అతని కవిత్వం గుండెకు లేపనం


Mon,August 6, 2018 01:41 AM

ఆయన కురిపించిన కవిత్వపు వర్షం అప్పుడే వర్షించినప్పుడు రివ్వున పైకి రేగిన మట్టి పరిమళంలాగా గాలిలో కోటి కాంతి పుంజాలను వెలిగిస్తూనే ఉంటుంది. ఆ కవిత్వం బొట్లు బొట్లుగా మన లోతుల్లోకి చేరి ఎండిపోయిన బంధాలను ఆ బంధాలకు పూసిన భావాల మొక్కలను నీల నీలంగా ఉంచుతూనే ఉంటుంది.
K-Shivareddy
కవిత్వమా కవిత్వమా నీవేమి చేస్తావని అడిగితే? హృదయాలను తవ్వి వాక్యాలను నాటుతాను, ఆకాశాన్ని తలగడగా చేసేస్తాను, ఊహా పక్షికి రెక్కలు తొడిగి భూమిపై, భూమిలో కూడా విహరింపచేస్తాను. నరాల్లో నీటిని నింపి గగనాని కి వెచ్చని, పల్చని, నల్లని ఒక తీగను విసురుతాను. అక్కడో మేఘం ఒంటి కాలుపై నిలబడుతుంది. అవినీతి ప్రభుత్వాలను కూల్చేస్తాను, ముసుగేసుకున్న సమాజాన్ని నాలుగు రోడ్ల కూడలిలో నగ్నంగా దేహశుద్ధి చేస్తాను. ఎవరు చేయలేనిది ఎవరికీ సాధ్యం కానిది నిజాలను వలిచి నీ ముంగిట కుమ్మరిస్తాను. వాదాలు, వేదాలు, ఇజాలు, బీజాలు, సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, ఏవైనా సరే అన్నీ నా అరచేతి రేఖలపై మౌనంగా కవాతు చేయాల్సిందే.

కవిత్వానికి ఎంతటి శక్తి ఉందో తెలుసుకోవాలంటే శివారెడ్డి కవి త్వాన్ని తవ్వుకుంటూ తవ్వుకుంటూ ఎక్కడికో వెళ్లిపోవాలి. ముందు కో, వెనుకకో అలా వెళ్ళిపోతే! తవ్వడానికి ఇంకా ఏమి ఉండదు. కేవలం అక్షరాలు మెట్లు మెట్లుగా రాలుతూ కనపడుతాయి. పదాల రాగాలు స్వరాలై నీ ముఖం మీద వాలితే ఆ స్వరాలు వినిన గర్భకుహరాలు ఆనందతాండవం చేసే వరకు వెళ్తూనే ఉండాలి. మరి అలా వెళ్ళాలంటే కవిత్వం కావాలి కదా. నిజమైన కవిత్వాన్ని నీ చూపులతో లోపలికి బయటికి వెతికి వెతికి శోధించి, పరిశోధించి, పరీక్షించి గుండెకు బిగించుకున్న తాళాన్ని తెరిచి శివారెడ్డి కవిత్వాన్ని వర్షం వర్షం బొట్లు బొట్లుగా గుండె లోపల, గుండె కింద మొత్తం గుండెకు లేపనంగా పూసుకోవాల్సిందే.

అవును మన మధ్య ఒక కవిత్వపు శిఖరం నడుస్తూ కన్నుల లోపలికి బయటికి ప్రవహిస్తూ ఉంటుంది. ఒక్కసారి ఆ శరీరాన్ని నిమిరితే చిక్కగా చక్కగా కవితలు ఎగిరి ఎగిరి మన ఎదపై వాలుతాయి. అప్పుడప్పుడు కవిత్వపు పిట్టలకు తెల్లని రక్తం కూడా ఉంటుంది. ఇంకొన్నిసార్లు ఆ పద్యానికి అర్ధచంద్రాకారపు చంద్రుడు వేలాడు తూ కనపడుతాడు. అసలు ఆ కవిత్వానికి ఒక లిపి ఉంటుంది. ఆ లిపిని అర్థం చేసుకుంటే మన చూపులు మనల్నే చూస్తాయి. మన మాటలు మన గుండెల్లో ఒదిగిపోయి సహస్ర సూర్యోదయాల్ని మన శరీరపు అణువణువునా ఉదయింపచేస్తాయి. కవిత్వపు పాలపుంత శివారెడ్డి. వర్షం వర్షం కవితా సంపుటి చదవగానే కలిగిన భావాలివి.

లోలకపుయాత్ర అనే కవితలో కంసాలి గురించి చెప్తూ...
మంట ఉంగరం మీద ఒక సూర్యుడు
ఎవరి వేలి మీద ఉంగరం చూసిన
కంసాలివాని కళ్ళల్లో కొట్టుకుంటున్న
సూర్యపక్షి రెక్కల చప్పుడు వినపడుతుంది..
కంసాలి ఒక చిన్న ఉంగరం చేసేటప్పుడు ఒక గొట్టంతో గాలిని ఊదుతూ మంటను రేపుతుంటాడు. ఆ సందర్భాన్ని, ఆ మంటను కవి సూర్యుడితో పోల్చడమే కాకుండా ఎవరి వేలిమీద ఉంగరం చూసినా కంసాలి గుండె చప్పుడు వినపడుతుందని చెప్పిన విధానం చూస్తే కవిలో దాగి ఉన్న అనంత భావసముద్రం పొంగి మన గుండె తీగలను మీటుతుంది.
ఇది రాత్రా , పగలా పగట్లోకి ప్రవహించిన రాత్రా రాత్రిలోకి ప్రవహించిన పగలా రెండుకాని, లేదు
రెండుకలిసిన ఒక జీవన సందర్భమా..
అవును కదా.. నిజానికి ఇది రాత్రి ఎలా అయ్యింది? ఏ పగులెందుకు కాకూడదు? అసలు రాత్రి.., పగలేంటి ఉన్నది జీవితమే కదా! ఆ జీవిత సందర్భమే రాత్రి పగలు. నిజానికి మనం చూస్తున్నది కాలాన్ని మాత్రమే అందు లో రాత్రి లేదు, పగలు లేదు. అసలు కాలాన్ని రాత్రి పగలుతో, చీకటి వెలుగుతో పోల్చగలమా!
ఈ చరాచరంలో జీవితాలు మాత్రమే ప్రవహిస్తున్నాయని చెప్పగలమా? జీవితాలతో పాటు అక్షరాలు ,అక్షరాలతో పాటు పద్యాలు ప్రవహించట్లేదా? అందుకే రాత్రిలోకి రాత్రి మాత్రమే కాదు అక్షరంలోకి అక్షరం ప్రవహిస్తున్నది.
ఎండాకాలపు భాషని ఏ కళ్ళతో చదవాలో నీకు తెలియదు
పంపు దగ్గర కూడిన కాసిన్ని నీళ్ళ మీద
తేనెటీగలు నీటిపాటలు పాడుకుంటూ తిరుగుతుంటాయి
నల్లా నుండి రాలే ఒక్కొక్క నీటి బొట్టును
ఒక తెల్లావు నాలుకతో చప్పరిస్తుంది
తారురోడ్డులో
ఎండమావులు దోబూచులాడుతాయి
నీటి ఆశ ఒక ఎడతెగని భ్రమ..
అసలు మానవునికి ఋతువుల భాషలు తెలిస్తే ఇన్ని అనర్థాలు ఎందుకు జరుగుతాయి? అదే కవి చెప్పదల్చాడేమో! ఒక ఋతువుతో మరొక ఋతువుకు సంబంధాలు సరిగా లేవేమో అందుకే కొన్ని ఆలస్యంగా వస్తున్నాయి కొన్ని త్వరగా వస్తున్నాయి.
నీ లోపల ఒక నది ప్రవహిస్తుంటే
నీ ముందు ఒక నది ప్రవహిస్తుంది
నీ లోపల చారిత్రక యుద్ధాలు జరుగుతుంటే
నీ బయట చరిత్రను మలుపు తిప్పే యుద్ధాలు జరుగుతాయి..
మన లోపల కొన్నిసార్లు తీవ్రమైన రాక్షస నది ప్రవహిస్తుంది. యుద్ధమంటే సమరమనే ఊహలో ఉన్నా, వారికి రాలుతున్న ఈ జీవన చలనం గురించి ఎలా తెలుస్తుంది. ఒక సజీవ దశ నుంచి నిర్జీవ దశలోకి తీసుకెళ్ళే యుద్ధం చారిత్రక మలుపులే కాదు శారీరక మలుపులు కూడా తిప్పుతుంది. అసలు యుద్ధాలు జరగని ప్రదేశం ఏదైనా ఉందా? నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అది సజీ

వమైనదైనా, నిర్జీవమైనదైనా యుద్ధం యుద్ధమే కదా! ఒక చచ్చిన దశ నుండి బతికే దశకు చేరడానికి జరిగేదే ఈ యుద్ధం.
ఒక నెత్తుటి బీజం నుండి జన్మించిన వాణ్ణి
ఒక దుఃఖం ఒక కష్టం కలిస్తే
ఒక వేదన ఒక విచారం సంగమిస్తే
ఆకారం పొందిన వాణ్ణి..
అవును మనం సుఖం నుంచి జన్మించామా? అలా అనుకుంటే నీటి తుంపరలు తామే వరదలని భావించినట్టే కదా! ఒక దేహం గాయాల సుఖాల వేదనలు పడింది అని చెప్పేదామా? లేక మరో దేహం ఆశ, కోరికలతో తుల్లిపడిందని మాటలు మైల పరచేద్దామా. ఏమో అసలు మాటలు మైల ఎలా అవుతాయి? అయితే గియితే నగ్నమవ్వాలి కాని. జీవితమంటే ఏముంది పలుకరిస్తే పుష్పిస్తాను లేదంటే ముకుళిస్తాను. మొత్తానికి కొన్ని విచారాలు, వేదనలు, కోరికలు, ఆశలు నుంచి జన్మించిన దేహమే మనది. అయితే సందర్భాలను మాత్రమే వేరుకుంటూ నడిచేవాడికి పెద్దగా ప్రేమ,అనురాగం, ఏమి ఉండవు. అసలు అతనికి గమ్యం ఎక్కడిది రెండు అంచులు మాత్రమే. ఒక్కసారి జనంలోకి కలిశాక అతను అతను కాడు ఒక సమూహం అవుతాడు. లేదంటే ఒక సజీవ చలన వస్తువు కావచ్చు. చివరికి ఒక గుర్తుగానో లేక చలనంగానో గుర్తు ఉండిపోతాడు.

రేపొద్దున్న వస్తానన్న మనిషికోసం
ఇక్కడొక మనిషి నాలుగురోడ్ల కూడలిలో విగ్రహమౌతాడు..
పైపైన అలలను చూసుకుంటూ కోరికల పెదవులను ముద్దాడితే సరిపోతుందా? దిగంతాల్లోకి చేరి భాగాలూ భాగాలుగా ఉన్నా అక్షరాలను కలిపి ఒక పచ్చన్ని పద్యాన్ని పుడమిలోపల ,బయట కూడా నాటితేనే సూర్య చంద్రుల రహస్యాలను ఛేదించగలము.
గతాన్ని తిరగేసినంత మాత్రానా కొత్త జీవితం మొలకెత్తుతుందా అనుకుంటే అది భ్రమే కదా!

అక్కడ కుంటోడు
తన కృతిమ కాలును తీసేసి
వాటిని ప్రేమగానో, ఆత్మీయంగానో చూశాడు..
నిజానికి అతనెలా చూశాడన్నది కాదు, మనకు కూడా మన శరీర భాగాలను పక్కనపెట్టి ప్రేమతోనో, కోపంతోనో ఒక చూపును వాటి పై విసిరితే వాటి ముఖ కవళికలు చూడాలని ఉంటుంది. పాపం దండించినా లాలించినా మనతోనే ఉంటాయి. మన నుంచి విడిపో తే రెక్కలు తెగిన పక్షులౌతాయి కదా! శివారెడ్డి ఆనవాళ్ళు ఉంటా యో లేదో తెలియదు కానీ.., తన కవిత్వపు ఆనవాళ్ళు కాలపు పేపర్ పైనా పరుగు తీస్తూనే ఉంటాయి. ఆయన కురిపించిన కవిత్వపు వర్షం అప్పుడే వర్షించినప్పుడు రివ్వున పైకి రేగిన మట్టి పరిమళంలాగా గాలిలో కోటి కాంతి పుంజాలను వెలిగిస్తూనే ఉంటుంది. ఆ కవిత్వం బొట్లు బొట్లుగా మన లోతుల్లోకి చేరి ఎండిపోయిన బంధాలను ఆ బంధాలకు పూసిన భావాల మొక్కలను నీల నీలంగా ఉంచుతూనే ఉంటుంది.
- లై, 94919 77190
(ఆగస్టు 6న కె.శివారెడ్డి జన్మదినం సందర్భంగా..)

3367
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles