బాలల ప్రపంచపు ‘వెన్నముద్దలు’


Sun,October 14, 2018 10:57 PM

వెన్నముద్దలు పుస్తకం చదువుతుంటే చిన్నప్పుడు అమ్మ చేతి పాలగోకు తిన్నటే ఉంటుంది. బాలగేయాలకు విషయంతో పాటు ధార కూడా ముఖ్యమే. లయాత్మకంగా సాగి ఒక మెరు పు మెరిసి ఆకాశమంత వెలుతురు పంచి ముగిసిపోవాలి. ఇందులోని అన్ని గేయాలు దానికి నిదర్శనంగా కనిపిస్తాయి.
VENNAMUDDALU
బాల ప్రపంచం పాల ప్రపంచం
పాలవలె తెల్లనిది
పాలవలె తియ్యనిది
పాలవలె చిక్కనిది
అంటారు రేడియా అన్నయ్య. ఏ దేశ, జాతి చరిత్రలోనైనా ప్రాధాన్యం కలిగిన వాళ్ళు పిల్లలు. బాలలను భావి పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో వాళ్ళకు దారిచూపే దివ్వెలాంటిది బాల సాహిత్యం. పెద్దలు బాలలు హాయి గా చదువుకోవడానికి రాసిందే బాల సాహిత్యం. దీనినే చింతా దీక్షితులు శిశువు జన్మించింది మొదలు బాల్య దశ వీడే వరకు కూడా వారి మనసుకు రంజకంగా ఉండేది బాల వాజ్ఞయం అంటారు. పంచతంత్ర కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, అలీబాబా నలభై దొంగలు, సింధూబాద్ సాహస యాత్రలు, తెలనాలి రామకృష్ణుని కథల వంటివి మనలను బాల్యంలో అలరించిన బాల సాహిత్యం. బొమ్మరిల్లు కథలు, చందమామ కథలు, చేత వెన్నముద్ద, చెంగల్వ పూదండ.. వంటి గేయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మన తరానికి నేటి తరానికి మధ్య అన్ని విషయాల్లో తేడా ఉన్నట్టే బాల సాహిత్య రచన, వికాసాల్లో కూడా తేడాలు కనిపిస్తాయి. అందుకు ఆంగ్ల ప్రభావం కారణమైంది. నేడు పెద్దల సహాయం లేకుండా పిల్లలు తమంతట తాము చదువుకోవ డం, వయసుల భేదాన్నిబట్టి ప్రత్యేకంగా రావడం నేటి ఆధునిక బాల సాహిత్యం సాధించిన గొప్పపరిణామం. ఒక్క మాట లో చెప్పాలంటే గంభీరమైన జీవితపు విలువలు మొదలుకుని సంస్కృతి, సంప్రదాయాలను, విజ్ఞాన విషయాలను, దేశభక్తి, మానవత్వపు పరిమళాన్ని మల్లెపూవు వంటి పిల్లల మనస్సులకు హత్తుకునేలా చెప్పడానికి పెద్దలు పిల్లల స్థాయికి ఎదిగిరాసేదే బాల సాహిత్యం. పిల్లల ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన సంగతులు దాక్కొని ఉంటాయి. రెక్కల ఏనుగులు, పగడపు దీవులు, కొంగల బారులు, అబ్రకదబ్ర చేసే మాయగాళ్లు, వర్ష పు జల్లుల సరిగమలు, కాగితపు పడవలు, ఇంద్రధనస్సులు, తొక్కుడు బిళ్ల ఆటలు.. అన్నీ పిల్లలతో పాటు మనల్ని కూడా ఊహాలోకంలోకి తీసుకెళ్లే మంత్రదండాలే. తెలుగులో అబ్బురపడే బాల సాహిత్యాన్ని సృజించి అటు పెద్దల మనసుల్లో ఇటు పిల్లల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన పండితులు చాలామందే ఉన్నారు.

తాజాగా డాక్టర్ పత్తిపాక మోహన్ వెన్న ముద్దలు పేర చక్కని బాలగేయాల సంపుటిగా తీసుకొచ్చారు. మోహన్ గత కొంత కాలంగా బాలసాహిత్యంలో తనదైన ముద్ర వేసుకుంటూ వస్తున్నారు. బాల సాహిత్యమంటే కథలు, కవితలు, గేయాలు మాత్రమే కాదని బాలల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే ప్రతి దీ బాల సాహిత్యమే అని నమ్మే పత్తిపాక మోహన్ ఇప్పటికే పిల్లల కోసం మన కవులు, చందమామ రావే, పిల్లల కోసం మన పాటలు వెలువరించారు. అంతేగాక ఇతర భారతీయ భాషల్లో విశేష ప్రాచుర్యం పొందిన పదిహేను పిల్లల కథల పుస్తకాలను పిల్లల కోసం తెలుగులోకి అనువాదం చేశారు. బాల సాహిత్య వికాసం కోసం వందకు పైగా వ్యాసాలు రాశారు. ఇవ్వాళ బాల సాహిత్య వికాసానికి చిరునామాగా నిలిచారు. అల్లారు ముద్దుగా పెరిగే బాల్యానికి ఆట పాటలే వెన్నముద్దలు. ముఖ్యంగా బాలగేయాలు పిల్లల నోళ్లలో రసగుళికలు. అందుకే బాలగేయాల్ని రాసే రచయిత లు వృత్యానుప్రాస, అంత్యానుప్రాస, ముక్తపదగ్రస్త అలంకారాలను ఒడుపుగా వాడి ఒక్కసారి పాడగానే పిల్లల మెదళ్ల లో కూర్చుండిపోయేలా రాస్తారు. శ్రద్ధ తో అభినయానికి,చిత్రలేఖనానికి వీలుం డేలా మలుస్తారు. అలా ఈ బాలగేయా లు పిల్లల నోళ్లలో,వాళ్ల మనసుల్లో నాటుకు పోతాయి. చిన్నప్పుడు మనమంతా పాడుకున్న చుక్ చుక్ రైలు వస్తుంది.. పక్కకు పక్కకు జరగండి.., చిట్టి చిలకమ్మా.. అమ్మ కొట్టిందా.. వంటి గేయాలు ఇప్పటికీ మనకు గుర్తుండటానికి కారణం ఆయా పాటల్లో ఉన్న అద్భుతమైన శబ్దమర్యా ద ఉండటమే. హృదయాన్ని చిగురింపజేసే, పిల్లలను రంజింపజేసి, అందమైన అమాయకమైన బాల్యానికి సందేశాన్ని అం దించిన గేయాలు ఈ సంపుటిలో చాలా ఉన్నాయి.

వానా కాలం వచ్చింది/ చిటపట వర్షం కురిసింది
వాడవాడలు తిరుగుదాం / మొక్కలెన్నో నాటుదాం
బడిలో గుడిలో కార్ఖానాలో / పచ్చని తోటలు పెంచుదాం
భూమి తల్లికి పచ్చని దండ / అదే మనకు అండా దండా..
అంటూ పాటగా ప్రవహించారు.
బాల బాలికలకు సమైక్య భావాన్ని రంగరించి పోయడం బాలగేయాల ద్వారానే సాధ్యం. భారతదేశం భిన్న సంస్కృతులకు ప్రదర్శనశాల. ఒక్కో ప్రాంతంలోని వైశిష్ట్యాన్ని పాఠ్యపుస్తకాల్లో చదివి ఒకింత ఆశ్చర్యానికి లోనవుతుంటారు పిల్లలు.
మెదుడుకు మేత పుస్తకం
వెలిగించును అది మస్తకం
చదివిన కొద్దీ చదివిస్తుంది
నలుగురిలో నిలబెడుతుంది
అందరిలోన మిన్నగ నిలిపి
అన్ని విద్యలు బోధిస్తుంది
ఒక్కో పుటను తిరిగేస్తుంటే
విశ్వం ఒడిలో దిగుతుంది..లాంటి పాటలు పిల్లలకు పుస్తకం విలువను చెబుతాయి.
ఎంత పిల్లల పుస్తకాలైనా అన్నీ గేయా లే ఉండవు కదా! కొంత పద్యం, కొంత వచనం, కొంత నాటకం, కొం త సంభాషణ, కొంత పరిసరాల విజ్ఞానం అన్నీ కలిసిన ఫ్రూట్ సలాడ్ లాంటిది పిల్లల పాఠ్య పుస్తకం. పుస్తకం అమృత తుల్యమని, అక్షరం చెరుకు రసంతో సమానమని పిల్లలు గ్రహించేలా సాగిన కమ్మని మధురాత్మకమైన గేయం ఇది.
పిల్లలకు ప్రశ్న సమాధానాలతో సాగే గేయాలంటే చాలా ఇష్టం. అందుకే బాలగేయ రచయితలు దీన్ని చాలా అనుకూలంగా మార్చుకొని వెయ్యిపుటల్లో చెప్పలేని విషయాన్ని చిన్ని గేయం లో కూర్చి పిల్లలకు ఆనందంతో పాటు ఆచరణీయ మార్గాలను చూపెడతారు.

పాపా! పాపా! ఏమిష్టం / బంగారు పాపా నీకేమిష్టం
అమ్మా నాన్నా నాకిష్టం / అన్నా చెల్లెలు నాకిష్టం
ఆటా పాటా నాకిష్టం / బడి గంటంటే నాకిష్టం
గారెలు బూరెలు తినిపించే / నానమ్మంటే ఎంతో ఇష్టం..
లాంటి మానవానుబంధాలను తెలిపే పాటలు వారిని తీర్చిది ద్దుతాయి. అదంతా మెల్లమెల్లగా పిల్లలకు అలవడితే వారి జీవి తం అంతా పూలబాటే కదా! వారు పాడే జోల పాటల్లో, ఊయల పాటల్లో, గోరుముద్దల పాటల్లో ఎన్నో నైతిక విలువ లు పిల్లలకు తెలియకుండానే వారి మనుసుకెక్కడం మొదలవుతుంది. ఈ వెన్నముద్దలు కేవలం సరదాగా చదువుకునే గేయాలు, బుద్దులు, సుద్దులతోనే ఆగిపోలేదు. వివిధ వైజ్ఞానిక అంశాలను కూడా పిల్లలకు అరటిపండి ఒలిచిపెట్టినట్టు పరిచయం చేస్తుంది. పక్షులలోకం ఈ కోవలనే మంచి గేయం. ఒక ఆకాశం... గేయంలో వానలు ఎలా వస్తాయో ఎంత సులభంగా చెబుతాడు.
వెన్నముద్దలు పుస్తకం చదువుతుంటే చిన్నప్పుడు అమ్మ చేతి పాలగోకు తిన్నటే ఉంటుంది. బాలగేయాలకు విషయంతో పాటు ధార కూడా ముఖ్యమే. లయాత్మకంగా సాగి ఒక మెరు పు మెరిసి ఆకాశమంత వెలుతురు పంచి ముగిసిపోవాలి. ఇందులోని అన్ని గేయాలు దానికి నిదర్శనంగా కనిపిస్తాయి. ఊహల పల్లకేదో వచ్చి మనల్నందరినీ గగనసీమలో విహరించేలా చేస్తుంది. టీవీలు, సెల్‌ఫోన్లు, వాట్సప్‌లు, ఫేస్‌బుక్‌లు, వీడియో గేవ్‌‌సు వచ్చి పిల్లల ఆట పాటల్ని ఆంబుక్క పెట్టిన సందర్భంలో ఇలాంటి బాలసాహిత్యం వెలువడటం ముదావహం.
- డాక్టర్ వెల్దండి శ్రీధర్, 9866977741
(డాక్టర్ వేదగిరి రాంబాబు బాల సాహిత్య అవార్డును
పత్తిపాక మోహన్ అందుకున్న సందర్భంగా..)

1576
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles