సాహితీ అరుగుపై ‘అలుకు పిడుచ’


Sun,June 3, 2018 10:50 PM


ఏ కవిత గొప్పది అంటే చెప్పలేం.. కాని నాయినమ్మకు శ్రీరాములు గొప్ప స్థానం ఇచ్చారు. తండ్రి సృష్టికర్త అయితే ఎంత బాగుండు అని. మానాన్న దేవుడైతే ఎంతబాగుండు. అన్నింటికీ అమరత్వం కల్పించేవారు అంటూ నాన్న గొప్పతనం వర్ణించారు. అలుకు పిడుచ పేరుకు తగ్గట్టుగానే గొప్ప కవితల మణిహారం అందించిన కందుకూరి శ్రీరాములు గారికి
ధన్యవాదాలు.

Kandukri-sriramulu
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భం గా వివిధరంగాల్లో విశేష సేవలందించిన వారి లో కవి, ఉద్యోగి, రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం అందుకోవటం గర్వకారణం. ఆధునిక కవిత్వ విభాగంలో సిద్దిపేట మండలం రావురూకులకు చెందిన కందుకూరి శ్రీరాములు ఎంపిక కావటం తెలంగాణ కవిత్వానికి దక్కిన గౌరవం. 47ఏండ్లుగా రచనలు చేస్తూ, ఇబ్రహీం పట్నం లోని ఓ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తూ మరోవైపు పాత్రికేయుడుగా కొనసాగుతున్నారు. సాహిత్యాభిమానులందరికీ చిరపరిచితులు కవి, రచయిత కందుకూరి శ్రీరాము లు. మధ్య తరగతి జీవనానికి అద్దం పట్టే అందమైన కవిత్వం తో అలరిస్తున్న సంకలనం అలుకుపిడుచ 2017 లో మొదటి ముద్రణ జరిగింది. ఇందులోని కవితలన్నీ వివిధ పత్రికల్లో 2011నుంచి 2017 మధ్యకాలంలో వివిధ సందర్భాలలో పత్రికల్లో అచ్చయిన కవితల సమాహారం ఈ కవితల కళ్ళాపి.

ఈ సంకలనంలో 49 కవితలున్నాయి. ప్రతీ కవితా దేనికదే ప్రత్యేకమైనది. అలుకు పిడుచ పేరు చూడగానే ఇలా పెట్టడం తో కవి ఉద్దేశం ఏంటో ఆ కవిత చదివే వరకు అర్థం కాలేదు. వారి నాయినమ్మనే పిడుచ అని. కవిత ఆసాంతం రచయితకు వారి నాయినమ్మ పైన ప్రేమను, ఆప్యాయతను, మమకారాన్ని తెలియజేస్తుంది. పదజాలం అంతా పల్లెటూరి భాష అయినా తన స్వీయ అనుభవాల నుంచి పుట్టి అర్థవంతమైన పదజాలం తో అందరికీ అర్థమయ్యేలా రాసిన కవిత్వం. అలుకు పిడుచను కవితా వస్తువుగా చేసి వారి నాయినమ్మను దానికి ఆపాదించడమే ఒక అద్భుతం.
పండుగొచ్చిందంటే చాలు
మానాయినమ్మ అలుకు పిడుచయ్యేది
కుచ్చుల రవికె చేతుల్లా ఒళ్ళు
ఆర్పేసిన వీధిలైట్లలా కళ్ళు
పక్కకి ఒరుగుతున్న పందిరిగుంజలా కాళ్ళు
సాయంత్రమాకసాన ఇంద్రధనుస్సాకారంలా నడుం
డ్బ్బై అయిదేళ్ళ మానాయినమ్మ
గడిలాంటి ఇంటికి పెద్దర్వాజ..
పొక్కిలైన నేలకు
అలుకుపిడుచయ్యేది మానాయినమ్మ..! అంటూ అలుకు పిడుచ కవితలో రచయిత నాయినమ్మ చేతులు, కుచ్చుల రవికె చేతుల్లా ఉండేవట. వృద్ధాప్యం వచ్చింది అనకుండా.. స్వల్ప పదజాలంలో చక్కగా నాయినమ్మను ఆవిష్కరించారు. మన నిత్యజీవితంలో నిరంతర అనుభవాలను అక్షరాలదోసిళ్ళలో పట్టి మన ముందు ప్రదర్శించారు. వ్యక్తీకరణ అంతా కష్టజీవన నేపథ్యం నుంచి సాధారణమైన భాషలో ప్రత్యేకమైన యాసలో సాగిపోతుంది.

ఈ పుస్తకం శ్రీరాములు గారి 10వ కవితా సంకలనం. మొదటి నుంచి వరుసగా.. దివిటీ(మినీ కవితా సంకలనం) 1974, వయొలిన్ రాగమో వసంతమేఘమో 1994, సందర్భం (2001), కవ్వం 2002,దహనకావ్యం(దీర్ఘకవిత), పీఠభూమి 2005, వెన్నెల బలపం 2008,రావురూకుల 2009, తెలంగాణ రథం 2013, ప్రస్తుత అలుకుపిడుచ 2017లో అచ్చయింది.
మొదటి కవిత.. భూమికి చిరునవ్వు పచ్చగడ్డి అనే కవితతో మొదలై అజరామరం ఆమె కవితతో ముగుస్తుంది.
పచ్చని గడ్డి చిరునవ్వు
దేహానికి అంటుకున్న చల్లదనం పోయి
మెల్ల మెల్లగా మంచుపువ్వుమీద ఎండకాస్తుంది..
పచ్చని గడ్డిని కవి చిరునవ్వుతో పోల్చాడు.
ఒక మహాకవి ముందు ఒక మహా సముద్రుడు
అక్షర రాజు కవి- అలల రేడు సముద్రుడు.. అని ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు, ఎవరికివారే గొప్ప అని కవి-సముద్రం కవితలో కవి గొప్పతనాన్ని వర్ణించారు.
బాధల గుండె పొరల్లో నుండి రాలిన
కంటి చినుకు ఉద్యమం ఊరేగింపులో పడి
అగ్గిమీద గుగ్గిలమై
బగ్గుమంటుందని తెలుసు..
అంటూ పన్నీరు - కన్నీరు కవితలో బాధ-సంతోషాల మధ్య వ్యత్యాసాన్ని వర్ణించారు.
నా ఒంటి వింటి నారిని సంధించింది మానాన్నే
దున్నటానికి నన్ను నాగలి పట్టుమని చెప్పి
వలపట దున్నపోతయితే దాపట తానయ్యాడు
హలాన్ని పట్టినట్టే
నన్ను కలాన్ని పట్టుకొమ్మన్నాడు మానాన్న
బురదలో దిగితే కాళ్ళు చెడుతాయట!
బుర్రతో చదువులో దిగమన్నాడు
కళ్ళు వెలుగుతాయట..! ఆది అనే కవితలో శ్రీరాములు గారి నాన్నగారు చదువుకు ఎంత విలువ ఇచ్చేవారో ఈ కవిత ద్వారా తెలుస్తున్నది.

గీతలమీద గతినీ
రాతలమీద లక్కీలాటరీలను
చింపుకుని చంపుకునే వారు
భవిష్యత్తుకు భయపడతారు
గాలిని గమనిస్తే
వాళ్ళు పసిగట్టవచ్చు
భూమిని తడిమి చూస్తే
పంటను అంచనా వేయొచ్చు
కాసింత జ్ఞానముండాలిగాని
కాల జ్ఞానం
కాలమే కాదు ఎవ్వరైనా చెప్పగలరు! తాత్విక దర్శనం అనే కవితలో గీతలమీద, రాతలమీద ఆధారపడి భవిష్యత్తుకు బయపడేవాన్ని కాను, బుద్ధితో ఏమయినా సాధించగలం అంటారు.
చిరునవ్వుల పెదాలమీద
విషపు చుక్కలు అద్దిందెవరు
నీకు రుద్దిన విషపు చుక్కలు మింగితే
నీవు చస్తావు
ఎదుటి వాడిని ముద్దాడితే
వాడు చస్తాడు
నాశనం చేసేవాడికి
ప్రాణం పోయడం తెలియదు
విషం కంఠంలో దాచుకోవాలి..

తీర్పు మోహిని ఎటువంచుతుందో
పసిగట్టి వరుస కట్టు
అమరుడవవుతావు
అజరామరంగా నిలుస్తావు..
గరళకంఠం అనే కవిత ద్వారా బావిలో కప్ప లాగా బతకొద్దు.. విషపు నవ్వులు కాటు వేస్తాయి జాగ్రత్తా అంటూ వాటి ని తప్పించుకొంటే నీవు బతకగలవు అంటాడు రచయిత.
పొద్దు తెరుస్తున్నట్లుండాలి గాని
కన్ను పొడుస్తున్నట్లుండ కూడదు
ప్రకృతిలో
ప్రణయముంది
ప్రళయముంది
ముంచటం కాదు పెంచటం నేర్చుకో
వంచించటం కాదు ప్రేమించటం నేర్చుకో!!
బీభత్స రుతువు అనే కవిత ద్వారా ప్రకృతిలో అన్నీ ఉన్నాయి. వాటిని ఒక్క రైతు మాత్రమే చక్కగా వాడుకోగలడంటారు.
పాఠం ఒక ప్రవర్తన ఒక పరివర్తన
శోకంతో మొదలుపెట్టిన సుద్దముక్క శ్లోకం నేర్పుతుంది.
కాళ్ళను నిలబెట్టిన బోర్డు వీరునిలా నడిపిస్తుంది
శిష్యున్ని సన్నద్ధం చేసి చదువు చెప్పటం
ఒక విద్య
ప్రశ్న శిలను చెక్కి జవాబు శిల్పాన్ని చేయటం
ఒకకళ
ఆ కళ ఒక గురువు
ఆ గురువుకు ఒక కల శిష్యుడు.. అంటూ గురుశిష్యులు అనే కవిత ద్వారా తాను ఒక గురువు అని తన చేతిలోని సుద్దముక్క ఎంత మంది శిష్యులను సమకూర్చిందో! జవాబు శిల్పాలు తయారు చేయడమే తన కళ అనీ.. గురువు కల శిష్యు డు అని గురుశిష్యుల అనుబంధం ఇంత చక్కగా వర్ణించారు.

ఏ కవిత గొప్పది అంటే చెప్పలేం.. కాని నాయినమ్మకు శ్రీరాములు గొప్ప స్థానం ఇచ్చారు. తండ్రి సృష్టికర్త అయితే ఎంత బాగుండు అని. మానాన్న దేవుడైతే ఎంతబాగుండు. అన్నింటికీ అమరత్వం కల్పించేవారు అంటూ నాన్న గొప్పతనం వర్ణించారు. అలుకు పిడుచ పేరుకు తగ్గట్టుగానే గొప్ప కవితల మణిహారం అందించిన కందుకూరి శ్రీరాములు గారికి ధన్యవాదాలు.
- జయంతి వాసరచెట్ల, 99855 25355
(ఆధునిక కవిత్వ విభాగంలో కందుకూరి శ్రీరాములు రాష్ట్ర ప్రభుత్వ విశిష్ఠ పురస్కారం -2018 అందుకున్న సందర్భంగా..)

817
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles