కావ్య పరిష్కర్తగా ప్రతాపరెడ్డి


Mon,May 28, 2018 02:02 AM

ప్రతాపరెడ్డి ఎంతో శ్రమకోర్చి సేకరించిన ఈ తాళపత్ర గ్రంథానికి ఒక్క మద్రాసు ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్స్ లైబ్రరీలో తప్ప మరెక్కడా మరో ప్రతి దొరుకలేదు. అది కూడా అసమగ్రంగా ఉండింది. అంటే ప్రతాపరెడ్డి పూనుకోక పోయివున్నట్లయితే తెలుగు సాహిత్యంలో నాదెండ్ల గోపయమంత్రి ఎవరో తెలియకుండా పోయేది.
Suravaram-Pratapa
బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి 122వ జయంతిని ఇవ్వాళ జరుపుకుంటున్నాం. గోలకొండ పత్రిక సంపాదకుడి గా, ఆంధ్రమహాసభ స్థాపకుల్లో ఒకడిగా, గ్రంథాలయోద్యమ నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, రచయితగా, కవిగా, పీడిత జన పక్షపాతిగా, విద్యాసంస్థల నిర్మాతగా, హక్కుల సంఘాల స్ఫూర్తి ప్రదాతగా, చరిత్రకారుడిగా, విమర్శకుడిగా, పరిశోధకుడిగా,విశ్లేషకుడిగా తెలుగునాట మన్ననలందుకున్నవాడు ఆయ న. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభమైన నాటి నుం చి గోలకొండ కవుల సంచిక స్ఫూర్తిని తెలంగాణ సాహితీలో కం ఆవాహన చేసుకున్నది. అయితే ప్రతాపరెడ్డి కావ్య పరిష్కర్తగా చాలామందికి తెలియదు. నాదెండ్ల గోపమంత్రి రాసిన కృష్ణార్జున సంవాదము ద్విపద కావ్యా న్ని మొదటిసారిగా పరిష్కరించి, సంపాదకత్వం వహించి అచ్చేసింది సురవరం ప్రతాపరెడ్డి గారే.

ఆంధ్రుల సాంఘిక చరిత్ర, రామాయణ విశేషములు, హిందువుల పండుగలు ఇంకా అనేక వ్యాసాలు ఆయన పరిశోధనా పటిమను పట్టిస్తాయి. ప్రతాపరెడ్డికి పరిశోధనాసక్తి గ్రంథాలయోద్యమంతో కలిగింది. 1918 లో హైదరాబాద్‌లో రెడ్డి హాస్టల్ స్థాపితమైంది. దీని నిర్వాహణ బాధ్యతలను 1924లో ప్రతాపరెడ్డి స్వీకరించారు. ఆనాటి నుంచి ఆ హాస్టల్ గ్రంథాలయాన్ని తీర్చి దిద్దడమే గాకుండా, ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థలకు సైతం కష్టసాధ్యమైన తాళపత్ర గ్రంథాల సేకరణ, సంరక్షణ బాధ్యతలను ప్రతాపరెడ్డి చేపట్టారు. ఈ గ్రంథాలయం కోసం ఎన్నో ప్రదేశాలను తిరిగి తాళపత్ర గ్రంథాలను సేకరించారు. అట్లా సేకరించిన గ్రంథ సంచయంలో ఒకటి నాదెండ్ల గోప మంత్రి రాసిన కృష్ణార్జున సంవాదము. నేను పది సంవత్సరముల క్రిందట నిజాం రాష్ట్రమందు కొన్ని పల్లెలలో నించుమిం చు 50 వఱకు అముద్రిత గ్రంథముల సేకరించి వానిని హైదరాబాదు రెడ్డి విద్యార్థి వసతి గృహమునకిచ్చి యచ్చటి గ్రంథాలయములో లిఖిత గ్రంథముల శాఖ (మాన్యుస్క్రిప్ట్స్) శాఖ నొకదానినేర్పాటు చేసితినిఅని 1930 అక్టోబర్ 11న, శ్రీకృష్ణ సంవాదము కావ్యానికి తొలిపలుకు రాస్తూ పేర్కొన్నా డు.

సురవరం ప్రతాపరెడ్డి 1920 నాటికే సేకరించిన ఈ గ్రంథా న్ని సాహితీ మిత్రులు శేషాద్రి రమణకవులు ప్రోత్సాహం మేర కు పరిష్కరించి ప్రచురించినాడు. శ్రీ శేషాద్రి రమణకవులు ప్రోత్సహించిన నేరమునకై దీనికి బీఠిక వ్రాయుటకై కోరితిని. వారు సంతోషముతో వ్రాసి యిచ్చిరి అని సురవరం రాసినా డు. ఈ చిన్ని కావ్యానికి శేషాద్రి రమణకవులు విశిష్టమైన పీఠికను రాసి నాదెండ్ల గోపమంత్రికి తెలుగు సాహిత్యంలో సుస్థిర స్థానం కల్పించారు. కొండవీటిలోని ఎన్నో శాసనాల ను, మరెం తో అరుదైన సాహిత్యాన్ని పరిశోధించి ఈ పీఠికను శేషాద్రి రమణకవులు రాశారు. ప్రతాపరెడ్డి ఎంతో శ్రమకోర్చి సేకరించిన ఈ తాళపత్ర గ్రంథానికి ఒక్క మద్రాసు ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్స్ లైబ్రరీలో తప్ప మరెక్కడా మరో ప్రతి దొరుకలేదు. అది కూడా అసమగ్రంగా ఉండింది. అంటే ప్రతాపరెడ్డి పూనుకోక పోయివున్నట్లయితే తెలుగు సాహిత్యంలో నాదెండ్ల గోపయమంత్రి ఎవరో తెలియకుండా పోయేది.

గుంటూరు జిల్లా నాదెండ్లకు చెంది న గోపమంత్రి సంస్కృత కావ్యం ప్రబోధ చంద్రోదయమునకు వ్యాఖ్య రాసిం డు. అలాగే గయోపాఖ్యానము అనే నామంతరము గల కృష్ణార్జున సంవాదము ద్విపద కావ్యాన్ని రాసినాడు. 1485-1533 ప్రాంతం వాడైన గోపయమంత్రి కృష్ణదేవరాయల మహామంత్రి తిమ్మరుసుకు స్వయానా మేనల్లుడు. 1515-1533 మధ్యకాలంలో కొండవీడు ప్రాంతాన్ని పాలించాడు. సంస్కృతంలో ప్రచండకవీ, సమస్త శాస్త్రపారంగతుడు అయిన లొల్ల లక్ష్మీధ్వర యజ్వ గోపమంత్రి ఆస్థాన విద్వాంసుడు. ఈ గోపమంత్రి కవులను ఆదరించేవాడనీ, శాస్త్ర పారంగతుడనీ, మహా త్యాగియని, వీరుడని కృష్ణార్జున సంవా దం ద్వారా తెలుస్తున్నది.

కృష్ణార్జున సంవాదము కావ్యానికి ప్రతాపరెడ్డి కోరిక మేర కు శేషాద్రి వేంకటరమణ కవులు పీఠికను రాసినారు. నిజానికి ఈ పేరులో ఇద్దరు అన్నదమ్ములున్నప్పటికీ పీఠిక రాసింది మాత్రం దూపాటి వెంకట రమణాచార్యులు. అయితే గోలకొండ పత్రిక కార్యాలయ సిబ్బంది అజాగ్రత్తవల్ల ఆ వ్యాసము ఎక్కడో పోయింది. ప్రతాపరెడ్డి విషయం వివరించి చెప్పి మరోసారి పీఠికను రాయించుకున్నాడు. దీన్ని జనవరి 1, 1929 నాడు నందిగామలో నివసిస్తున్న కాలంలో రమణాచార్యులు రాసినారు. ఇప్పుడు కృష్ణార్జున సంవాదములో ఉన్నది ఆ పీఠికయే! ఇందులో గోపమంత్రిని కత్తికి గంటమునకు సమముగ పనిజెప్పిన జెగజెట్టి అని పేర్కొన్నారు. అలాగే హైదరాబాదు రెడ్డి విద్యార్థివసతిగృహమున గొప్ప గ్రంథనిలయము గలదు.

దాని క్షేమాభివృద్ధుల నరయు శ్రీ సురవరము ప్రతాపరెడ్డిగారు సేకరించిన లిఖిత గ్రంథ సముదాయములో నొకటిగా నీ కృష్ణార్జున సంవాదమున్నది. గ్రంథ ప్రశస్తి మేము గ్రహించి ప్రకటించుట యత్యవసరమన్న శుద్ధ ప్రతి వ్రాసి సంస్కరించి ముద్రించి ఈ ప్రతి యాంధ్రలోకమునకు సమర్పించుటలో శ్రీ ప్రతాపరెడ్డి గారెక్కుడు శ్రమపడిరి. అని శేషాద్రి రమణకవులు రాశారు. ఎన్నో చారిత్రక అంశాలను, మరెంతో సాహిత్యం, భాష, పదాలు ఈ కావ్యం వల్ల వెలుగులోకి వచ్చినాయి. జాతీయాలు, లోకోక్తులను కవి సందర్భోచితంగా వినియోగించు కున్నాడు. ఈ కావ్యం ద్విపదలో రాయడం మూలంగా పాఠకుల మన్ననలను పొందింది. పౌరాణిక వాఙ్మయాన్ని పామర పాఠకులకు సైతం అర్థమయ్యేలా రాయడానికి ద్విపద ప్రక్రి య ఎంతగానో తోడ్పడింది. ఇట్లా ప్రజలకు చేరువైన ప్రక్రియ లో రాసిన కావ్యాన్ని ప్రతాపరెడ్డి అత్యంత ప్రేమతో, అక్షరమక్షరం పరిశీలించి, దోషాలను సవరించి తన ప్రాంతం,సామాజికవర్గం ఇట్లా దేనితోనూ నిమిత్తం లేకుండా తెలుగు సాహిత్యానికి కొత్త చేర్పుని చేశారు. అయితే సాహిత్య చరిత్రలో ఇలాంటి అరుదైన, అమరమైన అంశాలను సాహితీవేత్తలు, సాహిత్య చరిత్రకారులు పెద్దగా రికార్డు చేయలేదు.

కృష్ణార్జున సంవాదము కావ్యములోని ద్విపదను చదివినట్లయితే దాని గొప్పతనం అర్థమైతది. అందుకే శేషాద్రి రమణ కవులు తమ పీఠికలో ఇలా పేర్కొన్నారు. నాదెండ్ల గోపమంత్రి కవితా రచనమున మిగుల బ్రౌఢుడనుటకు ఈ కృష్ణార్జున సంవాద మొక్కటి చాలును. ఆకృతిని చిన్నదైనను గుణాతిశయమున నీ కబ్బము సమకాలిక కావ్యలోకమున మిన్న. గయోపాఖ్యాన కథ కేవల సంవాద రూపము ఒకరితో నొకరు సంభాషించుటయే యిందలి ప్రధానాంశము. ఈ చిఱు కబ్బమున గథకు ప్రధాన స్థానమొసగబడినది. కథ పెంపు దగ్గించు దీర్ఘ వర్ణనమునిందు లేవు. వర్ణన సందర్భమున గవి కథాంశ ము విస్మరించిన ఘట్టములిందు గోచరింపవు. యుక్తి యుక్త ము సందర్భశుద్ధి సముచితమునగు కథాంశముతో నీ కావ్య ము చదువ జవులూరునటుల గోపకవి మనోహరముగా వ్రాసినాడు అని శేషాద్రి రమణకవులు కావ్యాన్ని మెచ్చుకున్నారు. పండితుల మన్ననలందుకున్న ఈ కావ్యాన్ని ప్రతాపరెడ్డి ఎంచుకోవడానికి ఆయనకు ద్విపద మీద ఉన్న మక్కువే కారణం. ఇందులోని కొన్ని ద్విపదలు చదివినట్లయితే ఆ కావ్య విశిష్టత మనకర్థమవుతది.
గయోపాఖ్యానములో శ్రీకృష్ణుడు అక్రూరుడిని అర్జునుడి దగ్గరకు పంపించిన ఘట్టములో చోటుచేసుకున్న ద్విపద ఇలా ఉన్నది.

వినవయ్య రుక్మిణీ విభుడు నీకడకు
బనిచిన వచ్చితిని బాండుకుమార
జజాక్షు తోడ జగడమేమిటికి
బలవద్వి రోదంబు భావ్యంబు గాదు
నలిని క్షీరోద కన్యాయమై యుండ
వలవదే? కైట భవైరియు నీవు
కాచుకొన్నడ వెక్కడ గోత్రకలహ
మాచరింపగ నేమన వచ్చు నిన్ను
ఏవారి కెవ్వార లెక్కడి గయుడు
ఏవూరి కేవూరి కెక్కడి గయుడు
నీవేల పెనగెదు నీతిబో విడిచి
చెలగి వెన్నుడు నీకు చేసిన మేలు
తలపక మాటాడ ధర్మంబు గాదు
దైవంబు గురుడు బాంధవుడు మిత్రుండు
గోవిందుడతని మార్కొనదగునయ్య
నిగ్రహా నుగ్రహ నిపుణుండు శౌరి
ఆగ్రహింపక మున్నె యనుపుము గయుని
అనినను వినియప్పుడా పాండురాజ
తనయుడు మెల్లనా తనికి నిట్లనియె
ఆవల ప్రాణభయతూరుడగుచు
నీవె దిక్కని వచ్చి నిలిచిన వాని
భూపాలవర్యులు పుడమిని దొల్లి

చేపట్టి విడిచిరే చెప్పుమానీవు అని ద్విపదలో రసాలూరించారు. ఇందులోని సాహిత్యమంతా భావస్ఫోరకంగా ఉండటంతో సురవరం ప్రతాపరెడ్డి దీన్ని పరిష్కరించి, సంపాదక త్వం వహించి సొంత డబ్బులతో అచ్చేసి ఆంధ్రదేశానికి నాదెం డ్ల గోపమంత్రిని ఆయన ప్రతిభను పరిచయం చేశాడు. తెలుగు సాహిత్యానికి గొప్ప చేర్పుని అందించారు.
- సంగిశెట్టి శ్రీనివాస్, 98492 20321
(నేడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి)

550
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles