బాలల కథకుడినీ కమ్మిన వివక్ష


Mon,September 24, 2018 12:56 AM

తొలినాళ్ళలో గూడూరి రాఘవేంద్ర పిల్లల కథలు, వ్యాసాలతో బాటు కొన్ని కవితలూ, గేయాలు రాశారు. అయితే అవి దొరకడంలేదు. దొరికిన ఈ నాలుగు కథలే ఆరు దశాబ్దాల నాటి తెలంగాణలోని పటిష్టమైన వచన సాహిత్య వికాసాన్నే కాదు, నాడు సాహిత్యం పట్ల పత్రికలు, కవులు రచయితలు చూపించిన శ్రద్ధను తెలియజేస్తున్నాయి.
DR-RAG
మన సాహిత్య సాంస్కృతిక చరిత్ర నిర్మాణంలో అన్నిరంగాల్లోలాగానే బాల సాహిత్యం విషయంలోనూ జరిగింది. తెలంగాణకు చెందిన పొట్లపల్లి, జి.రాములు, యశోదారెడ్డి, వేముగంటి, ఎర్రోజు సత్యం, రేగు లపాటి కిషన్ రావు, డాక్టర్ జె.బాపురెడ్డి, డాక్టర్ మలయశ్రీ మొదలు వందలాది మంది తొలి, మలి తరాల్లో బాల సాహి త్యం రాసినా ఒకటి రెండు పేర్లు తప్ప ఎక్కడా నమోదుకాలేదు. అందుకు కారణాలు ఏవైనా తెలుగువారి సాహిత్య చరిత్ర నిర్మాణంలో విస్మృతికి గురైనవారిని నమోదుచేసి భావితరాలకు వారి రచనలను అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్న ది. ఈ నేపథ్యంలో లభించిన మరో హీరా, బాల సాహితీవేత్త డాక్టర్ గూడూరి రాఘవేంద్ర ఒకరు.

సాహిత్య చరిత్రలో, తెలుగువారి హృదయాలపై శాశ్వతంగా నిలిచిన పేరు హనుమాజీ పేట. అందుకు కారణం.. సినారె అనే ఫెనామినాకు జన్మనిచ్చిన ఊరది. ప్రసిద్ధ తెలంగాణ కథకులు గూడూరి సీతారాం, గేయకవితా విశారదులు కనపర్తి లక్ష్మీనర్సయ్య, ఒగ్గుకథకు అంతర్జాతీయ ఖ్యాతిని కల్పించిన మిద్దె రాములు ఇక్కడి వారే. ఇదే కోవలో 1955 ప్రాంతంలో బాల ల కోసం రచనలు చేసిన బాల సాహితీవేత్త గూడూరి రాఘవేం ద్ర ఈ హనుమాజీ పేటలోనే, సినారె పక్కింట్లో పుట్టారు. పాఠశాల దశలోనే రచనలు చేసిన రచయిత రాఘవేంద్ర. ఆయన తొలి రచనలు ఆనాటి సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాల సంచిక తరం గిణి, వేములవాడ కేంద్రంగా చేతి రాత పత్రికగా నడిపిన విద్యుల్లతలో అచ్చయ్యాయి.

1957-60ల మధ్య చాలా కథలు రాసిన గూడూరి రాఘవేంద్ర 1954 నుంచి 1958 మధ్యకాలంలో ప్రధానంగా పిల్లల కోసం రాశారు. తర్వాత చాలా కథలు వివిధ పత్రికల్లో రాసినప్పటికీ ఇప్పుడు వాటిలో చాలా కథలు అలభ్యం. కొన్ని కథలు మాత్రమే దొరుకుతున్నాయి. వృత్తిరీత్యా వైద్యవృత్తిని నిర్వహిం చి నేడు విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు రాఘవేంద్ర. ఇటీవల నేను వివిధ గ్రంథాలయాలు, పత్రికలు, మిత్రుల ద్వారా ప్రయత్నించగా స్వాతంత్య్ర సమరయోధురాలు సూర్యదేవర రాజ్యలక్ష్మి సంపాదకత్వంలో వెలువడిన ఆనాటి తెలుగు దేశం పత్రికలో అచ్చయిన కొన్ని పిల్లల కథలు లభించాయి. నాకు వీరి బాల సాహిత్యంతో పాటు, తెలుగుదేశం పత్రికలో 3-5-1956లో అచ్చయిన ఇంటాయిన-ఇంటావిడ కథ, 6- 12-1956న అచ్చయిన డిటెక్టివ్ సాహిత్యం వ్యర్థం, రచయితలు వ్రాయడం మానాలి అన్న వ్యాసం కూడా లభించాయి. కొన్ని కథల పేర్లు సీతారాంగారి ద్వారా తెలిసినా ఇంకా లభించలేదు. ఇటీవల మరికొన్ని కథలు పరిశోధకులు సంగిశెట్టి శ్రీనివాస్, వెల్దండి శ్రీధర్‌లకు దొరికాయి. ఇంకా ప్రయత్నిస్తే మరి న్ని కథలు దొరుక వచ్చు.

తెలంగాణ సోయితో ఇటీవల పరిశోధన చేస్తున్నప్పుడు స్వాతంత్య్రానికి పూర్వం, అనంతరం బాల సాహిత్యం మొదలుకుని ప్రౌఢసాహిత్యాన్ని రాసి చరిత్ర పుటల కెక్కకుండా ఉన్న ఎంతోమంది రచయితలు, కవులు కనిపిస్తున్నారు. 1945లోనే బాలల కోసం ఆనాటి ఆనందవాణి పత్రికలో ముల్లా కథ లు, ఆచార్యుల కథలు వంటివి రాశారు పొట్లపల్లి రామారా వు. పొట్లపల్లి సాహిత్యంపై పరిశోధన చేసిన ప్రముఖ బాల సాహితీవేత్త డాక్టర్ భూపాల్ అభిప్రాయం ప్రకారం ఆచార్యుల కథలు అనే కోవలో వచ్చిన కథలు తెలుగులో ఇంతవరకు రాలేదంటారు. ఇంచు మించు ఇదే ప్రాంతంలో గాంధీ సూక్తు లు, బాలబాట అర్థశతకం రాసిన జి.రాములు మొదలైన పేర్లు ఏ బాల సాహిత్య చరిత్రలో కనిపించవు.

ఇదే కోవలోనే పిల్లల కోసం రాసినప్పటికి విస్మరించడంవల్ల కొంత, స్వయంగా రచయితకు సోయి లేకపోవడం వలన చరిత్రలో కనిపించని బాల సాహితీవేత్త గూడూరి రాఘవేంద్ర. పాత పుస్తకాలు, పత్రికలు తవ్వుతున్న క్రమంలో నాకు రాఘవేంద్ర రాసిన నాలుగు పిల్లల కథలు లభించాయి. అప్పుడే యాభైకి పైగా కథలు రాసినా వాటిలో నాలుగైదు మాత్రమే లభించడం దురదృష్టం. ఈ నాలుగు కథలు కూడా నేటికి సరి గా 70 ఏండ్ల క్రితం రాసినవి. ఆనాడే ప్రధాన స్రవంతి అయిన బాలల కోసం సాహిత్యం రాసిన చరితార్థుడు గూడూరి.
నాకు లభించిన రాఫవేంద్రగారి నాలుగు బాలల కథలు 1956 తర్వాత అచ్చయినవి. పిల్లల్లారా! పిల్లల్లారా! విన్నారా మీరీ కథను !! అంటూ బాలల కొలువు శీర్శిక కింద కథలను ప్రచురించారు. తొలికథ ధైర్యే సాహసే లక్ష్మి. ఇది సాదాగా సాగే కథ. కానీ చదువరులకు ఆసక్తి కలిగించడమే గాక ఉత్కంఠను కూడా రేకెత్తిస్తుంది. కట్టెలు కొట్టే రంగడు అడివిలో దొంగలను చూసి భయపడి పారిపోతూ చివరకు ఆ దొంగలు దొంగతనం చేసి తెచ్చిన ధనం దాచుకునే గుహలోకి వెళ్ళి దాక్కుంటాడు.

తమను చూసిన రంగడిని ఎలాగైనా మట్టుపెట్టాలని దొంగలు మాట్లాడుకునే మాటలు విని భయపడి పోతాడు. ఆ గుహలోని తమ ఇష్టదైవమైన నరసింహ స్వామికి దొంగలు పూజచేసి వరమీయమని వేడుకోగ ఎలాగైనా ఈ దొంగలను పోలీసులకు పట్టించాలని నిశ్చయించుకుని ఆకాశవాణి రూపం లో.. ఏమి కావాలో కోరుకోండి అంటూ అభయమిస్తాడు. తమకు దేవుడు ప్రత్యక్షమయ్యాడని భావించి మేం దొంగతనం చేస్తున్నప్పుడు ఎవరికి పట్టుబడ కుండా వరం ఇవ్వమని వేడుకుంటారు. వీళ్ళ రోగం కుదుర్చాలని భావించిన రంగడు సరే మీరు సర్ ధూం అని అనగానే ఎవరి కంటికి కనబడరు అంటూ ఆకాశవాణి రూపంలో వరమిస్తాడు. దానిని నమ్మి మోసపోయిన దొంగలు ఒకరింట్లో దొంగతనం చేస్తూ తమకేమీ కాదని నవ్వుకుంటూ సర్ ధూం అంటూ గట్టిగా అరుస్తారు. దాంతో మాయమై పోకపోగా పోలీసులు వచ్చి ఆ దొంగలను పట్టుకుపోతారు. ధైర్యంవల్ల రంగడు పన్నిన ఉపాయాన్ని గురించి తెలుపుతుందీ కథ.

ఇలాంటిదే మరోకథ సహన పరీక్ష. ఇది 24-5-1957లో తెలుగుదేశంలోనే వచ్చింది. ఇది ముగ్గురు పిల్లలకు సంబంధించిన కథ. వేసవి సెలవుల్లో రాము, అతని బావలు సోము, భీములు రాము వాళ్ళ స్వగ్రామానికి వస్తారు. సోము, భీములిద్దరూ కొద్దిగ కోతలరాయుళ్ళు. ఎప్పుడూ తమ గొప్పతనాన్ని చాటుకుంటూ ఉంటారు. ఆటలో పిల్లలు ఘర్షణ పడుతుంటే వాళ్ళను ఆపేందుకు ఎవరు ముందు తింటే వారికి బహుమతి ఇస్తాను అని ప్రకటిస్తుంది. ముగ్గురూ వచ్చి కంచాల ముందు కూర్చుంటారు. వారికి అన్నంలో చేపలకూర వడ్డిస్తుంది బామ్మ. సోము, భీములు తాము తొందరగా తిని బహుమతిని పొందాలని అదర బాదరగా మింగుతారు. ముళ్ళు తీయకపోవడంతో చేపలు నాలుకకు కుచ్చుకుంటాయి. రాము నెమ్మదిగా, నిదానంగా చేపల ముళ్ళను తీసేసి తినేస్తాడు.

మరునాడు పిల్లలంతా నిన్నటి బహుమతి ఎవరికి దక్కింది, ఎవరికి సహ నం ఎక్కువగా ఉంది అని ప్రశ్నించగా అది రాముయే అని చెబుతుంది అమ్మ. పిల్లలు, వారి మనస్తత్వం, వారి స్పర్థలు, వాళ్ళ వాళ్ళ మానసిక ప్రవృత్తులను ఒక సైకాలజిస్టుగా చెబుతారు రాఘవేంద్ర ఈ కథలో. ఇలాంటిదే మరోకథ. నాలుగవది బాల కథ శీర్శికతో అచ్చయిన నిజం నిలకడ మీద తెలుస్తుంది అనే కథ. ఇందులో పైన పేర్కొన్న మూడు కథలకంటే కూడా ఒకింత ఎక్కువ నాటకీయతను చొప్పించాడు. దొంగతనం జరగడం, దానిని తమ దుకాణంలోని గుమాస్తానే చేశాడని భావించి ఇటు యజమానులు, అటు పోలీసులు చిత్రహింసలు పెట్టడం చివరికి దొంగ గుమాస్తా కాదని తెలియడం కథ. అయితే ఇందులోని సంభాషణలు, నాటకీయశైలి కథను చక్కగా నడిపించాయి. తొలినాళ్ళలో గూడూరి రాఘవేంద్ర పిల్లల కథలు, వ్యాసాలతో బాటు కొన్ని కవితలూ, గేయాలు రాశారు. అయితే అవి దొరకడంలేదు. దొరికిన ఈ నాలుగు కథలే ఆరు దశాబ్దాల నాటి తెలంగాణలోని పటిష్టమైన వచన సాహిత్య వికాసాన్నే కాదు, నాడు సాహిత్యం పట్ల పత్రికలు, కవులు రచయితలు చూపించిన శ్రద్ధ ను తెలియజేస్తున్నాయి. మరో రెండు కథలు దొరికినప్పటికి వాటి ముగింపు పుటలు దొరకడంలేదు. త్వరలో మరి న్ని కథలు లభిస్తాయని ఆశిద్దాం.

ఇంత చక్కని కథలు రాసిన డాక్టర్ గూడూరి రాఘవేంద్ర స్వాతంత్య్రానంతర తెలంగాణ తొలితరం కథకుల్లో అగ్రగణ్యులైన అన్న గూడూరి సీతారాంలాగే కథకు రాంరాం అన్నారు. ఒక వైపు వైద్య విద్యార్థిగా చదువు, మరోవైపు పత్రికలు బాల సాహిత్యానికి పెద్దగా స్థానాన్ని కల్పించకపోవడం మరోకారణం కావచ్చు. దాదాపు మూడు దశాబ్దాల పాటు ఎంతో ఉత్సాహం తో రచనలు చేసిన ఆయన ప్రస్తుతం ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఉన్నారు. రాశిలోనూ, వాసిలోనూ ఏడు దశాబ్దాలకిందే మేలిమి బంగారు లాంటి కథలను రాసి తెలంగాణ తొలి తరం బాలసాహిత్య రసవేది గూడూరి రాఘవేంద్ర ఉద్యమాల ఊపిరి జగిత్యాలలో దంత వైద్యులుగా సేవలందిస్తున్నారు.
-డాక్టర్ పత్తిపాక మోహన్,9966229548

1078
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles