ప్రాణహిత త్యాగ సౌందర్యం


Mon,August 20, 2018 01:33 AM

ఈ సంకలనం నిండా ప్రతికవితలో ప్రజల కన్నీళ్ళే ప్రవహిస్తాయి. కడగండ్లే గండ్లు తెంచుకొంటాయి. అయితే మానవ సంబంధాలు, ప్రేమ, దయ, మనిషితనం లోపించడమే ఈ అసమానతలకు, మోసాలకు,ద్వేషాలకు, అంతులేని ఆవేదనలకు కారణం. వాటిని తిరిగి నిలుపకోవడమే మనుషులు, కవులూ, కళాకారులూ చేయాల్సిన పని అని ఒక కర్తవ్య నిర్దేశాన్ని ఇందులో స్పష్టం చేశారు.

నా శరీరమంతా ఏడుపే / మనసు దుఃఖ రంగస్థలం
ఇంటెనుకా ముంగలా / వాళ్ళ కండ్ల నీళ్ళును తుడువలేదా
బాపుతుడువలేదా/ నేను చేస్తున్నదీ అదే /రాస్తున్నదీ అదే / క్షమించమ్మా
నాకు ఏడవాలని లేదు /బతుకులో తీపిని పంచటానికే / కొంత చేదు
మింగదలుచుకున్నాను / తియ్యగానో /చేదుగానో
తప్పనిసరిగా మాట్లాడ దలచుకున్నాను..


ప్రాణహిత ఒక నదిపేరు. ఆ పేరే కవితా సంకలనానికి పెట్టారు సిధారెడ్డి. ఈ కవితా సంకలనాన్ని 1995లో మంజీరా రచయితల సంఘం ప్రచురించింది. సాధారణంగా సంకలనంలో ని ఒక కవిత పేరే పుస్తకానికి పెట్టడం రివాజు. కాని ప్రాణహిత అనే కవిత ఇందులో లేకపోవడం విశేషం. ప్రాణాలకు హితవుచెప్పడానికే కవిత్వం అని ఒక అర్థం. నదిలా ప్రవహించే గుణం, పండించే గుణం ఉండాలని మరొక అర్థం పైకి కనిపించేవి. కాని ప్రాణహిత నది ఉత్తర తెలంగాణలో మహారాష్ట్ర సరిహద్దు నుంచి ఆదిలాబాదు జిల్లాలో ప్రవహిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా అడవులకు ఆదిమ నాగరికతలకు ఎంత ప్రసిద్ధి చెందిందో పోరాటాలకు, త్యాగాలకు కూడా అంతే ప్రసిద్ధి పొందింది. మరొక అంశమేమంటే ఈ సంకలనం వెలువడిన కాలానికి కొంచెం ముందు వెనుకలుగా ప్రాణహిత ప్రాంతంలో జరిగిన పోరాటాలకు కూడా ప్రతీక.సామాన్యుల జీవితాల పట్ల అణిచివేత రెండు రకాలు. ఒకటి దేశీయమైనది, స్థానికమైనది. మరొకటి విదేశీయమైనది , విజాతీయమైనది. రెండువిధాలా రెండు దరుల మధ్య ప్రవహించే నదిలా నిత్యచైతన్యంతో నిత్య పోరాటంతో బతుకుగడుపుతున్న సామాన్యుల జీవితాల కడగండ్లను, అణిచివేతలను, త్యాగాలను కవిత్వంగా ఈ సంకలనం చేశారు సిధారెడ్డి.

ఈ కవితల నిండా పుట్టెడు దుఃఖం ఉంది. అయితే ఏడుపుతో ముగిసే జీవితాలు కొన్ని, ఏడుపునుంచి ఏదో ఒకటి చేయాలనే నిర్ణయాతో నిశ్చయాలతో ముగిసే బతుకులు కొన్ని. తన చావు తప్పదు మిగిలినవారికైనా బతుకిద్దామనే త్యాగం, పోరాట పటిమతో రంగంలోకి దిగినవారు ప్రాణహిత వెంట పల్లెల్లో ప్రజల్లో కలిసిపోయారు. పల్లె కుటుంబాల్లో సభ్యులైపోయారు. అక్కడి అవ్వ అయ్యలకు కొడుకులైనారు, చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు అన్నలైనారు. అయినందుకే ప్రాణాలు కోల్పోయినారు.అక్కడ పగలు లాఠీలు, బూట్లు, రాత్రి ఆశలు, అభయాలు పొద్దుపొడుపుతో బతుకులు మారుతాయని రాత్రి కలలు కనడం, ఉన్న బతుకులు చితికిపోవడం పగలు జరిగే ప్రత్యక్ష నరకం. ఇంత కన్నీటిని తనలో కలుపుకున్నది, రక్తంతో తడిసిపోయింది ప్రాణహిత. అందుకే ఈ సంకలనంలోని కవితలన్నీ ప్రాణహితాలే.

కొడుకు వినడు/ పోలీసులు వినరు/తలకు రుమాలుతో పాటు అవమానాలు చుట్టుకున్నాను
చిరుగుల ధోతిలో/ సిగ్గొక్కటే కాదు / ఎన్నో దెబ్బలు దాచుకున్నాను
రెప్పల కింద మెరసిన కల తెల్లారకముందే కాలిపోయింది.. (సగం చావు)
ఇట్లాంటి దృశ్యాలు వాంగ్మూలం, వొంగిన ఆకాశం, దృష్టి మొదలైన కవితల్లో కూడా కనిపిస్తాయి. మరికొన్ని కవితల్లో ధ్వనిస్తాయి. ఆ ధ్వనులను ప్రాణహిత అలల చప్పుడులా పట్టుకుంటే దొరుకుతాయి.
ఆడపిల్లల, ముఖ్యంగా పల్లెటూరి ఆడవారి ఎడతెగని వలపోతను ఒక దుఃఖనదిలా చూపించారు. అందుకు కూడా ఈ నదిపేరు సార్థకం.కన్నీళ్ళ స్నానం అన్న కవితలో ఒక ఆడపిల్ల సాధారణంగా ఎన్ని మురిపాలు, ముచ్చట్లతో గడుపుతుందో చివరికి తెలియకుండా ఎంత దుర్భరమై న స్థితిలోకి నెట్టివేయబడుతుందో చూపుతూ అసలు ఆడపిల్లలందరికీ ఈ పరిస్థితి ఎదురవుతుం దా? అన్నట్లుగా చూపించారు. ఇది నిజంగా కన్నీటి స్నానమే. స్త్రీ వాదం ఎంతో సహజంగా వ్యక్తమయింది. అయితే నలిగిపోయి, చితికిపోయి, కన్నీటిమయమయి నిరాశతో ముగించడం సిధారెడ్డి కవిత్వంలో ఉండదు. ఆ కన్నీటికి కారణమైన దాన్ని ఎదిరించడానికి సిద్ధం కావడం, అవసరమైతే త్యాగానికి ముందుకు రావడం ఒక నిశ్చయమవుతుంది.
ఆమె ఇప్పుడు/తనకలల గురించి జీవించడం లేదు/ఎవరి కలలు ఎందుకు చెదరిపోతున్నాయో/ఎవరి తలరాతలు ఎవరెట్లా తారుమారు చేస్తున్నారో/ఎవరి బతుకెందుకు ఛిద్రమవుతుందో ఆలోచిస్తోంది/ సమయమొచ్చినపుడు/ కుక్కబుద్ధికి/ బుద్ధిచెప్పే తీరుతుంది..
కుక్కబుద్ధికి చెప్పుదెబ్బ అనే సామెత ధ్వనించడం కవితాశిల్పంతో పాటు పారిపోక ఎదుర్కొనే లక్షణం కూడా ఇందులో ఉంది. అదీ సాధ్యంకాకపోయినా బతుకునుంచి పారిపోని ఒక తల్లి తన సంసారాన్ని ఎన్ని కష్టాల్లో నెట్టుకొని వస్తున్నదో చూపించి చివరికి..

చాట్లో బియ్యం పోసుకొని / ఎంత వలపోస్తే ఏం లాభం?
పొయ్యి అంటించకా తప్పదు/ బియ్యం ఎక్కించకా తప్పదు.. అని బతుకు కొనసాగిస్తుంది.
ప్రపంచీకరణ ప్రభావం తొలి అడుగులు పడుతున్న దశ. డంకెల్ ఒప్పందాలకు తల్లడిల్లుతున్న దేశీయ సంపదలు. అప్పుడే మన దేశాన్ని ఎట్లా కొల్లగొడుతారో ముందే ఊహించి హెచ్చరించారు.నాయకులు పరదేశాల ఒప్పందాలపై సంతకాలు పెట్టడాన్ని నిరసించారు.బహుళ దాహం అన్న కవితలో..
మీ ముల్లేం పోయింది రాసివ్వండి/ కష్టాన్ని నమ్ముకున్న నేరానికి / మట్టిని నమ్ముకున్న పాపానికి/ నోరులేని అతని బతుకుమీద అన్ని హక్కులూ రాసివ్వండి.. అంటూ పాలకుల ద్రోహాన్ని నిరసించాడు.
ఇవాల్టి నాయుద్ధం / కత్తితోనే కాదు/ శరీరాన్ని బోను చేసి / మనసు మీద మసిపూస్తున్న/ నాగరిక సంస్కృతితోనూ.. అంటారు. ఇది నాగరికత పేరుతో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్న దగాకోరు తనానికి, స్వార్థానికి, దుర్మార్గాలకు పైకి ఎంతో నాజూగ్గా కనపడుతూ లోపల విషాన్ని పంచిపెడుతున్న వైనాన్ని ఇప్పి చెబుతారు.

ఈ సంకలనం నిండా ప్రతికవితలో ప్రజల కన్నీళ్ళే ప్రవహిస్తాయి. కడగండ్లే గండ్లు తెంచుకొంటాయి. అయితే మానవ సంబంధాలు, ప్రేమ, దయ, మనిషితనం లోపించడమే ఈ అసమానతలకు, మోసాలకు, ద్వేషాలకు, అంతులేని ఆవేదనలకు కారణం. వాటిని తిరిగి నిలుపకోవడమే మనుషులు, కవులూ, కళాకారులూ చేయాల్సిన పని అని ఒక కర్తవ్య నిర్దేశాన్ని ఇందు లో స్పష్టం చేశారు. ఈ కర్తవ్య నిర్వహణలో ఏదయినా త్యాగం చేయడానికి సిద్ధమే అని సిధారెడ్డిగారి సిద్ధాంతం.. రక్తం ఒలికిన నేలమీద రాజీ కుదరదు / రాజీలేని ఒక సాము మొదలయింది/ మనిషికోసం / మనిషి తనం కోసం.. ( విభజన రేఖ)..
జీవితంలో ఇంత ప్రేమా / ఇంతధైర్యమూ/ లేకపోతే/ అది మనిషి పుటకేనా? అంటూ ఎన్నో కవితల్లో ఒక తెగింపు ,నిలబడి ఎదిరించే లక్షణం స్పష్టమవుతుంది.
సిధారెడ్డి కవితల్లో కొన్ని నిర్మాణపరంగా విశేషంగా కూడా ఉన్నాయి.
మేం నిలబడే వున్నాం. తలెత్తుకొనే ఉన్నాం,. ప్రాణాల్ని గడ్డి పరకల్లో పెట్టి/ కొత్త లోకం కడుతున్న వాళ్ళ గురించి / కవిత్వం రాయడానికే మేం నిలబడ్డం అని తనకే కాదు తోటికవులకు కూడా ధైర్యం పెంచారు.
అసలు జీవితపరమార్థాన్ని కూడా ఎంతో అర్థవంతంగా వ్యక్తం చేశారు.
జీవితమంటే చీకటికి తలొంచడం కాదు/ బట్టకట్టి మౌనంగా మరణించడం కాదు
వెలుక్కోసం వెతుకులాట/ప్రేమకోసం పెనుగులాట/ మనిషికోసం ఎడతెగని గొప్ప తండ్లాట.
మూడు దశాబ్దాల కిందట వెలువడిన ఈ కవితా సంకలనం ఆనాటి రాజకీయ, సామాజిక, అంశాలనే గాక కవితా రంగాన్ని కూడా ఈ కవితల ద్వారా చూడవచ్చును.
మనిషికోసం, మనిషి ప్రాణంకోసం హితవుచెప్పిన ఈ సంకలనం అచ్చంగా ప్రాణహితం. సిధారెడ్డి గారే ఓ కవితలో అన్నట్లు..
మానవ సంబంధాలు మసిబారిన రాజ్యాన/ త్యాగం కంటే సౌందర్యమేముంటుంది?
- డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, 9849328036

935
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles