సరళ సుందర భాషా వ్యాసాలు


Mon,June 18, 2018 01:28 AM

తెలుగు భాష స్వరూప స్వభావాలనూ,ఔన్నత్య ఔచిత్యాలనూ, తీరుతెన్నులనూ మామూలు పాఠకులకు, పోటీపరీక్షార్థులకు, సాహిత్యపు చదువరులకు సరళంగా అందించిన ద్వానా శాస్త్రి కృషి ప్రశంసనీయం. భాష పట్ల, ప్రజల పట్ల, మాండలికాల పట్ల ఆయన అభిప్రాయాలు ప్రజాస్వామిక దృక్పథానికి నిదర్శనం.
Dwana-Shastri
ద్వానా శాస్త్రి తెలుగు సాహితీ ప్రపంచంలో చిరపరిచితమైన పేరు. ఆయన కవి, విమర్శకుడు, పరిశోధకు డు, సాహితీ చరిత్రకారుడు. ఒక్క ముక్కలో మం చి సాహితీవేత్త. ద్వానా శాస్త్రిలో భాషా పరిశోధకుడు కూడా ఉన్నా డు. కవిత్వానికైనా, విమర్శకైనా, పరిశోధన, సాహిత్య చరిత్ర రచ న.. ఏదైనా అది ప్రకటించబడాలంటే భాషది ముఖ్యపాత్ర. ఆ ప్రాధాన్యం గుర్తెరిగిన ద్వానా అనేక భాషావ్యాసాలు రాశాడు. ముఖ్యంగా వాటిని విద్యార్థులను, ఉపాధ్యాయులను, సాధారణ పాఠకులను, సాహితీ ప్రియులను దృష్టిలో ఉంచుకొని రాయడం ఆయన విశిష్టత. భాషకు సంబంధించిన మౌలిక విషయాలను అందరితో పంచుకోవాలన్నది అతని దృక్పథం. సరళమైన భాష లో భాషా సంబంధిత జటిలమైన అంశాలను సైతం అతి సరళం గా చెప్పడం ద్వానాశాస్త్రి ప్రత్యేకత.

ఇదీ మన తెలుగు, మాటలంటే మాటలా?, మన తెలుగు తెలుసుకుందాం, మన తెలుగు వైభవం, తెలుగు జిలుగు వం టివి ద్వానా శాస్త్రి రచించిన భాషా సంబంధిత గ్రంథాలు.ఇదీ మన తెలుగులో తెలుగు జాతి ఎంత ప్రాచీనమో తెలుగు భాష అంత ప్రాచీనమని వివరించాడు. పైగా భాష ప్రాచీనతకు కవిత్వం గీటురాయి కాదు-జన వ్యవహారామే గీటురాయి అన్నా డు. నిజమే కదా, ముందు భాష ప్రజల భావ ప్రకటన, గ్రహణ సౌకర్యాల కోసం పుట్టింది. కవిత్వ భాషలూ, శాస్త్ర భాషలూ, సాహిత్య భాషలూ అన్నీ ప్రజా భాష తర్వాతనే! ఆ స్పష్టత శాస్త్రి లో ఉండటం సుగుణ సంబంధితం. తెలుగు అక్షరాలలో ఋ ౠలు ఉండాలనీ, శకటరేఫం అవసరం వుందనీ, అరసున్న అర్థ భేదక సామర్థ్యం కలిగి ఉందనీ నిక్కచ్చిగా తన అభిప్రాయ ప్రకటన చేస్తాడు. ఇదీ మన తెలుగులో జాతీయాలు, సామెతలు, శబ్ద పల్లవాలు.. ఇత్యాది పలు విషయాలు విశదం చేశాడు. దస్తూరి కూడా బాగుండాలన్న సూచన బావుంది. మంచి తెలుగు రాయాలంటే కావలసింది కాసింత భాషాభిమానం. ఆపైన అభ్యాసం అన్న శాస్త్రి అభిప్రాయం నిరభిమాన, దురభిమానాలకు దూరమైనది. పైగా మానవతకీ, వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడేది మాతృభాష అనే అభిప్రాయ ప్రకటన సత్యదూరమైనది కానేకాదు.

శాస్త్రి రచించిన మన తెలుగు తెలుసుకుందాం అనే పుస్తకమూ సూటిగా పాఠకుని హృదయానికి చేరే సుబోధక రచన. ఇందులో మొదలు తెలుగు భాషకు ఎన్ని పేర్లు ఉన్నాయో (తెలుగు, తెనుగు, ఆంధ్రం మొదలైనవి) చెప్పడం జరిగింది. తెలుగులో తత్సమాలు, తద్భవాలు, దేశ్యా, అన్య దేశ్యాలు, గ్రామ్యాలు.. వీటి వివరణలో శాస్త్రి గారి ప్రత్యేకత లేదు గానీ లెగు, కూకో వన్నం, ఇసయం, సాములోరు, వత్తా వంటి మాటలకు గ్రంథ రచనా యోగ్యత పం డితులు లేదన్నారు కానీ కాలం మారింది ఇవీ పరిత్యాజ్యాలు కావు పరిగ్రాహ్యాలే అనే తీరులో భావ ప్రకటన చేయడం శాస్త్రిగారికి భాష పట్ల వున్న ప్రజాస్వామిక దృష్టికి దృష్టాంతం. ఆ తర్వాత అచ్చ తెలుగు అంటే వివరించి మన లిపి గురించి చెప్పాడు. ఎడనెడ.. విషయావివరణలో ద్వానా హ్యాసాన్ని పండిస్తారు. పఠనా స్త్రం పెంచుతారు. ఉదాహరణకు చావుకి కూడా మనం ఎన్నో మాటల్ని వాడుతుంటాం. ఎన్ని విధాలుగా చస్తామో చూడండి అంటూ చనిపోయాడు, మరణించాడు అనే అనేక క్రియల్ని ఇచ్చా రు. సీపీ బ్రౌన్ మాట అనే పదానికి ముప్ఫైకి పైగా అర్థాలిచ్చార ని చెబుతారు. ఈ పుస్తకంలో ఓచోట పాతిక రకాల వాక్యాల్ని పాఠకుల అవగాహన కోసం ఉదహరించారు.

మాండలికాల గురించి నేటికీ కొందరికి చిన్నచూపు ఉన్నది. మరికొందరికి కొన్ని మాండలికాలంటే వివక్ష ఉన్నది. ద్వానాశాస్త్రి గారు ఈ పక్షపాత వైఖరి మంచిది కాదని అన్ని మాండలికాల పక్షా న వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతారు. పైగా అసలైన తెలుగు పదాలు, తెలుగు నుడికారం మాండలిక భాషల్లోనే చూస్తాం అనేంత గొప్ప సంస్కారవంతుడూ, సత్యనిష్ఠా కలిగిన వ్యక్తి ద్వానా శాస్త్రి. కులాన్ని, వృత్తిని బట్టి ఏర్పడిన పదాలకు అర్థాలు చెప్పి పాఠకుల్లో ఆసక్తిని కలిగిస్తారు. ఈ పుస్తకంలో పొడుపు కథల అంశమూ ఉన్నది. సామాన్యంగా జరిగే అక్షర దోషాలు అనే శీర్షికతో ఉన్న అంశాలను సామాన్యులే కాదు, పండితులూ పట్టించుకోవాల్సిం దే! జయంతి, వర్ధంతి, ఇష్టాగోష్ఠి, రైతాంగం వంటి పదాలు పదబంధాల చర్చ చక్కగా సాగి వినూత్న విషయాలను అందించింది. పూతలపట్టు అనే పేరుతో ఉన్న వూరి ముచ్చటను తమాషాగా వివరిస్తారు శాస్త్రిగారు. ఈ పుస్తకం చివర విరేశలింగం వంటి దిగ్దంతుల ఉత్తరాలను ఇవ్వడం అదనపు సమాచారం. ఏనుగుల వీరాస్వామయ్య నుంచి జూకంటి వరకు వచనరీతులు ఇవ్వడం మరో ఆకర్షణ.

మాటలంటే మాటలా? ద్వానాశాస్త్రి మరో మంచి భాషా గ్రం థం ఆయన ఈ పుస్తకం. తెలుగు వాళ్లందరికీ తీపీ మాటలు చెప్పాలనీ, తేటతెల్లంగా చెప్పాలనీ ఈ ప్రయత్నం అంటూ మొద టే చెప్పుకొచ్చాడు. మన మాటకు మూడు పేర్లు అనే శీర్షకలో చెప్పిన అంశాలు ఇతఃపూర్వ పుస్తకాల్లో ప్రస్తావించినవే! నానార్థాలను వివరించే సందర్భాల్లో వాడు అన్నం తిన్నాడు, వాడు డబ్బు లు తిన్నాడు, వాడు తన్నులు తిన్నాడు వంటి వ్యవహార వాక్యా లు రాసి తిను అనే క్రియను ఎన్ని రకాలుగా వాడుతారో చూపా డు. ద్వానా గొప్పతనం అంతా ఎక్కడుంటుందీ అంటే.. భాషకు సంబంధించిన చర్చ చేస్తున్నప్పుడల్లా భాష ప్రజల సొత్తు అం టారు. ఈ అవగాహన లేక ఈ స్పష్టత లేక చాలా మంది సాహితీకారులూ, పండితులు అయోమయంలో ఉండిపోతారు.

ఈ పుస్తకంలో అప్పూసొప్పూ వంటి జంటపదాల చొప్పు విప్పిచూపారు. ఒకనాటి జగదొంగే గజదొంగ అయ్యాడని చెప్పుతారు. కీచడ్‌పల్లి చిక్కడ్‌పల్లి అయ్యిందట! (కిచడ్ అంటే బురద) ధ్వన్యనుకరణ శబ్దాల తీరుతీయాల గురించి తీయగా వివరిస్తారు. భాషకు ఆదాన ప్రదానాలు ప్రధానమని తెలుపుతారు. తెలుగులో డ్బ్భై శాతం ఇతర భాషా పదాలే ఉన్నాయని తెలియచెబుతారు. పర్యాయపదాల గురించి ఈ పర్యాయం తెలియజేస్తారు. చిత్రంగా తెలుగింగ్లీషు చిత్రీకరిస్తాడు కళ్ళ ఎదుట. భాష అనేది సంస్కృతపదం. ఈ మాటకు తెలుగులో సరిపోయే పదం ఉందా అని ప్రశ్నిస్తారు. తెలుగులో చేరిపోయిన సంస్కృతన్యాయాల వివరణ న్యాయంగా ఉండాల్సిందే ఈ పుస్తకంలో. ఈ గ్రంథం చివర అందువల్ల సం స్కృతం ఆంధ్రాలో ఆధిపత్యం వహిస్తే తెలంగాణలో ఉర్దూ ఆధిపత్యం వహించలేదు. భావస్వేచ్ఛకు ఉపయోగపడింది. అసలైన తెలుగు పదాలు-దేశ్యపదాలు తెలంగాణలోనే ఉన్నాయి. పాల్కు ర్కి సోమన, తెలగన్న దేశ్యపదాలకు పట్టం కట్టారుఅంటారు ద్వా. నా. జంధ్యాల తెలంగాణ తెలుగును తౌర్క్యము అన్నడాన్ని నిరసిస్తూ తెలంగాణలోనే తెలుగు పదాల వ్యవహారం ఎక్కువ అన్నది యధార్థం. బిరుదురాజు, ధూపాటి వంటి ఘనాపాటీలు ఎందరో ఈ అంశాన్ని నొక్కిచెప్పా రు. ద్వానా ఆ పరిశోధక పరంపరంలో ఉండటం సంతోషం.

తెలుగు జిలుగు భాషపై వెలుగు ప్రసరింపజేసిన మరో పుస్త కం. శాస్త్రి ఈ గ్రంథంలో జానపద నిఘంటువు అవసరం అని ఓ చిరువ్యాసం రాశారు. ప్రజలే శబ్దానుశాసనులు అన్నారు. నన్నయ్య మాత్రమే కాదు ప్రజల్లో వాగానుశాసనులున్నారని చెప్ప డం సాహసోపేత లక్షణం. కవిత్వం భాషాభివృద్ధికి దోహదం చేస్తుందంటరు. నిజమే! కవిత్వం కన్నతల్లితో సమానమైంది కదా! హృదయ మాలిన్యాల క్షాళనం చేస్తుంది కదా! మాండలికాలపై మరలా ఈ పుస్తకంలో ద్వానా అభిప్రాయాలు చూడండి. పండితులు కావాలని తమ అభిరుచికి అనుగుణంగా వేళాకోళం చేస్తూ మాండలికాలను ఈసడించేవారు అంటూ తెలుగు జీవద్భాష, సంకుచిత భాష కాదు, ఇంగ్లీషు లాగా స్వీకృత భాష అని వివరిస్తారు.

మన తెలుగు వైభవం పేరిట పాశ్చత్యులూ, మనవాళ్ళూ తెలు గు భాష ఔన్నత్యాన్ని కొనియాడుతూ చెప్పిన కొటేషన్లూ, పద్యపాదాలూ, శ్లోకాలూ ఉదహరిస్తారు ద్వానాగారు.తెలుగు భాష స్వరూప స్వభావాలనూ, ఔన్నత్య ఔచిత్యాలనూ, తీరుతెన్నులనూ మామూలు పాఠకులకు, పోటీ పరీక్షార్థులకు, సాహిత్యపు చదువరులకు సరళంగా అందించిన ద్వానా శాస్త్రి కృషి ప్రశంసనీయం. భాష పట్ల, ప్రజల పట్ల, మాండలికాల పట్ల ఆయన అభిప్రాయాలు ప్రజాస్వామిక దృక్పథానికి నిదర్శనం.
- డాక్టర్ నలిమెల భాస్కర్, 97043 74081
(ఇటీవల ద్వా.నా.శాస్త్రి సప్తతి మహోత్సవ సందర్భంగా..)

694
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles