మల్లెపూల పరిమళం మఖ్దూం కవిత్వం


Mon,August 20, 2018 01:36 AM

అది ఒక దయ్యాల మేడ/శిథిల సమాజాల నీడ
పీనుగులను పీక్కుతినే/అరిష్టాల మహాపీడ
ఆద్యంతం అంతులేని అరిష్టాల మేడ
ఎటుచూసినా అటు చీకటి ఎటుకన్నా శిథిలాలే
రా ఈ శిథిలాలపై స్వతంత్ర పతకాన్నెత్తు
రా ఈ శిథిలాలపై రక్తపతాకమ్ము ఎత్తు..

అంటూ నైజాం నియంతృత్వ రాచరిక శిథిలాల మేడను కూల్చేందుకు రక్తపతాకాన్నెత్తుకొని కవితా విప్లవాగ్నులు విరజిమ్మిన ఉర్దూ మహాకవి మఖ్దూం. అదే రువ్వడిలో..ఏక్ చెమేలీకే మండువే తలే- దో బదన్ ప్యార్‌కే ఆగ్‌మే జల్‌గయే..ఒక మల్లెపందిరి నీడకింద రెండు శరీరాలు ప్రేమాగ్నిలో కాలిపోతున్నాయి లాంటి మృదు మనోహరమైన అనుభూతి కవిత్వాన్ని కూడా సృష్టించాడు. అన్నార్తు లు, అనాథలు, పీడనలు లేని సమ రాజ్యంకోసం అహర్నిశలు పరితపించడమే కాకుండా కార్యాచరణకు ఉపక్రమించిన నిబద్ధత కలిగిన ఆచరణ వాది, ఉద్యమ సేనా ని, ఉద్యమ కవి మఖ్దూం. ఆయన జీవి తం అందరికీ ఆదర్శప్రాయం, కవిత్వం స్ఫూర్తిదాయకం. రెండు దశాబ్దాల కాలం కొనసాగి న మఖ్దూం జీవనం త్రిముఖ ప్రతిరూపం రాజకీయ రంగం, కార్మిక పోరాటాలు, కవిత్వ సృజన సమ్మిళితం.

తుపాకి మందుగుండు వాసన-అతడు మల్లెపూల పరిమళం
మండుతున్న జ్వాల- మంచు బిందువుల చల్లదనం
విప్లవకారుని చేతి తుపాకి- గాయకుని చేతి సితారా..
అతడు విజ్ఞానం, వివేకం, నటన, కవిత్వం, కార్యాచరణ
అన్నీ తానే. అతడే మఖ్దూం.

మఖ్దూం మోహియొద్దిన్ అసలు పేరు అబుసయీద్ మొహియోధ్దిన్ ఖాద్రీ. ప్రజలు మాత్రం ఆయనను ప్రేమగా మఖ్దూం అని పిలిచేవారు.1908 ఫిబ్రవరి 4న మెదక్ జిల్లా ఆందోల్ గ్రామంలో ఉమ్దాబేగం, గౌస్ మోహియోద్దిన్ దంపతులకు జన్మించారు. మఖ్దూం ఐదేండ్ల వయస్సులోనే తండ్రి చనిపోవడంతో పిన తండ్రి బహరుద్దీన్ పెంపకంలో పెరిగాడు. మఖ్దూం ను ఆయన పిన తండ్రి బహరుద్దీన్ భావాలు కమ్యూనిస్టుగా మార్చాయి. బహరుద్దీన్ రష్యాలో జరుగుతన్న సోషలిస్టు విప్లవ జ్వాలలను, అభ్యుదయ భావాలను ఈ వ్యవస్థలో కొందరు మాత్రమే పొందుతున్న సౌఖ్యాలను మఖ్దూంకు చెప్పేవాడు. వాటి ప్రభావం మఖ్దూం మనసుపై తీవ్రంగా పడింది. దేశంలో కూడా సోషలిజం రావాలని, ప్రజల కష్టాలు పోవాలని కలలు కన్నాడు. తన భావాలను కలం ద్వారా కవిత్వీకరించేవాడు. మనిషిని మరో మనిషి దోపిడీ చేయలేని ఆదర్శ సమాజం కోసం, మానవత్వం మూర్తీభవించిన మహోన్నత సమాజం కోసం పరితపించిన స్వాప్నికుడు. అందువల్లనే 1934 నుంచి కమ్యునిస్టులతో సంబంధాలు ఏర్పర్చుకున్నాడు.
కమ్యూనిస్టు విప్లవ నేతగా, కార్మిక నాయకుడిగా, చట్టసభల్లో ప్రతినిధిగా ఆయన నిర్వర్తించిన పాత్ర ఒక ఎతై తే, ఆయన కవిగా ప్రజా కవిత్వం రాయడం మరొక ఎత్తు.
మఖ్దూం గొప్ప నటుడు కూడా. ఆయన నాటకాల్లో జీవతముంటే కవిత్వంలో విప్లవముం ది. తన కవిత్వం ద్వారా కష్టాలు, నష్టాలు, కన్నీరు లేని రాజుల సింహాసనాలు కానరాని బీదల అరుపులు అసలే లేని సమసమాజ స్వతంత్ర భారతాన్ని కోరుకున్నాడు. స్వతంత్ర యుద్ధ నౌక పయనాన్ని జంగ్‌హైజంగ్ ఆజాదీ అనే కవితలో చూపించారు. మఖ్దూం 1934లో రాసిన కవితలు పీలా దుశ్శాల, తుర్ తుర్ అనే కవితలు కవితా ప్రపంచంలో తొలి గుర్తింపును తీసుకువచ్చాయి. రాజకీయ భావ వ్యక్తీకరణతో రాసిన బాగి (తిరుగుబాటుదారు) ప్రసిద్ధి పొందిన కవిత. ఇది ప్రఖ్యాత బెంగాల్ కవి నజ్రూల్ ఇస్లాం రచించిన బిద్రోహి లాంటి కవిత.
తెలంగాణ కవిత్వానికి మఖ్దూం యావత్ భారతావని కీర్తిని తీసుకువచ్చారు. కదులుతున్న రైతాంగ పోరాట జనసైన్యాల కవాతును దృష్యీకరించారు.
Makdhum-Portrait

అన్నార్తులు, అనాథలు, పీడనలు లేని సమ రాజ్యంకోసం అహర్నిశలు పరితపించడమే కాకుండా కార్యాచరణకు ఉపక్రమించిన నిబద్ధత కలిగిన ఆచరణ వాది, ఉద్యమ సేనాని, ఉద్యమ కవి మఖ్దూం. ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయం, కవిత్వం స్ఫూర్తిదాయకం.


హాయల్‌కె చలో ఖాయానత్ లేకే చలో
చలేతో సారేజమానేకే లేకే ఛలో..
అనే కవితలో మొత్తం ప్రపంచాన్నంతటిని వెంటతీసుకొని నడువు, నడుస్తూ విజయం సాదించు అని ప్రబోధించాడు.
అదే తరహాలో జానేవాలే సిపాహీసే పూచో,
అంధేరా, జంగ్ ఎ అజాది, సిపాయి, ఖైదీ లాంటి అనేక విప్ల వ కవితలు రాసిన మఖ్దూంకు మృదు మధురమైన కవిత్వాన్ని కూడా రాయడం తనకే చెల్లింది.
మఖ్దూం తన కవిత్వంలో ప్రజలు మాట్లాడుకునే భాషను వాడుకున్నాడు. ఆయన కవిత్వానికి పాడుకునే విధంగా బాణి, మాత్రలు ఉంటాయి. ఉర్దు కవిత్వంలో రాగశైలి (తరంగ్), వచన శై లిలు ఉన్నాయి. అందులో మఖ్దూం రాగశైలినే వాడుకున్నాడు. మఖ్దూంకు మానవత్వంపైన, శాంతి సమానవత్వాలపైన ప్రగాఢమైన ప్రేమ ఉంది. ప్రజలను మెప్పించి, ఒప్పించి ఉర్రూతలూగించే, ఉద్యమోన్ముఖుల్ని చేసే చక్కని గళముంది.
ఆయన రాసిన ముస్తబిక్ (భవిష్యత్తు) అనే ఉర్దూ కవిత ఎంతో జనాదరణ పొందింది. ఈ కవితను దాశరథి తెలుగులోకి అనువదించారు.
వస్తున్నది/ వస్తున్నది/వస్తున్నది
గడగడలాడే గుండెల శబ్దం వినవస్తున్నది
చీకటిదారుల అడుగుల సవ్వడి వినవస్తున్నది
అంధకార మహారాజ పరిపాలన లేదు నేడు
దైవ ప్రతినిధుల కనక సింహాసనం లేదు
పాడు పెట్టుబడిదారి బంధనాలు కానరావు
నవజీవన పతాకాన్ని ఎగురవేసి వస్తున్నది
సమసమాజ కథాకళిని వినిపిస్తూ వస్తున్నది..
అంటూ భవిష్యత్ దర్శనాన్ని సాక్షాత్కరించారు.
మఖ్దూం అనేక గజళ్లు రాశాడు. గజళ్లలో ప్రధానంగా ప్రణ య కవిత్వం, జీవన మాధుర్యం నిండుగా ఉంటుంది. ఆయన రాసిన గజళ్లలో ఈ రెండు ఎంతో ప్రాశస్త్యాన్ని పొందాయి.
కోయీ జల్తాహీ నహీ, కోయీ ఫిఘల్తాహీ నహి
మోవ్‌ుజాన్ జావో ఫిఘల్ జావోకే కుచ్ రాత్ కటే..
(దహించుకు పోరెవ్వరు, పోరెవరు కరిగి
కొవ్వత్తిగా కరుగు రేయంత గడువ)
దీప్ జల్తీహై దిల్‌మే కే చితా జల్తీహై
అప్‌కే దీవాళి మే దేఖోగే క్యా హోతాహై
(దివ్వెలు వెలుగునో మదిని చితి మండిపోవునో
ఈసారి చూడాలి దీపావళికి ఏమి అగునో)

ఈ గజళ్లలోని భాష సాంప్రదాయమైనా, భావాలు కొత్త లోకానివి. సామాజిక రాజకీయ చైతన్యం కలవి. సామాజిక, సమస్యలను అద్భుతంగా కవిత్వీకరించినవి.
మఖ్దూం కవితా ప్రాశస్త్యం ముంబాయ్ సినీ నిర్మాతలను కూడా కదిలించింది. సినీ గీతాలు రాయాల్సిందిగా అనేకమం ది నిర్మాతలు వెంటపడినా తిరస్కరించాడు. చివరకు 1958లో కాగజ్‌కే పూల్ సినిమాకు పాటలు రాసి ఉత్తమ గీత రచయితగా ప్రశంసలు పొందారు. బార్సాత్ అనే సినిమాకు కూడా పాటలు రాసినా, తరువాత సినీ రంగంపై ఏనాడు దృష్టి పెట్టలేదు. నాకు సంపద ముఖ్యం కాదు, ప్రజలే నా పెన్నిధి అంటూ సినీ రంగ ఆశల హార్మ్యాలను తోసి పుచ్చారు.
భారత కార్మిక రంగ వ్యవస్థాపకుల్లో ఒకరైన వివి గిరి దేశాధ్యక్షుడైన సందర్భంగా ఆయన ఆహ్వానం మేరకు ఆయనతో ఉన్న సక్యత వల్ల 24 ఆగస్టు 1969లో ఢిల్లీలో ఏర్పాటు చేసిన ముషాయిరాలో పాల్గొన్నాడు. ఆ మరుసటి రోజు అనారోగ్య కారణాల వల్ల ఆసుపత్రిలో చేరాడు. ఆరోగ్యం మెరుగుపడక 26 ఆగస్టు 1969న ఢిల్లీలోని ఇర్విన్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
తెలంగాణ భవిష్యత్ దర్శనాన్ని స్వప్నించిన మహనీయుడు మఖ్దూం
భారతావనిలో అగ్రగామి తెలంగాణ
సృష్టిస్తుంది నవోదయం తెలంగాణ
ఆహ్వానం పలుకుతుంది కొత్తదిశగా తెలంగాణ
విప్లవం పురిటి గడ్డ తెలంగాణ.. అంటూ తెలంగాణ ఎలా ఉండాలో కవిత్వీకరించాడు. తెలంగాణపై అచంచల విశ్వాసం ఉంచి ఆయన ఆశను, శ్వాసను, కవిత్వాన్ని మనకు వదిలి వెళ్లిపోయారు. సూర్యుడి వేకువ చలనం చంద్రుడి స్వాంతన పయ నం ఆయన కవిత్వం అజరామరం.
- వేల్పుల నారాయణ, 94404 33475
(ఆగస్టు 26 మఖ్దూం వర్ధంతి సందర్భంగా...)

1541
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles