అల్పాక్షరాల్లో అనంతార్థం


Mon,October 1, 2018 01:26 AM

వెల్దండి శ్రీధర్ మినీ కవితలన్నీ గుండెను పట్టి పిండుతాయి. చదివే వ్యక్తిని ఆలోచింపజేస్తాయి.ఆవేశం నుంచి ఆలోచనల్ని, ఆలోచనల్నుంచి పరిష్కార మార్గాన్ని సూచించేలా ఈ నానీలను తీర్చడం ద్వారా మనిషిని తట్టిలేపుకునేలా ఈ ఊపిరిదీపాలు నేటి ఈ సంక్షుభిత సమాజానికి వెలుగు దివ్వెలు
dhipalu
మనసులోని మాలిన్యాన్ని కడిగేసేది కవిత్వం. మనిషిని మనిషిగా తీర్దిదిద్దేది కవిత్వం. మానవత్వా న్ని గుర్తుచేసేది కవిత్వం. ఈ కవిత్వం ఏ రూపంలోనైనా వెలువడవచ్చు. ప్రక్రియలు వేరైనా కవిత్వం పరమా ర్థం ఒక్కటే. సమాజంలోని రుగ్మతలను గుర్తించడం, సాధ్యమైనంతమేర సంస్కరించడం. పద్యం, పాట, వచన కవితల్లాగే ఆధునికంగా అత్యంత వాడిగా ముందుకొచ్చిన కవితా ప్రక్రి య నానీలు. సుమారు రెండు దశాబ్దాల చరిత్ర ఉన్న నానీ లు ఇటీవల మరింత జూలు విదుల్చుతున్నాయి.

అట్లా వెలువడిన నానీల సంపుటి డాక్టర్ వెల్దండి శ్రీధర్ రాసినవే ఊపిరిదీపాలు. కర్నూలులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ కరీంనగర్ బిడ్డగా తెలంగాణ అస్తిత్వాన్ని, సోయిని తన రచనల ద్వారా ప్రదర్శిస్తున్న వెల్దండి శ్రీధర్ గతంలో పలు కథల్ని వెలువరించారు. తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, తెలంగాణ విశిష్టతలను రాస్తూ వస్తున్న వెల్దండి శ్రీధర్ ఇటీవల ఝలిపించిన కవితా సంకలనమే ఈ ఊపిరిదీపాలు.

ఇవి నానీలే అయినా జీవం కోల్పోతున్న అనేక సామాజిక అంశాలకు ప్రాణాలు. అంతరించిపోతున్న మానవ విలువల కు, అడుగంటిపోతున్న పల్లెల ఉనికికీ, ధ్వంసమైపోతున్న వృత్తిజీవితాలకు, కొడిగట్టి పోతున్న సంస్కృతీ సాంప్రదాయాలకు జవజీవాలు. ఒకటిరెండు వాక్యాల్లోనే కొండను అద్దంలో చూపినట్లు అనంతార్థాన్ని అల్పాక్షరాల్లో చూపే ప్రక్రియ.. నానీ లు. ఈ నానీల్తోనే తన మనసును ప్రక్షాలన చేసుకున్నాడు, మరెందరి మనసుల్నో కదిల్చాడు శ్రీధర్.

జన్మకొక్కసారైనా
శుభ్రపడాలి కదా!
కవిత్వపు వానలో
నిలబడ్తా!! అనే నానీ చూస్తేనే తెలుస్తుంది కవిత్వం ద్వారా కవి ప్రక్షాళన పొందుతాడని. అట్లే సమాజాన్ని కూడా ప్రక్షాళ న చేసేందుకు పూనుకొంటాడు.
జీవితాన్నంతా పిండాను కవిత్వం బొట్లుబొట్లుగా కాగితంపై పరుచుకొంది.కవిత్వం జీవితానుభవానుంచి వస్తుంది. ఆ అనుభవాల న్నీ సమాజంలోని మార్పును కాంక్షిస్తాయి. అట్లాంటి అనేక అనుభవాలు ఈ కవి కలం నుంచి వెలువడి సమాజానికి దిశ ను, దశను చూపిస్తున్నాయి. పల్లె జీవితం ఉన్న వ్యక్తిగా కవి దృష్టంతా పల్లెచుట్టు తిరిగింది. విధ్వంసాన్ని అభివృద్ధి అంటున్నారు పల్లెలు నలుగుతున్న మల్లెలు అంటూ ఈ నానీ ద్వారా అభివృద్ధి పేరుతో పల్లెలన్నీ విధ్వంసానికి గురవుతున్నాయని చెబుతాడు. ఉదాహరణకు ఒకప్పుడు పల్లెల్లో దర్జీలు చేతినిండా పనితో హాయిగా బతికారు. అంతా రెడీమేడ్ వస్త్రాల మయమయ్యాక దర్జీ జీవితానికే కత్తెర పడిందని ఈ కవిత ద్వారా చెబుతాడు.

అంతా రెడీమేడ్ జాతర
దర్జీ కార్మికుడి జీవితానికి కత్తెర అట్లే..
పాకెట్లో బందీయైన జీవనది
చెలిమె ఓ పురాజ్ఞాపకం
మినరల్ వాటర్ ప్యాకెట్లు, బాటిళ్ల రూపంలో అందుబాటులోకి రావడం కనిపించినా.. పల్లెలపరంగా చూస్తే చెలిమలు, చెరువులు కూడా అంతరించాయనే బాధ కవిలో కనిపిస్తుంది.
నీటినీ నిలబెట్టి అమ్ముతున్నాడు
వాడెంత తడిలేని వ్యాపారి అనే నానీ నీళ్లను అమ్ముకుంటారని పల్లెప్రజలు ఊహించి ఉండరన్నది గుర్తుచేస్తుంది.
మనిషి ఎంత కఠినుడయ్యాడో చెప్పేందుకు మరో మచ్చుతునక..
ప్రియమైంది కాశీలో వదలమన్నారు
వాడు అమ్మానాన్నల్ని వదిలాడు
కాలక్రమంలో ప్రియమైనవాళ్లే వదిలించుకోదగిన వాళ్లయ్యారు. ఇదంతా విధ్వంసమే కదా!
నిన్న ఉన్నట్లు ఇవాళ ఉండడం లేదు
పల్లెకూడా
ఈనాటి ఊసరవెళ్లి అనడం ద్వారా పల్లె అనేక మార్పులకు లోనైందనేది కవి భావన.
పల్లెల్లో కూడా పచ్చదనం నశించి పట్టణీకరించబడుతున్నా యి. భవనాలు, బడాబాబులు లేస్తున్నారని చెబుతున్నాడు.
ఇంటినిండా/ తెల్లని బంగారం/ బతుకులోనైతే/ నల్లని బంగారం పత్తిరైతు దుస్థితిని చెబుతున్నాడు కవి.
అవసరం/ పరికరాన్ని పుట్టించింది/ పరికరం/ పారిశ్రామిక విప్లవమైంది. ఇది అక్షరసత్యం.మానవ పరిణామ క్రమంలో ఆదిమానవుడు మొదలు ఒక్కో అవసరానికి ఒక్కో పనిముట్టును తయారుచేసుకున్నాడు మానవుడు. ఒకదాన్నుం చి మరొకటి మరింత మెరుగ్గా.. ఆమెరుగుదలే కాలక్రమంలో పారిశ్రామిక విప్లవానికి పురుడుపోసింది.
వాడిది/ అత్తరు బడాయి/ నాది చెమటతో/ నిరంతరం లడాయిఅంటాడు. మాతృభాష స్థితిని చెబుతూ..
బస్టాండులో/ అమ్మనే వదిలేస్తున్నారు/ అమ్మభాషకు/ ఇంకా చోటేది? ఆంగ్లం భాషా వ్యామోహంలో తెలుగు చెర బట్టబడుతున్నది. క్రమంగా తెలుగు మాధ్యమం స్కూల్లే అంతరిస్తున్నాయి. ఈ దుస్థితి కలత చెందుతున్న కవి.. అమ్మనే వదిలేసే మనుషులున్న సమాజంలో అమ్మభాష పరిస్థితి ఇట్లా ఉండటం సహజమేకదా అనే భావన కనిపిస్తున్నా.. అందులో ఒక నిష్కర్ష, ఒక నిరసన గోచరిస్తున్నది.
ఇప్పుడన్నీ/ యాసిడ్ ప్రేమలే/ ఆరాధన త్యాగం/ ఇక భ్రమలే! మారుతున్న మానవనైజాన్ని మాయమైపోతున్న డమ్మా మనిషన్నవాడు... అని అందెశ్రీ చెప్పినట్లు ఈ కవీ అట్లాంటి ఆవేదనే పడుతున్నాడు.
వెల్దండి శ్రీధర్ మినీ కవితలన్నీ గుండెను పట్టి పిండుతా యి. చదివే వ్యక్తిని ఆలోచింపజేస్తాయి. ఆవేశం నుంచి ఆలోచనల్ని, ఆలోచనల్నుంచి పరిష్కార మార్గాన్ని సూచించేలా ఈ నానీలను తీర్చడం ద్వారామనిషిని తట్టిలేపుకునేలా ఈ ఊపిరిదీపాలు నేటి ఈ సంక్షుభిత సమాజానికి వెలుగు దివ్వెలు.
- కటుకోజ్వల మనోహరాచారి, 9441023599

808
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles