చింతనిప్పుల సెగ ఎస్వీ కవిత్వం!


Sun,August 12, 2018 11:35 PM

Prof-SV-Satyanarayana
విరసం అనగానే వరవరరావు, అరసం అనగా నే ఎస్వీ సత్యనారాయణ జ్ఞాపకానికి వస్తారు. అభ్యుదయ రచయితల సంఘం చిరునామా ఎస్వీనే. అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా ఒకవైపు ఉద్యమ ప్రస్థానమైతే, అభ్యుదయ గేయ రచయితగా, కవిగా, విమర్శకునిగా, పరిశోధకునిగా, అధ్యాపకునిగా, ఉస్మానియా తెలుగు శాఖాధిపతిగా, డీన్‌గా ప్రస్తుతం తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా సమాంతర ప్రస్థానం మరోవైపు సాగుతూనే ఉన్నది.
1978లోనే సరిగమలు అనే లలిత గీతాల సంపుటి, ఎనభై రెండులో ఉద్యమ గీతాల సంపుటి తెచ్చి గేయరచయితగా ఒక వెలుగు వెలిగాడు. ఎస్వీ ఇన్‌సైడ్, ఔట్‌సైడ్ నిబద్ధుడే. వర్గదృష్టి ఉన్నవాడే. దారి తప్పనివాడే. ఆయన నిబద్ధత, ఎమోషన్స్‌తో కూడిన ఉపన్యాసాలు మంచివక్తగా తీర్చిదిద్దాయి.

ఎస్వీ కవిగా నిరంతర ప్రయా ణం సాగుతూనే ఉంది. ఆయన మొదటి నుంచి వస్తు ప్రాధాన్య కవిగానే బలమైన ముద్ర వేయగలిగాడు. ఇప్పటివరకు జీవజ్వాల, యుద్ధం జరుగుతూనే ఉంది, జీవితం ఒక ఉద్యమం పేర్లతో వచ్చిన కవితా సంపుటులు ప్రజా ఉద్యమాలకు దారులు వేస్తాయి. ఎస్వీ కవిత్వంలో భావ నిబద్ధతకు, వర్గదృష్టికి కొదువ ఉండ దు. దళితుల మీద రాసినా, స్త్రీల మీద రాసినా, మైనారిటీ ప్రజ ల మీద రాసినా అతని దృష్టి, దృక్పథం, నిబద్ధత స్పష్టంగానే తెలుస్తాయి. ఎస్వీ కవిత్వానికి డొంక తిరుగుడు గుణముండదు. ఆయన లాగే ఆయన కవిత్వం నాగేటి సాల్లు పట్టినట్టే ఉంటుం ది. ఆయన కవిత్వంలోని ఆవేశం ఎండుగడ్డి మంటే అయినా చింతనిప్పుల సెగ కవిత్వమంతా అల్లుకుని ఉంటుంది. ఆయన కవిత్వం విప్పిచెప్పే క్యాన్వాస్ పద్ధతి పాఠకుని మనసులోకి సరాసరి వెళుతుంది.

మొన్న కారంచేడు, నీరుకొండ, పదిరికుప్పం,
నిన్న గోద్రా, గుజరాత్
ఇవ్వాళ మా పార్టీ కార్యాలయాలూ
వీధులూ
స్థల మేదైతేనేం?
సందర్భ మేదైతేనేం?
ఒకసారి తగుల బెట్టడం మొదలు బెట్టాక
దేన్నైనా తన్ని తగిలేస్తాం, అగ్నికి ఆహుతిస్తాం.. అంటాడు.
గీటురాళ్లు, చకుముకిరాళ్లు దళిత ఉద్యమాన్ని ఎలా రాజేస్తా యో, విస్తృతపరుస్తాయో దేన్నైనా తన్ని తగిలేస్తాం అనడంలో నే కాదు అగ్నికి ఆహుతిస్తాం అనడంలో కుల దురహంకారాన్ని సమాధి చేస్తాం అనడంలో కవి నిబద్ధత బయట పడుతుంది. అలాగే రెడ్ సాల్యూట్ నమీబియా! గుజరాత్ కి రాత్, గర్జించు రష్యా!, నరమేధం, గోడ కూలిన శిథిలాలపై వంటి కవితలను చదువుతున్నపుడు ఆయనకు న్న రాజకీయ పరిపక్వత తెలుస్తుం ది. ఎటు నిలబడి ఎటు మాట్లాడుతున్నాడో తెలుస్తుంది. మీ కళ్ళ జీరలు, కవిత్వానికి పల్లవు లై ప్రాణం పోస్తున్నాయి అని ఏ సందర్భంలో అన్నా ఇది ఆయన కవిత్వానికి వర్తించే కొటేషనే. ఒకప్పుడు ఎస్వీ.. దోపిడీ ఉన్నంతకాలం పీడితవర్గం చేతిలో ఆయుధంగా నువ్వు ఉన్నావా? లేదా అన్నది ప్రశ్న అనేది నేటికి ప్రతి కవి వేసుకోవాలసిన ప్రశ్నే.
ఎస్వీకి దూరదృష్టి ఎక్కువే. నిబద్ధత మీద విశ్వాసం కూడా ఎక్కువే. ఆయన సారా ఉద్యమం మీద రాసిన కవిత చాలా లోతైనది. స్వానుభవంలోంచి రూపుదిద్దుకున్నది. తండ్రి సారా దుకాణంలో కూలీ బతుకు బతికిన స్పృహ కూడా ఎస్వీకి తోడైంది. ఈ తోడైన దానిలో ప్రధాన గుణం ప్రశ్నించడం, నిలదీయడం, ఎద్దేవా చేయడం, ఎండగట్టడం, అధిక్షేపించడం ఎక్కువ. ఉద్యమ సెగలతో నినదించే కవిత రాశాడు.

ఎస్వీ కవిత్వానికి వర్తమాన దృష్టేకాదు, భవిష్యత్ దృష్టి కూడా ఉన్నది. మాటకూ, చేతకూ వ్యత్యాసం లేకుండా సాగిన కవితలు రాశాడు. మితవాద దృష్టో, నైరాశ్య దృష్టో ఆయన కవిత్వంలో కనిపించదు. నడవలేనివాళ్ళు, అలసిపోయిన వాళ్ళు, ఆగిపోయిన వాళ్ళు, మండే సూర్యుడిలోంచి కొన్ని అగ్ని కణిక లు రాలిపడితే సూర్యుడే రాలిపోయాడంటారేమిటి? అని సడలిపోయిన ఆత్మవిశ్వాసుల్ని ప్రశ్నిస్తాడు. ఎవడు చరితార్థుడు అని ప్రశ్న వేసుకుని ప్రజల కోసం ప్రాణత్యాగానికి కూడా వెనుదిరగని వాణ్ణే ప్రజలు ప్రేమిస్తారు. కన్నీటితో వీడ్కోలు పలుకుతారు అతనికోసం చౌరస్తా ఒక సంతాప సంకేతంగా స్తంభించి పోయింది. నిజానికి చౌరస్తా అందరికీ కన్నీళ్ళు కార్చదు.. అం టాడు. చౌరస్తా అంటే ప్రజలు. చరితార్థుడు అంటే ప్రజల మని షి. ప్రజల కోసం పోరాడిన వారికి కన్నీరు కార్చడం సహజం. ప్రజల మనిషి కాని వానికి కన్నీళ్ళు కార్చకపోవడం సహజమే. సహజత్వాన్ని సమర్థించడానికి ఎస్వీ తన కవిత్వంలో అసహజత్వాన్ని ముందుకు తెస్తాడు. అలా తేవడం వల్ల కవితా వస్తువు సులభ గ్రాహ్యమవుతుందని నమ్మి రాయడం ఆయన కవితా శైలిలో ఒక పద్ధతి.

ఎస్వీ కవిత్వం.. జీవితానికి ఉద్యమాన్ని, ఉద్యమానికి జీవితాన్ని అన్వయించుకుంది. ఆయన కవితా ప్రతీకలు సాధారణ పాఠకునికి అందుబాటులో ఉండేవాటిలోంచి స్వీకరించి నూతనత్వాన్ని పొందుతాయి. మహిళలు సారా ఉద్యమాన్ని విస్తృతపరిచారు. సారా మహిళోద్యమకారులు..
కళ్ళెర్రజేసి కదన భూమిక్కదిలిన
నారీజన మహోద్యమంలో
కదులుతున్న కూకటి వేళ్ళలా వాడు
కంపించిపోయి తెగుతున్న కోరలువాడు
చలిచీమల దాడికి
చిత్తు కానున్న బలవంతపు సర్పమువాడు..
ఇందులో వాడెవడు? వాడే స్త్రీల కొంపలార్పుతున్నవాడు. సారా కాంట్రాక్టర్. ప్రతి కుటుంబంలోని డబ్బును ఇనుప చీపు రు కట్టలతో ఊడ్చుకుపోతున్నాడు. వాడు సారాసర్పం. నిజానికి చలి చీమలెవరు? ఉద్యమ మహిళలే. సారాసురున్ని హతమార్చడమే చలిచీమల పని.
ఎస్వీ స్మృతి కవిత్వంలో వ్యక్తుల గుణగణాల తాత్త్విక భూమి క, ఆదర్శాలు, ఆశయాలు, నీతి నిజాయితీలు వ్యక్తమవుతున్నా యి. ఆరుట్ల కమలాదేవిపై పోరాట పుష్పం పేరుతో రాసిన కవిత కమలాదేవి నిజాయితీకి నిలువుటద్దంగా నిలుస్తుంది. అలాగే తమ్మారెడ్డి సత్యనారాయణను స్మరించిన తీరు చిరస్మరణీయమైనదే. ఆయన రాలిన స్వప్నమే కావచ్చుకాని ఆయన ఒక ఉద్యమ సంకేతం.

గద్దర్‌పై కాల్పులు జరిగిన రోజున ఎస్వీ పాట అమరం అన్నాడు. గద్దర్ విప్లవోద్యమానికి ప్రతీక. పాటకు ప్రతీక. గద్ద ర్ మీద కవిత రాసినట్లే ఉన్నా లోలోపల వ్యాపించిన భావన అతి ప్రధానమైనది. ఈ కవిత అడవి తల్లి జలపాతంలా మాట ను తూటాలా మలచిన భావన అమేయం. అజరామరమైంది. ఎస్వీ ఆత్మీయమిత్రుడు ఏ. పుల్లారెడ్డిని స్మరిస్తూ పుల్లన్న కోసం అంటూ ఓ మంచి కవిత రాశాడు. పుల్లన్న ఉద్యమాల ప్రతిధ్వ ని. ప్రగతిశీల గళానికీ, కలానికి ప్రతీక. ఆయన అభ్యుదయ శక్తులకు ఒక కరదీపిక.
ఎస్వీ ప్రజల మనుషులైన రాజకీయ ఖైదీల మీద మమేకం చెంది రెండు కవితలు రాశాడు. రాజకీయ ఖైదీల ఆశయాల్నీ, లక్ష్యాల్నీ, వాళ్ల వీరోచిత పోరాటాల్నీ ఎలుగెత్తి చాటాడు. రాజకీయ ఖైదీలకు సంఘీభావం చెప్పిన తీరులో వాళ్ల ఆదర్శాలను గుర్తుచేస్తాడు. అన్నలూ! మేం మీ వెంటే నడుస్తాం, మేం మీ జట్టే కడుతాం. అన్నలూ మీ చేతులకే కాదు మా కాళ్లకు సంకెళ్లున్నాయి. మా చెవులకు సంకెళ్లున్నాయి. మెదళ్లకూ సంకెళ్లున్నా యి. పాలకుని తెలివి సంకెళ్లు వేయడానికి తప్ప విముక్తి చేయడానికి కాదని చెప్పడంతోనే ఆగడు. అన్నలూ! మీ పోరాటం మా కళ్ల పొరల్ని కరిగించివేసింది. మీ త్యాగం మా మా మెదళ్ళ మగతను దులిపేసింది. మేమిప్పుడు విముక్తి గీతాలం. విప్లవ సంగీతాలం. ఎగిరే జెండాలం. బిగిసే పిడికిళ్లం అంటూ చెప్పిన సంఘీభావం వెనుక విప్లవోద్యమాన్ని బతికించుకుందామనే భావన ఉంది. రాజకీయ ఖైదీలు జైలు నుంచి విడుదలైన సం దర్భంగా కూడా మంచి కవితలు రాశారు. ఇది ఖైదీల స్వగతం లా ఉన్నా ఉద్యమ అభివ్యక్తితోనే రాశాడు. లోకమంతా విము క్తం కావాలన్నందుకు మమ్మల్ని జైళ్లలో పెట్టారు. చీకటంతా పారిపోవాలన్నందుకు వెలుతురుకు దూరం చేశారు. జనం సుఖపడాలన్నందుకు కష్టాల కొలిమిలో కాల్చారు. వివిధ వాదాల కవిత్వం వచ్చిన తర్వాత రాజకీయ ఖైదీల మీద కవిత లు చదువుతుంటే సార్వజనీనమైన కుట్రలు ఎంత నిర్బంధంగా అమలుచేస్తారో తెలుస్తుంది. రాజకీయ ఖైదీల పట్ల సాధారణ ప్రజలు సంఘీభావాన్ని కవి కాంక్షిస్తున్నాడని అర్థమవుతుంది.

ఎస్వీ కవిత్వం అంతరంగంలో కుటుంబమే కాదు తాను నివసించిన హైదరాబాద్ పాతబస్తీ మీద రాసిన కవిత పాఠకులంతా ఇష్టపడుతారు. పాతబస్తీ కవికి తిరిగిరాని బాల్యం లాం టిది. ఆ పాతబస్తీ పాదముద్రలు మాయమైపోతున్నందుకు కవి కి వేదన. ఆ వేదనే కవిత్వాన్ని రాయించింది. కవితలో పాతబ స్తీ బాల్య జ్ఞాపకాల్ని కలబోసి వెతుక్కున్న తీరు పాఠకుని మనసుపై బలమైన ముద్ర వేస్తాయి.
- డా॥ నాళేశ్వరం శంకరం, 94404 51960
(ఎస్వీకి ఆగస్టు 16తో 64వ వడి)

1258
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles