కథలెందుకు? పిల్లల విశ్లేషణలు


Mon,July 16, 2018 12:53 AM

కథ మానవ జాతి సమకూర్చుకున్న అమూల్యమైన సాహిత్య సంపద. అద్భుతమైన ఆయుధం. ఇలాంటి కథను మన పిల్లలకు, రాబోయేతరాలకు అందించడం ఒక ప్రధానమైన బాధ్యతలా అందరూ గుర్తించాలి. అందుకు అందరూ సహకరించాలి. నేడు తెలుగు లో పిల్లల కోసం వస్తున్న బాలసాహిత్యంలో అత్యధిక భాగం గతకాలపు ప్రసిద్ధమైన కథలను తిరుగవేసి, బోర్లా వేసి అనుకరణలు చేసి అటుతిప్పి, ఇటుతిప్పి కొత్త కథలుగా అందిస్తున్నవే ఎక్కువగా ఉంటున్నవి. నేటి పిల్లల పరిస్థితులు కానీ, పాత్రలు కానీ, అవసరా లు కానీ, సమస్యలు కానీ, నేటి పిల్లలు ఎదుర్కొంటున్న ఛాలెంజ్‌లు కానీ, సాధిస్తున్న విజయాలు కానీ, ఆధునిక జీవిత విధానాలు కానీ, కనిపిస్తున్న కథలు చాలా చాలా తక్కువ.

కథలు లేని మానవ సమాజాలు, మానవజాతులు ఎక్క డా లేవని కచ్చితంగా చెప్పొచ్చు. లిపి ఉన్నా లేకున్నా, లేఖనం వచ్చినా, రాకున్నా మాట్లాడటం వచ్చిన ప్రతి మానవ సమాజపు జీవితం, సామాజిక చలనం కథా ప్రక్రియలను బాగా ఉపయోగించుకున్నది.
కథ వేల సంవత్సరాలుగా మానవజాతికి ఒకతరం నుంచి మరొక తరానికి అందివస్తున్న ఓ అమూల్యమైన సంపద. కథ మానవజాతి పురోగతికి ఓ దిక్కానిలా, దిక్సూచిలా తోడ్పడింది. కథల్లో కనిపించిన అనేక ఊహలు, కల్పనలూ శాస్త్రీయ పరిశోధనలకూ, శాస్త్రీయ ఆవిష్కరణలకూ ప్రేరణను ఇచ్చాయి. పునాదిగా నిలబడినా యి. కథ ప్రపంచాన్ని గురించి ఆలోచించడం నేర్పింది. లోకాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఎలా నడుచుకోవాలో, లోకవ్యవహారం ఎలా నిర్వహించాలో నేర్పింది. యుద్ధాలు, ప్రకృతి వినాశనాల మొదలు కుటుంబాల్లో జరిగే తీవ్రమైన సంక్షోభ పరిస్థితుల్లో కావలసిన గుండె నిబ్బరాన్ని, ఓదార్పునిచ్చింది. ఏది మంచో, ఏది చెడో, ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్పింది. ఎలా ఉండాలో ఎలా ఉండాకూడదో ఉదహరించింది. కల్పనాశక్తి, ఊహాశక్తి వికసించడానికి మెదడును నిశితం చేయడానికి వ్యాయామాన్నిచ్చింది. కథ జానపదుల్లో బుర్రకథ, ఒగ్గుకథ, చిందు, యక్షగానం వంటి అనేకానేక కళాప్రక్రియలతో కూడా కలిసిపోయి విశ్వరూపాన్ని ప్రదర్శించింది. నాగరిక సమాజాల్లో పురాణ శ్రవణాలు, ప్రవచనాలు, హరికథలు, సత్యనారాయణ కథల వంటి పూజా ప్రక్రియల్లో, సినీమా లూ, సీరియళ్ళుగానూ కొనసాగుతున్నది. వ్యక్తిత్వ వికాస నిపుణు లు అనబడేవారు, స్టోరీ టెల్లర్లుగా కనబడేవారు కొందరు కథను వ్యాపార సరుకుగా మార్చేసిన, మార్చేస్తున్న క్రమం కొనసాగుతున్నది. ఎంతమంది గొప్ప నటులను పెట్టి తీసిన సినీమాలైనా కథ లేక బోల్తా పడుతున్న విషయం కనబడుతున్నది. మరోవైపు ఆధునిక వస్తుజాలం, జీవితం ఊహనూ, కల్పననూ పిల్లల్లో, సామాన్య జనాల్లో చంపేస్తున్నది.

1998 నుంచి బాలసాహిత్య రంగంలో పిల్లల్లో రకరకాల సాహి త్య సృజనాత్మక కార్యక్రమాలు పిల్లల లోకం పేరుతో నిర్వహిస్తున్న మేము గత ఆగస్టు 2017 నుంచి పాఠశాలల్లో తిరుగుతూ పిల్లలతో కథలు చెప్పించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. అలా ఓ వెయ్యి మంది పిల్లలు చెప్పిన కథల్ని వీడియోలు తీసి యూట్యూబ్ ద్వారా ప్రపంచానికి అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా కథలెందుకు? అనే ప్రశ్నను పిల్లల ముందు ఉంచినపుడు వాళ్ళు అనేక కోణాల్లో కథల ప్రయోజనాలను గురించి తమ మాటల్లో చెప్పారు.
కథలు వింటే ఆనందంగా ఉంటుందని, సంతోషం కలుగుతుందని, బాగుంటుందని, కాలక్షేపంగా టైంపాస్ అవుతుందని కొందరు పిల్లలు చెప్పారు. భాషా నైపుణ్యాలు, ఉచ్చారణ, మాట్లాడే పద్ధతి బాగుపడతాయని కొందరు చెప్పారు. ధైర్యం పెరుగుతుందని, తెలివితేటలు పెరుగుతాయని, సమస్యలు వస్తే తీర్చుకునే పద్ధతి తెలుస్తుందని అన్నారు. కొత్త సంగతులు తెలుసుకోవచ్చని, చరిత్ర తెలుస్తుందని చెప్పారు. ఊహించుకుంటామని తామే ఆ పాత్రలుగా అనిపిస్తుందని, నీతులు ఉంటాయని, స్నేహం పెరుగుతుందన్నారు. పెద్దవాళ్ళపై ప్రేమ, గౌరవం పెరుగుతాయని, కలిసి ఉండటం తెలుస్తుందని, కొత్త ఆలోచనలు కలుగుతాయని, మనుషుల గురించి అర్థ మవుతుందని, జంతువుల గురించి తెలుస్తుందని కొందరన్నారు. మంచి కలలు వస్తాయని ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎప్పుడెలా ప్రవర్తించాలో తెలుస్తుందని కొందరు చెప్పారు.

చదువడం రాయడం నేర్చుకోవచ్చని, తాము కూడా కథలు పుట్టించి రాస్తామని, తమ పేర్లు పత్రికల్లో వస్తాయని, తమను కూడా మెచ్చుకుంటారన్నారు. ఇంకా అల్లరి చేయరని, అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవచ్చని, రాజుల గురించి, దేవతల గురించి, దెయ్యాల గురించి, మాంత్రికుల గురించి వినడం ఆసక్తిగా ఉంటుందని చెప్పారు. నవ్వు వస్తుందని, నటన నేర్చుకోవచ్చని, మిమిక్రీ చేస్తామని కొందరు భావించారు. ఇప్పుడు ఎవరూ తమకు కథలు చెప్పడం లేదని, పాఠ్యపుస్తకాల్లో ఉండే కథలు ఆసక్తికరంగా ఉండవని, కొన్నే బాగుంటాయని, కథ కూడా పాఠంలాగే అనిపిస్తుందని కొందరు పిల్లలు అన్నారు. తమకు కథలు చదివే, వినే చెప్పే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. గుర్తింపు వస్తుందని, డబ్బులు సంపాదించుకోవచ్చని బహుమతులు వస్తాయని, కథలను నాటికలుగా చేసి సెల్‌ఫోన్లలో చిత్రించవచ్చునని కూడా కొందరు పిల్లలు అన్నారు.ఇలా కథను గురించి పిల్లలు చెప్పిన మాటలు పెద్ద పెద్ద సూత్రీకరణలు కాకపోయినా కథల అవసరాన్ని కథల ఉపయోగాన్ని వాళ్ల భాషలో తెలుపుతున్నాయి. ఈనాడు కథలు చెప్పడాన్ని, రాయడా న్ని పూర్తిగా వ్యాపార కళగా, వ్యాపార సరుకుగా మార్చేసే ప్రయత్నా లు కూడా చాపకింద నీరులాగా జరుగుతుండటాన్ని మనం చూస్తున్నాం.

కథ మానవ జాతి సమకూర్చుకున్న అమూల్యమైన సాహిత్య సం పద. అద్భుతమైన ఆయుధం. ఇలాంటి కథను మన పిల్లలకు, రాబోయేతరాలకు అందించడం ఒక ప్రధానమైన బాధ్యతలా అంద రూ గుర్తించాలి. అందుకు అందరూ సహకరించాలి. నేడు తెలుగు లో పిల్లల కోసం వస్తున్న బాలసాహిత్యంలో అత్యధిక భాగం గతకాలపు ప్రసిద్ధమైన కథలను తిరుగవేసి, బోర్లా వేసి అనుకరణలు చేసి అటుతిప్పి, ఇటుతిప్పి కొత్త కథలుగా అందిస్తున్నవే ఎక్కువగా ఉంటున్నవి. నేటి పిల్లల పరిస్థితులు కానీ, పాత్రలు కానీ, అవసరా లు కానీ, సమస్యలు కానీ, నేటి పిల్లలు ఎదుర్కొంటున్న ఛాలెంజ్‌లు కానీ, సాధిస్తున్న విజయాలు కానీ, ఆధునిక జీవిత విధానాలు కానీ, కనిపిస్తున్న కథలు చాలా చాలా తక్కువ. ఆచరణకు దూరంగా ఆదర్శాలు కేవల నీతులు బోధించడానికే పరిమితమవుతున్న కథలు చాలా ఎక్కువ వస్తున్నాయి. పిల్లల్లో విశ్లేషణ శక్తిని, నిర్ణయాలు తీసుకునే నేర్పును, లోకాన్ని అర్థం చేసుకునే అవగాహననూ, జీవిత పోరాటానికి సిద్ధం చేసే ఆత్మ స్థైర్యాన్ని ఇచ్చే కథలు రావాల్సి ఉన్నది. బాల సాహిత్యం పేర పెద్దలే కథలు రాసుకొని తమ పుస్తకాలు పెద్దలకే పంచుకొని, సన్మానాలు సత్కారాలు, అవార్డులు, పండుగ లు అన్నీ పెద్దవాళ్లకే పరిమితమై నామమాత్రంగా పిల్లలను ఆహ్వానిస్తున్న సంస్కృతి మారాలి. పిల్లలే బాల సాహిత్యంలోని మంచి చెడులను నిర్ణయించే రోజులు రావాలి.
- డాక్టర్ వి.ఆర్.శర్మ, 9177887749

336
Tags

More News

VIRAL NEWS