సాహితీ, సాయుధ యోధుడు


Mon,July 16, 2018 12:54 AM

హాస్య ప్రియత్వం అతని వ్యక్తిత్వం
సాహసం అతని సహజ లక్షణం
సమయస్ఫూర్తి అతని నాయకత్వ ప్రతిభ
మార్క్సిజం అతని గుండె చప్పుడు
ఉర్దూ భాషా సాహిత్యాలు అతని చిరునామా
ఉదాత్త సమాజ నిర్మాణం అతని నిరంతర స్వప్నం
అతడెన్నియో ఉద్యమాలలో రాటుదేలిన యోధుడు
అజ్ఞాత, అరణ్యవాసాలలో పదునెక్కిన వీరుడు
ఆత్మీయ పలుకరింపులతో పులకించిన ప్రేమాస్పద హృదయుడు
ఆ మహామనీషి రాజ్ బహద్దూర్ గౌర్

RAJBAHADUR
1918 జూలై 21న హైదరాబాద్ పాతనగరంలోని గౌలీపురాలో అమరావతి-శ్రీరాయ్ మహబూబ్‌గౌర్ దంపతులకు పుట్టిన రెండవ సంతానం రాజ్ బహద్దూర్. ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్ జిల్లా కిషన్‌పూర్ గ్రామానికి చెందిన గౌర్ తండ్రిగారు హైదరాబాద్ నగరానికి వలసవచ్చి స్థిరపడ్డారు. రాజ్ పుట్టిన కొన్నాళ్లకే తల్లి మరణించడంతో ఒక ముస్లిం ఆయా పాలిచ్చి పెంచింది. అలా ఉగ్గుపాలతో ఉర్దూభాషా, సెక్యులర్ జీవన విధానం అలవడింది. హైదరాబాద్ పాతనగరంలోని ముఫీదుల్ ఆనాం, ధర్మవంత్, రిఫా యే ఆవ్‌ు పాఠశాలల్లో ప్రాథమిక విద్యను పూర్తిచేసుకున్న రాజ్‌బహద్దూర్ 1928లో శాలీబండలోని మాధ్యమిక పాఠశాలలో చేరారు. అక్కడ ఆరవ స్టాండర్డ్ పూర్తిచేసుకొని, చాదర్‌ఘాట్ ప్రభుత్వోన్నత పాఠశాలలో ఏడవ తరగతిలో చేరి, తమ విద్యా మాధ్యమాన్ని ఉర్దూ నుంచి ఆంగ్లానికి మార్పించుకున్నారు. 1936లో మెట్రిక్ పరీక్షల్లో ప్రథమ శ్రేణిని సాధించినందుకు నెలకు పదిరూపాయల స్కాలర్‌షిప్‌తో 1938 లో ఇంటర్ పూర్తిచేశారు. ఇంటర్‌లోనూ అత్యధిక మార్కులు పొంది ఉస్మానియా మెడికల్ కాలేజీలో చేరారు. ఫ్రీషిప్ సౌకర్యంతోపాటు నెల కు పదిహేడు రూపాయల స్కాలర్‌షిప్ పొందారు.

1934 నుంచి సాహిత్యంపై మక్కువ పెంచుకున్న రాజ్ బహద్దూ ర్ తమ ఇంటిలోనే ఒక రీడింగ్ రూంనూ, గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పుస్తకాలను సేకరించడం ప్రారంభించారు. ఆధునిక సాహిత్య ధోరణుల మీద, అభ్యుదయ సాహిత్య సిద్ధాంతాల మీద, హిందీ, ఉర్దూ భాషల్లోనూ, ఆంగ్ల భాషలోనూ అనేక విమర్శనాత్మక వ్యాసాలు, సమీక్షా వ్యాసాలను గౌర్ రచించారు. రాజ్ బహద్దూర్ తొలిరచన ట్రైకలర్ షల్ ైఫ్లెఓవర్ హైద్రాబాద్ 1947లో అచ్చయిం ది. 1970లో మఖ్దూం సాహిత్యాన్ని ఆంగ్లంలో పరిచయం చేస్తూ ఒక గ్రంథాన్ని ప్రచురించారు. 1975లో తెలంగాణ సాయు ధ పోరాటాన్ని విశ్లేషిస్తూ గ్లోరియస్ తెలంగాణా ఆర్మ్ డ్ స్ట్రగుల్ గ్రంథాన్ని వెలువరించారు. 1978 లో అదబీ ముతల్‌హీ ఉర్దూ వ్యాస సంకలనాన్ని ప్రకటించారు.

తెలంగాణ సాయుధపోరాటంలో పాల్గొ న్న డాక్టర్ గౌర్ సుదీర్ఘ రాజకీయ, రహస్య, కారాగార జీవితాలు గడిపారు. 1940లో భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం, 1941 లో కామ్రేడ్స్ అసోసియేషన్ సభ్యత్వాన్ని పొందారు.
1937-38 మధ్యకాలంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని కోరుతూ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహోద్యమాన్ని ప్రారంభించింది. ఆర్యసమాజం, హిం దూ పౌరహక్కుల సంఘం కూడా ఈ ఉద్యమంలో చేరాయి. ఉద్య మం ఊపందుకుంటున్న దశలో గాంధీజీ దేశవ్యాప్తంగా సత్యాగ్రహ విరమణ ప్రకటించారు. ఉద్యమ విరమణ నిర్ణయం యువతరాన్ని అసంతృప్తికీ, ఆగ్రహానికీ గురిచేసింది. సరిగ్గా ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపించబడింది. అసంతృప్త సత్యాగ్రహుల్లో ఒకరైన రాజ్ బహద్దూర్ 1941లో కామ్రేడ్స్ అసోసియేషన్ సభ్యత్వం స్వీకరించారు. అప్పటికే అతని సహచరులైన మఖ్దూం, సయ్యద్ ఇబ్రహీం, మాణిక్‌లాల్ గుప్తా, నాగోరావు మొదలైనవారు ఈ సంస్థలో సభ్యులుగా ఉన్నారు. 1940లో మఖ్దూం నగర పార్టీ కార్యదర్శిగా ఉన్నప్పుడు డాక్టర్ గౌర్ సహాయ కార్యదర్శిగా ఉన్నారు.

1945, 1948 సంవత్సరాల్లో హైదరాబాద్ నగర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా డాక్టర్‌గౌర్ పదవీ బాధ్యతలు నిర్వహించారు. 1940 దశకం నుంచే హైదరాబాద్ సంస్థానంలో వివిధ ట్రేడ్ యూనియన్‌లకు నాయకత్వం వహించారు. 1946లో అనేక కర్మాగారాల్లో మఖ్దూం, మహేంద్ర, రామనాథం గార్లతో కలిసి ట్రేడ్‌యూనియన్లను నెలకొల్పారు. 1946 అక్టోబర్ 16న హైదరాబాద్ సం స్థానవ్యాప్తంగా కార్మికుల అణచివేత వ్యతిరేక దినం పాటించారు. నిరసనలు, సమ్మె లు, ఉద్యమాలతో క్రమంగా ఈ ప్రాంతమంతా వేడెక్కసాగింది. 1946 నవంబర్ 15న కమ్యూనిస్టు పార్టీ నిషేధింపబడింది. 1947 సెప్టెంబర్ 13న ప్రారంభమైన సాయుధ పోరాట పూర్వాపరాలను జాతీయ నాయకత్వానికి వివరించే బాధ్యతను, ఆమోదాన్ని పొందే కర్తవ్యాన్ని డాక్టర్ రాజ్ బహద్దూర్ గౌర్ సమర్థవంతంగా నిర్వర్తించారు.
1951 ఏప్రిల్ 23నాడు నల్లగొండ జిల్లా, దేవరకొండ తాలూకాలోని రాచకొండ గుట్టల్లో డాక్టర్ రాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండ జైల్లో కొంతకాలం, హైదరాబాద్ సెంట్రల్ జైల్లో మరికొం త కాలం కారాగారవాసం. 1952లో జైల్లో ఉండగానే రాజ్యసభకు ఎన్నికైన డాక్టర్ రాజ్, అప్పటి రాజ్యసభ ఛైర్మన్, ఉప రాష్ట్రపతి డాక్ట ర్ రాధాకృష్ణన్ ప్రమేయంతో జైలునుంచి విడుదలయ్యారు. రెండు పర్యాయాలు (1952, 1956) రాజ్యసభ సభ్యులుగా బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ గౌర్ ఆ తర్వాత కాలమంతా క్రియాశీల కార్మిక ఉద్యమానికీ, కమ్యూనిస్టు పార్టీ బాధ్యతల నిర్వహణకు అంకితమై పనిచేశారు.

భారత కమ్యూనిస్టు పార్టీ నగర కార్యదర్శి మొదలు జాతీయ సమితి సభ్యులు గానూ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మొదలు జాతీయ కార్యవర్గంలోనూ ప్రముఖమైన పాత్రను నిర్వర్తించారు. అఖిలభారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయుసీ) రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షులుగా, అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించిన గౌర్ ఏఐటీయుసీ జాతీయ కార్యదర్శి (1958) గా నూ, జాతీయస్థాయి ఉపాధ్యక్షులు (1986)గానూ ఉన్నతమైన పద వీ బాధ్యతలను ప్రతిభావంతంగా నిర్వహించారు. తమ 72 ఏండ్ల వయస్సు (1990)లో క్రియాశీల బాధ్యతల నుంచి గౌర్ స్వచ్ఛందం గా వైదొలిగారు.ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకుడిగా దేశంలోని దాదాపు అన్ని రాష్ర్టాలను పర్యటించిన డాక్టర్ రాజ్ బహద్దూర్ గౌర్ సోవియ ట్ యూనియన్, జెకోస్లోవేకియా, జర్మన్ డెమొక్రటిక్ రిపబ్లిక్, ఉత్తర కొరియా, మంగోలియా, బల్గేరియా మొదలైన దేశాలను సందర్శించారు. మఖ్దూం ప్రఖ్యాత గీతం చమేలీకా మండ్వా (మల్లెపంది రి) నీడ కింద విశ్రాంత జీవితాన్ని గడిపి అస్తమించిన రాజ్ బహద్దూర్ గౌర్ వ్యక్తిత్వం, జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమైన ఇతిహాసం.
- ఆచార్య ఎస్వీ సత్యనారాయణ
96180 32390
(జూలై 21 డాక్టర్ రాజ్ బహద్దూర్‌గౌర్ శతజయంతి సందర్భంగా..)

350
Tags

More News

VIRAL NEWS