తెలంగాణకు భరోసానిచ్చే కవిత్వం


Mon,September 17, 2018 12:09 AM

నరసింహారెడ్డి తనకు ఎదురైన ఏ చిన్న సంఘటనలను కూడా నిర్లక్ష్యం చేయలేదు. క్షణికమైన దాన్ని శాశ్వతం చేయ డం, ఆత్మీయమైన దాన్ని విశ్వజనీయం చేయడమే కదా కవిత్వమంటే.
Mula-Malupu
కవిత్వం ప్రకృతి శాస్త్రాలకు సారూప్యతను కలిగి ఉంటుందా? ప్రకృతి శాస్ర్తాలతో కవిత్వాన్ని కొలి చే ప్రామాణికత ఏదైనా ఉన్నాదా? అనే మీమాంస కలుగుతుంది అప్పుడప్పుడు. ప్రకృతి శాస్ర్తాల కొలమానాలతో కవిత్వాన్ని పట్టుకోగలమా? కవిత్వంతో ప్రకృతి శాస్ర్తాలను పట్టుకోగలమా? అనే సందేహంలోంచి రెండోదే సరైందెమో అనిపిస్తుంది. నిజానికి శాస్ర్తాలన్నీ పురుడుపోసుకోక ముందూ లేదా అంతమవుతున్న చోటా కవిత్వం శాస్ర్తాలకు భిన్నమైన ఒక ఉన్నత సత్యాన్ని చాటుతుంది. వైజ్ఞానికునిలో కలిగే స్పందనకు కవిలో కలిగే స్పందనకు వ్యత్యాసమున్నది. అది పదార్థానికి, రసభావ జగతికి గల సంబంధం. అన్ని నిరూపణలు, అన్ని ప్రకటనలు ముగిసిన తర్వాత, అన్నిరకాల తత్వ నిరూపణలకు ఉన్నతమైన సత్యా న్ని ప్రకటించడానికి కవిత్వం పూనుకొంటుంది. మనిషిలోని విభిన్నకోణాల్లో ఆవిష్కృతమయే జీవితాన్ని ఒక మూల మలుపు నుంచి ప్రకటిస్తున్నాడు ఏనుగు నరసింహారెడ్డి. ఎవ రి చేతిలోనైనా తనవితీరా ఓడిపోవాలనే ఒక మౌన సున్నిత కోణం లోంచి ఒక కరుణ రస సాగారాన్ని మనపైకి దొర్లిస్తున్నా డు. ఈ కవిత్వం చదువుతున్నప్పుడు ఒక మనంగా ఉండటం కష్టం, అనేక మనంల్లా విడిపోవడమో లేక మనలోకి అనేక మనంలు, విడతలు విడతలుగా రంగ ప్రవేశం చేయడమో జరిగి తీరుతుంది. అంతా చదివాక మనిషి ఒక్కడేనా? అనే సందేహం కూడా కలుగుతుంది. తెలుగు కవిత్వం ఈ మధ్య అనేక మార్పులకు గురైనట్టుగా తోస్తుంది.

అందులో నిత్యం ఒక అస్తిత్వం కోసం సంఘర్షణ పడే సమాజాల్లో నుండి వచ్చే కవుల కవిత్వం మరింత విభిన్నంగా ఉంటుంది. అందుకే తెలంగాణ నుంచి వస్తున్న కవి త్వం భిన్నంగా ఉంటుంది. నిజానికి ప్రపంచంలో వచ్చిన గొప్ప సాహిత్యమంతా అస్తిత్వం, సంఘర్షణల మేలిమి బంగారమే. అయితే ఈ సాహిత్యాలను సంఘర్షణకు ముందు, సంఘర్షణకు తర్వాత అనే రెండు దృక్కోణాల్లోంచి చూడవచ్చా? అనేది ఒక ప్రశ్న. నిజానికి సందర్భాలు రెండు కానీ, కవి సంఘర్షణ ఒకటే. మొదటిది సాధించుకోడానికైతే రెండోది తనను తాను పాదుకొలుపుకొని లోలోతుల్లోకి విస్తరిస్తూ ఒక ఆదర్శం కోసం జరిగే ఘర్షణ. సందర్భానికి ముందైనా, తర్వాతనైనా కవి రికామిగా ఏమీ ఉండడనేది మనకు బోధపడుతుంది. కాబట్టి కవి నిత్య దు:ఖితుడిలా కనిపిస్తాడు. స్వేచ్ఛ పుట్టుకలో ఉన్న రహన్యం, దు:ఖం పుట్టుకలోని రహస్యం కలిసి ప్రయాణిస్తుంటాయి. ఈ లోకానికి ఎవరూ ఎక్కువ కాలం అవసరం లేదనే చేదు సత్యాన్ని ఈ స్వేచ్ఛాయుత దు:ఖంలోంచే ప్రకటిస్తున్నారు నరసింహా రెడ్డి. అందుకే పొద్దు గూకక ముందే గూట్లో దీపం పెట్టడం మంచిదని హెచ్చరికతో కూడిన సలహాని కూడా ఇస్తున్నాడు. ప్రతి కార్యానికి కారణముంటుందని తెలిసీ కనుక్కోలేని హేతువు చుట్టూరా గిరికీలు కొట్టడమే జీవితమంటూ, ఈ అహేతుక విషయాల పట్ల నిరసనను ప్రకటిస్తున్నాడు. అతను ఒక ఊరు గురించో, చెరువు గురించో, బడి గురించో, చిన్ననాటి బాల్య స్నేహితుడి గురించో చెపుతున్నప్పుడు అతను వెళ్ళిన ప్రతిచోటుకు మనం వెళతాం. జీవితంలోని విభిన్న కాలాల్లోకి, విభిన్న ముఖాల్లోకి మనల్ని తోలుకొనిపోయి మనదైన మన అస్తిత్వాన్ని చాలా సరళంగా, సులువుగా మనకు బహుమతిగా ఇస్తాడు. కవిత్వంలోని పదాలు, భాష ఎక్కడా మనల్ని అడ్డుకోవు. చాలా సులభంగాను అతను మనతో మమేకమవుతాడు. పోగొట్టుకున్న దాన్ని వెతికి పట్టుకోవడమనేది మనిషి అస్తిత్వాన్ని పాదుకోవడమే. ఈ అస్తిత్వ పెనుగులాట బహుశా ప్రతీ మనిషి అంతర్ముఖమే.

పాట జారిపోయిన వేదిక మీదే స్వరాలను ఏరుకోవడం రెప్పదాటిన కలల మీద మెరుపుల్ని చిత్రిక పట్టడం, నేలపై కాళ్ళను నిలుపుకునే కవి మాత్రమే చేయగల డు. నిలబడ్డ చోటు నుండే ముందు దారిని చూడడం అభ్యుదయ మానవుని దార్శనిక దృష్టి. ఇక్కడ నిలబడి అక్కడ చూడటం ఓడిపోవడం కానే కాదు నిలుచున్న చోటునే ఉండే ది అచేతనావస్థ. ముందుకు చూడడమే చేతనావస్థ. మనిషే మనిషికి భవిష్యత్తు అంటాడు సార్త్.్ర ఎంతటి భావావేశాన్నైనా నిగ్రహంగా చెప్పడం నరసింహా రెడ్డి కవిత్వం తీరు. ఎక్కడా పదాలను అతివీరావేశంగా రంగప్రవేశం కానీయడు. ఎంతటి కోపాగ్నికి తాను గురైనా సున్నితంగానే ఆ జ్వాలను వివరిస్తాడు. కవిత్వమంతా సామాన్యుని జీవన ప్రయాణాన్ని డాక్యుమెంటరీ చేసినట్టు ఉంటుంది. అందుకే ఉద్యోగ చోటు, రాజకీయ ముఖచిత్రాలు, ఉద్యమాలు, స్నేహాలు, ప్రేమలు, జీవిత సత్యాలు, తత్వాలు, కుటుంబ బంధాలు, దృశ్యాలు దృశ్యాలుగా మనముందు ఆవిష్కరిస్తాడు. నరసింహారెడ్డి తనకు ఎదురైన ఏ చిన్న సంఘటనలను కూడా నిర్లక్ష్యం చేయలేదు. క్షణికమైన దాన్ని శాశ్వతం చేయ డం, ఆత్మీయమైన దాన్ని విశ్వజనీయం చేయడమే కదా కవిత్వమంటే. నడిస్తేనే అలసిపోయే రోజుల్లో ఎంత గెంతినా ఒడువని కేరింతల కాలాన్ని, అప్పుడెగేరెసిన గాలిపటం తెగిన దారా న్ని, కాల్వలో సెల్ఫీ దిగిన చందమామ మురిపాల జ్ఞాపకం, క్లాసురూంలో మనసు విరిచిన తుంటరి ప్రేమలేఖ, ఆకలికి అందం దిద్దిన రోజులు దేన్ని ఊరకోని పోనివ్వడు, ఒకొక్క జ్ఞాపకాన్ని ఏరి కవిత్వ దారానికి కలిపి మన ముంజేతిపైన కట్టేస్తాడు. కవిత్వాన్ని అంతులేని మహా ప్రపంచంగా చూస్తాడు.
- డాక్టర్ చెమన్, 94403 85563

781
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles