చారిత్రక అంశాల గని కాలనాళిక


Mon,August 27, 2018 04:52 AM

కవియైన చంద్రమౌళి ఈ రచనలో ఉద్యమాలను ప్రత్యక్షీకరించడంలో తనకు సహజమైన కవిత్వ వాసనలను పరిమితం చేసుకున్నట్లుగా కనిపిస్తున్నది. దీనిలోని 65 అధ్యాయాలుకూడా ఒక శిఖర వాక్యాన్ని తలమీద పెట్టుకుని మోస్తున్నాయి. ఈ నవల రామాయణంవలె ఏకసూత్ర నిర్మాణం కాకుండా మహాభారతంవలె శిథిల బంధంగానే ఉన్నది.

రామా చంద్రమౌళి వర్తమాన సాహిత్యరంగంలో పేరెన్నికగన్న కవి,కథకులు, నవలా రచయిత. వీటన్నిటిని మించి సాహిత్యాన్నిఅనుభవంలోకి తెచ్చు కోగలిగిన సహృదయులు. ఈ చివరి లక్షణం ఇటీవలికాలంలో అనేక కారణాలవల్ల వాదాల భేదాలలో తనకుతాను ఏర్పర్చుకున్న అడ్డుగోడలవల్ల ఈనాటి రచయితలలో అరుదుగానే కానవస్తున్నది. భాష విషయంలో రెండుతరాలకు ముందున్న రచయితలకున్నంత నిర్దిష్టమైన శబ్ద పరిజ్ఞానం నేటి రచయితలకు లోపించినట్టుగా కనిపిస్తున్నది. రచయితలు తమ ఆవేశాలను ఆపుకోలేక దూషించే సందర్భంలో వ్యవహారికంగా వాడే అశ్లీలాలనుకూడా యథేచ్ఛగా ప్రయోగిస్తున్నారు. అనౌచిత్యాన్ని క్షేమేంద్రుడు రసభంగానికి కారణమని పేర్కొన్నాడు. ఔచిత్య విచారం ఉండే నిశ్చయాలు కాలాన్ని బట్టి మారిపోతాయేమో నాకు తెలియదు. కవిగా, కథకుడుగా తన ముద్రను వర్తమానంలో నిలబెట్టుకున్న చంద్రమౌళి ఇటీవల ప్రకటించిన నవలసూర్యుని నీడ విశిష్టమైన రచన. నిజాం పాలనాకాలం లో జరిగిన దురంతాలలో బైరాంపల్లిలో 118మందిని హింసిం చి, అవమానించి సామూహికంగా హత్య చేసిన సన్నివేశాలను కళ్ళకు కట్టినట్టుగా చిత్రించారు. ఈఘటన జలియన్ వాలాబా గ్ దురంతంతో పోల్చదగినది. దానికంటే హీనమైంది కూడా. వాస్తవమైన సన్నివేశాన్ని ఒక చలనచిత్రం వలె ప్రదర్శించగల నేర్పు రామా చంద్రమౌళికి కలదనడానికి ఇది తార్కాణం.

కొన్ని నెలల క్రితం అచ్చులోకి వచ్చిన చంద్రమౌళి రచన కాలనాళికఅనే మాట తడబడి పలికితే కాళినాలుక ఔతుం ది. ఎమర్జెన్సీ రోజుల్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చరిత్రను తనకు, తన వంశానికి, తన పార్టీకి అనుకూలంగా నిర్మించి భావి తరాలకోసం భూమిలో ఒక రాగి నాళికను పాతిపెట్టిన సన్నివేశం మనకు గుర్తుకు వస్తుంది. దాని పేరుకూడా కాలనాళికే ( time capsule). అప్పుడు చరిత్ర ఒక వ్యక్తికోసం పరివర్తింపచేయబడి కథనమంతా అపమార్గంలో నడిచిందని విన్నాం. ఇప్పుడు ఈ కాలనాళిక వరంగల్లు చరిత్రను 1920 నాటి నుంచి 2014దాకా జరిగిన సన్నివేశాల్ని తానే ఒక నగర మై, తానే అన్ని ఉద్యమాలై, ఆ నగరం కేంద్రంగా తానే మొత్తం తెలంగాణమై రచించిన సుదీర్ఘకాల సంభావనం.

ఈ నవల తెలుగులో ఇంతకు ముందు వచ్చిన బృహత్ నవలలకంటే భిన్నమార్గంలో నడిచింది. దీనిలో చరిత్ర ఉంది, కొంత కథా ఉంది. జీవితం ఉంది, భావుకతతో కూడిన కథనం ఉన్నది. నవల అంతా వరంగల్లు ఆనాటి బస్తీలోని గిర్మాజిపేట కేంద్రంగా సాగిపోయింది. గిర్మాజిపేటలో గోవిందరాజుల గుట్ట ఉన్నది. తిరుపతిలోని గోవిందరాజస్వామి గుట్టమీద కూడా గోవిందరాజస్వామి నెలకొని ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూంటా డు. ఈ స్వామి ఈ నవలలో తానే కేంద్రబిందువై కథాభారాన్ని మొత్తం మోసినట్టుగా కానవస్తుంది. ఆ కేంద్రబిందువు పేరు రాజగోవిందు. భౌతికంగా,కాల్పనికంగా, ఆధ్యాత్మికంగా ప్రాధా న్యం వహించిన గోవిందరాజస్వామి వేంకటేశ్వరస్వామి కానుకలను కొలిచినట్టుగానే రాజగోవిందు పాత్రకూడా ఎప్పటికప్పుడు ప్రవహిస్తూ వస్తున్న కాలాన్ని ఉద్యమాలను, కొలుస్తూ వాటిలో అన్వయిస్తూ జీవితాన్ని నడిపిస్తా డు. మొత్తం నవలా కథనమంతా రాజగోవిందు విస్తరించి కుటుంబమై, నగరమై, తెలంగాణమై వ్యాపించినట్టు కనిపిస్తుంది. ఆత్మకథాత్మక లక్ష ణం ఈ నవలలో ప్రస్ఫుటంగా వ్యక్తమౌతుంది. ఈ పాత్ర రచయితకు పితృస్థానంలో ఉంటుంది.

నవల కథాసూత్రమం తా ఆనాళ్ళలో ఏర్పడ్డ ఆజంజాహి మిల్లు కార్మికులజీవన చిత్రణతో ప్రారం భమౌతుంది. తెలంగాణలో ఏర్పడ్డ తొలి పెద్ద వస్త్ర పరిశ్రమ అది. దాని ఉత్పత్తులు దేశంలో, విదేశాలలో కూడా ఆదరణ పొం దినవి. ఇంత కథ మిల్లునుంచి రైల్వే గూడ్స్ ప్లాట్ ఫాంకు చేరడంతో ఒక మెరుపు మెరిసినట్టయింది. ఎవరో తొందరపాటులో తోస్తే అనుకోకుండా రాజగోవిందు గాంధీజీ ఎదుట నిలబడ్డాడు. గాంధీ ఆరోజుల్లో ప్రజల దృష్టిలో దిగివచ్చిన దేవుడే. ఆయన దర్శనాన్ని జీవన సాఫల్యంగా జనులు భావించారు. ఈ శుభారంభంతో నవల ప్రారంభమై తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన 2014 జూన్ 2 నాటి సంఘటనను చిత్రించడంతో పూర్తయి ఏక సూత్రతను సంతరించుకున్నది.

ఐతే, ఈ నవలానుగతిలో మొట్టమొదటి సన్నివేశం భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా హైదరాబాద్ సంస్థానం స్వతం త్రం కాకపోవడం, అది అదనుగా తీసుకుని తెలంగాణ ప్రాం తంలో నిజాం సంస్థానాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటన చేసే ప్రయత్నం చేశాడు. అనల్ మాలిక్ అంటే సంస్థానంలో ప్రతి ముస్లిమూ ఒక రాజే అన్న సిద్ధాంతం. ఈ భావాన్ని ఆధారం చేసుకుని అల్ప సంఖ్యాకంగా ఉన్న ముస్లిం జనాభాను పెంచే ప్రయత్నంలో భాగంగా బహద్దూర్ యార్ జంగ్ నేతృత్వంలో, ప్రభుత్వ సహకారంతో మతమార్పిడి గిర్మాజిపేట్‌లోని చార్ బౌలీ దాదా లక్డీపహిల్వాన్‌అని పిలువబడే ఖాసిం షరీఫ్ నాయ కత్వంలో ఉధృతంగా జరుగుతోంది. సామాన్య ప్రజలమీద రజాకార్ల దౌర్జన్యాలు పెరిగాయి. మత స్వేచ్ఛ లేదు. ప్రజల భాష రోజు రోజుకూ అణగదొక్కబడ్తూ వచ్చింది. పేద వర్గాల , దళితుల, గిరిజనుల మతం మార్పించే ప్రయత్నం జోరుగా జరిగింది. ఈ సందర్భంలో భారత స్వాతంత్య్ర సంఘటనను సత్యంగా భావించలేని కమ్యూనిస్ట్‌లు చీనాలో జరిగినట్టుగానే తెలంగాణాలో తమ రాజ్యం నెలకొల్పి అది కేంద్రంగా మొత్తం భారతదేశాన్ని అరుణపతాకాంకితం చేయాలని చూశారు.

ఆ సందర్భంలోనేతెలంగాణాలోని భూస్వాములమీద అందరికంటే పెద్ద భూస్వామి ఐన నిజాం మీద తిరుగుబాటు చేశారు. ఈ లక్ష్యం చేరడం అసాధ్యమైంది. పోలీస్‌చర్యతో తెలంగాణ విముక్తమైనపుడు వాస్తవాన్ని అర్థం చేసుకోలేని కమ్యూనిస్ట్‌లు బొక్కబోర్లా పడ్డారు. ప్రజలు స్వాతంత్య్రమంటే భారతదేశం మొత్తానికి విముక్తిగా భావించారు. ఈ సందర్భంలో ఈ రచయిత రజాకార్లనెదుర్కొన్న వీరి సాహసాలను పేర్కొన్నట్టుగా ఆర్యసమాజం, కాంగ్రెస్ పార్టీలు చేసిన సాహస ఉద్యమాలను పేర్కొనలేదు. వరంగల్లు నగరంలో 1948లో పతాకావిష్కరణ సందర్భంగా జరిగిన మొగిలయ్య హత్యను మాత్రం అద్భుతం గా చిత్రించారు. మరొక అద్భుతమైన కథనం విస్నూరు రామచంద్రారెడ్ది కొడుకు బాబుదొరను ప్రజలు సమూహంగా ఏర్పడి అతని దుర్మార్గాలను భరించలేని దశలో జనగాం రైల్వే స్టేషన్ లో చంపివేసిన సన్నివేశం.

కాలనాళికలో మొదటినుంచి చివరిదాకా ఈ ప్రాంతంలో సాగిన ఉద్యమాలు విపులంగా చాలా సందర్భాలలో, సూచనమాత్రంగా మరికొన్ని సందర్భాలలో చిత్రించడం జరిగింది. అట్లాగే ప్రత్యేక తెలంగాణ తొలి దశ ఉద్యమం విశదంగానే రచయిత రికార్డ్ చేశారు. తర్వాత విపులమైన స్థానం ఆక్రమించింది నక్సలైట్ల ఉద్యమం. దీని విభిన్న దశలను రచయిత కళ్ళకు కట్టినట్టుగా చూపించారు.ఇది ఇలా సాగుతూండగా దేశంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను స్వయంచోదక శక్తితో ప్రజలు నిర్వహించిన సందర్భంలో రాజగోవిందు, రాజ్యలక్ష్మి ఒక టెక్స్ టైల్ మిల్లును ప్రారంభించడం, క్రమంగా కథతోపాటు అది వృద్ధి పొందుతూ కోట్ల రూపాయల వ్యాపారంగా మారి కార్మిక జన భాగస్వామ్యంలో లాభాల పంపకంతో పెరిగిన తీరు ఉత్సాహపూరితంగా చిత్రించడం జరిగింది. ఇలాగే రాజగోవిందు కుమారుడు ఇంజనీరింగ్ పట్టా తీసుకుని నాగార్జున సాగర్ నిర్మాణంలో భాగం పంచుకోవడం ఒక అద్భుతమైన స్వప్నసాక్షాత్కారం. తర్వాత కాశీ విశ్వవిద్యాలయంలో వ్యోమశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించి శ్రీహరికోటలో చంద్రిక వ్యోమ నౌకల ప్రయోగాలను నిర్వహించిన సన్నివేశం, కథనం రచయిత దేశభక్తి భావనకు కిరీటం పెడుతున్నది. ఇక రాజగోవిందు పెద్ద కూతురు పుష్ప ఐఎఎస్ స్థాయిని సంపాదించి దేశోపకారకమైన సేవలు చేయడం, పదవీ విరమణ చేసి కేసీఆర్ కు ఆంతరంగిక సలహాదారుగా పరిణమించడం క్రియా సిద్ధిః సత్వే భవతి అన్న మాటకు ఉదాహరణగా నిలుస్తుంది.

ఈ నవలలో అనేక సందర్భాలలో శుష్కమైన , సాధారణమైన, నీరసమైన సన్నివేశాలను రచయిత తన కాల్పనిక శక్తితో ఆకర్షకంగా చిత్రించాడు. ఈ నవలంతా రాజకీయ ఉద్యమాల కీకారణ్యంలో పడి కొన్ని వెలుగులతో, కొన్ని నీడలతో రచింపబడింది.
అప్పటి సాంస్కృతికమైన ఇతర ముఖ్యాంశాలు గ్రంథాలయ, సాహిత్య వికాసం వంటి విషయాలు అంతగా వెలుగులోకి రాలే దు. ఇటువంటివే మరికొన్ని అంశాలు.. మన చరిత్రలో ముఖ్యమైన మలుపులు., స్వాతంత్య్రం రాగానే దేశంలో అంతకు ముందున్న త్యాగశీలం తొలగిపోయింది. భోగశీలం ఆ స్థానాన్ని ఆక్రమించింది. కవియైన చంద్రమౌళి ఈ రచనలో ఉద్యమాలను ప్రత్యక్షీకరించడంలో తనకు సహజమైన కవిత్వ వాసనలను పరిమితం చేసుకున్నట్లుగా కనిపిస్తున్నది. దీనిలోని 65 అధ్యాయాలుకూడా ఒక శిఖర వాక్యాన్ని తలమీద పెట్టుకుని మోస్తున్నాయి. ఈ నవల రామాయణంవలె ఏకసూత్ర నిర్మాణం కాకుండా మహాభారతంవలె శిథిల బంధంగానే ఉన్నది. ఈ ప్రయోగశీలమైన నవలను రచించినందుకు అభినందిస్తున్నాను.
- ప్రొఫెసర్ కోవెల సుప్రసన్నాచార్య
90526 29093

482
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles