జీవిత సంఘర్షణల సారమే నవల


Mon,May 14, 2018 12:51 AM

-నవల వైవిధ్యానికీ వైశిష్ట్యానికీ చిహ్నంగా నిలిచే సాహితీ ప్రక్రియ. చారిత్రక, రాజకీయ, ఆర్థిక, సామాజిక, నైతిక, తాత్త్విక విషయాల్ని మనస్తత్వశాస్ర్తాన్ని వివరిస్తూ సమస్త జీవిత కోణాల్ని చిత్రించగల అనువైన ప్రక్రియ నవల.

-నవలా రచయిత జీవితంతో ముడి పడిన కళాకారుడు,ప్రాథమికంగా అనాలోచనాపరుడు. అందుచేత అతడు ఎలాంటి తాత్త్విక సామాజిక విశ్వాసాలూ లేకుండా ఉండటం అరుదైన విషయం. వారి విశ్వాసాలేమిటో వారికే తెలియకపోవటం ఈ వాదనను చేస్తున్న వారిలో
కనిపించే ప్రధానవైరుధ్యం.


జీవితంలో ఉండే వాస్తవికతను, సంక్లిష్టతను, సంఘర్షణను చిత్రించే విస్తృతమైన సృజనాత్మక ప్రక్రియ నవ ల. సుదీర్ఘమైన ఇతివృత్తం, సులభమైనశైలి నవలకు ముఖ్యలక్షణం. ఏ రచనకైనా వాస్తవికతే ప్రాణం. వాస్తవికత అంటే కేవలం ఉన్నది ఉన్నట్లుగా రాయడం కాకుండా విశ్లేషణాత్మకంగా, విమర్శనాత్మకంగా చిత్రించడం. ఈ సమాజం ఇలా ఎందుకుంది? ఈ సమాజాన్ని నడిపించే ఆర్థిక, సామాజిక, రాజకీయశక్తులేమిటి? సమాజాన్ని అభ్యుదయపథం వైపు నడిపించాలంటే ఏం చేయాలి? అన్న ప్రశ్నలకు రచయిత తన రచనల్లో సమాధానాలను సూచించాలి. ఏ రచయితా తన చుట్టూ ఉన్న సమాజాన్ని, దాని పరిణామ క్రమా న్ని విస్మరించలేడు.
తెలుగులో నవలా పరిణామం: కళాపూర్ణోదయమే పద్యరూపం లో ఉన్న తొలి తెలుగు నవల అని కొంతమంది వాదిస్తారు. కానీ నవ ల గద్యరూపంలో ఉన్న ఆధునిక ప్రక్రియ తెలుగు నవలా పరిణామ చరిత్రను 1867 నుంచి లెక్కించాలా లేక 1872 నుంచి లెక్కించాలా అనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. నిడదవోలు వెంకట్రావుగారి ప్రకారం తొలి తెలుగు నవల 1867లో వెలువడింది. ఈ నవ ల పేరు మహాశ్వేత- రచయిత కొక్కొండ వెంకటరత్నం పంతులు. అయితే మహాశ్వేత స్వతంత్రంగా రాయబడిన నవలకాదనీ, సం స్కృత కాదంబరిలోని మహాశ్వేత వృత్తాంతానికి ఇది అనువాద మనీ, ఈ అనువాదం కూడా పూర్తిగా జరిగిందనటానికి తగిన దాఖలాలు లేవని చాలామంది విమర్శకులు మహాశ్వేత తొలి తెలుగు నవల అనేవాదాన్ని ఖండించారు. అందుచేత 1867 నాటికి తెలుగు లో నవల రాసే ప్రయత్నం ప్రారంభమైందని చెప్పవచ్చునేమోగానీ, ఆనాటికి తొలి తెలుగు నవల ఆవిర్భవించిందని చెప్పలేం.

ఆ సంవత్సరంలో లార్డ్‌మేయో బెంగాల్ దేశీయుల ఆచార వ్యవహారాలు, జీవన విధానం తెలియజేసే నవలకు బహుమానం ఇస్తాన ని ప్రకటించాడు. ఆ ప్రకటనను పురస్కరించుకొని, కర్నూలులో డిప్యూటీ కలెక్టరుగా పనిచేస్తున్న గోపాలకృష్ణమ శెట్టి శ్రీరంగరాజ చరి త్ర అనే నవలరాసి బహుమతిని గెలుచుకున్నాడు. దీన్ని ఫోర్డ్ సెయింట్ జార్జ్ గెజిట్ తొలి తెలుగు నవలగా పేర్కొన్నది. దీన్నే గోపా ల కృష్ణమశెట్టి వచన ప్రబంధంగా పేర్కొన్నాడు. ఆ తర్వాత చాలా కాలం వరకు అంటే 1897వరకూ నవలలు తెలుగులో వచన ప్రబంధాలు గానే చలామణి అయ్యాయి.1897 నాటికి వచన ప్రబంధం తన పేరును నవలగా మార్చుకొంది. దీనికి కారకులు కాశీభట్ల బ్రహ్మ య్య శాస్త్రి.
శ్రీరంగరాజ చరిత్ర వెలువడిన ఆరేండ్లకు, వీరేశలింగం నడుపుతు న్న వివేకవర్ధిని మాసపత్రికలో రాజశేఖర చరిత్ర ధారావాహికంగా ప్రచురించారు. అయితే వీరేశలింగం తెలిసో, తెలియకో తమ నవలే తెలుగులో వెలువడ్డ తొలి నవల అని ప్రకటించుకున్నారు. దీనికి తార్కాణం స్వీయచరిత్రలో వీరేశలింగం రాసుకున్న వాక్యాలే.

ఏదేమైనా రాజశేఖర చరిత్రకున్న ప్రాశస్త్యాన్ని ఎవరూ కాదనలే రు. ఆలివర్ గోల్డ్‌స్మిత్, వికార్ ఆఫ్ వేక్‌ఫీల్డ్ ప్రభావం దీని మీద కనబడుతున్నప్పటికీ అచ్చంగా భారతీయుల ఆచార వ్యవహారాలను ప్రతిబింబింపజేసే నవల ఇది.అంతేకాదు. ఇంగ్లీషులోకి Fortunes Wheel అనే పేరిట అనువదింపబడిన తొలి తెలుగు నవల కూడా ఇదే. సాహిత్యానికీ, సామాజిక ప్రయోజనానికీ సంబంధం ఎంత పటిష్ఠమైందో గుర్తుచేసే రాజశేఖర చరిత్ర ఒకనాటి తెలుగు నవలకు ఆదర్శమై నిలిచింది.చింతామణి పత్రిక నడిపే రోజుల్లో వీరేశలింగం నిర్వహించిన నవలా పోటీలు ఇందుకు మరింత దోహదం చేశాయి.
నవల వైవిధ్యానికీ వైశిష్ట్యానికీ చిహ్నంగా నిలిచే సాహితీ ప్రక్రియ. చారిత్రక, రాజకీయ, ఆర్థిక, సామాజిక, నైతిక, తాత్త్విక విషయాల్ని మనస్తత్వశాస్ర్తాన్ని వివరిస్తూ సమస్త జీవిత కోణాల్ని చిత్రించగల అనువైన ప్రక్రియ నవల. ఇతర ప్రక్రియల స్వరూప స్వభావాలు నవలలో ఉంటాయి. నవలలో కథానిక, నాటిక, విమర్శ, ఉపన్యాసం, వ్యాసం వంటి వాటిని గమనిస్తాం. అందుకే కొందరు నవలను సమగ్రసాహితీ ప్రక్రియగా, సాహితీ సమాహార స్వరూపంగా పేర్కొంటారు.

నవలకు కవిత్వానికీ భేదం ఎక్కువ. సంజీవమ్మ ప్రకారం.. కవి త్వం ప్రధానంగా ఆత్మాశ్రయం. కథా సాహిత్యం ప్రధానంగా వస్తా శ్రయం. కథాత్మక కవిత వున్నా అందులోనూ వున్నంతలో కవి ఆత్మాశ్రయ భావాలకు ఎక్కువ చోటిస్తాడు. కాని కథా సాహిత్యంలో అందులోనూ నవలలో విస్తృత సామాజిక జీవితాన్ని కథా వస్తువుగా ఎన్నుకున్నప్పుడు రచయిత వస్తాశ్రయతను పొందక తప్పదు. తద్వారా యథార్థ సమాజం,ఆ చైతన్యం ప్రతిబింబించడానికి అవకాశం ఎక్కు వ అన్నారు. కవిత్వంలో ఒకనాడు ఆత్మాశ్రయం అధికమే గాని నేటి కవిత్వంలో సామాజిక చైతన్యమే ఎక్కువ. కవితలో ఒక అంశమే వివరించే అవకాశం ఉంటుంది. నవలలో అన్ని పార్శ్వాలను ప్రదర్శించే సౌకర్యం ఉంది. తర్వాతికాలంలో నవల బౌద్ధిక ధర్మాన్ని కూడా పెం చుకోవటం వల్లనే మనస్తత్వ చిత్రణలకీ, అస్తిత్వవాదానికీ, చైతన్య స్రవంతికీ అవకాశం ఏర్పడింది. కళాత్మకంగా చూస్తే కవిత్వమే నవలకన్న మిన్న అనిపిస్తుంది. ప్రజలకు మధురాన్ని కలిగించే లక్ష ణం, గాన యోగ్యమైన లక్షణం కవిత్వానికి మాత్రమే ఉంది. ఆలోచన కన్నా స్పందన ప్రధానమైంది కవిత్వమైతే, సద్యఃస్ఫూర్తికన్నా ఆలోచన ప్రధానమైంది నవల.

ఇక నవలకు, కథానికకు కూడా భేదాలున్నాయి. సాంఘికమైన ఇతివృత్తి రెండింటికీ ప్రధానమే. కాని లోగడ చెప్పుకున్నట్టుగా నవలకున్న విస్తృతి కథానికకు లేదు. పరిమితమైన సంఘటన, పరిమితమైన పాత్రలు గలది కథానిక. జీవితంలోని ఒక చిన్న సంఘటన చుట్టూ అల్లేది కథానిక అవుతుంది. నాటకానికన్న తక్కువ పరిధి గలదిగా చెప్పవచ్చు. కథ సామాన్యంగా ఒక సన్నివేశంతో ఉంటుంది. నవల అనేక సన్నివేశాలతో కూడుకుని ఉంటుంది. అయితే నవలలో లేని సంక్షిప్తత, స్పష్టత, సూటిదనం కథలో ఉండే అవకాశమున్నది. శిల్పం విషయంలో కూడా ప్రతిభ గల రచయితకు కథ మంచి సాధ నం. కవితలాగా కథ పాఠకుడిలో సద్యఃస్పందన కలిగించే వీలుంది. పెద్దకథ పేరుతో కొందరు నవలలు రాస్తున్నారు. శ్రీపాదవారి కథలు నవలికలు అనేలా ఉంటాయి. కవిత్వానికి ప్రాధాన్యం ఇచ్చే కథలూ ఉన్నాయని చలం ఓ పువ్వు పూసింది వెల్లడిస్తుంది.

రచయితకు ఎలాంటి సామాజిక తాత్త్విక విశ్వాసాలు ఉండకూడదనీ, రచయిత జీవితాన్ని వస్తుగతంగా మాత్రమే చూడాలని నమ్మే రచయితలూ, విమర్శకులూ ఉన్నారు. విశ్వాసాలు కళా విలువలను పాడుచేస్తాయన్నది వీరి ప్రధానమైన వాదం. కవికి కొన్ని సందర్భాలలో నేలవిడచి సాముచేసే అవకాశం ఉంటుందేమో కానీ నవలా రచయితకు అది గగన కుసుమం. నవలా రచయిత జీవితంతో ముడి పడిన కళాకారుడు, ప్రాథమికంగా అనాలోచనాపరుడు. అందుచేత అతడు ఎలాంటి తాత్త్విక సామాజిక విశ్వాసాలూ లేకుండా ఉండటం అరుదైన విషయం. వారి విశ్వాసాలేమిటో వారికే తెలియకపోవటం ఈ వాదనను చేస్తున్న వారిలో కనిపించే ప్రధానవైరుధ్యం. ఈ పద్ధతి సైన్స్‌లో, సామాజిక శాస్ర్తాలలో కూడా పనికిరాదు. ఈ శాస్ర్తాలలో పరిశీలన ఒక పరికల్పన (హైపోథిసిస్)తో ప్రారంభమవుతుంది. అందుచేత ఎలాంటి విశ్వాసాలూ లేని నవలా రచయిత కంటే ఏదో ఒక విశ్వాసం ఉన్న నవలా రచయితే జీవితాన్ని లోతుగా చూడగలడ నీ, జీవితం ఎలా ఉందని మాత్రమే కాక, అలా ఎందుకుందో కూడా చెప్పగలడనీ మనం గుర్తుంచుకోవటం మంచిదని కమిట్‌మెంట్ అవసరాన్ని వల్లంపాటి వెంకటసుబ్బయ్య వివరించారు.

మనం ఒక ప్రక్రియను అవగాహన చేసుకోవడానికి కొన్ని అంశాలను గుర్తించవలసి ఉంటుంది. కవిత్వాన్ని విశ్లేషించే అంశాలు వేరుగాను, నవలను విశ్లేషించే అంశాలు వేరుగాను ఉంటాయి. ఈ అంశాలను గుర్తించి వివేచన చేసినప్పుడే నవల పరమార్థం వెల్లడవుతుం ది. నవలను సీరియస్‌గా పట్టించుకొని ఆలోచించేవారు, విమర్శకులు కొన్ని నియమాలు పాటించి లక్ష్యాలు నిర్దేశించుకుంటారు. వల్లంపాటి వెంకట సుబ్బయ్య నవలాశిల్పంలో నవలలోని ప్రధానాంగాలను పేర్కొని నవలను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చో, అంచనా వేయవ చ్చో చక్కగా వివరించారు. నవలను పరిశీలించటానికి ఉపయోగపడే ప్రధానాంగాలుగా ఆయన నాలుగింటిని పేర్కొన్నారు. 1.కథ 2.కథావస్తువు 3.పాత్రలు 4.నేపథ్యం. ఈ నాలుగింటిలో ఎక్కువ తక్కువలని నిర్ణయించే బదులుగా వీటిని పరస్పరాశ్రయాలుగా చెప్పటమే సముచితం. ఏ ఒక్కటి లోపించినా, బలహీనమైనా నవల సారహీనమవుతుందని వల్లంపాటి వారు పేర్కొన్నారు.

కాలక్రమంలో దండగుచ్చిన సంఘటనల వరుసను కథ అనవ చ్చు. ఈ ఘటనలు ఒకదానితో మరొకటి సంబంధం కలిగినవిగా, ఒకదానిలోంచి మరొకటి పుట్టినవిగా ఉంటాయి. నవలా రచయిత ఉపయోగించే కథ ఆద్యంతాలు వాస్తవమైనవీ కావు, సహజమైనవి కావు. నవల ఎలా ప్రారంభించాలో ఎలా ముగించాలో రచయితకు స్పష్టమైన అవగాహన అవసరం. యాదృచ్ఛికత అనేది నవలకి సరైనది కాకపోవచ్చు. చక్కని కథ నింపాదిగా ప్రారంభమై, సాగిన కొద్దీ విశాలమౌతూ, పాత్రలనూ సంఘటనలనూ తనలో కలుపుకున్న తర్వాత తన వైశాల్యాన్ని తగ్గించుకుంటూ వేగాన్ని పెంచుకుంటూ ముందుకుసాగి. ప్రశాంత గంభీరంగా ముగుస్తుంది. కథకు సంబంధించిన సంపూర్ణమైన అనుభూతిని ముగింపే సూచిస్తుంది.

నవలలోని మరొక ప్రధానంగం కథావస్తువు. దీన్నే ఇతివృత్తం అంటారు. కథావస్తువును వల్లంపాటి వారు ఇలా నిర్వచించారు - కథ మనకు పూర్తిగా తెలిసిన తర్వాత ఈ కథ ఏం చెబుతోంది? అని ప్రశ్నవేసుకుంటే వచ్చే సమాధానాన్ని స్థూలంగా కథావస్తువు అనవ చ్చు. కథ పాఠకుడిలో తర్వాత ఏం జరిగింది అన్న కుతూహలం రేకెత్తిస్తే, కథావస్తువు కథ అలా ఎందుకు జరిగిందో వివరించటానికి ప్రయత్నిస్తుంది. హడ్సన్ అనే విమర్శకుడు ఇతివృత్తానికి మూలం మానవ జీవితమే అన్నాడు. నవలలోని కథ ఇతివృత్తంగా రూపుదిద్దుకుంటుంది. సుజాతారెడ్డి గారి ప్రకారం.. తెలుగు నవలానుశీలనం లో నవల ఇతివృత్తంలో మూడు గుణాలు తప్పక ఉండాలి. విశ్వజనీనత, చిత్తరంజకత, సంభావ్యత అని పేర్కొన్నారు. నవలను ఏ ప్రాం తం వారైనా, ఏ జాతివారైనా చదివి లీనమయ్యేలా రాయటమే విశ్వజనీనత. కథావస్తువు పాయల్లో ఉత్కంఠను నిలుపుతూ చివరివరకు ఏకబిగిన చదివింపజేసేలా, నైతిక విలువలు బోధించేదిగా ఉండాలి. శైలి, సంభాషణలు, వర్ణనలు ఉండాలి. అదే చిత్తరంజకథ. మూడవ గుణం సంభావ్యత. సంఘటనలు, పాత్రలు నిత్యజీవితానికి సన్నిహితంగా, పాఠకులకు విశ్వాసం కలిగేలా ఉండాలి. సత్యదూరం, అభూతకల్పనలు, కృత్రిమత్వం అసంభావ్యాలుగా ఉంటాయి. సంభావ్యత అంటే వాస్తవికత. నవలలో కల్పితం తప్పదు, కానీ అది పాఠకుల అనుభవానికి అందేదిగా ఉండాలి తప్ప - ఊహాపోహలతో కూడుకొని ఉండకూడదు. పాశ్చాత్యులు కథావస్తువును నిబిడబంధం, శిథి ల బంధం అని రెండుగా విభజించారు (సుజాతారెడ్డి). ఏ రచయిత అయినా తన సిద్ధాంతానికి, నమ్మకానికి అనుగుణమైన ఇతివృత్తాన్ని ముందుగా ఎంచుకొని ఆ తర్వాత నవల రాస్తాడన్నది సాధారణ విష యం. నవలలో ఇతివృత్తం ఒకే కథగానూ ఉండవచ్చు లేదా రెండు మూడు కథల మిశ్రమంగానూ ఉండవచ్చు.

కథావస్తువును భరించేవి, పాఠకుల్ని తమతోపాటు లాక్కొని వెళ్ళే వి పాత్రలు. నీతి కథలలో (పంచతంత్రం వంటివి) జంతువులు, పక్షు లు పాత్రలుగా ఉండి అన్యాపదేశంగా నీతిని ప్రబోధిస్తాయి. నవలల్లో సామాన్యంగా మానవులే పాత్రలుగా ఉంటారు. (విశ్వనాథవారి వేయిపడగలులో పసిరిక పాత్ర వంటిది ఎక్కడో ఉంటుంది). ఏ నవలకైనా గుండెకాయ వంటిది పాత్ర. కథ, కథావస్తువులు నామమాత్రంగా గానీ, బలహీనంగా గానీ.. ఎలా ఉన్నా పాత్రలు తప్పనిసరిగదా. నవలా సాహిత్యంలో ఎక్కువగా క్లిష్టతలేని పాత్రలే కనిపిస్తాయి. ఒకేఒక భావాన్నో, గుణాన్నో ఆధారం చేసుకొని రూపొందించబడిన పాత్రను క్లిష్టత లేని పాత్రగా చెప్పవచ్చు. అడవిబాపిరాజు నవలల్లో పాత్రలు ఎక్కువగా క్లిష్టతలేని పాత్రలుగా కనిపిస్తాయి. భిన్నవ్యక్తిత్వాలు అంతస్సంఘర్షణ, పరిస్థితుల వల్ల పరిణామం చెందటం మొదలైన లక్షణాలు గలవి క్లిష్టత గల పాత్ర అనవచ్చు. చివరకు మిగిలేది నవలలో దయానిధి పాత్ర క్లిష్టత గల పాత్రకు ఉదాహరణ. కొం తమంది నవల్లోని పాత్రల్ని టైప్స్, ఇండివిడ్యువల్స్ అని కూడా విభజించారు. వీటిని నమూనా పాత్రలు, వ్యక్తులు అనవచ్చు. ఒక నవలలో నాయకుడూ, నాయిక, విలన్.. అనే పాత్రలు నమూనా పద్ధతిలోనే ఉంటాయి. అంటే ఒక సంప్రదాయమైన మార్గంలోనే ఉంటా యి. ఇలాంటిదే ఆర్కిటెప్స్ అని కూడా ఉంది. అంటే నమూనాలకు ఆధారభూతమైన రూపం అని అర్థం. విప్లవకారుడు, తాగుబోతు, వ్యభిచారి, భగ్న ప్రేమికుడు, ద్రోహి, పతివ్రత మొదలైనవి ఆర్కిటైప్ పాత్రలు (వల్లంపాటి).

నవలలోని చివరి ప్రధానాంగమైన నేపథ్యం గురించి వల్లంపాటి ఇలా వ్యాఖ్యానించారు..కథతో, కథా వస్తువుతో, పాత్రలతో విడదీయరాని సంబంధం కలిగిన మరొక అంశం నేపథ్యం. కథ, కథావస్తు వు, పాత్రలు మొక్కలైతే నేపథ్యం నేలవంటిది. ఒకే కుదురుకు చెందిన ఈ మూడు మొక్కలూ తమకు కావలసిన ప్రాణ చైతన్యాన్ని నేపథ్యం నుంచి మాత్రమే గ్రహిస్తాయి. నేపథ్యాన్ని వాతావరణం అనీ, ఇంగ్లీషులో Back ground అనీ కూడా పిలువవచ్చు. నేపథ్య చిత్రణ కథకు వెనుక ఉన్న దేశాన్ని (స్థలాన్ని) చిత్రించటం మాత్రమే కాదు. ఆ నేలలో ఆ గాలిలో ఆ కాలంలో ఉన్న భావాలను చిత్రించటం కూడా. అంటే నేపథ్యం భౌతికమైంది మాత్రమే కాక, భావజాల సం బంధమైంది కూడా. కొన్ని నవలల్లో వస్తువు నేపథ్యంలోంచి సరాస రి పుట్టుకురావచ్చు. మరికొన్ని నవలల్లో వస్తువుకూ నేపథ్యానికీ చెప్పుకోతగ్గ తేడా లేకుండాపోవచ్చు. ఉదాహరణకు కేశవరెడ్డి ఇన్ క్రెడిబు ల్ గాడెస్‌లో కథావస్తువు నేపథ్యంలోంచి సరాసరి పుట్టుకొచ్చింది. అంటే ఆ కథావస్తువుకు ఆ నేపథ్యమే సరిపోతుందన్నమాట! దీనికి కాస్త భిన్నంగా నామిని మునికన్నడి సేద్యంలో నేపథ్యమే కథావస్తు వు. రచయిత తనకు తెలీని అర్థంకాని నేపథ్య చిత్రణకు పూనుకోవ టం శ్రేయస్కరం కాదు. నేపథ్యం చిత్రణలో ఉండవలసిన ప్రధాన లక్షణం ప్రామాణికం. కందుకూరి రాజశేఖర చరిత్రలోనూ ఉన్నవ వారి మాలపల్లిలోనూ నేపథ్య చిత్రణ ప్రామాణికు ప్రమాణాలుగా చెప్పుకోవచ్చు.

ఈ నాలుగు అంగాలతోపాటు కథా కథనం కూడా నవలలో ప్రధానాంశమే. కథను ఎలా చెప్పాలి? అనేది ముఖ్యం. వస్తువును బట్టి కథా కథనం ఆధారపడి ఉండటం సహజమే. వాస్తవిక కథనం, ఫాం టసీ, అంతరార్థ కథనం (అలిగిరీ), దినచర్యా కథనం, లేఖా కథనం, చైతన్య స్రవంతి కథనం వంటి భేదాలున్నాయి. కథను సంభా షణల ద్వారా నడిపించటమూ వుంది. రంగనాయకమ్మ కృష్ణవేణి నవల, పుప్పల లక్ష్మణరావు అతడు-ఆమెనవల కథాకథనం ఉత్తరాల ద్వారా జరిగింది. కొడవటి గంటి సరితాదేవి డైరీ, సరోజ డైరి అనే నవలల్లో డైరీల ద్వారా కథ నడిచింది. విశ్వనాథ వారి ఆరునదులు నవలలో కథ ఉపన్యాసాల ద్వారా నడువటం గమనిస్తాం. చైతన్య స్రవంతి ద్వారా కూడా కథా కథనం జరుగుతుంది. చైతన్య స్రవంతి పద్ధతి అంతర స్వగతంగా ఉండి పాత్రల అంతరాంతరాల్లోని ఆలోచనల స్రవంతిని పాఠకులకు తెలియజేస్తుంది. నవలకూ సామాజిక వాస్తవికతకూ ఉన్న సంబంధాన్ని మరింత నమ్మకం కలిగేలా చిత్రించటం కోసం రూపొందిన కథన పద్ధతిని న్యూస్‌రీల్ కథనం అంటారని వల్లంపాటి పేర్కొని ఇందుకు ఉదాహరణగా కె.చిరంజీవి రాసిన బోలో స్వాతంత్య్ర భారతికీ జై పేర్కొన్నారు. ఈ కథనం సాధారణంగా ఒక చారిత్రక ఘట్టంతో ప్రారంభమై మరొక ప్రధాన చారిత్రక ఘట్టం వద్ద ఆగుతుంది. ఈ రెండు ఘట్టాలమధ్య జరిగిన సామాజిక చరిత్రను ఆ కథలోని పాత్రల జీవితాలతో అనుసంధించే ప్రయత్నం ఇందులో ఉంటుంది.

నవలల్లో శైలికి కూడా ప్రాధాన్యం ఉంది. గురజాడ తర్వాత నుంచి పూర్తిగా వాడుక భాషలోనే వెలువడుతున్నాయి. అయితే మాండలిక భాషలకూ, ప్రాంత భాషలకూ, కుల, వృత్తుల భాషలకూ ప్రాము ఖ్యం లభించాయి. వడ్డెర చండీదాస్, కేశవరెడ్డి మొదలైన వారి నవలల్లో శైలి మరీ ప్రత్యేకంగా ఉంటుంది. సామాన్యులకు అన్నివర్గాల వారికి ఉద్దేశించబడుతూ సామాజిక సమస్యలకు ప్రాధాన్యం ఇస్తూ నవల తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్నది.
- డాక్టర్ మహమ్మద్ హసేన, 99080 59234

656
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles