ఆ కథలు పీడిత జన వెతలు


Mon,May 7, 2018 01:13 AM

బోయ జంగయ్య ప్రజల భాషకు ప్రామాణిక భాష అవరోధమని గుర్తించాడు.అందుకే ఆయన ప్రామాణిక భాషా సిద్ధాంతాన్ని పక్కనపె ట్టాడు. ఏది రాసినా అది ప్రజలకు అర్థం కావాలని తండ్లాడాడు. ముఖ్యంగా కథ ల్లో సంభాషణలు వచ్చినప్పుడు అత్యంత
శక్తివంతంగా రాయడం బోజకు బాగా అలవాటైన పద్ధతి. పెద్దపెద్ద విషయాలను కూడా సులభతరం చేయడంలో దిట్ట.

Boya-Jangayya
సామాజిక ప్రయోజన దృష్టితో రచనలు చేయాల్సిన బాధ్యత బాధిత సమూహాలకు మరింత ఎక్కువగా ఉంటుంది. ఆ బాధ్యత తలకెత్తుకొని చాతుర్వర్ణ కులవ్యవస్థ మీద అలుపెరుగని అక్షరయుద్ధం చేసిన కలం యోధుడు బోయ జంగయ్య. దళిత సాహిత్య చరిత్రలో కులపీడనపై రాసిన కవు ల జాబితాలో మొదటి పేరు గుర్రం జాషువా. తెలంగాణ నుంచి ఆ రకమైన గొంతుకను బలంగా వినిపించిన సాహితీ కృషీవలుడు బోయ జంగయ్య.
స్వాతంత్య్రానంతరం చదువుకున్న తొలి తరానికి చెందిన దళితు డు బోయ జంగయ్య. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరుగుతున్న కాలంలో నల్లగొండ జిల్లా చౌటుప్పల్ సమీపంలోని లింగారెడ్డిగూడెంలో జన్మించాడు. చిన్ననాటి నుంచి కుల అవమానాలను ఎదుర్కొని బడిలోకి అడుగుపెట్టాడు. చదువునే కాదు సమాజాన్ని చదివిన బోయ జంగయ్యకు అనివార్యంగా రచనాశక్తి అలవడింది. అలా చదివిన చదువుకు సార్థకం రచనావ్యాసాంగమేనని గుర్తించా డు. అందుకే బోయ జంగయ్య అక్షరయుద్ధాన్ని ప్రకటించాడు. అంబేద్కర్ చెప్పిన కుల నిర్మూలన కోసం జీవితాంతం పోరాడాడు. కులం చేత అవమానాలు పొందుతున్న వారి పక్షాన గొంతెత్తి నిలబడ్డాడు.

బోయ జంగయ్య(బోజ) ఏ రచన చేసినా దాని అంతిమ లక్ష్యం గౌతమ బుద్ధుడు చెప్పిన సంఘపరివర్తనే. దళిత సమూహం పడుతు న్న కష్టాలను చూసి చలించాడు బోజ. ఆయనలో ఉండే ఆర్ద్రత, ఆవేద న అనివార్యంగా రచనల్లో కూడా ప్రతిఫలించేవి. అందుకే కన్నీటి కి పర్యాయంగా కవిత్వాన్ని, ఆవేదనలకు ప్రతిబింబంగా కథలను రాశాడు. బోజ రాసిన జగడం, జాతర నవలలు తెలంగాణ అట్టడుగు ప్రజల జీవితాలను పట్టి చూపుతాయి. జాతర నవలలో ప్రజ ల్లో నెలకొని ఉన్న మూఢాచారాలు బలహీనతల్ని గుర్తించి, దళితుల మాన ప్రాణాల్ని దోచుకుంటున్న పూజారి వర్గం మీద విరుచుకు పడతాడు బోయ జంగయ్య.

బోజ మీద అంబేద్కర్ ప్రభావమే ఎక్కువ. అందుకే ఆయన ఎన్ని ఉద్యమాలు వచ్చినా అంబేద్కర్ మార్గాన్ని విడిచిపెట్టలేదు. చదువుకున్న దళితులు ఆయా ఉద్యమాలకు సులభంగా ఆకర్షితులవుతారు. అలా ఉద్యమాల ఉధృతిలో కొట్టుకుపోతారు. బోజ మాత్రం ఏనాడు తన బాధ్యత నుంచి వైదొలుగలేదు. అసలు సిసలు అంబేద్కర్ వారసుడిగా తాను ఏది నమ్మాడో, దానిని రాశాడు. రచనకు, రచయితకు మధ్య ఎలాంటి వైరుధ్యం లేని రచయిత బోజ. దళితులు విప్లవ కారులుగానో, అభ్యుదయ వాదులుగానో ఉండాలని బోజ ఆకాంక్షించలేదు. కులవ్యవస్థలో నిచ్చెన మెట్ల కింద నలిగిపోతున్న వారు, ఆత్మవిశ్వాసంతో విజయసారథులు కావాలని ఆకాంక్షించాడు. చదువు విలువను గుర్తించాడు. చదువు ద్వారా మాత్రమే దళితుల జీవితా లు మారుతాయిని నమ్మాడు. ముఖ్యం గా దళితుల కష్టాలకు మూలాలు కులవ్యవస్థలోనే ఉన్నాయనే తాత్విక దృక్పథం ఆయనది. తన ఆఖరి శ్వాస వరకు అక్షరయుద్ధంలో సైనికుడిగానే నిలబడినాడు.

అగ్రవర్ణాలకు సాహిత్యం తమ ఆధిపత్యాల్ని కాపాడే సాధనం. అట్టడుగు ప్రజల జీవితాలకు సాహిత్యం ఓ వలపోత, వ్యక్తీకరణ, విముక్తి గీతం. ఈ తాత్విక చింతనతోనే బోజ కలాన్ని ఆయుధం చేసుకున్నాడు. అట్టడుగు జీవితాలు సాహిత్యంలోకి రానంత కాలం, అది పరిపుష్టం కాదని నిర్ణయించుకున్నాడు. కవిత్వం, కథ, నవల, జీవిత చరిత్ర ఏది రాసిన బోజ తాత్త్వికత ఇదే. ఈ సమాజం మారాలి, ఈ సమాజంలోని అంతరా లు తొలిగిపోవాలి. అది జరుగాలంటే ప్రజలు చైతన్యవంతం కావాలి. ముఖ్యంగా ఊరికి దూరంగా మగ్గుతున్న వెలివాడల్లో పొద్దుపొడవా లి. అది అంబేద్కర్ తాత్త్వికతతో మాత్రమే సాధ్యమవుతుంది.

బోజ జీవించినకాలం వామపక్ష, విప్లవ, అస్తిత్వ, తెలంగాణ ఉద్యమాలు ఎన్నో వచ్చాయి. ఆ ఉద్యమాలకు మద్దతుదారునిగా ఉన్నప్పటికీ బోజ ప్రధాన దృష్టి దళిత జీవితానికి పట్టం కట్టడంపైనే. దళిత, బహుజనుల హక్కులకు విఘాతం కలుగుతున్నప్పుడు, గొంతెత్తి నిలబడిన అక్షర సైనికుడు బోజ. బోజ స్వప్నం ఒక సుందర సమాజం. దానికి దారులు వేయాల్సింది రేపటి పౌరులేనని భావించి, విలువైన బాల సాహిత్యాన్ని సృష్టించాడు. అలాగే సమాజంలో అణగారిపోతున్న మహిళలు, దళితుల పట్ల గొప్ప బాధ్యతతో రచనలు చేశాడు బోజ. సృజనలోని భాష పట్ల బోజకు స్పష్టమైన వైఖరి ఉంది. ప్రజల భాషకు ప్రామాణిక భాష అవరోధమని గుర్తించాడు. అం దుకే ఆయన ప్రామాణిక భాషా సిద్ధాంతాన్ని పక్కనపె ట్టాడు. ఏది రాసినా అది ప్రజలకు అర్థం కావాలని తండ్లాడాడు. ముఖ్యంగా కథ ల్లో సంభాషణలు వచ్చినప్పుడు అత్యంత శక్తివంతంగా రాయడం బోజకు బాగా అలవాటైన పద్ధతి. పెద్దపెద్ద విషయాల ను కూడా సులభతరం చేయడంలో దిట్ట. సమాజ చైతన్య స్థాయిని కనుగొని వారికి అర్థమయ్యేలా రచన ఉండాలని భావించాడు. అదే సృజించాడు.

బోజ తన జీవిత కాలంలో ముప్ఫైకి పైగా రచనలు చేశాడు. అందు లో ఐదు కవితా సంపుటాలు, 125 కథలు, మూడు నవలలు ఉన్నా యి. ఇక బోజ కలం నుంచి వెలువడిన అంబేద్కర్, జగ్జీవన్‌రాం, జాషువా, కేఆర్ నారాయణన్ వంటి మహనీయుల జీవిత చరిత్రలు సాహిత్య చరిత్రలో మైలురాళ్లుగా నిలిచాయి. బోజ చేసిన సాహిత్య కృషికి గౌరవ డాక్టరేట్లు వచ్చాయి. కానీ, తెలుగు సమాజంలో బోజ రచనలకు రావాల్సినంత గుర్తింపు రాలేదన్నది నిజం. ఐదు దశాబ్దాల పాటు సాహిత్యం కోసం నిలబడిన ఓ కలం యోధుడిని మన సమా జం కుదించి గౌరవించింది. తెలంగాణ రాష్ట్రంలో నైనా బోజ కృషికి గుర్తింపు దక్కాలి. అందుకోసం ప్రభుత్వం, పౌర సమాజం ఆలోచించాలి. తెలంగాణ సాహిత్య వైతాళికుల సరసన బోజకు సమున్నత స్థానం కల్పించాలి. అతడి సమగ్ర రచనలను ప్రభుత్వమే ప్రచురించి, పాఠకులకు అందుబాటులోకి తేవాలి. జీవితాన్ని ప్రజాసాహిత్యానికే ధారపోసిన ఈ మహనీయుని జీవితం నేటి తరానికి ఆదర్శం. ఆయ న సాహిత్యం, ఆ సాహిత్యం ఆశించిన సమాజం సాధించడమే ఆ మహా రచయితకు నిజమైన నివాళి.

- డాక్టర్ పసునూరి రవీందర్
77026 48825
(ఈ రోజు నల్లగొండలో జరుగనున్న బోయ జంగయ్య
ద్వితీయ వర్ధంతి సభ సందర్భంగా..)

481
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles