసుకునేటందుకు మనమే జడివానౌతాం..
టైటిల్‌ని ఇనుమడింప చేసే కవిత. టైటిల్‌కి తగ్గట్టు పైకి శబ్దం వినపడుతున్నా నారాయణస్వామి లోనే కురిసిన కవిత వానొస్తదా. వానొస్తదా అంటూ రైతన్న ఆత్మఘోష. శ్రామికుల గుండె నిండుగా వేసుకున్న ఆశ ఈ కవిత. ఎక్కడా ఇసుమంతైనా ఫీల్ పోదు. ఇలా ప్రతి కవిత మెదడులో చెరిగిపోని ముద్రేస్తది. సడలిన గుండెల్ని సవరిస్తది. చెదిరిన ఆలోచనల్లో కి తోసేస్తది.
దేశం కానీ దేశంలో ఉన్నా భాషని యాసని వ్యక్తీకరణని వ్యక్తుల ఆచరణనీ తన శైలిలో అచ్చు పోసినట్టు ఉన్న ఈ కవి తా సంపుటి ఎవరి కళ్ళలోనైనా వానని తెప్పిస్తది.
- సుభాషిణి తోట

798
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles