భాషా, సంస్కృతుల గండదీపం


Mon,May 21, 2018 01:21 AM

నిజాం పాలనలో కొడిగడుతున్న తెలుగు భాషా, సాహిత్య, సంస్కృతుల దీపాన్ని నిలబెట్టిన సంస్థ నాటి నిజాం రాష్ర్టాంధ్ర సారస్వత పరిషత్. ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించగా 2015 ఆగస్టు 20న తెలంగాణ సారస్వత పరిషత్‌గా మారి ఇవ్వాళ్ళ పంచ సప్తతి ఉత్సవం జరుపుకుంటున్నది.తెలుగులో మాట్లాడటం, చదువడం నేరంగా పరిగణింపబడుతున్న సమయంలో.. మా నిజాము రాజు జన్మజన్మాల బూజు అంటూ నిజాం నిరంకుశ పాలనను నిరసించిన తెలంగాణ ప్రజలు ఎలుగెత్తి నిరసిస్త్తున్న సమయాన, హైదరాబాద్ సంస్థానంలో తెలుగువారి కోసం, తెలుగు భాష కోసం, తెలుగు సారస్వతం, సాహిత్య వికాసం కోసం, సంస్కృతి పరిరక్షణ కోసం ప్రత్యేక సంస్థ ఆవశ్యకమని భావించిన అప్పటి నిజాం రాష్ట్ర భాషోద్యమకారులు 1943మే 26న స్వర్గీయ లోకనంది శంకరరావు అధ్యక్షతన సమావేశం జరిపారు. హైదరాబాద్‌లోని కవి పండితులు, భాషోద్యమకారులు పాల్గొన్న ఆ సమావేశంలో నిజాం రాష్ట్రంలో భాషాసాంస్కృతిక వికాసాల ప్రచా రం చేసేందుకు నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్‌కు బీజం పడింది. అదేరోజున మాడపాటి హనుమంతారావు, బుక్కపట్టణం రామానుజాచారి, సురవరం ప్రతాపరెడ్డి, లోకనంది శంకరనారాయణరావు, బూర్గుల రామకృష్ణారావు, చిదిరెమఠం వీరభద్రశర్మ, ఆదిరాజు వీరభద్రరావు పంతులు, నందగిరి వెంకటరావు, కోదాటి నారాయణరావు, గడియారం రామకృష్ణశర్మ, భాస్కరభట్ల కృష్ణారావులతో ఒక ఉపసం ఘం ఏర్పాటై నిబంధనలను సిద్ధం చేసింది.
Saraswatha
1943 జూన్ 1న లోకనంది శంకరనారాయణరావు అధ్యక్షులుగా, బుక్కపట్టణం రామానుజాచారి ఉపాధ్యక్షులుగా, బిరుదు వెంకటశేషయ్య ప్రధాన కార్యదర్శిగా, బూర్గుల రంగనాథరావు సంయుక్త కార్యదర్శులుగా సంస్థ నూతన కార్యవర్గం ఎన్నికైం ది. మాడపాటి హనుమంతారావు కోశాధిపతిగా నియమింపబడగా సభ్యులుగా ఆదిరాజు వీరభద్రరావు, సురవరం ప్రతాపరెడ్డి, రావాడ సత్యనారాయణ, భాస్కరభట్ల కృష్ణారావు, సన్నిధానం సూర్యనారాయణశాస్త్రి, చిదిరెమఠం వీరభద్రశర్మ, కాళోజీ నారాయణరావు, నందగిరి వెంకట్రావు, పోల్కంపల్లి వెంకట్రామారావు, జొనపాటి సత్యనారాయణ, వెంకట రాజేశ్వరజోషి, గవ్వా అమృతరెడ్డి, మఱ్ఱి చెన్నారెడ్డి నియమింపబడ్డారు. రాజభాష, పాలనా భాష ఉర్దూగా ఉన్న సమయంలో తెలుగు సారస్వత వికాసం కోసం సంస్థను ఏర్పాటు చేయడం సాహసం. ఇది ఒక హైదరాబాద్‌తోనే ఆగిపోలేదు. ఈ చైతన్యం రాష్ట్రమంతా విస్తరించి సారస్వత పరిషత్తు స్థాపించబడిన మొదటి సంవత్సరంలోనే వరంగల్, ఖమ్మం, జనగామ, మహబూబాబాద్, అలంపూర్, తోటపల్లి మొదలగు ప్రాంతాల్లో శాఖలు ఏర్పాటయ్యాయి. నిజాం ప్రభు త్వం ఎన్నో ఆటంకాలు, అడ్డంకులు కల్పించినా వాటన్నింటిని అధిగమించి పరిషత్తు కార్యకర్తలు సంస్థ కార్యకలాపాలను రాష్ట్రం నలుమూలలా విస్తరింపజేశారు. స్థాపన నాటినుంచి ఏటా పరిషత్తు వార్షిక సభలను జరుపుతూ రెండవ సభ 1944 డిసెంబర్‌లో వరంగల్‌లో, మూడవసభ 1945లో నల్లగొండలో, 1947లో నాల్గవ సభ మహబూబ్‌నగర్‌లో జరిగాయి.

పరిషత్ సభలు సమావేశాలకే పరిమితం కాలేదు.1944లో జరిగిన ద్వితీయ సభ ల్లో పరిషత్తు పక్షాన ప్రాథమిక, ప్రవేశపరీక్షలు ప్రారంభించబడినాయి. అధిక సంఖ్య లో బాలురు, స్త్రీలు, వయోజనులు ఈ పరీక్షల్లో పాల్గొని ఉత్తీర్ణులైనారు. ఇదే సభలో సంస్కృతి సారస్వతాల వికాసానికి కృషి చేయడం, నిరక్షరాస్యతను నిర్మూలించి మాతృభాష ద్వారా విద్యావ్యాప్తి చేయడం ప్రధాన ఉద్దేశాలుగా నిర్ణయించబడినాయి. సభలు, సమావేశాలు జరుపడం, ప్రాచీన సారస్వతాన్ని ముద్రించడం, పారిభాషిక-మాండలిక కోశాలను సిద్ధం చేయడం, ఇతర సంస్థల తోడ్పాటుతో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించాలని సంకల్పించారు. ఉత్తమ సారస్వతాన్ని అచ్చువేయాలన్న ఉద్దేశంతో పరిషత్తు పక్షాన ప్రజాసారస్వతం, బాల సారస్వతం, పండిత సారస్వతం పేర వందలాది గ్రంథాలు ప్రచురించబడినాయి.
1948లో హైదరాబాద్‌పై ఇండియన్ యూనియన్ పోలీస్ చర్య అనంతరం నిజాం పాలన అంతంకావడంతో ప్రజాచైతన్యం పెల్లుబుకి అప్పటిదాకా కేవలం హైదరాబా ద్ రాష్ర్టానికే పరిమితమైన పరిషత్తు కార్యక్రమాలు యావత్ తెలుగునాడుకు విస్తరిం చాయి.

ఇండియన్ యూనియన్‌లో భాగంగా హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలిసభ హైదరాబాద్ సమీపంలోని తూఫ్రాన్‌లో జరిగింది. ఇల్లిందల రామచంద్రరావు అధ్యక్షులుగా, దేవులపల్లి రామానుజారావు ఉపాధ్యక్షులుగా, పులిజాల హనుమంతరావు కార్యదర్శిగా నూతన కార్యవర్గం ఏర్పడింది. ఈ సంవత్సరమే నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తులోని నిజాం రాష్ట్ర పదం తొలిగించబడి ఆంధ్ర సారస్వత పరిషత్‌గా మారింది. అప్పటిదాకా తెలంగాణకే పరిమితమైన పరిషత్తు శాఖలు రాయలసీమ, సర్కారు ప్రాంతాలకు విస్తరించాయి. ఈ ప్రాంతాలే గాక తెలుగువాళ్ళు అధికంగా ఉండే షోలాపూర్, బొంబాయి, గుల్బర్గా, బీదర్, బెంగళూరు మొదలగు ప్రాంతాలకు కూడా విస్తరించాయి. కేవలం ప్రాథమిక, ప్రవేశపరీక్షలకే పరిమితమైన పరిషత్తు1951లో మొదటిసారిగా విశారద పరీక్షను కూడా ప్రారంభించి నిర్వహించింది. ఈ పరీక్ష ఆ సమయంలో ప్రాథమిక పాఠశాలల్లో తెలుగు పండితుల కొరతను తీర్చింది. విద్యావికాసానికి సంబంధించిన అన్ని కార్యక్రమాల పట్ల ఆసక్తి కలిగిన పరిషత్తు 1950లో వయోజన విద్యాకేంద్రాన్ని నిర్వహించింది. ప్రభుత్వ సహకారంతో పరిషత్తు తెలంగాణలో 11 సాంఘిక విద్యాకేంద్రాలను, 64 వయోజన రాత్రి పాఠశాలలను నిర్వహించింది.

పరిషత్తు వేదిక మీద నాడు ప్రసంగించని, పరిషత్తు సత్కారం పొందని తెలుగు ప్రముఖుడు లేడనడం అతిశయోక్తి కాదు. కవి పండితులు మల్లంపల్లి సోమశేఖరశర్మ, మునిమాణిక్యం నరసింహారావు, పింగళి లక్ష్మీకాంతం, డాక్టర్ నెలటూరి వేంకటరమణయ్య, గడియారం వేంకటశేషశాస్త్రి, పుట్టపర్తి నారాయణాచార్యులు, వేదాల తిరువేంగళాచార్యులు, తల్లావఝల శివశంకరశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, నండూరి బంగారయ్య, పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు, వెంపరాల సూర్యనారాయణశాస్త్రి, కేశవపంతుల నరసింహశాస్త్రి, కురుగంటి సీతారామయ్య మొదలుకొని శ్రీశ్రీ నుంచి శ్రీపాద వరకు పరిషత్తు సత్కారాన్ని అందుకున్నవారే. 1954లో అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు చేతల మీదుగా పరిషత్తు భవనం ప్రారంభోత్సవం జరిగింది. 1964లో పరిషత్తులో తెలుగు పండిత కళాశాల ప్రారంభమైంది. ఎంతోమందికి శిక్షణ ఇస్తున్న ఈ సంస్థ వేలాదిమంది తెలుగు పండితులను తయారుచేసింది. దీనికితోడుగా 1967 నుంచి సాయం కళాశాలను ప్రారంభించింది. కాలక్రమేణా ఈ కళాశాల స్నాతకోత్తర కళాశాలగా రూపొందింది. సారస్వత పరిషత్తు కేవలం ఒక సాహిత్యసంస్థగా మాత్రమేగాక, తెలుగు భాషా సంస్కృతులకు ఒక ఉద్యమ సం స్థగా పనిచేసింది.

ఇవ్వాళ తెలంగాణ ప్రభుత్వం ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు తప్పనిసరి తెలుగును ప్రవేశపెట్టడంపట్ల భాషా ప్రేమికులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. అట్లాగే హైస్కూల్ తరగతుల్లో తెలుగులో విద్యాబోధన జరిపించడానికి ప్రభుత్వం అంగీకరించటం ముదావహం. ఈ క్రమంలో పరిషత్తు అధ్యక్షులుగా డాక్టర్ దేవులప ల్లి రామానుజారావు కృషిని ఇక్కడ పేర్కొనడం అవసరం. ప్రతిష్ఠాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఒకదశలో కేంద్ర ప్రభుత్వం హిందీ విశ్వవిద్యాలయంగా మార్చేం దుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్న సమయంలో దానికి అడ్డుకట్టవేసి ఆపింది రామమానుజరావుగారే. తానే పరిషత్తు, పరిషత్తే తానుగా వ్యవహరించి తన చివరిశ్వాస వరకు పరిషత్తు వికాసం కోసమే పనిచేశారు ఆయన. వీరి మరణానంతరం అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి గారు 2017లో మరణించే వరకు అధ్యక్షులుగా ఉన్నారు. ప్రస్తుతం ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షులుగా, డాక్టర్ జె.చెన్నయ్య కార్యదర్శులుగా ఉన్నారు.
తెలంగాణ ప్రజలకు అక్షరాయుధాన్ని అందించిన సారస్వత పరిషత్తు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవసారి తన పేరును మార్చుకున్నది. పోలీస్ యాక్షన్ తర్వాత నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు నుంచి ఆంధ్ర సారస్వత పరిషత్తు గా మారినట్టే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ సారస్వత పరిషత్తుగా మారింది. భాషా సాహిత్యాలను సంరక్షించిన ఈ గండదీపం వెలుగులు ఇలాగే శతవసంతాల కు సాగాలని కోరుకుందాం.
(2018 మే 26న తెలంగాణ సారస్వత పరిషత్ పంచ సప్తతి సందర్భంగా..)
- డాక్టర్ పత్తిపాక మోహన్, 99662 29548

525
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles