కవితా ప్రక్రియలన్నీ కరతలామలకం


Sun,July 22, 2018 11:19 PM

CNarayana-Reddy
విద్యార్థి దశలో అలవోకగా సీస పద్యాలను అల్లిన నాటి నుంచి నిన్న మొన్నటివరకు 70 ఏండ్ల పాటు మహా ప్రవాహంలా నిరంతరం సాగిన కవితా యాత్రను ఆపి ఏడాది కిందట శాశ్వతంగా సెలవు తీసుకున్నారు మహాకవి డాక్ట ర్ సి.నారాయణ రెడ్డి.సినారె అన్న మూడక్షరాలు తెలుగు సాహితీ క్షేత్రంలో భిన్న ప్రక్రియల్లో పేరెన్నిక గన్న రచనల ఆవిర్భావానికి అక్షయపాత్రలై నిలిచాయి. కోట్లాదిమంది అభిమానులను సంపాదించిపెట్టాయి. జానపద వాఙ్మయ ప్రభావంతో సాహితీ సృజనకు శ్రీకా రం చుట్టింది మొదలు అత్యున్నతమైన జ్ఞానపీఠ గౌరవాన్ని పొందడం దాకా సాగిన సినారె జీవన యాత్ర విశిష్ఠమైనది.

1931జూలై 29న నాటి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలూకా హనుమాజిపేటలో నారాయణరెడ్డి జన్మించారు. తల్లిదండ్రులు బుచ్చమ్మ, సింగిరెడ్డి మల్లారెడ్డి. తనకంటే ముందు ఒక కొడుకు చనిపోతే ఊళ్ళో ఒక ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతున్నప్పుడు బుచ్చమ్మ మొక్కుకున్నది, నాకు కొడుకు పుట్టి క్షేమంగా ఉంటే నీ పేరు పెట్టుకొంటానని. అలా జన్మించిన కొడుకుకు సత్యనారాయణ రెడ్డి అని పెట్టుకున్నది. పేరులోని సత్యం కవిత్వంలోకి, జీవితంలోకి ప్రవహించింది. నారాయణరెడ్డి లోక ప్రసిద్ధుడైనాడు.

పాఠశాలలో చదువుతున్నప్పుడే నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. సత్యాగ్రహం చేశారు.సైనికులం మేం సైనికులం అని పాటలు పాడుతూ ఊరేగింపులో పాల్గొన్నారు. క్విట్‌స్కూల్ ఉద్యమంలో కొంతకాలం పాఠశాల మానేశారు.

సాహిత్య వాతావరణం లేని కుటుంబ నేపథ్యంలో జన్మించినా, ఉర్దూ మాధ్యమంలో డిగ్రీ వరకు విద్యాభ్యాసం చేసినా తెలుగు మూర్తిగా వికసించిన సినారె అసాధారణ ప్రతిభాశాలి. చిన్ననాడు పల్లెప్రజల నిసర్గసుందరమైన సంభాషణారీతి, జానపద కళారూపాలు నారాయణరెడ్డి భాషా సాంస్కృతిక వ్యక్తిత్వాన్ని మలిచాయి. హరికథలను మైమరిచి వినేవారు. ఆ సమాహార కళలోని పాటలు, పద్యా లు, చతుర కథారీతి, కథన చాలనం ఆకట్టుకోవటమే కాదు పాటలు, నాటకాలు ఆశువుగా అల్లే అభిరుచిని నూరిపోశాయి. 6,7 తరగతు ల్లో వున్నప్పుడే భక్తప్రహ్లాద, సీతాపహరణం, రఘుదేవరాజీయం వంటి నాటికలు రాసి మిత్రులతో కలిసి ప్రదర్శించారు. ఒకనాడు ఒకనక్క ఒక అడవిలోపల అంటూ సీస పద్యం రాస్తే ఉపాధ్యాయు డు దూపాటి వెంకటరమణాచార్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరికొన్ని మెళకువలు చెప్పారు. ఇంటర్మీడియెట్‌లో ఉండగా జువ్వాడి గౌతమరావు జనశక్తి పత్రికలో తొలి కవిత ప్రచురితమైంది. బీఏలో ఉండగా పాములపర్తి సదాశివరావు సంపాదకత్వంలో వెలువడే కాకతీయ పత్రికలో రచనలు ప్రచురితమయ్యాయి.

21 ఏండ్ల వయసులో నారాయణరెడ్డికి రేడియోతో అనుబంధం ఏర్పడింది. 1952లో బీఏ విద్యార్థిగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు హైదరాబాద్‌లో ఖైరతాబాద్ లో ఉన్న దక్కన్ రేడియోలో ప్రసారమైన సాగుమా ఓ నీలమేఘమా గగనవీణా మృదుల రావమా అన్న గీతం నారాయణరెడ్డి పరిణత కవిగా ఎదిగే దశలో తొలిమెట్టుగా నిలిచింది. పూల పాటలు, చిరుగజ్జెలు ఉపద్రష్ట కృష్ణమూర్తి సంగీత దర్శకత్వంలో రూపొందించిన అజంతా సుందరి, ఆ తర్వాత రామప్ప సంగీత రూపకాలు ఆకాశవాణి జాతీయ పోటీల్లో ప్రథమ బహుమతి తెచ్చిపెట్టింది.12 భాషల్లోకి అనువాదమైంది.

ఇంటర్ రెండో సంవత్సరంలో ఉండగా రెడ్డి హాస్టల్‌లో జరిగిన అఖిలాంధ్ర కవి సమ్మేళనంలో విద్యార్థి కవిగా వానమామలై, దాశరథి, తల్లావఝ్జల, కృష్ణశాస్త్రి, జాషువా తదితర అగ్రశ్రేణి కవుల సరసన పాల్గొన్నారు సినారె. దాశరథితో పరిచయం అదే తొలిసారి. అది మొదలు దాశరథి ప్రోత్సాహం తనను మునుముందుకు నడిపించిందని చెప్పుకున్నా రు సినారె. ఆ సోదర ప్రేమకు గుర్తుగా జలపాతం కవితా సంపుటిని దాశరథికి అంకితం చేశారు.

1952లో బీఏ ఫైనల్ విద్యార్థిగా వున్నప్పుడే తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి కార్యదర్శిగా వున్నారు. సంఘానికి తర్వాత అధ్యక్షుడయ్యారు. తెలంగాణ జిల్లాల్లో అంతటా పర్యటించి కవితా పఠనాలు, కవితాత్మక ప్రసంగాలు చేసి ఆనాడే ఈ ప్రాంతంలో కవితా చైతన్యాన్ని పెంపొందించేందుకు కృషి చేశారు సినారె.
1954లో బీఏ, ఎంఏ పూర్తిచేసి సికింద్రాబాద్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా ప్రవేశించారు. తర్వాత నిజాం కళాశాలలో, ఆ తర్వాత ఆర్ట్స్ కళాశాలలో ఆచార్యత్వం. తనకు సాహి తీ విద్యనేర్పిన గురువులు కె.గోపాలకృష్ణారావు, దివాకర్ల వెంకటావధానితో కలిసి ఆచార్యులుగా పనిచేసిన అరుదైన ఖ్యాతి సినారెకు నాడే దక్కింది. ఆయన పాఠాలు విన్న మధురానుభవాన్ని నేటికీ గుర్తు చేసుకునే విద్యార్థులెందరో! ఖండవల్లి లక్ష్మీరంజనం పర్యవేక్షణలో ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు- ప్రయోగములు అన్న అంశంపై పీహెచ్‌డీ చేశారు. పరిశోధనాంశాన్ని సూచించిన వారు దేవులపల్లి కృష్ణశాస్త్రి.

1961లో సినీ గీతరచన ప్రారంభమైంది. హైదరాబాద్ సారథి స్టూడియోలో ఒక సినిమా చిత్రీకరణలో ఉన్న నందమూరి తారక రామారావు సినారెతో ప్రస్తావన చేశారు. తొలి చిత్రంలో అన్ని పాట లు తనవే ఉండాలన్న కోరికను వ్యక్తపరిచారు. గులేబకావళి కథ సినిమాకు అప్పటికే ఒకరి చేత ఒక పాట రాయించి ఉన్నారు ఎన్టీఆ ర్. అయినా సినారె అభిమతాన్ని అనుసరించి ఆ కవికి నచ్చజెప్పి అన్ని పాటలు రాయించారు. తొలుత రాసిన పాట కలల అలలపై తేలెను కాని తొలుత రికార్డయ్యింది నన్నుదోచుకుందువటే వన్నెల దొరసాని. 1961 నుంచి 1990 వరకు సినారె సినీగీత రచన ఒక స్వర్ణయుగం. ప్రాచీనాధునిక కవిత్వాధ్యయనానుభవం వల్ల సినారె ప్రతి పాటలో తన కవిత్వ ముద్రను నిలిపారు. పేర్కొనదగ్గ పాటలు ఎన్నో.. మొత్తం సుమారు మూడు వేల పాటలు రాశారు.

నిజానికి సినీగీత రచన సినారె బహుముఖ ప్రజ్ఞల్లో ఒకపార్శ్వం మాత్రమే. తాను ఎదుగుతున్న నాటికే తెలుగు కవితా రంగం లోఎందరో గొప్పకవులున్నారు. అప్పటికే అగ్ర కవులతో పోటీప డుతూ పద్యకృతులు, గేయకృ తులు వెలువరిస్తున్నా ఏదో మథ నం జరిగింది ఆయనలో. ఏదో ప్రత్యేకత సాధించాలి అనుకున్నా రు. అంతే ప్రౌఢతరమైన పద్యకృతికి తుల్యంగా కథాత్మక గేయ కావ్యం నాగార్జున సాగరం రాశారు. రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ వంటి విద్వన్మణుల ప్రశంసలు లభించాయి. తర్వాత కర్పూర వసంతరాయలు రాశా రు. దేశ విదేశాల్లో కావ్యగానం చేశారు. నాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రత్యేకంగా హైదరాబాద్ షామంజిల్‌లో నాగార్జు న సాగరం కావ్యగానం ఏర్పాటుచేసి సత్కరించారు.

గేయ కావ్యాలతోనే మహాకవి అనిపించుకున్న సినారె అంతటితో ఆగలేదు. భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం ప్రాబల్యం సాగుతు న్న కాలంతో పోటీ పడాలని నిర్ణయించుకున్నారు. సృజన పౌరుషం తో వచన కవితా రచనను ఉధృతం చేశారు. మంటలూ మానవుడూ, తేజస్సు నా తపస్సు, అక్షరాల గవాక్షాలు, మధ్య తరగతి మందహాసం, విశ్వంభర.. ఇలా కవితాయాత్ర కొనసాగింది. విశ్వంభరకు భారతీయ సాహిత్యంలో అత్యున్నతమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. వచన కవిత్వంలోనూ మహాకావ్య లక్షణాలు పొదువుకున్న విశ్వంభర దీర్ఘ కవిత. ఆదిమ కాలం నుంచి ఆధుని క కాలం దాకా సాగిన మానవ విజయ మహేతిహాసమే విశ్వంభర.

పద్యం, గేయం, వచన కావ్యాలు, నాటికలు, గజళ్ళు, ముక్తకా లు, అనువాదాలు, విమర్శ, పరిశోధన, బుర్రకథ, యాత్రా సాహి త్యం ఇలా అనేక ప్రక్రియల్లో 20 వ శతాబ్దం ఉత్తరార్థం నుంచి 21వ శతాబ్దం ప్రథమ పాదం దాకా విస్తరించి కాలంతో పాటే సాగుతూ వర్తమాన కవులతోనూ పోటీ పడుతూ సాహితీ సృజన చేశారు సినారె. 86 ఏండ్ల వయసు. 86 రచనల సొగసు ఆయనది.

పరిపాలనా పదవుల్లో సినారె దక్షతముద్ర ప్రారంభమైంది. ఆం ధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షునిగా సినారెను నియమించారు. పదవీకాలం పూర్తికాగానే తెలుగు విశ్వవిద్యాల యం ఉపాధ్యక్షులుగా నియమించారు. తర్వాత సాంస్కృతిక మండ లి అధ్యక్షులయ్యారు. భాషా సాంస్కృతిక సలహాదారులయ్యారు. కవులు, కళాకారుల తరపున రాష్ట్రపతి చేత రాజ్యసభ సభ్యులుగా నియమితులయ్యారు. కవితా రచన కొనసాగిస్తూనే విద్యా, సాంస్కృతిక సంస్థల పరిపాలనా పదవులనూ వెలిగించారు సినారె.

ఏడు దశాబ్దాల కవితా సృజనానుభవాన్ని పండించుకున్న మహాకవి డాక్టర్ సి.నారాయణరెడ్డి తెలంగాణ బిడ్డ కావడం గర్వకారణం. మేరట్ విశ్వవిద్యాలయం, నాగార్జున, కాకతీయ, సార్వత్రిక విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు అందించాయి. ఆంధ్ర విశ్వవిద్యాల యం కళాప్రపూర్ణతో సత్కరించింది. సోవియెట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, రాజ్యలక్ష్మీ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ఠ పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలో పురస్కారం.. వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు, సత్కారాలు సినారెను వరించాయి.

కడదాకా కవిత్వం రాస్తూనే వచ్చారు. ఔత్సాహిక, ప్రముఖ కవుల రచనలకు ఆశీస్సులందిస్తూనే వచ్చారు. తమకు ఎవరైనా లేఖరాస్తే దానికి ప్రత్యుత్తరం రాయకపోవడం ఏనాడూ లేదు.

ఒక కవితలో ఆయన అన్న పంక్తులు.

అది తెలుగుకీర్తి.. కదిలే కిరణమూర్తి.. సాగరాల్ దాటిపోయింది రా.. నయాగరాల్ మీటి వచ్చిందిరా..ఈ మాటలు తెలుగు కవిత్వ కీర్తికి, తెలుగు వ్యక్తి కీర్తికి.. సినారె సాహితీమూర్తికి, ఆయన వ్యక్తిత్వకీర్తికి వర్తిస్తాయి.
- డాక్టర్ జుర్రు చెన్నయ్య, 9440049323
(జూలై 29న డాక్టర్ సి.నారాయణరెడ్డి జయంతి సందర్భంగా..)

391
Tags

More News

VIRAL NEWS