గుగి వా థియోంగో - మనం


Mon,August 27, 2018 04:51 AM

కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. కాలక్రమంలో జరుగుతాయి.గుగి వా థియాంగో మొదటి నవ ల వీప్ నాట్ చైల్డ్ ఏడవకు బిడ్డా తెలుగు అనువాదం ఎ.ఎం.అయోధ్యారెడ్డి. ఇప్పుడు చదువుతుంటే చాలా ఆశ్చర్యం, ఆనందం, సంభ్రమం కలిగాయి. 1983,84 ప్రాం తాల్లో ప్రపంచ కవిత్వాన్ని ఆవురావురామంటూ ఆబగా చదువుతున్న రోజుల్లో ఆఫ్రికన్ కవిత్వంతో తొలి పరిచయం. ఆబిడ్స్‌లో అన్నపూర్ణ హోటల్ దగ్గరున్న సి.ఎల్.ఎస్. బుక్‌షాప్‌లో తొలిసారి ఆఫ్రికన్ కవిత్వం దొరికిందంతా కొన్నా. కవిత్వం మొత్తం కొన్నా, నవల కొన్నా అదే వీప్ నాట్ చైల్డ్. ఆబగా రెండు సార్లు చదివి థ్రిల్ అయ్యా. అది మన గురించి, అప్పుడు తెలంగాణలో జరుగుతున్న భూపోరాటాల గురించి వామపక్ష పోరాటాల గురించి రాసినట్టుగానే ఉంది. అప్పటికి గుగి ఎవ రో నాకు తెలియదు. ఎంత ఆనందపడ్డానంటే దీన్ని తెలుగులోకి అనువదిస్తే బాగుంటుంది అన్పించి మిత్రుడు కథకుడు అయోధ్యారెడ్డిని ప్రోత్సహించి అనువాదం చేయవయ్యా అని చెప్పిన. ఆయన చదివి, ఆనందపడి శ్రద్ధగా అనువాదం చేశా డు. మళ్ళీ ఇన్నాళ్లకు ఆ అనువాదానికి విముక్తి కలిగింది. ఈ నవల అనువాదం పుస్తక రూపం ధరించింది మలుపు ప్రచురణ కర్త బాల్‌రెడ్డి పుణ్యమా అంటూ.

ఈలోగా గుగి తెలుగు పాఠకులకు బాగా పరిచయమయ్యాడు. అతని మూడు నవలలు ది రివర్ బిట్వీన్, ఎ గ్రైన్ ఆఫ్ వీట్ పెటల్స్ ఆప్ బ్లడ్, ప్రిజన్ డైయిరీ తెలుగులో అనువదించబడ్డాయి. గుగిని మన రచయితగా స్వీకరించాం.
గుగివిద్యార్థిగా ఉన్నప్పుడే రాసిన సెమి ఆటోబయోగ్రఫికల్ ఆత్మ కధాత్మక నవల ఇది. విద్య ద్వారానే జాతి, దేశ విముక్తి అని నమ్మిన రోజుల్లో రాసిన నవల. ఒకానొక నిర్దిష్ట ప్రాంతంలో, కాలంలో జరిగిన మానవ సమూహాల అనుభ వం సాహిత్యమై తర్వాతి తరాల వాళ్ళకు ఎన్నో ఏళ్ళు గడిచిన తర్వాత కూడా అనువర్తితతమౌతుంది. అనుభవయోగ్యమౌతుంది. తర్వాతి తరాలు భిన్న దేశాలకు చెందిన మానవావళి. ఆ అనుభవంలో తమని తాము ఎలా చూసుకుంటారు, అనుభూతి చెందుతారు తమ గురించే రాసినట్టు ఎలా ఫీల్ అవుతారు. బహుశ మొత్తం సాహిత్యం గొప్పదనం ఇదేనేమో. ఈ అన్వయింపే, ఈ అనువర్తించుకునే గుణమే సాహిత్యం కాలాశధుల్ని దాటి బతకటానికి కారణమౌతుంది. సర్వచేతనను అది స్వీకరించి, భవిష్యత్తరాలకు అందిస్తుంది. అన్నితరాల పాఠకుల్ని అది ఆకట్టుకుని, తనలో లీనం చేసుకుని చైతన్యపరుస్తూపోతుంది.శరత్ మనవాడవటానికి, గుగి మనవాడవటానికి కారణం ఇదేనేమో.
gin

గూగీ వా థియోంగో నవల ఏడవకు బిడ్డా...ఆవిష్కరణ సభ
మలుపు ఆధ్వర్యంలో గూగీ నవల ఏడవకు బిడ్డా... ఆవిష్కరణ సభ, 2018 ఆగస్టు 27 సాయంత్రం 5.30 గంటలకు, హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రం లో జరుగుతుంది. కాత్యాయని అధ్యక్షతన జరుగు సభలో వక్తగా కె.శివారెడ్డి, పుస్తక పరిచయకర్తగా బి. అనూరాధ హాజరవుతున్నారు. ముఖ్యఅతిథి, పుస్తకావిష్కర్తగా అల్లం రాజయ్య హాజరవుతున్నారు. అందరికీ ఆహ్వానం.
-మలుపుప్రచురణ సంస్థ


ఇది గుగి తొలి నవల అన్పించదు. దీన్ని ఆయన కథాకథనం చేసిన పద్ధతి గొప్పగా ఉంది. చిన్న పిల్లవాడి జొరొగొ కోణం నుంచి కథని విప్పుకుంటూ పోతాడు. ఒక వాస్తవం కళ అయ్యే క్రమం, అత్యంత అద్భుతంగా దీన్లో ప్రతిఫలిస్తుంది. భూమికి మనుషులకు ఉన్న విడదీయరాని అనుబంధం అది తెల్లవాడయిన హావ్‌లాండ్స్ కావచ్చు, జొరొగొ తండ్రి నుగొ తొ కావచ్చు. భూమితో వాళ్ళకున్న అనుబంధాన్ని చాలా వాస్తవంగా చిత్రించాడు. నిజానికి హావ్‌లాండ్ భూములన్నీ నుగొతోవే. తన పొలంలోనే తను కూలి అయ్యాడు. ఇలా ఎంత మంది రైతులు రైతు కూలీలుగా మారారో మన చరిత్ర చెబుతుంది. ఈ నవల మన చుట్టూ సమాజానికి, మారుతున్న మానవ సంబంధాలకీ అద్దం పడుతుంది. ఒక సాయుధ ఉద్యమంలోకి ఒక కుటుంబం మొత్తం కొడుకులందరితో సహా ఎలా ఉద్యమంలోకి లాగబడతారు, సామాజిక చరిత్రలో వ్యక్తులెలా భాగస్వాములవుతారు, నిర్దేశకులవుతారు చరిత్రే. సామాజిక చరిత్ర సూత్రధారిగా ఎలా ఉంటుందీ నవల కళ్లకు కట్టినట్టు చూయిస్తుంది.

ఏదేశమైనా ఏ ప్రాంతమైనా కావచ్చు దోపిడీదారుడు, భూస్వామి తెల్లవాడు కావచ్చు, నల్లవాడు కావచ్చు. వాడి స్వభావం ఒకటేనని, క్రమంగా వాడు దోపిడీదారుడుగానే ఆగడనీ హింసాత్మకుడవుతాడని, హింస వాడి ధర్మమవుతుందని ఈ నవల చెబుతుంది. జాకబో నల్లవాడే, కానీ దోపిడీ విషయంలో హేవ్‌లాండ్స్‌కి తక్కువేమీకాదు. జాకొబో కూతురు విహాకి. విహాకి జోరొగొ మధ్య తలెత్తిన ప్రేమ దాని స్పందనలు అతి సుతారంగా వైరుధ్యాల్ని ప్రతిఫలిస్తూ అద్భుతంగా చిత్రించాడు. దోపిడీ సమాజంలో స్వచ్ఛ ప్రేమలు, అరుదనీ, అవి బతకటం కష్టమని ఈ నవల చూయిస్తుంది. భూమి సమ స్య ప్రధానమైనా వ్యక్తులు, వాళ్ళ స్వభావాలు, వాళ్ళ ప్రవర్తనలు వర్గాల ప్రతిఫలనాలే అనీ ఈ నవల చూయిస్తుంది.

గుగి రాసిన అనేక నవలలకు బీజప్రాయంలో థీమ్స్ ఈ నవలలో ధ్వనిస్తాయి. సైద్ధాంతిక భూమిక వదలకుండా గొప్ప నవల ఎలా రాయొచ్చో ఈ నవల చెబుతుంది. చుట్టూ ఉన్న జీవితాన్ని దాని నిర్దిష్ట పరిస్థితుల్లో కళగా ఎలా పరివర్తింప చేయాలో ఈ నవల నిరూపిస్తుంది. దేశమేదయితేనేమి దోపిడీ ఒకటేనని దాన్ని నిర్మూలించే ప్రజాపోరాటాలు ఒకటేననీ అవి ప్రజల నుంచి పుట్టుకొస్తాయని చెబుతుంది. ఇప్పుడీ నవల చదవటం, ఈ నెలకొన్న పరిస్థితుల్లో గొప్ప అనుభవం, గొప్ప పాఠం. 35 ఏళ్ళ కింద అనువాదం చేసినా ఇప్పుడే భారత దేశ పు పరిస్థితుల్లో అనువాదం చేసినట్టు తాజాగా ఉంది. తెలుగు పాఠకులకు ఈ నవల ఒక బహుమానం లాంటిది. మరోసారి మనలోకి మనం తొంగిచూసేట్టు చేసిన ఈ నవల ద్వారా గుగీకి, అయోధ్యారెడ్డికీ ధన్యవాదాలు. అభినందనలు.
- కె.శివారెడ్డి, 95021 67764

510
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles