సోమన్న వినిపించెను మన మాట


Mon,September 17, 2018 12:09 AM

తెలంగాణ వచ్చినంక శెయ్యవల్సిన పనులల్ల మన పలుకుల నికాలస్ తనం ఏందో బయటవెట్టి మనది ఆత్మగల్ల పలుకేనని, అసలైన ముచ్చటనే అని చెప్పాలె. సిన్మాలు, సీరియల్ల మన ముచ్చట్లను నాదాన్ జేసేలెక్కల రాసేటోల్లకు బుద్ధిజెప్పాలె. మన ఆత్మగౌరవం నిలవెట్టుకోవాలె.

తెలుగు భాషల కవిత్వం రాసిన తొలి తరపు కవులల్ల తెలుగు పలుకులంటే పానమిచ్చిన కవి సోమ న్న. తన ప్రాంతపు పలుకుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన కవి పెద్ద సోమన్న. సబ్బండవర్ణాలను పాత్రలు జేసి వాళ్ళ పనితనం, దీమంతం ఏందో కండ్లకుగట్టి, దేశి తొవ్వల ద్విపద పాదాలతోని పలుకుబడుల కైత్వపు బండిని ఉరికిచ్చి, జాను తెనుగు ముచ్చట్ల సాలువోసి బసవ పురాణమంతటి కావ్యాన్ని కైగట్టిండు, మార్గ పధ్ధతి మీద పైవట్టిండు. సోమన్న వాడిన తొలి తెలుగు పలుకులల్ల కొన్నిటిని కుల్లం కుల్లంగ శెప్పెతందుకు ఈ ముచ్చట.సోమన్న రాసిన బసవపురాణంల వాడుకజేసిన కొన్ని పదాలను ముంగటేసుకుంటే ఆయన పెద్దీర్కం ఏందో తెలుస్తది. తెలంగాణల ఈనాటికి అవ్వ, అయ్య, అన్న, గారుపదాలు నాలికెల మీద ఆడుతన్నయ్ గద. బసవ పురాణంల ఎంతమం దో అయ్యలు అవ్వలు, అన్నలు ఉన్నరు. కరస్థలి సోమనాథ య్య, పిన్నయ్య, బసవయ్య, కూడలిసంగయ్య, బల్లేశుదేవు మల్లయ్య, బంబిన బాపూర బ్రహ్మయ్య, శివనాగుమయ్య ఇవి ఎప్పటి పేర్లు అంటే, ఎనిమిది వందల ఏండ్ల కింద పన్నెండో శతాబ్దంల రాసినయ్. అయ్య అంటే తండ్రి అని అర్థం. అట్లనే గౌరవంగ గూడ అయ్య అనుడు ఉన్నది. అందుకేగద అయ్యగారు అని పిలుస్తున్నం. ప్రేమతోని గూడ అయ్యా! జరగిటు జూడు, కొద్దిగంత శెయ్యెయ్యి! అనుడు ఉన్నది. భారతంల అయ్యా! యేనేల కృతఘ్నుండనగుదు అని (అరణ్యపర్వము ఏడో ఆశ్వాసం 6). బసవ పురాణంల ఇట వచ్చు అయ్యలకు ఎదురువచ్చుచును/ అట వచ్చు అయ్యలకు అర్థి మ్రొక్కుచును అని గౌరవంగ వాడిండు సోమన్న.

ఇప్పటికి గూడ తెలంగాణల మల్లయ్య, శంకరయ్య, బ్రహ్మయ్య, రామయ్య, రాజయ్య, భీమయ్య, వీరయ్య, లింగయ్య, చెన్నయ్య, సంగయ్య, దేవ య్య అసొంటి పేర్లు ఉండనే ఉన్నయ్. అయ్యా! అని పిలుసుడు తెలంగాణల ఏండ్ల సంది ఉన్నదే. ఇప్పుడు అది మోటు మాట లెక్క అనిపిస్తున్నది కని, అయ్య శరిత్ర తక్కువ లేదు. ప్రాకృతంల అయ్యడి, అజ్జ అని, పాళీ భాషల అయ్యా, అయ్యక అని, తమిళంల అయ్యా, అయ్యర్ అనే మాటలుగూడతండ్రి, పూజ్యుడు, పురుషుడు అనే అర్థాలనే ఇస్తున్నయ్. ఇగ, మనం ఇప్పటికి గూడ అన్నా! జర జరుగు! అన్నా! టైం ఎంతైంది?అని అంటనే ఉన్నం గద. అట్ల బసవపురాణంల ఇండె సోమన్న, బండియ రేవణ్ణ, గణదాసి మాదన్న, సింగరాజు ఆదెన ఉన్నరు. నిజానికి అన్న అంటే తండ్రి అని అర్థం. తెలంగాణల తండ్రిని అన్న అనే పధ్ధతి గూడ ఉండే. అన్న అంటే,తండ్రి ఎనుక తండ్రి అసొంటోడుగనుక అన్న అని వచ్చి ఉంటది. అన్న అంటే తండ్రి అనే అర్థంల శ్రీనాథుని గుణనిధి కథలో సోమిదేవమ్మ, కొడుకుతోని ఇట్ల అంటది అన్న మీ య న్న చెప్పినయట్ల చేయు(కాశీ ఖండము నాలుగో ఆశ్వాసము 83).అట్లనే, అన్న అనేది ప్రేమతోని పిలిశే మాట గూడ. మహా భారతంల కుంతీ దేవి భీమునితోని అన్న! యిది ధర్మువని మీ యన్నను నన్నును అని అంటది(ఆదిపర్వం ఆరో ఆశ్వాసం 225). బసవపురాణంల బసవేశ్వరుని తల్లి మాదాంబ నందిని మొక్కుకుంట నా అన్న, నా తండ్రి, నా ఆల ఱేడ అని అంటది. మన కవులు పాల్కురికి సోమన, తిక్కన, మారన, కేతన, జక్క న, బమ్మెర పోతన, వెలిగందల నారన, అల్లసాని పెద్దన, నంది తిమ్మన, పింగళి సూరనలల్ల కొనకు ఉన్నది ఏంది? అన్ననే గద. కొసకు శెప్పేది ఏందంటే తెలంగాణల ప్రతి ఒక్కలను అన్న అని పిలుసుడు అయితే ప్రేమతోని, కాకుంటే తండ్రి అసొంటి మనిషి అనే.

ఇగ మన అవ్వలసంగతి సూడుండ్రి. పాల్కురికి సోమన్న బసవపురాణంల ఎందరో అవ్వల పేర్లు రాసిండు. కొన్ని సదువుండ్రి. గొగ్గవ్వ, అమ్మవ్వ, సకలవ్వ, నిమ్మవ్వ, శాంతవ్వ, సంగవ్వ, లింగవ్వ, రెబ్బవ్వ, ప్రమథవ్వ, బాచవ్వ, విమలవ్వ, సెల్లవ్వ, వీరభద్రవ్వ, చిక్క్లల రామవ్వ, అక్కవ్వ, సోడవ్వ, మల్లవ్వ, భాగవాడ మాదవ్వ, ఇండె రేకవ్వ, సంగళవ్వ, కాళ వ్వ, సకళవ్వ, పిట్టవ్వ, జోడవ్వ, అమ్మవ్వ, వైజవ్వ, తిలకవ్వ, పురాతవ్వ ఇంక ఎందరో ఉన్నరు. ఇండ్ల ఇప్పటికి అమ్మవ్వ, శాంతవ్వ, భద్రవ్వ, లింగవ్వ, రామవ్వ, అక్కవ్వ, మల్లవ్వ అసొంటి పేర్లు ఇనవడుతనే ఉన్నయ్. ఈ రోజుల్ల మనకు అవ్వ అనుడు నామోషి అయింది. అవ్వ అనే పదం ప్రాచీన కావ్యాలల్ల ఎన్నో అక్కల్ల ఉన్నది. మహా భారతంల తల్లి అనే అర్థంల బలియునిట్టి భీము బ్రాహ్మణార్థమ్ముగానసురవాత ద్రోతురవ్వ యిట్లు(ఆదిపర్వ ము ఆరవ ఆశ్వాసము 281) అని ఉన్నది. అట్లనే గౌరవంగ పరాయి ఆడామెను పిలిశేటప్పుడు గూడ మహాభారతంల అవ్వ! నీవు వేల్పవగుదని కొందఱు, మొగిన కేలు మొగిచి మ్రొక్కిరంత(అరణ్య పర్వము రెండవ ఆశ్వాసము 103) అని ఉన్నది. భాగవతంల కృష్ణుని బాల్య చేష్టల గురించి శెప్పుకుంట పోతన ఇట్ల రాసిండు- అవ్వలనెఱుంగక మువ్వురి కవ్వల వెలుగొందు పరముడర్భకుడై యా యవ్వలకు సంతసంబుగ నవ్వా యవ్వా యనంగ నల్లన నేర్చెన్ (పదవ స్కంధము పూర్వ భాగము 294). ఆ కృష్ణుడు సుత శిన్నప్పుడు అవ్వా అవ్వా అని పిలుసుడు నేర్సుకున్నడట. తమిళంల అ్వ, అ్వయార్ అని కన్నడంల అవ్వ అనే పదాలు ఉన్నయ్. శబ్ద రత్నాకరంల అవ్వ అంటే తల్లి, తల్లి తల్లి, పూజ్యురాలు అని ఉన్నది.

ఇగ గారు అనే పదం సంగతిజూద్దాం. ప్రాచీన కావ్యాలల్ల ఎక్కడ దొరుకని ఈ పదం బసవ పురాణంల ఎందరో అయ్యలకు, అవ్వలకు గౌరవంగ సోమన్న వాడిండు. సూడుండ్రి కరస్థలి సోమనాథయ్య గారు, కాట కోటయ్యగారు, బిబ్బబాచయ్యగారు, సుంకేశుబంకయ్యగారు. వీళ్ళంత అయ్యగార్లు గాదు. సుంకం వసూలు చేసే బంకయ్య, గోడలు మంచిగజూసే మల్ల య్య, కుక్క మాంసం వండుక తినే శ్వపచయ్యలు ఉన్నరు. అట్ల నే ప్రసాదాలు ఆరగింపు జేసే వీర చోడవ్వ, పరిహాసాలు మాట్లాడే కళియంబ, బొంతలు కుట్టే బొంతాదేవి ఉన్నది. అంటే సోమన్న జాతి భేదం లేకుంట గారు అని వాడిండు. మూలఘటిక కేతన ఆంధ్ర భాషా భూషణంల పోడిగ బహువచనంబులు/వీడనుచో వీండ్రు వీరు వీరలునయ్యెన్/ కాడన గాండ్రన గారన/ వాడునకున్ వాండ్రువారు వారలునయ్యెన్ (అధ్యాయం 3-71). బహువచనంలో కాడు అనే ప్రత్యయంకాండ్రు, కారు అని, వారు అనే ప్రత్యయం వాండ్రు, వారు, వారలు ఐతదని శెప్పిండు. ప్రథమా విభక్తి మీద వచ్చే పరుషాలకు గసడదవలు వస్తయిగనుక కారు గారు అయింది(చూ. బా.వ్యా సంధి 13). అయ్యవారు, అమ్మవారు, దొరవారు అన్న దాంట్ల వారు అనేది బహువచన అర్థాన్ని పోడగొట్టుకొని గౌరవంగ మారింది. అట్లనే, అయ్యగారు, అమ్మగారు, దొరగారు, నాచయ్య గారు, శ్వపచయ్య గారు అన్న దాంట్ల గూడ బహువచన అర్థం పొయ్యి పెద్ద అర్థం వచ్చింది. తొల్కాప్పియంలో ఒరువర్ ఎన్నుమ్ పెయర్ నిలైక్కిళవి/ ఇరుపాఱ్ క్కుమ్ ఉరిత్తే తెరియుమ్ కాలై అనగా ఒరువర్ అనే పదం మహద్వాచక స్త్రీలింగ, పుంలింగాలు రెండిటికి వస్తది(నామవాచక ప్రకరణం 37). ఒరువర్(ఒకరు), ఒరువన్(ఒకడు), ఒరుత్తి(ఒకతె).

అట్లనే తన్మై చుట్టిన్ పన్మైక్కి ఏఱ్కుమ్ అనగా ఒరువర్ అనే పదం ఏక వచనాన్ని తెలిపే బహువచన పదం (నామవాచక ప్రకరణం 38). వారు, గారు అనేటివి బహువచన ప్రత్యయాలే కాని ఏక వచనానికి గూడ వస్తయ్ అని శెప్పుటానికి. ఇంకొకటి తమిళ ఒరువర్ అనే దానికి తెలంగాణల ఒరి వారి అనే పిలుపుగూడ ఉంది. అట్లనే మీ వారు వచ్చిండ్రా, మా వారు ఇప్పుడే పోయిండ్రు అన్నప్పుడు గూడ వారు అనేది ఏక వచనమేగని గౌరవంగ పిలుసుడుగద. ఈ గారు ఇన్ని సార్ల ప్రయోగం జేసినా శబ్ద రత్నాకరంతో సహా ఏ నిఘంటువుల గూడ ఈ ప్రయోగాలు ఎక్కలే. తెలంగాణల ఇప్పటికి సామాన్యులుగూడ అయ్యగారు, అమ్మగారు, దొరగారు, అత్తగారిల్లు, అవ్వగారిల్లు పదాలు వాడుక జేస్తున్నరు. ఇప్పుడైతే సుట్టరికాలకు, పదవులకు, పెద్దలకు సర్వ సామాన్యంగ గౌరవంగ వాడుతుండ్రు. భాషా శాస్త్రకారుల ప్రకారంగ లెక్కవెడుతే ఇది అర్థ గౌరవం పొందిన పదం ఐతది.
తెలంగాణ వచ్చినంక శెయ్యవల్సిన పనులల్ల మన పలుకుల నికాలస్ తనం ఏందో బయటవెట్టి మనది ఆత్మగల్ల పలుకేనని, అసలైన ముచ్చటనే అని చెప్పాలె. సిన్మాలు, సీరియల్ల మన ముచ్చట్లను నాదాన్ జేసేలెక్కల రాసేటోల్లకు బుద్ధిజెప్పాలె. మన ఆత్మగౌరవం నిలవెట్టుకోవాలె. (శెయ్యెయ్యి, శరిత్ర, పిలి శే, శెప్పేది, శెప్పుకుంట, శిన్నప్పుడు, శెప్పిండు, శెయ్యవల్సిన అని ఈ రచయిత వాడుట్ల ఉద్దేశం ఏందంటే ఇ ఈ ఎ ఏ లం గూడిన చ జ లు తాలవ్యంబులు అని బాల వ్యాకరణంల జెప్పినట్టుగ తెలంగాణల అచ్చ తెలుగు వాడుక ఉన్నది. అందుకే తెలంగాణలశిలుక, శీమ, శెల్క, శేను అంటరు. ఇది తప్పుగాదు)
- బూర్ల వేంకటేశ్వర్లు, 94915 98040

871
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles