తెలంగాణ అస్తిత్వ ప్రతీక కాళోజీ కవిత


Sun,September 2, 2018 11:40 PM

kaloji
అన్నపురాసులు ఒక చోట - ఆకలి మంటలు ఒక చోట
హంస తూలికలొకచోట - అలసిన దేహాలొకచోట
సంపదలన్నీ ఒక చోట - గంపెడు బలగం బొకచోట..!
అంటూ సమాజంలోని అసమానతలను చూసి ఆవేదనతో కవితారచన చేసిన నికార్సయిన ప్రజాకవి కాళోజీ. ఆయన ఆధునిక తరం వేమన. ఆయన కవిత్వంలో సమకాలీన స్పందనాత్మకత ఒక పార్శ్వమైతే తెలంగాణ అస్తిత్వ ప్రతీకాత్మకత మరొక కోణం. తొలిదశ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం నినదించిన కవులలో కాళోజీ స్వరం అత్యంత విలక్షణం.
మాతృదేశాన్నీ మాతృభాషను అమితంగా అభిమానించిన కాళోజీ నాటి నిజాం రాష్ట్రంలోని కొందరు తెలుగు భాష పట్ల చూపిస్తు న్న నిరాదరణకు స్పందిస్తూ..
ఏ భాషరా నీది ఏమి వేషమురా
ఈ భాష ఈ వేషమెవరికోసమురా
ఆంగ్లమందున మాటలాడగలుగగనే
ఇంతగా కుల్కెదవు ఎందుకోమురా?
అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు
సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా.. అంటూ స్వభాషాభిమానాన్ని తట్టిలేపారు.
1943 సంవత్సరం వరంగల్‌లోని శబ్దానుశాస న గ్రంథాలయ వార్షికోత్సవాల సందర్భంగా జరిగిన కవిసమ్మేళనానికి రాయప్రోలు అధ్యక్షులు. తెలంగాణ ప్రజల పోరాటానికి సంఘీభావం ప్రకటించని ఆనాటి ఓయూ తెలుగు శాఖాధిపతి రాయప్రోలు సుబ్బారావును అధిక్షేపిస్తూ నాటి కవి సమ్మేళనంలో కాళోజీ కవిత చదువుతూ..
లేమావిచిగురులను లెస్సగా మేసేవు
ఋతురాజువచ్చెనని అతి సంభ్రమముతోడ
మావి కొమ్మల మీద మైమరచి పాడేవు
తిన్నతిండెవ్వారిదే కోకిలా! - పాడు పాటెవ్వారిదే?
అని సూటిగా నిలదీశారు కాళోజీ. ఊరు పేరు లేని పిచ్చుకను దయదలచి చేరదీస్తే మావిగున్నల మాట మాటవరుసకైనా తలవని కృతఘ్నతను ప్రశ్నించారు.

1944లో వరంగల్‌లో ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రథమ వార్షికోత్సవం జరిగింది. రజాకారులు ఈ ఉత్సవాలను భగ్నం చేయాలని వరంగల్ కోటలోని ఏర్పాట్లనన్నిటిని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఖుషీ మహల్‌లో కవి సమ్మేళనం జరపడానికి అప్ప టి పురావస్తు శాఖ వారు అనుమతి నిరాకరించడం వలన కాలి కూలిన పందిళ్ళలోనే కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. దీనికి ముసిపట్ల పట్టాభిరామారావు అధ్యక్షత వహిం చగా సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి, గార్లపాటి రాఘవరెడ్డి మొదలైన ప్రముఖులు హాజరయ్యారు. దాదాపు అరవై మంది కవులు కావ్యగానం చేశారు. అందులో కాళోజీ
మాసిపోయిన రాజశాసనము జూపి
పురుగుపట్టిన తాటి పొత్తముల జూపి
తుప్పు పట్టిన కత్తి తునకలను జూపి
పూర్వ గాథలు జెప్పి పొంగేటి మనస్తత్వాలను విమర్శించారు. ప్రస్తుత దీనస్థితి పోయేందుకు ప్రజా ప్రతిఘటన అవసరమని ప్రబోధించారు.
1946 వరంగల్ కోటలో జరుపతలపెట్టిన పతా కావిష్కరణ ఉత్సవాన్ని భగ్నం చేయడానికి రజాకారులు బీభత్సం సృష్టించారు. వారి అరాచకాన్ని ఎదిరించి వీరోచి తంగా పోరాడిన మొగలయ్యను దారు ణంగా హతమార్చారు. తరువాత కొద్ది రోజుల్లోనే డాక్టర్ నారాయణరెడ్డి అనే వైద్యుడిని కూడా పాశవికంగా హత్య చేశారు. ఈ అమానుష చర్యలను నిరసించిన కాళోజీ..
రక్షణకు ఏర్పట్ట బలగము -రక్కసుల పక్షంబు జేరిన
రాక్షసుల ఇష్టానుసారం రాజ్యమును నడిపించినట్లే అం టూ నాటి దుష్టపాలనపై ప్రజాగ్రహాన్ని ప్రకటించారు.

కాళోజీ ధర్మాగ్రహంపై నిజాం ప్రభుత్వం కన్నెర్ర జేసింది. 1947లో మూడు నెలల పాటు ఆయనపై వరంగల్ నగర బహిష్కార శిక్ష విధించింది. శిక్షా కాలం పూర్తయిన తర్వాత ప్రజాకవి కాళోజీ వరంగ ల్‌కు తిరిగి వచ్చి..
నిందమోపిన వాడె నిందితుడు కాగా
మావూరికే మేము మరలివచ్చితిమి.. అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
కాళోజీ ఈ కవిత సుప్రసిద్ధం. ఇది ఆయన కవిత్వా నికి పర్యాయపద్యంగా పేర్కొనదగినది.
నల్లగొండలో నాజీ వృత్తుల - నగ్న నృత్యమింకెన్నాళ్లు?
పోలీసు అండను దౌర్జన్యాలు - పోషణ బొందే దెన్నాళ్లు?
దమన నీతితో దౌర్జన్యాలకు - దాగిలిమూతలు ఎన్నాళ్లు?
కంచెయె చేనును మేయుచుండగా - కాంచకుండుటింకెన్నాళ్లు?
దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుని - దొరలై వెలిగే దెన్నాళ్లు? అంటూనే ప్రతి ఘటన చేసేందుకు సమయం ఆసన్నమైందన్నారు కాళోజీ. 1946లో నిజాం ప్రభు త్వం కమ్యూనిస్టు పార్టిని నిషేధించినపుడు..
ప్రజాసంస్థపై పగ సాధించిన ఫలితము తప్పక బయటపడున్
నిక్కుచునీలిగే నిరంకుశత్వం నిలువలేక నేలను కూలున్ అని ప్రజాతీర్పును క్రాంతదర్శిగా ప్రకటించారు. నిజాం సైనికులు, రజాకారులు కలిసి జనగామ తాలూ కాలోని మాచిరెడ్డి పల్లె, ఆకునూరు గ్రామాలపైబడి స్త్రీలపై అత్యాచారాలు జరిపారు.

ఈ దుశ్చర్యను నిరసించిన కాళోజీ..
బాధ్యతలేని ప్రభుత్వ భటులు - పెట్టే బాధలు చాలింక
బాధ్యత గల పరిపాలనలేక - బ్రతికిన బ్రతుకులు చాలింక
హద్దుమీరి అధికార వర్గము - ఆడిన ఆటలు చాలింక
రాజు పేరిట ఆరాజకమునకు - జరిగిన పూజలు చాలింక
రక్కసి తనముకు పిశాచవృత్తికి - దొరిగిన రక్షణ చాలింక
మాచిరెడ్డిలో ఆకునూరులో - దోచిన మానము చాలింక
రక్షణకై ఏర్పడ్డ బలగమే - చేసే భక్షణ చాలింక.. అంటూ దుర్మార్గాలకు చరమగీతం పాడే సమయం అసన్నమయిందని, అధికార వర్గం ఆటలు ఇక సాగడానికి వీలులేదనీ హెచ్చరించారు.
రజాకార్ల హత్యకాండకు పరాకాష్ఠ జనగామ తాలూకాలో బైరాన్ పల్లి గ్రామ ప్రజలపై జరిగిన మూకుమ్మడి దాడి. స్త్రీలపై అత్యాచారాలు, పురుషులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం వంటి ఘటనలతో సంస్థానమంతా అట్టుడికిపోయింది. గుల్బర్గా జైలులో నిర్బంధంలో ఉన్న కాళోజీ ఈ వార్తలను చదివి ఆగ్రహోదగ్రుల య్యారు.
మనకొంపలార్చిన మన స్త్రీల చెరచిన
మన పిల్లలను చంపి మనల బంధించిన
మానవాధములను మండలాధీశులను
మరచి పోకుండగా గురుతుంచుకోవాలె
కసి ఆరిపోకుండ బుసకొట్టు చుండాలె
కాలంబు రాగానే కాటేసి తీరాలె.. అనే గీతాన్ని రచించాడు. అహింస, దయ, క్షమ అన్న మాటలను కట్టిపెట్టి చాణుక్య నీతిని ఆచరించాలని ఉద్బోధించాడు కాళోజీ.
సాగిపోవుటే బ్రతుకు - ఆగిపోవుటే చావు
సాగిపోదలచిన ఆగరాదిచటెపుడు
బ్రతుకు పోరాటం పడకు ఆరాటం అని ప్రజాశ్రేణులకు ప్రబోధ గీతాన్ని అందించాడు కాళోజీ.

ఆ మహామనిషితో కలిసి సభలు, సమావేశాల్లో పాల్గొనడం ఆయన ఉపన్యాస ధోరణిని మంత్రముగ్ధులమై వినడం ఆయన ధిక్కారస్వరంతో ప్రేరణ పొందడం ఆయన బ్రతికిన కాలంలో బ్రతకడం ఒక మధురమైన స్మృతి.
మాటలను కత్తులుగా, కొడవళ్లుగా మలచిన వారు, పాటలను ఈటెలుగా ప్రయో గించినవారు, హక్కుల కోసం పోరాడుతున్న ప్రజలకు పెద్ద దిక్కుగా నిలిచి నవారు పరిపూర్ణ మానవుడు ప్రజాకవి కాళోజీ.
అతిథివోలె ఉండి ఉండి - అవని విడిచి వెళ్లుతాను
పల్లె పట్టణంబులనక - పల్లేరై తిరిగినాను
కంటకాల మధ్య నేను - కాలినడక నడిచినాను
ఈగవోలె దోమవోలె - వాగుచు తిరుగాడినాను
అతిథివోలె ఉండి ఉండి - అవని విడిచి వెళ్లుతాను అన్న తెలుగు ప్రజల హృద యం, నిత్య చైతన్య దీప్తి కాళోజీ.సుప్రసిద్ధ తెలంగాణా అగ్రశ్రేణి కవి నందిని సిధారెడ్డి పేర్కొన్నట్లు కాలాన్నీ, లోకాన్నీ, జీవితాన్నీ మధించిన ప్రజాకవి కాళోజీ జీవితం, వ్యక్తిత్వం, సాహిత్యం నేటితరానికీ, రేపటి తరానికీ స్ఫూర్తిదాయకం.
- డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ, 96180 32390
(సెప్టెంబర్ 9న కాళోజీ జయంతి)

1560
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles