మరో కోణంలో మహాకవి పోతన


Mon,October 1, 2018 01:27 AM

మహాకవి పోతన కవిత్వాన్ని కేవలం భక్తికే పరిమితం చెయ్యకుండా అందులోని గణిత విషయాలను, నాటి చరిత్రకు అనుకూలంగా పరిశీలిస్తే మనకు అనేక విషయాలు తెలుస్తాయి. పోతనగారి పూర్వీకులు మంచి గణకులు. పోతన కూడా గణితాన్ని బాగా అభ్యాసం చేశారు. సంకలవ్యవకలన గుణకార భాగహార విషయాలయందు, వర్గమూలాలయందు, వ్యాపార గణితాదులయందు ఆయనకు మంచి ప్రావీణ్యం ఉంది. ఆ ప్రావీణ్యం తనకు నిజ జీవితంలో కూడా ఉపయోగపడింది. ఆయనకు ఉపయోగపడిన ఆ గణిత ప్రావీణ్యాన్ని వెలికి తీయవలసిన అవసరం ఉన్నది.

సాహిత్య చరిత్రకారులు బమ్మెర పోతన నివాసంగురించి అనేక తర్జనభర్జనలు చేశారు. కడకు పోతన వరంగల్లు సమీపంలోని బమ్మెరగ్రామ నివాసి అని తేల్చారు. సహజపండితుడు మహా కవి బమ్మెర పోతనామాత్యుడు, అమాత్య శబ్దానికి నూటికి నూరుపాళ్ళు ఆయన స్వరూపమే తగి ఉన్నది. సహజ పాండిత్యంలో నుంచి జాలువారిన.. అమ్మలగన్నయమ్మ, మందార మకరంద, కుప్పించియెగసిన, నల్లనివాడు పద్మనయనంబులవాడు, శారదనీరదేందు, పలికెడిది భాగవతమట, భాగవతము తెలిసిపలుకుట వంటి పద్యాలయందలి అందాన్ని, మకరందాన్ని, శబ్ద సొగసును, భావ సొగసును, భక్తి తేజాన్ని అనేకమంది మహానుభావులు అనేక రకాలుగా వివరించారు. భక్తాగ్రేసర పీఠం మీద భక్త పోతనకు ప్రథమస్థానం కల్పించారు.
pothana
హలం పట్టిన హాలికునిగ, కలం పట్టిన మహాకవిగా పోతనకు సాహిత్య చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్నది. భూమితల్లిని, సరస్వతీమాతను నమ్ముకుని నిరుపేద జీవితాన్ని అనుభవించి న పోతన గురించి ఇలాంటి విషయాలు ఎంత రాసినా తక్కు వే. హాలికునిగా అతని మహతు ్తగురించి అనేక కథలు చెబుతా రు. పోతన పొలంలో శ్రీనాథుని మహిమకు ధీటుగా ఎద్దులు లేకుండా నాగలిని నడిపించడమేగాక శారదమ్మ కన్నీరు చూసి, కాటుక కంటినీరు అంటూ స్పందించారు.
సాహిత్య ప్రపంచంలో ఇలాంటి కథలు చెప్పుకుని ఆనందించడం సహజమే అయినప్పటికి వాస్తవ ప్రపంచంలో వీటిని కట్టుకథలే అంటారు. కట్టుకథలెన్ని ఉన్నా అతని సహజ పాండిత్యాన్ని సాహితీప్రియులందరూ ఆనందంగా ఆస్వాదిస్తారు. అయితే పోతన ఈ రెండు రంగాల్లోనే (కవన రంగం, హాలిక రంగం) మహనీయుడా? కాదు. మరో రంగాన కూడా అతడు నిష్ణాతుడు.

బమ్మెర పోతన మహా భాగవతాన్ని, పోతన కాలం నాటి పరిస్థితులను చక్కగా ఆకళింపు చేసుకుంటే బమ్మెర పోతన మహాగణికుడని కూడా తెలుస్తుంది. భాగవతంలోని నవమ స్కంథమందలి గంగావతరణ ఘట్టాన్ని పరిశీలిస్తే, 78 పంక్తుల బాణ వచనం ఉంటుంది. అందులో గణితానికి సంబంధించిన ఘన ఘనమూల, వర్గమూల సంకలిత భిన్నగుణాదుల ప్రసక్తి ఉంటుంది. వీటిని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే ఆధునిక గణిత బోధనకన్నా ఈ గణితమే ఉత్తమం అనిపిస్తుంది.

నేడు విద్యార్థులకు సంకలనాలు(కూడికలు) నేర్పేటమన్నది ఒకే రీతిలో జరుగుతుంది. ఉదాహరణకు ఒక అంకె గల నాలు గు అంకెలను కూడవలసి వచ్చినప్పుడు, ఒక అంకెకు మరో అంకెను కూడుకుంటూ వెళ్ళిపోతారు. కడకు సమాధానం రాస్తారు. నాడు అలాగాక రెండు అంకెలను కూడినప్పుడు 10 కంటే ఎక్కువ సంఖ్యవస్తే, అందులో 10ని పక్కనపెట్టి, మిగతాదానికి మిగతా సంఖ్యలను కలిపేవారు. కడకు పదులన్నిటిని కలుపుకుని సమాధానం చెప్పేవారు. ఇలా చెయ్యడం వల్ల విద్యార్థులకు అంకెల మీద పరిశీలనా సామర్థ్యం పెరుగుతుం ది. ఏ అంకెను ఎన్ని ప్రత్యేకతలతో ప్రయోగించవచ్చు. అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి సంకలన ప్రక్రియలు నాడు దరిదాపు 12 రకాలుగా ఉండేవి.

అలాగే గుణకారం తీసుకుంటే.. 19X19 ఎంతంటే నేడు గణిత యంత్రాల మీద ఆధార పడుతున్నారు. లేదా నేటి గుణకార లెక్క ప్రకారం ముందుగా తొమ్మిది తొమ్మిదులు 81 అనుకుని అందులో ఒకట్ల స్థానాన 1 రాసుకుని, ఆ తర్వాత తొమ్మి ది ఒకట్లు 9 అనుకుని, 9కి 8ని కలుపుకుని వచ్చిన 17ని ఒకట్ల పక్కన రాసుకుని 171చేసి, పిదప తొమ్మిది ఒకట్లు తొమ్మిది అని దానిని 7 కింద రాసి, పిదప ఒక ఒకటి ఒకటి అని దానిని 1కింద రాసి మొత్తం కూడి 361అని సమాధానం చెబుతున్నారు. నాడు ఈ పద్ధతిలోనే కాకుండా మరో 12 రకాల పద్దతుల్లో ఈ లెక్క చేసేవారు. అందు ఒకటి.. 19 పదులు 190. మరలా 19 పదులు 190 మొత్తం 380. అందులోనుంచి ఒక 19 తీసివేస్తే 361. మరో పద్దతి.. రెండు 19ల్లో రెండు పదులున్నాయి కాబట్టి పది పదులు వంద. తర్వాత తొమ్మిది తొమ్మిదులు 81. వందకి 81 కలిపితే 181. పిమ్మట 9కి9 కలిపితే 18. ఈ 18ని 181కి వందల స్థానం నుంచి కలుపుకు వస్తే 361. నోటి లెక్కల దీన్ని చెప్పి వేయవచ్చు. నాడిలా రకరకాల పద్ధతుల్లో గుణకారాలను నేర్పించేవారు.

మహాకవి పోతన పేర్కొన్న ఘనాల ఘనపరిమాణాదులను కూడా రకరకాల రీతులలో చెయ్యవచ్చును. అలాగే ఆయన పేర్కొన్న ఘన మూలాలు, వర్గమూలాదులను రకరకాల ప్రక్రియల్లో చెయ్యవచ్చు. నేడు ఈ అంశాలన్నింటిని నేర్చుకోవడానికి విద్యార్థులు రెండు మూడు పద్ధతులను మాత్రమే ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల వారి అభ్యాసన ప్రక్రియల్లో అసహనం చోటు చేసుకుంటుంది. అభ్యాసానికి అనేకరకాల ప్రక్రియలను అనుసరించకపోవడం, అందలి చమక్కులు మెథడుకు ఎక్కకపోవడం అనేది నేటి గణితాభ్యాస సమస్యలలో ప్రధానమైన సమస్య.

మహాకవి పోతన కవిత్వాన్ని కేవలం భక్తికే పరిమితం చెయ్యకుండా అందులోని గణిత విషయాలను, నాటి చరిత్రకు అనుకూలంగా పరిశీలిస్తే మనకు అనేక విషయాలు తెలుస్తాయి. పోతనగారి పూర్వీకులు మంచి గణకులు. పోతన కూడా గణితాన్ని బాగా అభ్యాసం చేశారు. సంకలవ్యవకలన గుణకార భాగహార విషయాలయందు, వర్గమూలాలయందు, వ్యాపా ర గణితాదులయందు ఆయనకు మంచి ప్రావీణ్యం ఉంది. ఆ ప్రావీణ్యం తనకు నిజ జీవితంలో కూడా ఉపయోగపడింది. ఆయనకు ఉపయోగపడిన ఆ గణిత ప్రావీణ్యాన్ని వెలికి తీయవలసిన అవసరం ఉన్నది. అది వెలుగులోకి వస్తే, భారతీయ గణితశాస్త్రం మరింత విస్తృతం, పటిష్టం అవుతుంది.
- వాగుమూడి లక్ష్మీరాఘవరావు 98494 48947

878
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles