ప్రజాపాటకు పుట్టుమచ్చ


Mon,October 8, 2018 01:48 AM

హితం కోరేదే సాహిత్యమని నిర్వచించుకోవటంతోనే ఆగిపోకుండా ప్రజాహితం కోరేదే ప్రజాసాహిత్యం అనేదాకా తెలుగు నేలలో సాహిత్యం తనదైన పాత్రను పోషించింది. కాలానుగుణంగా పరిణామక్రమంలో పాటగా పరిణామం చెంది ప్రజల చేతుల్లో ఆయుధమయ్యింది. ఆధునిక భారత చరిత్రలో ప్రత్యేక పుటగా వెలుగులు పంచుతున్న తెలంగాణ సాయుధ పోరాటం, ఆ పోరాటంలో పాట నిర్వహించిన పాత్ర చరిత్రాత్మకం. బండెనుక బండిగట్టి-పదహారు బండ్లు గట్టి పాట రాసి ప్రజలను ఉర్రూతలూగించిన యాదగిరి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న సుద్దాల హనుమంతు తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రజల గొంతుకగా పాటై, బుర్ర కథగా బతుకు వెతలను పారదోలే మార్గాన్ని చూపాడు.
SCAN4
తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత అరువైయ్యవ దశకంలో రాజుకున్న భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లో సుద్దాల హనుమంతు పోరుపాట మళ్లీ మొగ్గతొడిగి వికసిం చింది. ఈ నేల నాగేటి చాళ్లల్లో జనం పాటగా హోరెత్తింది. మళ్లీ ఒకసారి పాట పతాకమై తెలుగు నేలంతా విస్తరించటమే కాదు, సమస్త ప్రజలను, ప్రజాజీవన సంస్కృతులనూ ప్రభావితం చేసింది. ప్రజా చైతన్యానికి, పోరాటానికీ సంకే తంగా నిలిచన పాటకు పర్యాయపదంగా నిలిచిన వారిలో గద్దర్, గూడ అంజయ్య, గోర టి వెంకన్న, జయరాజ్ అగ్రేసరులు.

కవి గాయకుడు జయరాజ్ జీవితం విశిష్టమైనది. ఆయన అచ్చమైన భూమి పుత్రుడు. అట్టడుగువర్గంలో కడగొట్టు జీవితం ఆయనది. జయరాజ్ జీవితం సాహిత్యం, పాట.. వేర్వే రు కాదు. ఆయన ప్రతి అక్షరం ఓ కన్నీ టి చుక్క. చిత్రహింసల కొలిమిలో గొంతు పై కాలుమోపినా రక్తం కక్కుతూ అయినా పాట ఆపని గొంతుక అది. గొంతెత్తి పాడితే.. పొట్ట చిట్లి పేగులు బయటకొచ్చినా తొణకని ధిక్కార స్వరమది. కన్నీటి సంద్రాలు ఈదుతూ కష్టాలను గానం చేశాడాయ న. మానవ సంబంధాల సున్నితత్వాన్నీ, అనుబంధాల ఉన్నతిని ఎత్తిపట్టినా, అడవి తల్లి అందాన్నీ, అందులోని పోరన్నల జీవితాన్ని, త్యాగాన్ని గానం చేసినా, అన్నల అమరత్వాన్ని పాడినా.. అవన్నీ స్వీయానుభవాల రాగాలే. విన్నవి కావు, అన్నీ కన్నవే.. అనుభవించినవే. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నాగలి మేడి కొసన చిగురించి, తుపాకీ బయొనెట్ మీద పతాకంగా ఎగిరిన పాటకు నేటితరం వారసుడు జయరా జ్. అతడు ప్రజాపాటకు పుట్టుమచ్చ.
- ఎస్.మల్లారెడ్డి, 80966 77255
(2018 సుద్దాల హనుమంతు జాతీయ పురస్కారానికి జయరాజ్ ఎంపికైన సందర్భంగా..)


సుద్దాల హనుమంతు-జానకమ్మ పురస్కార సభ

2018, అక్టోబర్ 14న సాయంత్రం 6 గంటలకు, హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో పురస్కార సభ జరుగుతుంది. యస్.యస్. తేజ అధ్యక్షతన జరుగు సభలో గౌరవ అతిథులుగా ఎస్.మధుసూదనాచారి, బండ ప్రకాశ్, ఆర్.నారాయణమూర్తి, అల్లం నారాయణ, కోయి కోటేశ్వరరావు హాజరవుతారు.
- డాక్టర్ సుద్దాల అశోక్ తేజ

245
Tags

More News

VIRAL NEWS