సాహితీ శిఖరం సురవరం


Sun,September 2, 2018 11:39 PM

ప్రతిభావంతులైన యువ రచయితలకు సరైన సలహాలు ఇవ్వడం ద్వారా వారి సాహిత్య జీవితాలను తీర్చిదిద్దిన దూరదర్శి సురవరం. ప్రభుత్వంలో మంచి ఉద్యోగం వచ్చినా, రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం వచ్చినా వాటిని తిరస్కరించి సాహిత్య పరిశోధనా రంగాల్లోనే కృషి చేయాలని బిరుదురాజు రామరాజుకు సలహా ఇచ్చారు. ఫలితంగా వారు దక్షిణ భారతదేశంలోని తొలి మహా జానపద పరిశోధకుడై, విశ్వవిద్యాలయ ఆచార్యులైనారు.
prathapa-reddy
సురవరం ప్రతాపరెడ్డి (1896-1953)కి ముందు ఆధునిక స్వభావంతో ఒకటి రెండు రచనలు చేసిన తెలంగాణ రచయితలు ఉండి ఉండవ చ్చు. కానీ పరిశోధన సృజన రంగాల్లో అనేక ఆధునిక గ్రంథాలను రచించిన రచయిత మాత్రం సురవరం ప్రతాపరెడ్డి మాత్రమే.ఈ ప్రతిభాశాలి అకాలమరణం సందర్భంగా 1954 లో స్రవంతి పత్రిక ఒక స్మారక సంచికను ప్రచురించింది. దాన్ని ఇప్పుడు డాక్టర్ గంటా జలంధర్‌రెడ్డి, జెట్టి శంకర్‌లు పూనుకొని తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి పక్షాన పునర్ముద్రించటం ముదావహం.
ఈ స్మృతి వ్యాసాలను రాసినవారంతా ప్రతాపరెడ్డితో ప్రత్యక్ష పరిచయం కలిగినవారు. ఆయన వ్యక్తిత్వంలోని బహు ళ కోణాలను, ఆయన జీవ లక్షమైన ఆధునికతను బాగా అర్థం చేసుకున్నవారు ప్రముఖ చరిత్రకారులు, పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖర శర్మ తమ వ్యాసంలో.. వారి పుస్తకములు ప్రజాభ్యుదయమునెడల ఆయనకు గల ఆకాంక్షను, ప్రజలను అజ్ఞానంధకారమునుంచి మేల్కొలుపవలెననే ఆయన ఆవేదను తెలుపగలవు అంటున్నారు. ప్రతాపరెడ్డిని మహా పరిశోధకుడిగా గుర్తిస్తూ, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, రామాయణ విశేషములు అన్న వారి గ్రంథాలు కూలంకషమైన చరిత్ర పరిశోధనా దక్షతకు నిదర్శనంగా పేర్కొంటున్నారు.

చరిత్ర సంస్కృతి సాహిత్యరంగాల్లో విశేష కృషిచేసిన ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం మహాకవి జాన్ మిల్టన్‌ను ఉద్దేశిం చి నీవొక సముజ్జల తారవై సాహిత్యాకాశంలో వెలుగుతున్నారు అని వర్డ్స్‌వర్త్ అన్నాడనీ, ఆ మాటలే సురవరం వారికి వర్తిస్తాయని అంటున్నారు. ఆంధ్రుల సాంఘిక చరిత్రను రచించటానికి ఎవరికైనా శిలా తామ్ర శాసనాలు, ప్రాచీన నాణాలు, అప్పటి కట్టడాలు, చరిత్ర, భాషా సాహిత్యాలు వంటి అనేక రంగాల్లో పరిజ్ఞానం అవసరమంటూ సురవరం వారిలో ఇవన్నీ పుష్కలంగా వుండటం మూలంగానే విజ్ఞాన సర్వస్వ స్వభావం వున్న ఆగ్రంథాన్ని రచించగలిగారని అభిప్రాయ పడ్డారు. సాధారణ విమర్శకుల దృష్టిలో గొప్ప ప్రబంధాలుగా లెక్కకువచ్చే మన వసు చరిత్రాది గ్రంథాల్లో ప్రజా జీవిత చిత్రణ కొరవడటం వల్ల అవి రెండవశ్రేణి రచనలని, బసవపురాణము, సింహాసన ద్వాత్రింశిక, హంసవింశతి-వంటి కావ్యాలలో ప్రజా జీవిత చిత్రణ వుండటం వల్ల అవి ప్రతాపరెడ్డి దృష్టిలో ఉత్తమ కావ్యాలయ్యాయన్నారు.
పోతన జీవితం ఆధారంగా హాలికుడు అన్న గొప్ప నాటకాన్ని రచించిన చెలమచెర్ల రంగాచార్యులు-ప్రతాపరెడ్డిని ఒక వ్యక్తికాదు సంస్థ అని సాధారణంగా అంటుంటారని నిజానికి వారు అనేక సంస్థలకు మూలరూపము అంటున్నారు. విజ్ఞానవర్ధిని పరిషత్తు, సారస్వత పరిషత్తు, ఆయుర్వేద పరిషత్తు, ఆంధ్ర మహాసభ, గ్రంథాలయ ఉద్యమం, ఉస్మానియా విశ్వవిద్యాలయం వంటి సంస్థల్లో, ఉద్యమాల్లో వారికి సన్నిహిత సంబంధం వుంది. ఇందుకు ప్రతాపరెడ్డిలోని ప్రజాదృష్టే కార ణం.

మన మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రతాపరెడ్డినిఅన్నగారు అని సంబోధిస్తూ, తమకంటే ముం దే వకాలతు వృత్తిని చేపట్టినా తిమ్మిని బమ్మిని చేసే తతం లేకపోవటం వల్ల వృత్తిలో కొనసాగలేదు. కానీ-న్యాయానికి, ధర్మానికి కట్టుబడి నిష్కళంక జీవితం గడిపారంటున్నారు. ప్రతిభావంతులైన యువ రచయితలకు సరైన సలహాలు ఇవ్వడం ద్వారా వారి సాహిత్య జీవితాలను తీర్చిదిద్దిన దూరదర్శి సురవరం. ప్రభుత్వంలో మంచి ఉద్యోగం వచ్చినా, రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం వచ్చినా వాటిని తిరస్కరించి సాహిత్య పరిశోధనా రంగాల్లోనే కృషి చేయాలని బిరుదురాజు రామరాజుకు సలహా ఇచ్చారు. ఫలితంగా వారు దక్షిణ భారతదేశంలోని తొలి మహా జానపద పరిశోధకుడై, విశ్వవిద్యాల య ఆచార్యులైనారు. అట్లే.. పద్యకావ్యాలు రాస్తున్న సామల సదాశివతో ఉర్దూ ఫారసీ సాహిత్యాలను తెలుగువారికి పరిచయం చేయమని సూచించారు. దీంతో సాహిత్య సంగీత రంగాల్లో ఇతరులెవరూ చేయని కృషిని చేసి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు సదాశివ. ఆంధ్రుల సాంఘిక చరిత్రలో దొరలిన పొరపాట్లను రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ ఒక లేఖ ద్వారా ఎత్తిచూపగా, వాటన్నింటిని సవరించుకోవటమే గాక, రెండవ ముద్రణ అనుబంధంలో ఆ లేఖ ను కూడా ప్రచురించారు. అట్లే, రామరాజు రచించిన తెలుగు వీరుడు రచనలో వరంగల్ ప్రాంతపు మాండలికాలను చది వి, తామది వరకు వాటిని వినలేదంటూ అర్థాలు అడిగి తెలుసుకోవటమే కాదు, నిఘంటువులకెక్కని పదములు అన్న తమ జాబితాలో రాసుకున్నారు.

అస్త్యుత్తరస్యాం దివి దేవతాత్మా.. అన్న కుమార సంభవ ప్రారంభ శ్లోకంలో కాళిదాసు హిమాలయాన్ని దేవతల ఆత్మగా, పృథ్వికి మానదండంగా వర్ణించాడు. దాశరథి తాను రాసిన స్మృతి కవితలో..
అతడు నీహారాచల/మంత ఎత్తువాడు
ఈనాడే బ్రహ్మాండము/లోన కానరాడు..
అని ప్రతాపరెడ్డిని అభివర్ణించాడు. అవును గొప్పవాళ్ళ విషయంలో అతిశయోక్తి కూడా స్వభావోక్తిగా మారుతుంది. తెలంగాణకు సంబంధించినంత వరకు సాహిత్య పరిశోధన, సృజన, పత్రికా రంగాల్లో సురవరం ఒక ఉత్తుంగ హిమ శిఖరమే!
- అమ్మంగి వేణుగోపాల్, 94410 54637

1207
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles