ఆ కవిత్వంలో శ్రమైకజీవన చైతన్యం


Mon,October 8, 2018 01:50 AM

పీడితవర్గ సంస్కృతి ఎంతైనా అవసరం. దానికి విరుద్ధంగా ఉండే సంస్కృతిని నరికి పారెయ్యాలి.. అం టూ కొడవటిగంటి కుటుంబరావు ప్రజాస్వామ్య వాదులకు తెగేసి చెప్పాడు. బూర్జువా సంస్కృతికి అంత్యక్రియలు జరిపించి జానపదశైలిలో విప్లవ వైతాళికులుగా ముందు కుసాగాలని శ్రీశ్రీ రచయితలకు దిశానిర్దేశం చేశాడు. ఈ విధమైన అరుణారుణ ఎరుకతో అధునిక తెలుగు సాహిత్యంలో యుద్ధ ఫిరంగిలా ప్రజ్వలించి, కోటి రత్నాలవీణ శ్రుతిలో కణకణ మండే కవన గీతాలు ఆలపిస్తున్న అరుదైన ప్రజాకవి డాక్టర్ నందిని సిధారెడ్డి. వరిమువ్వకు తీపిబువ్వ తినిపించే మంజీరా నదిలా సిధారెడ్డి వర్తమాన తెలుగు కవిత్వానికి తెలంగాణ కళాతత్వ మాధుర్యాన్ని పంచిపెట్టాడు. వెన్నెల్ని నా గీతానికి శిల్పం గా మలచుకుంటాను/వెక్కి వెక్కి ఏడుస్తున్న సముద్రాల్ని ఓదారుస్తాను/విశాలంగా కదుల్తున్న నదులతో ప్రవహిస్తాను.. (భూమి స్వప్నం) అంటూ తన సృజన నైజాన్ని ప్రకటించిన సిధారెడ్డి మూడు దశాబ్దాలుగా ఈ బృహత్తర కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ సామాజిక విముక్తి ఉద్యమాల దారుల్లో సాహిత్య స్రవంతిలా పరవళ్ళు తొక్కుతున్నాడు. విప్లవ సాహిత్య ఒరవడితో తన కవిత్వాయుధానికి పుటం పెట్టుకున్న సిధారెడ్డి భూమి స్వప్నాలను అక్షరాల్లోకి అనువదించి నాగేటి చాల్లల్లో నక్షత్రాలు పూయించాడు.
jelandhar
అడవులతో కోయలు మాట్లాడినట్టు/ధనస్సులతో నయనా లు మాట్లాడినట్టు/నారుమళ్ళతో కాలువలు మాట్లాడినట్టు (భూమిస్వప్నం) సిధారెడ్డి ప్రామాణిక భాషా వ్యామోహంతో గొంతు చించుకుంటున్న సోకాల్డ్ రచయితలకు భిన్నంగా సజీవ భాషను తన కవిత్వంలో ప్రయోగించాడు.

వచన కవిత్వంతో పాటు పాటను కూడా ప్రజారంజకంగా పలికించడంలో సిధారెడ్డిది అపురూపమైన ప్రతిభ. శివసాగర్ లాగా సిధారెడ్డి కూడా ఈ రెండు ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించి సాహిత్య సవ్యసాచిగా ప్రఖ్యాతిగాంచాడు. సాంద్రతరమైన అభివ్యక్తితో తెలుగు కవిత్వంపై బలమైన ముద్రవేసిన సిధారెడ్డి ప్రభావశీలమైన తన ఉపన్యాసశైలితో వేలాది సభలను ఉర్రూతలూగించి పీడిత తాడిత ప్రజాచైతన్య వాణిని వినిపించాడు. నిబద్ధత కలిగిన ఆచార్యునిగా ఎంతోమంది విద్యార్థుల కు భాషా, సాహిత్యాలను ప్రబోధించి, వారిని కవులుగా, కళాకారులుగా తీర్చిదిద్దాడు. ఉద్యమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలనే సంకల్పంతో ఆయన ప్రధానాచార్యుల పదవి ని కూడా విడనాడి ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడిగా వాసికెక్కాడు.

తల్లి రక్తం బిడ్డలో ప్రవహించినంత సహజంగా సిధారెడ్డి కవిత్వంలో తెలంగాణ సోయి ఆద్యంతం పరిమళిస్తుంది. 2000 సంవత్సరం తర్వాత ఉధృతమైన ప్రాంతీయ చైతన్య స్ఫూర్తితో సిధారెడ్డి కవిత్వంలో ఒక గుణాత్మకమైన పరిణామం దర్శనమిస్తుంది. విప్లవోద్యమ నేపథ్యంలో వెలువడిన భూమి స్వప్నం, సంభాషణ, ప్రాణహిత కవితా సంపుటాల్లో చిరుజల్లులాగా వ్యక్తమైన ప్రాంతీయ స్పృహ ఒక బాధ కాదు (2001) నుం చి వరద గోదావరిలాగా పోటెత్తి సిధారెడ్డి కవిత్వాన్ని ముంచెత్తింది. విశ్వనాథ, జాషువా, తుమ్మల లాంటి కవులు తన్మయత్వంతో, స్పందనాస్పద హృదయంతో ఆంధ్రప్రశస్తిని కవిత్వీకరించినట్లు సిధారెడ్డి మరింత ఆర్ధ్రంగా తెలంగాణ ప్రశస్తిని వేయిగొంతుకలతో గానం చేశాడు. వలసవాదుల పాలనలో, ప్రపంచీకణ పడగనీడలో కునారిల్లుతున్న తెలంగాణ బాధలను, కన్నీ ట తడిసిన గాథలను అక్షరబద్ధం చేశాడు. తెలంగాణ ఆత్మగౌర వ పోరాట విత్తనాలను దగాపడ్డ బిడ్డల హృదయక్షేత్రాల్లో వెదజల్లి ఉద్యమచైతన్యాన్ని పండించాడు.

తెలంగా ణ చారిత్రక సాంస్కృతిక వైభవ ప్రాభవాలను, నైసర్గిక సౌందర్యా న్ని, తెలంగాణ సహజ వనరుల విశిష్టతను, తెలంగాణ సంస్కారా న్ని, అద్వితీయమైన తెలంగాణ జీవనశైలిని చిత్రించడంలో సిధారెడ్డి చారిత్రాత్మకమైన పాత్ర పోషించాడు. విప్లవరచయితల సంఘానికి సందర్భానుసారంగా సంఘీభావం ప్రకటిస్తూనే నిర్దిష్ట ప్రాంతీయ సాహిత్య ఆవశ్యకతను గుర్తించిన సిధారెడ్డి భావసారూప్యం కలిగిన సృజనకారులను సమీకరించి తెలంగాణ రచయితల వేదిక స్థాపించి సాంస్కృతిక ఉద్యమం లో అగ్రభాగాన నిలుచున్నాడు.

ఈ దశాబ్దంలో తెలంగాణ సాహిత్యమే ప్రధాన స్రవంతిగా స్థిరపడటానికి సిధారెడ్డి శక్తివంచన లేకుండా కృషిచేశాడు. తెలంగాణ సాహిత్య ఉద్యమానికి అయన పెన్నెముకగా నిలిచాడు. తెలంగాణలో కవులు పూజ్యమన్న నాటి కారు కూతల్ని తిరుగరాసి తెలంగాణే కావుల రాజ్యమని నిరూపించే కొత్త తరానికి సిధారెడ్డి నేతృత్వం వహించాడు. తెలంగాణ మాండలిక భాషకు తన కవిత్వంలో సిధారెడ్డి పట్టాభిషేకం చేశాడు. సామాన్య ప్రజ ల నాలుకల మీద జీవిస్తున్న పలుకుబడులను, నుడికారాలను ప్రయోగించి కవిత్వ గౌరవాన్ని ఇనుపడింపజేశాడు. తెలంగాణ జానపదుల గొంతుల్లో ప్రవహించే అందమైన సంభాషణశైలి తో తన పాటలకు కొత్త వన్నెలు చేకూర్చాడు.

సిధారెడ్డి మట్టి నాడి పట్టుకున్న ఉత్తమకవి. మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిపెరిగిన ఆయన కవిత్వంలో శ్రమైక జీవన చైతన్యం ప్రత్యక్షరంలో జాలువారుతుంది. ఈ పూలదండలు కాస్త తీస్తావా! పొలానికెళ్ళి కాడి మొయ్యాలి.. (భూమి స్వప్నం) అన్న గొప్ప భావనలో ఉదాత్తమైన శ్రమ ఔన్నత్యం తొంగిచూస్తుంది. పూల పరిమళం కంటే చెమట సుగందం గొప్పదనే తాత్వికత ధ్వనిస్తుంది. శ్రామిక ప్రజల విమోచనాని కి తోడ్పడటం కంటే విద్యుక్త ధర్మం మరొకటి లేదని చైనా వామపక్ష రచయితల సంఘం ఏనాడో నిర్ధారించింది. విశ్వజనీనమైన ఈ విద్యుక్త ధర్మానికి నిలువుటద్దంగా సిధారెడ్డి కవిత్వం కనబడుతుంది. అందుకే కష్టపడ్డా కడుపునిండని పేదరైతు పాట నాది.. అంటూ తన కవితా తత్వా న్ని తెలియజేశాడు. గోండు స్త్రీ బొడ్లో నుండి కొడవలి తీసినట్లు/ నేను కవిత్వం తీస్తున్నాను/ సవర వీరుడు బాణం ఎక్కుపెడుతున్నట్లు/ నేను కవిత్వం ఎక్కుపెడుతున్నాను.. (భూమి స్వప్నం) అంటూ సిధారెడ్డి శ్రమైక జీవన సౌందర్య దృష్టితో తన వస్తురూపాలను అద్భుతంగా నిర్వచించాడు.

ఎడ్లబండి గీర బండరాయెక్కి విరిగినపుడు/ నేను నడకనేర్చి ఉంటానేమో.. అంటూ గ్రామీణ వ్యవసాయ సంస్కృతిలో నుంచే నాగరికతలు వర్ధిల్లాయని, తల్లి వేరు ఉనికిని ప్రతిభావంతంగా పట్టి చూపించాడు. కాయకష్టమే కైలాసమని చెప్పిన శివకవుల దగ్గరనుంచి ప్రపంచపురోగతి సాంతం శ్రమజీవవి నెత్తుటి బొట్టులో ఇమిడి ఉందని సూత్రీకరించిన చెరబండరాజు వరకు ఎంతోమంది కవులు, రచయితలు ఉత్పత్తి సంబంధాల తీరుతెన్నులను విశ్లేషించారు. విప్లవ కవులు, ప్రజానాట్యమండలి, జన నాట్యమండలి కళాకారులు, కార్మిక లోక కళ్యాణాన్ని, శ్రామికవర్గ సౌభాగ్యాన్ని కలమెత్తి గళమెత్తి చాటిచెప్పా రు. శ్రామికవర్గ తాత్విక దృక్పథాన్ని సిధారెడ్డి నవనవోన్మేషంగా తన కవితల ద్వారా కీర్తించాడు.

అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంలో శ్రామికులంటే స్త్రీలు, దళితు లు, గిరిజనులనే భావన సర్వత్రా రూఢీ అయింది. అస్తిత్వ ఉద్యమాలు చర్చకుపెట్టిన లింగ, కుల వివక్షల పూర్వాపరాలను కూడా సిధారెడ్డి ఉన్నతంగా కవిత్వీకరించాడు. మహిళల బహుముఖీన కష్టనష్టాలను కూడా లోతైన విశ్లేషణతో సిధారెడ్డి దృశ్యీకరించాడు. అన్ని రుతువుల్లో నదులు ఒకేలా పారవని చెబుతూ విస్తరిస్తున్న దళిత చైతన్యాన్ని గుర్తుచేస్తూ ఆధిపత్య శక్తులను కవి ఆగ్రహంతో హెచ్చరించాడు.

విపణి వీధి వేయికోరల రాకాసి/ విపణి వీధి నూరుచారల ఉరితాడు.. అంటూ ప్రపంచీకరణ సందర్భంలో శ్రమ విలువ ను హరిస్తున్న మార్కెట్ ఎకానమీ ప్రమాదాలను విడమరచి చెప్పాడు సిధారెడ్డి. ర్యాగటి పొలముల్ల రక్తాము చెమటోడ్చి చేసి న కష్టాలు చేజారి పోవట్టె.. (నాగేటిచాలల్ల) అంటూ శ్రమదోపిడీ దుర్మార్గాన్ని నిరసించాడు. జ్ఞానగర్వం తలకెక్కి చెమటను అవమానించే సాంకేతిక సార్వభౌములకు శ్రమజీవుల త్యాగనిరతిని, పనితత్వంలోని పరమార్థాన్ని సిధారెడ్డి విశదీకరించాడు. చెట్లు కూలిపోవచ్చు, చెమట చిగురిస్తూనే ఉంటుంది/ నదులు ఎండగొట్టవచ్చు చెమట నిరంతరం ప్రవహిస్తుంది/మనుషులు రాలిపోవచ్చు చెమట పుడతనే ఉంటది/ చెమట నిరంతర నిర్మాణము.. (ఒక బాధ కాదు) అంటూ శ్రమైకజీవ ఔన్నత్యాన్ని కొనియాడి సమకాలీన సాహిత్యంలో జగత్‌జగీయ మానంగా శ్రమ చిమ్నీ వెలిగించాడు. పరిగేరిన చేలల్లో పాలపిట్టల రాగా లు, గుడిసె కొప్పు మీద వికసించిన గోగుపూల పరిమళాలు కలగలిసిన కమ్మనైన కళాతత్వం సిధారెడ్డి కవిత్వమంతా పరుచుకొని ఉంటుంది. సిధారెడ్డి కవిత్వం జమ్మిచెట్టులాగా కాలానికి పదునైన ఆయుధాలను అందిస్తుంది. తీరొక్క పూలతో కొలువై న బతుకమ్మలాగా సమాజానికి ప్రాణచైతన్య పరిమళాలను పం చిపెడుతుంది.
- డాక్టర్ కోయి కోటేశ్వరరావు, 94404 80274
(సిధారెడ్డి సాహిత్యంపై అక్టోబర్ 11,12 తేదీల్లో హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాయంలో జరిగే జాతీయ సదస్సు సంద ర్భంగా..)


నందిని సిధారెడ్డి కవిత్వ, జీవన ప్రస్థానం.. సాహిత్య సమాలోచన- సదస్సు

రెండు రోజులు జరిగే ఈ జాతీయ సదస్సులో వివిధ సెషన్లుంటాయి. ప్రముఖ వక్తల ఆయా అంశాలపై ప్రసంగాలుంటాయి. పత్ర సమర్పణలుంటాయి. డాక్టర్ కె.వి.రమణాచారి అధ్యక్షతన జరుగు ప్రారంభ సమావేశంలో గౌరవ అతిథులుగా తన్నీరు హరీశ్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి, దేశపతి శ్రీనివాస్, డాక్టర్ ఎం.మధుసూధన్ రెడ్డి, ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, కె.శివారెడ్డి, డాక్టర్ బుక్కా బాలస్వామి హాజరవుతారు. డాక్టర్ గంటా జలంధర్ రెడ్డి స్వాగత ప్రసంగం చేస్తారు. జి.దేవి ప్రసాదరావు అధ్యక్షతన జరుగు ముగింపు సమావేశంలో గౌరవ అతిథులుగా ఆచార్య ఘంటా చక్రపాణి, ఆచార్య తుమ్మల పాపిరెడ్డి, ఆచార్య కె.సీతారామరావు, ఎస్.గోపాల్‌రెడ్డి, ఆచార్య పి.నీరదా రెడ్డి, బుర్రా వెంకటేశం, మామిడి రామారెడ్డి, డాక్టర్ తూర్పు మల్లారెడ్డి, డాక్టర్ నాళేశ్వరం శంకరం, ఘనపురం దేవేందర్ తదితరులు హాజరవుతారు.
- డాక్టర్ గంటా జలంధర్‌డ్డి, సదస్సు సంచాలకులు, 9848292715

633
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles