ఆధునిక తెలంగాణ చరిత్రకు కరదీపిక


Sun,July 8, 2018 10:57 PM

అనేక స్థాపిత ఉద్యమాలను, ఆలోచనలను, భావనలను కాదని ప్రపంచీకరణ అనంతరం నిరంతరాయంగా వెల్లువగా పెల్లుబికింది తెలంగాణ రాష్ట్ర ప్రజా ఉద్యమమే. ఆ కోణంలో తనదైన చరిత్రను రూపొందించుకోవడానికి బీజప్రాయ అన్వేషణ మొదలైందని తెలంగాణ ఉద్యమపాట విమర్శ అన్న ఈ గ్రంథం నిరూపిస్తున్నది. సాకల్యంగా చూస్తే ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చాలా న్యాయబద్ధమైనదని ఈ పుస్తకం తేల్చింది.
ravinder-cover
ఆధునిక తెలుగు సాహిత్యరంగపు చరిత్ర రచనా క్రమం మొదలై 150 ఏండ్లు దాటింది. ఇది నాడే తొలుత రాజమండ్రి, మరికొన్నాళ్లకు హైదరాబాద్ కేంద్రంగా రూపుదిద్దుకున్నది. మొత్తంగా చూస్తే ఇందులో సంప్రదాయ చరిత్ర (ట్రెడిషనల్ హిస్టరోగ్రఫీ), సహా జాతీయవాద చరిత్ర క్రమం (నేషనలిస్ట్ హిస్టరోగ్రఫీ), ప్రగతిశీల చరిత్ర (ప్రొగ్రెసివ్ హిస్టరోగ్రఫీ ప్రధానమైనవి. సిపాయిల తిరుగుబాటు తర్వాత తెలంగాణ, నాటి సర్కారు జిల్లాలలో బాగా బలపడ్డ యూరోపియన్ ఉదారవాద భావన జాతీయ చరిత్ర క్రమం, 1920 నుంచి ప్రవేశించిన మార్క్సి స్టు భావన వల్ల ప్రగతిశీల చరిత్ర క్రమవికాసానికి దారి తీసింది. కారణాలు, నేపథ్యం భూమిక ఏదైనా ప్రపంచవ్యాప్తంగా చెలామణిలో ఉన్నదే. తెలంగాణ రాష్ట్ర ఉద్య మం వల్ల రాజమండ్రి కేంద్రంగా రూపుదిద్దుకున్న ఆంధ్ర కేంద్రిత చరిత్ర సహా తెలుగువాళ్ల చరిత్ర రచనా క్రమం పూర్తి బలహీనపడింది. ఇప్పుడు తెలంగాణ కేంద్రంగా తలెత్తిన ప్రగతిశీల చరిత్ర రచనా క్రమం మౌలికమైన ప్రతిపాదనలతో సరికొత్త రూపు సంతరించుకుంటున్నది. కవి రచయిత డాక్టర్ పసునూరి రవీందర్ వెలువరించిన పరిశోధక గ్రంథం తెలంగాణ ఉద్యమపాట విమర్శ దీనినే తేటతెల్లం చేస్తున్నది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూపుదిద్దుకున్న సాహిత్యచరిత్ర రచనాక్రమాన్ని దానికి సంబంధించిన నమూనాలను, ప్రమాణాలను, అది స్థాపించిన వైతాళిక పరంపరను ఈ పుస్తకం తిరస్కరించింది. చరిత్రరచనలో కుల దృక్పథంతో దళిత బహుజన మేధావులు ముందుకు తెస్తున్న వాదనల ప్రతిఫలనం కూడా పరోక్షంగా ఉన్నది. తాను స్వయంగా మార్క్సిస్ట్, అంబేద్కర్ అయినందువల్ల కావచ్చు, మొత్తం ప్రతిపాదనలలో ఒక సంయమనం కూడా ఉన్నది. దృష్టి కోణం తెలంగాణ ఉద్యమ పాటపైనే అయినప్పటికీ మొత్తం తెలుగు సాహిత్య దశలు, మలుపుల చరిత్ర చర్చతోనే ఈ పుస్తకం మొదలవడం విశేషం.
ఇటీవలి వరకు విశ్వవిద్యాలయంలో ఆధునిక, తెలుగు కవిత, పాట చరిత్రపై పరిశోధన గురజాడపై చర్చతో మొదలవడం పరిపాటి. తెలంగాణ సహా మొత్తం తెలుగు జాతికే ఆయనను ఆధునిక భావ వీచికల క్రమానికి వైతాళికునిగా చూపి చరిత్ర రచనకు పూనుకోవడం తెలిసిందే. ఇది కూడా వలస పాలకుల చరిత్ర రచనకు కొనసాగింపే. తెలుగులో పేరెల్లిన ప్రతి రచయిత గురజాడ ప్రతిపత్తిని అంగీకరించినవాళ్లే. కానీ ఈ పరిశోధకుడు దానిని సరిగా వందేండ్లకు వెనక్కి మలిపాడు. ఆయన స్థానంలోనే తెలంగాణకు చెందిన తత్వాల రచయిత మాదిగ మహాకవి దున్న ఇద్దాసు (శ్రీదున్న ఇద్దాసు తత్వాలు, సంపాదకుడు మహేంద్రనాథ్, పరిష్కర్త రాటకొండ శేఖర్‌రెడ్డి), మరోకవి బ్రాహ్మణుడైన రాకమచర్ల వెంకటదాసులో ప్రచలితమైన హిందూ ఫ్యూడల్, ఆధిపత్యభావాల వ్యతిరేకతను ఆసరాగా తీసుకొని మొత్తం ఆధునిక ఉద్యమ పాటను చర్చించడం చూస్తాం. రవీందర్ తీరు యాదృచ్ఛికమే.

అయినా అది సరికొత్త ప్రతిపాదన. దున్న ఇద్దాసు పుట్టిన కాలం ఆయనను ఆకర్షించింది. కానీ చారిత్రక దృష్టితో చేసిన పరిశీలన కాదు. నాటి తెలంగాణ పరిస్థితులను చూస్తే సమంజసమేనని చెప్పవచ్చు. ఆనాటికి స్థానికంగా అనేక సామాజిక, రాజకీయ పరిణామాల్లో ఒక మలుపు కనిపిస్తుంది. ఇదేకాలా న మఠం మనవాళ్లయ్య, వెంకటభూపాలుడు, ఉర్దూలో చందాబా యి మహ్లక, సులేమాన్ ఖతీబ్ వంటి కవులు ఆనాటికి చెలామణిలో ఉన్న సాహిత్య సంప్రదాయాలపై తిరుగుబాటు చేశారు. బ్రిటిష్ వలస వ్యతిరేక ఉద్యమమైన వహబీ పోరాటంలో పాల్గొం టూ నాటి హైదరాబాద్ పాలకులకు వ్యతిరేకంగా రాజా సదాశివరె డ్డి, రెండవ నిజాం కొడుకు ఆర్తుజా మెదక్ జిల్లా సదాశివపేట కేం ద్రంగా ఆంగ్ల వలసవాదానికి, రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా రైతాం గ తిరుగుబాటు చేసి ఉరికంబానికి ఎక్కారు. ఫ్రెంచి విప్లవంతో సరిసమానమైంది. అంతర్జాతీయంగా ఆంగ ్లరొమాంటిజానికి ఆద్యుడైన వర్డ్స్‌వర్త్, కాలరిడ్జ్‌లు సంపాదకులుగా ఇంగ్లీష్ భాషలో భావకవిత్వానికి నాంది పలికిన ప్రీవర్స్ గ్రంథం వెలువడింది. హైదరాద్‌లో పనిచేస్తూ కోల్‌కత్తాకు వెళ్లిన కావలి రామస్వామి సంపాదకునిగా దక్కన్ పోయెట్స్ గ్రంథం వెలువడింది. అటు ఇటుగా రెం డూ ఒకేకాలంలో వెలువడ్డాయి. దీనికి ధన సహాయం చేసింది రాజారావ్‌ుమోహన్‌రాయ్, రవీంద్రుని తాతగారు ద్వారకానాథ్ ఠాగూర్.

సరిగా ఈ కాలంలో ఏనుగుల వీరస్వామయ్య తెలంగాణ లో పర్యటిస్తున్నారు. ఇదే కాలంలో మెకంజీ సహాయకుడు, తెలంగాణకు చెందిన వెంకటరావు దినవహీ పేరుతో వచన గ్రంథం వెలువరించాడు. నాటి భారతదేశ చరిత్ర క్రమంలో ముఖ్యమైన ఈ ఘట్టాలన్నీ 1780 నుంచి 1825 వరకు జరిగినవే. రాకమచర్ల, దున్న ఇద్దాసు లు అందుకు సమకాలికులు, తిరుగుబాటుకు కేంద్రమైన సదాశివపేటకు సమీప గ్రామస్థులు. ఈ పరిణామాలకు ప్రత్య క్ష సాక్షులు. ఈ తిరుగుబాటులో వీర మరణం పొందినవారిలో పాపన్న అనే ఎస్సీ యోధుడు సహా చాలామంది మాదిగ, మాల సైనికులు, ఇతర శూద్రకులాల వారు పాల్గొన్నారు. ఈ తిరుగుబాటు ప్రభావం (8, 5వ తత్వాలు) దున్న ఇద్దాసు తత్వాల మీద కూడా ఉన్నది. భావ కవితను పోలిన రచన (2,13 తత్వాలు) కూడా ఉన్నది. ఆనాటి అసంగతమైన పరిస్థితులు, రాజ్యం గురించి కవితాత్మక వ్యక్తీకరణ లు ఆయన తత్వాలలో ఉన్నాయి. ఒక జాతీయ విశ్వవిద్యాలయం ఆమోదంతో వెలువడిన ఈ రచన ఈ మేరకు ప్రాధాన్యం సంతరించుకుంటున్నది. ప్రపంచస్థాయి నగరం వందల ఏండ్లుగా ఉన్న తెలంగాణలో సాహిత్య, సామాజిక పరిణామాలను తొక్కిపెట్టి ఏకపక్షంగా గురజాడను తెలుగు జాతి వైతాళికునిగా నిలబెట్టింది కూడా తొలుత బ్రాహ్మణ వ్యతిరేకోద్యమకారులే.అటు తర్వాత ప్రగతిశీలవాదులే. గురజాడ కూడా గొప్ప రచయిత.

ఆయన సహా కోస్తాంధ్ర ప్రాంతం పరిణామాలు చాలా ప్రగతిశీలమైనవే కావచ్చు. దీనిని చెప్పడానికి తెలంగాణ సాహిత్యరంగ పరిణామాలను తొక్కిపెట్టాలా.. ఆంధ్ర పాలకవర్గాలతో పాటు తెలుగు జాతి పేరుతో ఊదరగొట్టే ప్రగతిశీల సాహిత్యోద్యమకారులు కూడా ఇందుకు బాధ్యులు కావడం శోచనీయం. ప్రజాస్వామిక భావనలకు ప్రతినిధిగా గురజాడను చిత్రిస్తూ వచ్చిన వీరు తెలుగు సమాజంలో ప్రధాన భాగమైన తెలంగాణ చరిత్రను, సాహిత్య పరిణామాలను తొక్కిపెట్టడం ఏ ప్రజాస్వామిక విలువకు నిదర్శనం. గొప్ప సామాజిక, కళారంగ చరిత్ర కలిగి అణగారిపోయిన మాదిగ సామాజిక వర్గంలో జన్మించిన రవీందర్ ప్రతిపాదనను హిస్టరీ రైటింగ్ ఫ్రవ్‌ు బిలో అన్న నేపథ్యంలో పరిశీలించాలి. వందేండ్ల క్రితం ఇప్పటికీ ఫ్యూడల్ వాసనలు వదలని ఒక చిన్న పట్టణంలో పుట్టిన గురజాడపై ఆధునిక వీచికలు తెచ్చిన మహాపురుషునిగా చూడటం దాదాపు 80 ఏండ్లుగా కొనసాగుతున్నది. ప్రాంతం, కులం ఏదైనా ఆయన ప్రస్తావన లేకుండా ఆధునిక సాహిత్య చరిత్ర రచన గ్రంథాల సహా పాట, కవితకు సంబంధించిన గ్రంథం ఒకటి కూడా వెలువడలేదు. ఈ మేరకు రవీందర్ పరిశోధన గ్రంథమే మొదటిది అనుకుంటాను. ఇప్పటికీ అరసం, విరసం వంటి సాహిత్య సంస్థలు, విశ్వవిద్యాలయాలు గురజాడకు అంటగడుతున్న ప్రతిపత్తి బీటలు వారనున్నదా...? త్వరలో కాలం నిర్ణయిస్తుంది.

ఏమైనా ఇది తెలంగాణ కష్టజీవుల భాషా సంస్కృతులను అణిచివేస్తూ వచ్చిన ఆంధ్ర ఆధిపత్యవాదులపై చరిత్ర తీర్చుకున్న ప్రతికారం. అయితే ఈ యత్నం ఇంతకుమునుపు కూడా పరిశీలనాత్మకంగా జరిగింది. ఆయన వైతాళిక ప్రతిపత్తి మీద సీరియస్ అధ్యయనం ఇంతవరకైతే వెలువడలేదు. ఆయన తొలి కథకుడు కాదన్న చర్చ, మిలియన్ మార్చ్ సందర్భంగా ఆయన విగ్రహం కూల్చివేతను మినహాయిస్తే తెలంగాణ ఉద్యమం సందర్భంలో కూడా తెలుగు జాతి వైతాళికునిగా స్థిరపడ్డ గురజాడ ప్రతిపత్తిమీద ఎలాంటి ప్రశ్నలు రాలేదు. ఆయనకు ప్రతిగా మరొకరిని నిలబెట్టే ప్రయత్నం ఎవరూ చేయలేదు. నిజానికి వేమన, దున్న ఇద్దాసు, రాకమచర్ల వంటి కవులు నిర్మించిన దారిలోనే గురజాడ నడిచారన్నది వేల్చేరు నారాయణరావు రాశారు. రవీందర్ ప్రతిపాదన ఈ మేరకు సరైందే. ఈ పరిశోధనలో మరో కొత్త పద్ధతిని కూడా ఎంచుకున్నాడు. ఉపరితలంలోంచి పునాదిని పరిశీలించే పద్ధతి అది. ఈ పద్ధతిని మొదట ప్రవేశపెట్టింది సురవరం ప్రతాపరెడ్డి. ఆ రకంగా రవీందర్ సురవరం వారసుడు. దీనివల్ల సామాన్యులైన కవుల ప్రశస్తి చాలా వెలుగులోకి వచ్చింది. ఇది వారి భావ ప్రకటనను వ్యక్తీకరణ స్వేచ్ఛను గౌరవవించడమే. ప్రజాస్వామ్యం వల్ల సాకారమైన హక్కుల స్పృహ సామాన్యుల ఆలోచనల్లో ఎట్లా రూపుదిద్దుకున్నదో చెబుతూ రవీందర్ బాబా అంబేద్కర్‌కు నివాళి అర్పిస్తున్నాడు.

అనేక స్థాపిత ఉద్యమాలను, ఆలోచనలను, భావనలను కాదని ప్రపంచీకరణ అనంతరం నిరంతరాయంగా వెల్లువగా పెల్లుబికింది తెలంగాణ రాష్ట్ర ప్రజా ఉద్యమమే. ఆ కోణంలో తనదైన చరిత్రను రూపొందించుకోవడానికి బీజప్రాయ అన్వేషణ మొదలైందని తెలంగాణ ఉద్యమపాట విమర్శ అన్న ఈ గ్రంథం నిరూపిస్తున్నది. సాకల్యంగా చూస్తే ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చాలా న్యాయబద్ధమైనదని ఈ పుస్తకం తేల్చింది.
- సామిడి జగన్‌రెడ్డి, 85006 32551

618
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles