సినారె సినీ గేయాల సౌరభాలు


Sun,June 10, 2018 11:06 PM

చాంగురే బంగా రు రాజా అనే పల్లవితో నారాయణరెడ్డి గారు రచించిన పాట అన్నిటా మకుటాయమైనది. ఈ పాటలో వారు వెలుగులోకి తెచ్చిన తెలుగు మాటలు ఆయనకు భాషపైన గల మమకారం ఒక వంక,ప్రయోగాభిలాష మరొకవంక చేరి వారి భాషా పోషకాభిలాషకు అద్దం పట్టాయి. స్త్రీ, పురుష శరీరాలు, అవయవాలు, కలుసుకొనడం- వీటి ని గురించి సాధారణమైన వస్తువులను, పనులను శ్లేషకై వాడుకుంటూ ఎన్నో పాటలు వచ్చాయి. తెలుగులో వచ్చిన వాటిలో కలికితురాయి అని చెప్పుకోదగిన పాట అనుబంధాలు సినిమాలో సి. నారాయణరెడ్డి రాసింది.

తెలుగు సినిమా పాటలలో అరబ్బీ అందాలు, హవురీ హనళింపులు, పర్షియన్ భావరాగాలు, తూగిసాగే గజళ్ళ నడకలు, సూఫీ ఆలోచనలు.. సి.నారాయణరెడ్డి చిత్ర రంగ ప్రవేశంతో (గులేబకావళి కథ 1962) ఒక వరదలా, వెల్లువలా, ఉప్పెనలా, తుఫానులా, జడివానలా, లేత వెన్నెలలా, బాలచంద్రికలా, పొద్దుపొడుపులా, అరుణోదయంలా, మింటితారకలా, వియన్నక్షత్రంలా, జలపాతంలా, నీటి దూకుడులా, తేనె మంచులా, సుధాతుషారంలా ప్రవేశించాయని అంటారు ఆ ఒరిజినల్స్ తెలిసిన వారు. నాలాంటి వారు ఆహా.. అనుకుంటారు.. - వి.ఎ.కె. రంగారావు

సినారె, దాశరథి, ఆరుద్ర ప్రవేశించాక సినిమా పాటలో గడుసుతనమూ, ఆధునికతా, క్లుప్తతా వచ్చాయి..
-భమిడిపాటి రామగోపాలం (భరాగో)

పల్లె నాకు పాటనిచ్చింది. పట్నం నాకు మాటనిచ్చింది..
- సినారె
Seenare
చాలామంది సినారె 1962లో వచ్చిన గులేబకావళి కథతో సినీరంగ ప్రవేశం చేశారని భావిస్తారు. నిజానికి 1959, 1960ల్లోనే సినారె సినీరంగ ప్రవేశం జరగాల్సింది. 1959లో ఎల్.వి.ప్రసాద్ నిర్మించదలచిన కొడుకులూ కోడళ్ళూ చిత్రానికి సినారె ఒకటి రెండు పాటలు రాశారు. కానీ కారణాంతరా ల వల్ల ఎల్.వి.ప్రసాద్ ఆ చిత్ర నిర్మాణం ఆపివేశారు. 1960 లో విడుదలైన పెళ్ళి సందడి, శభాష్ రాముడు చిత్రాల్లో ఒక్కొక్క పాట రాయమని ఆహ్వానం వచ్చింది. కానీ, ఆయన దానికి అంగీకరించలేదు. గులేబకావళి చిత్రంలో అన్ని పాట లూ సినారె రాయడానికి ఎన్టీఆర్ ఒప్పుకోవడంతో సినారె సినీ రంగ ప్రవేశం సుగమమైంది. సినిమాల్లో 3500లకు పైగా పాటలు రాశారు సినారె. 19 40 నుంచి 1973 వరకు వచ్చిన ఉత్తమమైన పాటలను 116 గొప్ప సినిమా పాటలు పేరుతో భమిడిపాటి రామగోపాలం ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఇందులో సినారెవి మూడు పాట లే ఉన్నాయి.

అవి గులేబకావళి లోని కలల అలలపై తేలెను మనసు, ఏకవీరలోని తోటలో నా రాజు తొంగిచూచెను నాడు, అమ్మమాట చిత్రంలోని మాయదారి సిన్నోడు మన సే లాగేసిండు. ఆ తర్వాత.. మరో నూటపదహార్లు పేరుతో 1940 నుంచి 1985 వరకు వచ్చిన, మొదటి పుస్తకంలో ప్రస్తావించని పాటలను ప్రచురించారు. ఇందులో సినారె రాసిన మరో 11పాటలను తీసుకున్నారు. అవి.. 1.చదువుకున్న అమ్మాయిలు(1963)- కిలకిల నవ్వులు చిలికిన. 2. బొబ్బిలి యుద్ధం (1964)-ఊయలలూగిన దోయీ 3.శ్రీకృష్ణ పాండవీయం(1966)-చాంగురే బంగారు రాజా 4.అగ్గి బరాటా (1966)-పలుకవే నా రామ చిలుకా 5. పుణ్యవతి (1967)-మనసు పాడింది సన్నాయి పాట 6.శ్రీకృష్ణావతారం (19 67)- నీ చరణ కమలాల 7. ఏకవీర (196 9)-ఏ పారిజాతమ్ములీయగలవో 8. జై జవాన్ (1970)-మధుర భావాల సుమమాల 9. చిట్టి చెల్లెలు (1970)- ఈ రేయి తీయనిదీ 10. శ్రీకృష్ణ విజయం(1971)- జోహారు శిఖిపింఛ మౌళీ 11. సీతాకళ్యాణం (1976)-ఇనవంశ జలజాత దినకర. భరాగో తన రెండు పుస్తకాల్లో 1985 తర్వాత వచ్చిన సిని మా పాటలను ముట్టుకోలేదు. వి.ఎ.కె. రంగారావు సినారె సినీ పాటల గురించి చేసిన వ్యాఖ్యానం చూద్దాం. సినారె రచనలను జ్ఞాపకం చేసుకోవాలి కానీ నాకిష్టమైనవి వాటిల్లో సులభంగా వంద పాటలుంటాయి.

వీటిల్లో అతి ప్రియమైనవి..

1.గులేబకావళి కథ (1962) మదనా సుందర నా దొరా
2. అనుబంధాలు (1963) నా పేరు సెలయేరు
3. శ్రీకృష్ణావతారం (1967) నీ చరణ కమలాల
4. ఏకవీర (1969) నీపేరు తలచినా చాలు
5. సప్తస్వరాలు (1969) నినుగన్న కనులే కనులు
నిజానికి ఇవేవీ గొప్ప రచనలు కావు. ఇంతకన్నా మేలైనవి ఆయన సినిమా పాటల్లో కొల్లలున్నాయి. అయితే వీటి మీద నాకు ఎక్కువ మక్కువ ఉండటానికి కారణాలు కొన్ని చెప్పగలిగినవీ, కొన్ని చెప్పలేనివీ. మొదటి కోవకు చెందినవి వరస, సినిమాలో ఆ పాటకుండే స్థానం, ఆ పాటపాడిన తీరు.. ఇవ న్నీ సాహిత్యానికి సంబంధించినవి కావన్న సంగతి నా బుద్ధికి తెలుసు. కానీ నా మనసు నా బుద్ధిమాట వినదే.
అటు సాహిత్యంలో, ఇటు సంగీతంలో మొదటి తరగతికి చెందినవి ఈ కింది రెండు పాటలు.

1.మంచి మిత్రులు (1968) ఎన్నాళ్లో వేచిన ఉదయం

2.మా నాన్న నిర్దోషి(1969) అలకలు తీరిన కన్నులు ఏమ నె.. ఈ రెండు పాటల్లోనూ రచన పకడ్బందీగా ఉండటం ఒక సొగసు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. భరాగో ప్రస్తావించిన 14 పాటల్లోను, వి.ఎ.కె. రంగారావు ప్రస్తావించిన 7 పాటల్లో ను చోటుచేసుకున్న ఒకేఒక్క పాట శ్రీకృష్ణావతారంలోని నీ చరణ కమలాల ఉన్నది.
భరాగో, వి.ఎ.కె.రంగారావుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, విభిన్న కోణాలనుంచి పరిశీలించి, కొన్ని ఆణిముత్యాల్లాంటి సినారె సినీ గేయాలను వ్యాఖ్యానాలతో పాటు ఈ వ్యాసంలో పొందుపరిచాను.

1.గులేబకావళి కథ (1962) కలల అలలపై..

మర్రి చెట్టు కింద ఏ మొక్కా బ్రతకదు అన్నట్లు, నన్ను దోచుకుందువటే అని ప్రారంభమయ్యే పాట, హీరోయిన్ ఓరియంటేషన్ వల్ల, అప్పటి జమున గారు మంచి ఫైల్‌లో ఉన్నందువల్ల కలల అలలపై పాట ఎంత గొప్పదైనప్పటికీ దాని నీడలోనే ఉండిపోయింది. నారాయణరెడ్డిగారు అంతకుముందు రామప్ప సంగీత రూపకం కోసం మబ్బులో ఏముందీ? నా మనసులో ఏముందీ? అంటూ ప్రశ్న, జవాబుల పాట రాశా రు. ఆ టైపులోనే ఈ పాటకూడా సాగింది. దృశ్యీకరణ కోసం తలపెట్టిన సెమిపోర్నో పాట రచనలోకి కూడా ప్రవేశించి ప్రేక్షకులకే కాక శ్రోతలకు కూడా ఉబలాటం కలిగించింది. దానికి తోడు జానకిగారి కంఠంలో నిరంతర ఆకర్షణ, అనంతమైన ప్రలోభం కదా మరి! పగలే వెన్నెలా. (భరాగో)

2.గులేబకావళి కథ (1962) మదనా సుందర నాదొరా

ఇది ఒక జావళి. సంగీతపరంగా గడుసు విరుపులతో, సాహి త్యపరంగా కవితాత్మక పంక్తులతో సాగిన పాట. తర్వాతి చిత్రా ల్లో ముఖ్యంగా డీవీఎస్ రాజు, విఠలాచార్య , భావనారాయణ లు నిర్మించిన చిత్రాల్లో నా చేత జావళీలు రాయించడానికి ఈ పాటే ప్రేరకంగా నిలిచిపోయింది.(సినారె పాటో బయాగ్రఫీలు)
గులేబకావళి కథలో మదనా సుందర నా దొరా భీం పలాస్‌లో సుశీల గారు పాడిన అద్భుతమైన జావళి. (భరాగో)

3.అనుబంధాలు (1963) నా పేరు సెలయేరు.

అనుబం ధా లు సినారె గీత రచన చేసిన రెండవ తెలుగు చిత్రం. ప్రతినాయిక పాడిన పాట. నాయికకు ఉన్న ఒదుగులు, అదుపులు ప్రతినాయికకుండవు. ఆమె స్వేచ్ఛా విహారిక. పాటలో ప్రతినాయిక నాకెదు రు లేదు. నా ఇష్టం అన్న భావాన్ని ప్రకృతిలోని ఏ అందానికైనా అన్వయించి చెప్పాల్సిందిగా రామకృష్ణ (భానుమతి భర్త) సూచించారు. ప్రతినాయిక పాత్రను సెలయేరుతో పోల్చాలని స్ఫురించింది. ఒక చిన్న చిత్రంలో వర్ధమాన తారపై చిత్రించిన ఈ పాట ఆ రోజుల్లో కవితాత్మక గీతాలను ఆదరించే వాళ్ళను బాగా ఆకట్టుకుంది.(సినారె పాటోబయాగ్రఫీలు)
స్త్రీ, పురుష శరీరాలు, అవయవాలు, కలుసుకొనడం- వీటి ని గురించి సాధారణమైన వస్తువులను, పనులను శ్లేషకై వాడుకుంటూ ఎన్నో పాటలు వచ్చాయి. తెలుగులో వచ్చిన వాటిలో కలికితురాయి అని చెప్పుకోదగిన పాట అనుబంధాలు సినిమాలో సి. నారాయణరెడ్డి రాసింది. ఎం.బి.శ్రీనివాస్, ఎల్‌ఆర్ ఈశ్వరి సంగీత గాత్ర ప్రదాతలు. ఇందున్న చమత్కార పరిమళాలు శ్లేషాలంకారాలు, ధరించి ఆ గీర్వాణికే మేల్దుకూలాలు అలంకారాలు, ఆభరణాలు అయినవి. (వి.ఎ.కె. రంగారావు)

4. చదువుకున్న అమ్మాయిలు (1963) కిలకిల నవ్వుల..

ఈ పాటలో సినారెగారు ప్రేమ తరంగాలకు భావ తరంగాలను సమకూర్చి రచన సాగించారు. కరిగిన కలలే మందార మాలలు. రమ్మని పిలిచిన మురళీరవములో అణువణువున బృందావనం తోచింది. మరులు సోకిన వేళలో తీయని జ్వాల హాయిగా రగిలింది. జీవన రాగాల నావ జలజలా పారే వలపులలో సాగింది. ఆయన రచించిన సుమధుర గీతాలలో ఈ పాట ఒక ఉత్తమ స్థానంలో కూర్చు ని ఉంది. (భరాగో)

5. లక్షాధికారి (1963) మబ్బులో ఏముందీ..

సినారె రచిం చి ఆకాశవాణి ద్వారా ప్రసారమైన రామప్ప సంగీత రూపకంలోని పాట. మబ్బులో ఏముందీ అనే పాటను రాసినప్పటి నా బాణీ ఒకటి. రామప్ప సంగీత రూపకంలో పాలగుమ్మి విశ్వనాథం గారు స్వరపరిచిన బాణీ మరొకటి. చలపతిరావు గారి చేతిలో నుంచి ఉబికొచ్చిన స్వరధార ఇంకొకటి. నా పద్ధతిలో ఈ పాట పాడి వినిపించాను. చలపతిరావు గారి చేతి వేళ్ళు హార్మోనియం మీద గలగలా ప్రవహించాయి. జముకుల కథలోని అచ్చమైన జానపదుల బాణీ ఆ పాటలో నుంచి పొంగులు వారింది, పల్లవికి ట్యూన్ బాగా కుదిరింది.
ఈ పాట చివరి చరణంలో వ్యాకరణాన్ని ప్రక్కకు నెట్టి, నేనులో ఏముంది, నీవులో ఏముంది, నేనులో నీవుంది, నీవులో నేనుంది అని ప్రయోగం చేశాను. నాలో నీలో అనడానికి బదు లుగా నేనులో నీవు అనడం ఇందులో పదవైచిత్రి. అయినా శృంగారం శృతికెక్కినప్పుడు పడుచు జంటకు వ్యాకరణం గుర్తుంటుందా? (సినారె పాటోబయోగ్రఫీలు)

6. పూజాఫలం (1964) నిన్నలేని అందమేదో..

సాహిత్యం, సంగీతం పోటీపడ్డ రచన. కథానాయకుడిలో కలిగిన అవ్యక్త మధురానుభూతిని ఈ పాటలో కవితాత్మకంగా చిత్రీకరించారు. రాగమంటే ఏమిటి, రమణి అంటే ఏమిటో తెలియని తనకు బాహిర ప్రకృతి సమస్తం రమణీసదృశంగా కనిపించింది. పూచిన ప్రతి తరువు వధువులా అనిపించింది. సెలయేరు తెలినురుగులే నవ్వులు కాగా కులుకుతూ కనిపించింది. పసిడి అంచు పైట జార, పయనించే మేఘబాల పరవశించినట్టు స్ఫురించింది. దర్శకుడు బి.ఎన్. స్వయంగా రాయలేడు. కానీ తనకు నచ్చినట్లుగా రాయించుకుంటాడు. పాడలేడు. కానీ తన ఎదను మీటేటట్లుగా పాడిస్తాడు.
(సినారె పాటోబయాగ్రఫీలు)

7.పూజాఫలం (1964) పగలే వెన్నెలా..

జగమే ఊయలా.. ఈ పాటలోని చరణాలన్నింటిలో చంద్రుడు, కలువ, నీలిమ బ్బు, నెమలి లాంటి సాంప్రదాయక కవిసమయాలనే తీసుకు న్నాను. కానీ వాటి అనుబంధం రసస్పర్శ ఉన్న హృదయాల్లో ఏకంగా తీయని స్పందనలను, తీరని అనుభూతులను కలిగి స్తుందో ధ్వనింపజేశాను. ప్రతి చరణం చివరి పదం కురిసిపో నా, నిలిచిపోనా,విరిసిపోనా అంటూ గజల్‌లోని అంత్య ప్రాస ను స్ఫురింపజేయటం ఈ పాటలోని మరో విలక్షణం. సినిమా విడుదలైన తర్వాత ఈ పాటను వి.ఎ.కె. రంగారావు నిశితంగా విమర్శిస్తూ రాశారు. కొన్ని వారాల పాటు చర్చోప చర్చలు జరి గాయి. బహుళ సంఖ్యలో పాఠకులు నా వైపే నిలిచారు.(సినారె పాటో బయోగ్రఫీలు)

8. అమరశిల్పి జక్కన (1964) ఈ నల్లని రాల్లలో..

రామప్ప రూపకంలోని పాట. రాజేశ్వరరావుగారు స్వరపరిచిన ఈ గీతం ఎన్నెన్నో పాటకచేరీల్లో గణనీయ స్థానం సంపాదించింది. ఈ గీతానికి పతాక సదృశమైనవి ఈ చివరి చరణాలు. పైన కఠిన మనిపించును లోన వెన్న కనిపించును, జీవమున్న మనిషికన్న శిలలే నయమనిపించును. కవితామూల్యాలు పొదుగుకున్న ఈ గీతాన్ని రాజేశ్వరరావు గారు మోహన రాగంలో ఎత్తుకొని అక్కడక్కడ మధ్యమ విషాద స్వరాలను కూడా మేళవించారు. (సినారె పాటోబయాగ్రఫీలు)

9. బొబ్బిలియుద్ధం(1964) ఊయలలూగినదోయీ..

బొబ్బిలి యుద్ధం కవితా సిద్ధిలో వందలాది మందికి మాత్ర మే అందినా బుర్రకథ రూపంలో వచ్చినప్పుడు వేలాది మంది ని, సినిమాగా వచ్చినప్పుడు లక్షలాది మందిని అలరించింది. బాక్సాఫీసు దగ్గర గొప్ప విజయం సాధించలేక పోయినా అన్ని తరగతుల ప్రేక్షకులలోనూ, విమర్శకుల మీద తనదైన ముద్ర వేసింది. భానుమతి గారి పాట రంగారాయుడు గారి మనస్సు తో పాటు మన మనస్సులను కూడా ఊయలలూగించింది. ప్రాయము నీవై పరువం నేనై పరిమళించగా రమ్మని ఒక కవితా శకలం రాగపు మెత్తదనాన్ని, కంఠస్వరపు వంపు సొంపులను సమకూర్చుకొని శ్రోతలు ఈ పాటి సుఖము నేనింతవరకు ఎరగనేఅనిపించేటట్లుగా సిద్ధించి యుంది. (భరాగో)

10. శ్రీ కృష్ణ పాండవీయం(1966) చాంగురే బంగారు రాజా..

ఇందులో ఎన్నో మంచి పాటలున్నా చాంగురే బంగా రు రాజా అనే పల్లవితో నారాయణరెడ్డిగారు రచించిన పాట అన్నిటా మకుటాయమైనది. ఈ పాటలో వారు వెలుగులోకి తెచ్చిన తెలుగు మాటలు ఆయనకు భాషపైన గల మమకారం ఒక వంక,ప్రయోగాభిలాష మరొకవంక చేరి వారి భాషా పోషకాభిలాషకు అద్దం పట్టాయి. (భరాగో)

11.అగ్గి బరాటా (1966) పలుకవే నా రామ చిలుకా..

అగ్గి బరాటా లోని పలు పాటలు హాయి హాయిగా ఇప్పటికీ వినబడుతూనే ఉన్నాయి. అయితే పలుకవే నా రామచిలుకా అనే పల్లవి గల పాట అన్నిటిలో విశిష్టమైనది. సుశీల గారి గళం ప్రాథమికంగా వాద్యఘోషా నిపుణుడైన విజయా కృష్ణమూర్తి గారి సుతిమెత్తని సంతూర్, సితార్, బాంసురి వాద్యాల చమత్కార ధ్వని చిత్రాలు ఈ పాటను చిరస్మరణీయంగా రూపొందించాయి.పాటలో సాహిత్యం కథానుగుణంగా న్యాయ మార్గా న్నే సాగింది. ఈ పాట రచన మీద అలనాటి (మల్లీశ్వరి లోని) ఎందుకే నీ కింత తొందరా (భానుమతి, కృష్ణశాస్త్రి) ప్రభావం అనివార్యం అయినప్పటికీ నారాయణరెడ్డి గారు నా కంటి పాపలో ఎవరో నవ్వులొలికించేరు, నా కలల దారిలో ఎవరో నడిచిపోతున్నారు అనే రెండు అద్భుతమైన పద చిత్రాలతో ఒక కొత్తరకం స్థాయినిచ్చారు. (భరాగో)

12.పుణ్యవతి (1967) మనసు పాడింది సన్నాయి పాట..

ఆ కాలంలోని వారే కాక మనం కూడా మెచ్చగలిగే మధుర ప్రేమ యుగళగీతం. గగనమే పూల తలంబ్రాలు కురిపించింది, మదిలో దాచిన మమతల తేనెలు, పెదవులకు అందని మధురిమలను హృదయాలు చవిచూశాయి అన్నారు. ఇవన్నీ సినారె గారి ప్రేమాస్పదమైన ప్రయోగాలు. (భరాగో)

13. శ్రీకృష్ణావతారం (1967) నీ చరణ కమలాల..

ఇటు రుక్మిణితో అటు సత్యభామతో శ్రీకృష్ణుడు పాడే త్రిగళగీతం. ఎన్టీఆర్ కృష్ణుడిగా, దేవికా కాంచనలు రుక్మిణి, సత్యలుగా నటించిన చిత్రం. గీతాన్ని గానం చేసింది ఘంటసాల, లీలా, సుశీలలు.
ఇద్దరు దేవేరులు మరొక మహా దేవేరిని పూజించినా, కీర్తించినా వారి మాటలు వారి వారి స్వభావాలను ప్రతిబింబించే విధంగా వచ్చాయి. నీ చరణ కమలాల పాటలో రుక్మిణి సత్యభామల మాటలు అదే ధోరణిలో సాగాయని గమనించాల్సి ఉంది. చరణ కమలాలు, తులసీ దళాలు, పూజించుట, పులకించుట వంటి పదజాలం రుక్మిణిది. నునుమావి చిగు రు, ప్రణయవని వంటివి సత్యభామ పదజాలం. ఒక చోట భక్తి, రెండవ చోట రక్తి. ఇదంతా వారికి వినోదం మనకు విధాయకం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. (భరాగో)

14. మంచి మిత్రులు (1968) ఎన్నాళ్ళో వేచిన ఉదయం..

ఈ చిత్రంలో శోభన్‌బాబు పోలీసు అధికారి. కృష్ణ సాయుధ పోరాటం ద్వారా సమాజంలో పరివర్తన సాధ్యమని విశ్వసించే ఉగ్రవాది. ఇద్దరూ చిన్ననాటి మిత్రులు. ఎవరి పయనం వారి ది. కొంతకాలం తర్వాత ఒకచోట కలిసి ఎవరి దారి సరైందో పరస్పరం తెలుసుకుందామని, తేల్చుకుందామని అనుకుంటా రు. అది పాటకు సన్నివేశం. ఘంటసాల, అప్పటికి యువక దశలో ఉన్న బాలసుబ్రహ్మణ్యం కలిసి పాడిన, జనాదరణ పొం దిన గేయం. (సినారె పాటో బయోగ్రఫీలు)

15. ఏకవీర(1969) తోటలో నా రాజు..

చిక్కటి కథ, చక్కటి నటీనట వర్గం ఉన్నప్పటికీ ఎందుకో ఏకవీర సినిమా ఓటమి చవిచూసింది. యంవీఎల్ అని ఒకాయన ఉండేవాడు. అందగాడు, వక్త, స్కాలర్, రైటర్, ఉన్నత అభిరుచులు కల భావుకుడు, వాదకుడు, సినిమాల మీద గుం డెనిండా ప్రేమ కలిగినవాడు. ఏకవీర సినిమా చూశారా? బాగుందా? అని అడిగితే చూశాను, బాగుంది. కానీ తెలుగు లో తీస్తే ఇంకా బాగుండేది అన్నారు. సంభాషణలో పాండిత్యం ఎక్కువయిందని, విశ్వనాథ సత్యనారాయణ గారి పాషాణపాకం అక్కడ కూడా ప్రవేశించిందని అన్నారు. ఏకవీరలో ఈ పాట మంచి సమతూకంలో నడిచింది. ఘంటసాల, సుశీల పాటలో ఉన్న ఒక్కొక్క మాటను ఒక్కొక్క లోతు నుంచి అందుకొని ఒకానొక పారవశ్యంలో మనల్ని ముంచి తేల్చారు. (భరా గో) (ఏకవీరలో సంభాషణలు గ్రాంధికంగా ఉంటే, విశ్వనాథ సత్యనారాయణ గారిని తప్పు పట్టడం సబబు కాదేమో. చిత్రానికి సంభాషణలు రాసింది సినారె. వ్యావహారికంగా ఉండాల ని చెప్పాల్సింది దర్శకుడు).
ఏకవీరలో తోటలో నా రాజు తొంగిచూచెను నాడు పాట ను నేను రాశాను. ప్రతి రాత్రీ వసంత రాత్రీ.. పాటను కృష్ణశాస్త్రి రాశారు. రెండు పాటలు అమోఘమైన ప్రజాదరణ పొం దాయి. రెండు గీతాలు పదే పదే విన్న తర్వాత గీతాభిమానులు ప్రతి రాత్రీ వసంత రాత్రీ నేను రాసిందని, తోటలో నారాజు కృష్ణశాస్త్రి గారు రాసిందని అనుకున్నారు. పైకి అన్నారు. ఏం సమాధానం చెప్పాలో తెలియక విస్మితున్నయ్యాను. అంతటి వారి సరసన నన్ను కూర్చోబెట్టారే అని..
(సినారె పాటో బయాగ్రఫీలు)

16. ఏకవీర (1969)నీ పేరు తలచినా చాలు..

కృష్ణారాధనలో మేను మరిచిన గోపిక పాడుకునే పద్ధతిలో రచించిన గీతమిది. సింధూభైరవి, రాగచ్ఛాయలో పొదిగిన పల్లవి. ఇందులో పదాలు బరువుగా ఉన్నా రాగధార వల్ల నురగల్లా తేలిపోతాయి. నిజానికి ఈ పాట ఏకవీర, వీర భూపతి మూర్తిని తన మదిలో ఊహించుకొని పాడిన పాట.
(సినారె పాటోబయాగ్రఫీలు)

17. ఏకవీర (1969) ఏ పారిజాతమ్ములీయగలవో..

ఏకవీర చిత్రాన్ని గీస్తూ, అంతటి అమృతరూపిణికి తాను ఏమి అర్పించుకోగలుగుతానని వీరభూపతి పాడుకునే గేయం. మోహనరాగంలో ముగ్ధమోహనంగా బాలసుబ్రహ్మణ్యం పాడి న గేయం. చంచలా అంటేనే మెరుపుతీగ. మెరుపు తీగలాంటి ఆ తరుణి వల్లికలా అంటే తీగలా నేలపై నడిచి వచ్చింది. ఈ పంక్తి పాడుతూ ఉంటే అల్లనల్లన నడిచొచ్చిన నాయకి ఆగిపోయినట్లు, తరుణి రూపం ధరించిన శరత్కాల చంద్రిక అన్నప్పుడు ఆమె సురుచిర వదనం విరబూచినట్లు చిత్రీకరించడం ఈ గేయానికి వన్నె తెచ్చిన అంశాలు.
(సినారె పాటోబయాగ్రఫీలు)
చివరగా ఒకటి చెప్పాలి. ఈ వ్యాసంలో కొన్ని ప్రజాదరణ పొం దిన పాటలను ప్రస్తావించలేదు. ఒకటి పగలే వెన్నెలా, జగమే ఊయలా. దీని బాణీ ప్రముఖ హిందీ చిత్రం నవరంగ్‌లోని ఆధా హై చంద్రమా రాత్ ఆధీ శైలిలో కూర్చబడింది. ఈ వ్యాసం రాస్తున్న సందర్భంలో ఈ పాటపై మీకు అభ్యంతరాలున్నాయటగా అని రచయిత వి.ఎ.కె.రంగారావును అడిగారు. దానికి ఆయ న నాకు ఉన్న అభ్యంతరం ఒకటే. వేరే అవయవాలకు కన్నులుం టే అని ఉపయోగించడంలో తప్పులేదు కానీ, ఊహలకు కన్నులుంటే అనడం సమంజసంగా లేదు. అన్ని అవయవాలుంటేనే అవి ఊహలు అన్నారు. వి.ఎ.కె. రంగారావుతో పాటు ఈ పాట ను విమర్శించిన వారిలో ప్రముఖ సాహిత్య వేత్త జువ్వాడి గౌతమరావు కూడా ఉన్నారు.

- వి.కె.ప్రేవ్‌ుచంద్, 98480 52486
(రచయిత ఫ్రాంటియర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ వ్యవస్థాపకులు)
(జూన్ 12 సి.నారాయణరెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా..)

2495
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles