వీరోచిత వేట కథ


Mon,May 14, 2018 12:49 AM

ఇంగ్లీష్ పుస్తకాలు చదివేవాళ్లకు, ప్రఖ్యాత వేటగాడు, అంతే ప్రఖ్యాతిగాంచిన రచయిత జిమ్‌కార్బెట్ గురించి తెలుసు. జిమ్‌కార్బెట్, రుద్రప్రయాగ చిరుతపులిని వేటాడిన తన అనుభవాలన్నీ ఇంగ్లీషలో రాస్తే 27 ప్రపంచభాషల్లో అనువదింపబడింది. 72 సంవత్సరాల నుంచీ 47 పునర్ముద్రణలు పొందింది. తరాలు మారినా ఇంకా చదువుతూనే ఉన్నారంటే, అటువంటి పుస్తకాన్ని తెలుగులో కందుకూరి రవీంద్రనాథ్ స్వేచ్ఛానువాదం చెయ్యడం పులిని వేటాడినంత సాహసం అని చెప్పక తప్పదు. ఆ సాహసంలో రవీంద్రనాథ్ విజయం సాధించారని ఒప్పుకోక తప్పదు.
Rudra
వందేళ్ల కిందట 500 చదరపు మైళ్ల పరిధిలో, 50 వేల ప్రజలు నివసిస్తున్నచోట, ఇంకో 60 వేలమంది కాలినడకన బదరీనాథ్, కేదార్‌నాథ్ యాత్ర చేస్తున్న దార్లలో ఒక మనుషల్ని తినమరిగిన చిరుతపులి 8 సంవత్సరాల పాటు వందలమందిని చంపుకు తినేస్తూంటే, దానికోసం వందలమైళ్లు ఒంటరిగా పగలూ రాత్రులూ అడివిలో కలయ దిరిగి, 65 రాత్రులు మాటువేసి చివరకు దాన్ని చంపిన ధీశాలి జిమ్‌కార్బెట్.
8 సంవత్సరాలు ప్రజలూ, యాత్రికులూ సాయంత్రం నుంచి బాగా తెల్లారేదాకా ఇళ్లల్లో, సత్రాల్లో చప్పుడు చెయ్యకుండా, బిక్కు బిక్కుమంటూ గడిపారంటే, అది రుద్రప్రయాగ్ చిరుతపులి విధించిన కర్ఫ్యూ అంటారాయన.
మూసిన తలుపులు బద్దలుకొట్టి, మట్టిగోడల్లో కన్నాలు చేసి కనురెప్పపాటులో మనుషుల్నెత్తుకుపోయిన రుద్రప్రయాగ చిరుతపులి కలిగించినదే నిజమైన హడల్ అంటారాయన.
ఒక చిన్న గదిలో నలభై మేకలు ఇరుక్కుని, అందులో ఒకమూలనున్న కుర్రాడిని, చిరుతపులి ఎత్తుకుపోయినప్పుడు, గుమ్మం నుంచి కుర్రాడి దగ్గరికి మేకల మీంచి దూకిందా? లేదా మేకలప్పటికే భయంతో నిలబడిపోయుంటే, వాటి పొట్టలకింద నుంచి డేకిం దా? అని మన్నే ప్రశ్నించి, నేర పునర్ నిర్మాణం తనే చేసి మనల్ని ఆశ్చర్యపరుస్తారు.

నరమాంసభక్షకి భయంతో వాడడం మానేసిన ఎన్నోదార్లు, ఒక్క చిరుతపులికీ, తనకీ మాత్రమే తెరిచివున్నాయన్న జిమ్‌కార్బెట్ మాటల్లో ఆయన సాహసం మనకు తెలుస్తున్నది.
70 కిలోల బరువున్న స్త్రీని నడుందగ్గర నోటితో కరిచి పట్టుకుని, ఆమె తలా కాళ్లూ నేలమీద ఆనకుండా ఎత్తుకుపోయిందంటే ఈ చిరుతపులి బలం మనం ఊహించుకోవాల్సిందేనంటారాయన. బోనుల్లో, జిన్‌ట్రాప్‌ల్లో చిక్కుకున్నా తప్పించుకున్న ఈ చిరుతపులి జిత్తులమారితనం, తెగువ, ధైర్యం చదువరులకు ఆశ్చర్యం కలిగిస్తుంది.
చీకట్లో రుద్రప్రయాగ నరమాంసభక్షక చిరుతపులీ, మరో మామూలు చిరుతపులీ భయంకరంగా పొట్లాడుకుంటూంటే, దూరం నుంచి వింటూ, జిమ్‌కార్బెట్ వాటి పోరాటాన్ని వర్ణించిన తీరు ఆయన విశ్లేషణకు అద్దం పడుతుంది. మనకు టీవీలో చూస్తున్నట్టే అనిపిస్తుంది.
పులులకీ చిరుతపులులకీ మనుషలు సహజ ఆహారం కాదని, వాటిల్లో ఒకటో అరో నరమాంస భక్షకిగా మారితే, దానికి మనవేకారణమని పరిశోధించిన తన సిద్ధాంతవాక్యాన్ని, సకారణాలతో రుజువుచేసిన వ్యక్తి జిమ్‌కార్బెట్.
ఒక వేటగాడు, హిమాలయాల్లో ప్రపంచంలోకల్లా అద్భుతమైన సూర్యాస్తమయాన్ని వర్ణించడం మనని రంజింపజేస్తుంది.

తెలుగులో రుద్రప్రయాగ చిరుతపులి చదువుతుంటే, జిమ్‌కార్బెట్ భావాలను కందుకూరి రవీంద్రనాథ్ వేటాడినట్టనిపిస్తుంది. జిమ్‌కార్బెట్ ప్రఖ్యాతి ఈ చిరుతపులిని చంపడంలోనే కాదు - దాన్ని చంపి ఎందరో మనుషుల ప్రాణాల్ని కాపాడటంలో కూడా ఉందనిపిస్తుంది.
స్వేచ్ఛానువాదమని కందుకూరి రవీంద్రనాథ్ చెప్పుకున్నారు గానీ, ఎక్కడా అనువాద ఛాయలు లేవు. జిమ్‌కార్బెట్ స్వయంగా తన అనుభవాలను మనకు చెబుతున్నట్టే వుంటుంది. పుస్తకం చదువుతుంటే తనతోబాటు 3 నెలలు వెంటబెట్టుకుని వేటకి తీసుకెళ్లినట్టే అనిపిస్తుంది. అది మాటిమాటికీ తప్పించుకుంటూంటే, చిరుతపులికీ జిమ్‌కార్బెట్‌కీ మధ్య జరుగుతున్న ఎత్తుకు పైఎత్తులూ చూస్తూం టే, ఇంకా ఏం చెయ్యా లా! అని మనం కూడా ఆలోచిస్తాం.
కందుకూరి రవీంద్రనాథ్ అవసరమైన చోట్ల ఇచ్చిన పుట్ నోట్స్ ఈ పుస్తకానికే హైలెట్.వయస్సుతో నిమిత్తం లేకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది.
- విశ్వనాథ్, 98499 01776

677
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles