ధిక్కార కవి, భక్తి రసధుని


Mon,September 24, 2018 12:53 AM

వైష్ణవ సంప్రదాయ అనుచరుడైన భూమగౌడులో పలకరింపులోనే సీస పద్యాలు జాలువారుతాయి. చదువు శాస్ర్తాలు గుప్పెట్ల-పెట్టుకొని అందరిని ఆడిచ్చినోళ్లు బ్రాహ్మన్లా.. అది తప్పు మనుషులందరు ఒక్కటే అందరని కలుపుకుపోవాలన్నడు రామానుజుడు అన్నది భూమగౌడు దృక్పథం.
Vemula
చరిత్ర ఎప్పుడూ తొలి పొద్దులాంటిదే. ప్రతి పొడుపులో కొత్తదనాన్ని తీసుకొస్తుంది. రచయి త చేతిలో దివిటీ అయి కానరాని కోనల్లో వెతుకులాడుతోంది. సాగర గర్భశోధన కన్నా చరిత్ర చేదడం కఠినమైన కర్మ. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందు కు అన్నట్లు దొరికిన కాస్తా పురికోసను పట్టుకొని మరుగున పడిన పాదముద్రల్ని దొరికి పుచ్చుకునే ప్రయత్నం నిరంతరంగా సాగుతోంది.రచయిత వేముల ప్రభాకర్ పదేండ్ల కృషి ఫలితంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి కైరం భూమగౌడు జీవితం అక్షరబద్ధమైంది. విశిష్టాద్వైత సిద్ధాంతకర్త రామానుజాచార్యపై భక్తి, అనురక్తితో రామానుజుల బోధనలను ఆచరణ రూపంతో స్వీకరించిన కైరం భూమగౌడు జీవనయానాన్ని నవలీకరించారు వేముల. కైరం భూమగౌడును వరకవి భూమగౌడుగా అభివర్ణించారు రచయిత. ఈ నవలను చారిత్రక ఆధారాలతో అల్లిన కాల్పనిక రచనగా చెప్పుకోవచ్చు.

ఏ నవలకైనా అందులో కాల్పనికత ఎంత ఉన్నా సమకాలీన జీవన పరిస్థితులు, సామాజిక స్థితిగతులు కథలో అంతర్భాగమవుతాయి. ఊర్లో అన్ని వృత్తుల వారితో కలిసి బతుకు తూ కల్లు అమ్ముకునే గీత కార్మికుడు అయిన భూమగౌడు తన సత్ప్రవర్తనతో, ముక్కుసూటితనంతో ప్రతికూల పరిస్థితులనుఎదురీదే క్రమంలో పడ్డ ఇక్కట్లను తన ఆశుపద్య రచనతో అధిగమించిన జీవనయానం ఈ నవల వృత్తాంతం.జగిత్యాల సమీపంలోని రావికల్ నివాసి అయిన భూమగౌడుకు నాటకాలపై ఆసక్తి మెండు. ఊర్లో నాటకం వేయాలనే సంకల్పంతో నరసింహదాసుతో మాధవ చరితం రాయించి మిత్రుల తోడ్పాటుతో ప్రదర్శన ఏర్పాటు చేస్తాడు. గ్రామ దొర లకా్ష్మరెడ్డి నుంచి అనుమతి తీసుకోలేదన్న కారణంతో ఆరంభంలోనే ఆటంకం సృష్టించబడుతుంది. భూమగౌడును గడి లోకి పిలిపించి నాటక పరదాలను దగ్ధం చేస్తారు దొర మనుషులు. దాంతో దొరపై కోపంతో యువత ఊర్లోనే దారికడ్డంగా కోలాటం ఆట మొదలుపెడుతారు. ఆ దారిన దొర వస్తుండని, కోలాటం ఆపి తప్పుకోండని చెప్పినా మరింత కసిగా కోలా టం సాగుతుంది. తన పద్యాల ద్వారా ఊరి ప్రజల్లో చైతన్యా న్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని గ్రహించిన లకా్ష్మరెడ్డికి భూమగౌడు ప్రతిచర్య కంటకింపుగా తయారైంది.

గీతకార్మికుడిగా చెట్టుపన్ను కట్టలేదనే నెపంతో భూమగౌడును గడికి రప్పించి వీపుపై రాళ్లు పెట్టిస్తాడు దొర. భూమగౌడు అనుచరులైన వెంకటి, కిష్టయ్యలను పిలిపించి భూమగౌడు రాసిన పద్యాలను చదివిస్తాడు. దొర ఆగడాలను విప్పిచెప్పే ఆ పద్యాలు దొరను మరింత కోపోద్రిక్తున్ని చేస్తాయి. ఆ పంక్తులు.. చిమ చిమ పొంగేటి శ్రేష్ఠమౌ కల్లును- బుంగెడు వెట్టికి మ్రింగినావు, విలవిలలాడు మొట్టలు కడిగించుక-తక్కెడు వెట్టికి మెక్కినావు, పుట్నపంచుల ధోతి పోశెట్టి దెచ్చిస్తె-వెట్టికి... కట్టినావు, గుడ్లకచ్చిన లేత కోడి యర్దక్కెడ్డి - బిచ్చగాళ్ల బిలిచి వెట్టి దొబ్బి పెయిని పెంచినదో దొర- వీపు పైన గొట్టు కడుపు పైన గొట్టవలదు.. అని పాడుతాడు.ఇసుంటి పాటలు పాడితే బిచ్చమెవడేస్తర్రా! అన్న లకా్ష్మరెడ్డి ప్రశ్నకు బాంచెన్... మళ్లీ మళ్లీ పాడించుకుంటున్నరు.. అంటాడు వెంకటి.

దొర గడిలో జరిగిన అవమానాన్ని భరించలేక భూమగౌ డు.. అవనికి కడు పాతకుడీ-భువినేలిన లకా్ష్మరెడ్డి బూడిదయగునే.. అని శపించి .. కవితిట్టు పాముకాటు.. కుట్టి కుదుపురా! అని శపించి .. ధారాదత్తం జగన్నాథం- నీ సమస్తం చల్లారనీ, నువ్వు సత్తెనాసు కానీ, అప్పటివరకు రావికల్‌లో అడుగుపెట్ట..నని ప్రతిజ్ఞ చేసి ఊరును వదిలిపెడుతాడు. ఇలా ఊరు వదిలిన భూమగౌడు పన్నెండేండ్ల పాటు దేశ సంచారం చేశాడు. పడమరన పండరీపురం నుంచి తూర్పున భద్రాచలం దాకా ఆ పాదయాత్ర సాగింది. ప్రజలతో కలిసిపోతూ, మంచి ని పంచుతూ, సమస్యలను పరిష్కరిస్తూ, దీన జనుల కడగండ్లను తీర్చుతూ, తనకు తెలిసిన ఆయుర్వేదంలో వైద్య సేవ చేస్తూ ఊరూరా తన అస్తిత్వాన్ని చాటుకున్నాడు భూమగౌడు.
వైష్ణవ సంప్రదాయ అనుచరుడైన భూమగౌడులో పలకరింపులోనే సీస పద్యాలు జాలువారుతాయి. చదువు శాస్ర్తాలు గుప్పెట్ల-పెట్టుకొని అందరిని ఆడిచ్చినోళ్లు బ్రాహ్మన్లా.. అది తప్పు మనుషులందరు ఒక్కటే అందరని కలుపుకుపోవాలన్నడు రామానుజుడు అన్నది భూమగౌడు దృక్పథం.

రచయిత వేముల ప్రభాకర్ ఎంతో శ్రమిం చి, చారిత్రక ఆధారాలను సేకరించి భూమగౌడు పద్యాలనాధారం చేసుకొని వరకవి జీవనగతిని పునఃసృష్టించాడు.
పుస్తకంలో ఉటంకించిన పద్యాలు భూమ కవి కావ్య ప్రతిభ కు, సామాజిక అవగాహనకు అద్దం పడుతాయి. 1875లో పుట్టిన భూమగౌడు 1950లో తిరిగి గ్రామానికి చేరుకొని రావికల్‌లో రామున్ని ప్రతిష్ఠించి రామ శతకం అంకితం చేశాడు. ఆయన క్షయ బారిన పడి మరణించడంతో నవల ముగుస్తుంది.ఈ నవలకన్న ముందు కైరం భూమగౌడుపై వేముల పెరమాండ్లు 2002లో వరకవి కైరం భూమదాసు కృతులు అని, నటుడు రచయిత తనికెళ్ల భరణి కల్లు కుండల మీద కవిత్వం రాసిన కైరం భూమగౌడు అనే వ్యాసాన్ని 2005లో రాశారు. వివిధ సాహిత్య, సాంస్కృతిక చరిత్రకు సంబంధించిన సంపుటాల్లో భూమగౌడు ప్రస్తావన వచ్చింది. భూమగౌడు కావ్య ప్రతిభను, మానవ సేవను అక్షర శిల్పంలో నిలబెట్టిన వేముల ప్రభాకర్ కృషి ప్రశంసనీయం.
- బి.నర్సన్, 94401 28169

897
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles