చెప్పకుండా వెళ్లిపోయావా!


Mon,May 7, 2018 01:10 AM

తెలంగాణ మట్టికి ఏదో మహత్తు ఉన్నది. అదేమిటో గానీ ఈ నేల నుంచి వచ్చిన కవులు అద్భుతమైన కవిత్వాన్ని ప్రపంచానికి అందించారు. ఎవరూ అం తగా పట్టించుకోని సూక్ష్మమైన విషయాలను కూడా కవిత్వంలో ప్రతిష్ఠించటం కొంచెం కష్టమైన పని. ఎంతో సున్నితత్వం ఉన్న కవి మాత్రమే జీవితం భాషను తెలుసుకొని సంభాషించగలరు. అలాంటి అరుదైన కవుల్లో అయిల సైదాచారి ఒకరు. అయిల సైదాచారి జీవితమంతా కష్టాలమయమైంది. ఆయన ఇత్తడి బిందెలు స్వయంగా తయారు చేసినవాడు. ఆ ఇత్తడి బిందె తయారు చేయటానికి నేపథ్యమైన కంచరి కులం నుంచి వచ్చినవాడు. అందుకే తాను ఎక్కడినుంచి వచ్చాడో ఆ జీవితాన్ని కవిత్వంగా రాశాడు. కంచర కులానికి సంబంధించిన కవిత్వం ఆయనలో ఉంది.
Srinivas-Denchanala
ఆయన ప్రధానంగా స్త్రీని కేంద్రంగా చేసుకొని కవిత్వం రాశాడు. సూర్యాపేట ప్రాంతానికి చెందినవాడు. కంచరి జీవితం, బహుజన వాస్తవికత, స్త్రీ పురుష సంబంధాలు, మానవ సంబంధాలు, స్త్రీల పట్ల సానుభూతి, సహానుభూతిని అయిల సైదాచారి కవిత్వం గా మలిచాడు. తెలంగాణ మధ్యతరగతి జీవితంలో ఉన్న నైరా శ్యం, ప్రేమ, సుఖదు:ఖాలు, మధ్యతరగతి బాధలు,జీవనవిధానాన్ని సైదాచారి కవిత్వంలో చూడవచ్చు. ఆయన సంగీతం మీద ప్రేమతో వయోలిన్ విద్వాంసుడు కావాలనుకున్నాడు. కానీ ఆయన కవి అయ్యాడు. సాహిత్య విమర్శకుడు గుడిపాటి ప్రేరణ సైదాచారిపై బలంగా ఉన్నది. సైదాచారి చిక్కటి కవిత్వం రాశాడు. సైదాచారి కవితలను కె.శ్రీనివాస్, అఫ్సర్, ప్రసేన్ లాంటి సాహితీ వేత్తలు ఇష్టంగా అచ్చువేశారు. ఆయన స్త్రీ కేంద్రంగా రాసిన కవిత్వం ప్రధానమైంది. ఇలా స్త్రీని కేం ద్రంగా చేసుకొని కవిత్వం చెప్పుకుంటూ పోయిన వారిలో ముఖ్యుడు సైదాచారి. అందుకే ఆయన కవిత్వ సంకలనాలకు ఆమె నా బొమ్మ, నీలం మాయ అని పేర్లు పెట్టారు. స్త్రీ మీద అపారమైన గౌరవంతో, ప్రేమతో ఆయన కవిత్వాన్ని రాశాడు. ఇలా తెలుగు సాహిత్యంలో స్త్రీని కేంద్రంగా చేసుకొని కవిత్వం చెప్పినవారు అరుదుగా ఉంటారు. సైదాచారి వాదాలకు దొరుకడు. చిక్కటి కవిత్వంలో చిక్కుకొని బలమైన కవిత్వాన్ని తెలుగు సమాజానికి అందించాడు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో వచ్చిన సుదీర్ఘ, మహత్తర కవిత్వ సంకలనం (మత్త డి)లోని కవిత్వాన్ని సైదాచారి తన చేతులతో స్వయంగా కంపోజ్ చేశాడు. దాన్ని సంకలనంగా మలుచటంలో, అక్షరాలను ప్రోది చేయడం లో ఆయన కృషి ఎంతో ఉంది.

ఒక విధ్వంసక స్వరం కోసం
కాలం కుబుసం విడుస్తున్నాడు
ఫిడేల్ దుఃఖానికి దోసిళ్లు పట్టే
వాగ్గేయ కారుడేడి..?

అంటూ.. అయిల సైదాచారి అధివాస్తవికతతో తన భావాలను చెప్పాడు. అంటే ప్రపంచాన్ని ప్రతికూల పరిస్థితుల్లోకి నెట్టడాన్ని ఎదిరించాడు. ప్రతికూల శక్తులపై నాదస్వరాన్ని సైదాచారే ఊదాడు. కాలం కుబుసా ల్ని కూడా విడిచింది ఇతడే. ఫిడేల్ దుఃఖానికి దోసిలిపట్టి ప్రపంచ దుఃఖా న్ని తన దోసిళ్లలోకి వొంచుకొని మన గుండెల్లోకి పోస్తున్నాడు. ఇది కవి మనోశక్తికి ప్రతీక. అయిల సైదాచారి కవిత్వం కొత్తదనానికి, లోతైన తాత్త్విక ఆలోచనలకు చిహ్నం.

ఒక్కడే కిరణాలు కూర్చుకుంటున్న ఆత్మ వెలుగులో
ఒక రూపాన్నుంచి అరూపానికి.. లాంటి పద్య పాదాలను చూస్తే సైదాచారి ఆత్మ ప్రకాశకుడుగా కనిపిస్తాడు. లోకం చీకట్లలో తన ఆత్మను వెలిగించుకున్నవాడు సైదాచారి. ఇంత గొప్ప స్వరం ఆగిపోవటం కవిత్వలోకం భరించగలదా! ఇంత చిక్కటి కవిత్వం రాసే కవిని కాలమే తిరిగి వెతుక్కోవాలి. సైదాచారీ.. కవిగా కవిత్వంగా నిత్యం చరిస్తూనే ఉంటావు. నీకు మరణం లేదు.
ఒక కవిని మరొక కవితో పోల్చలేం. కానీ కొందరు కవుల కవిత్వానికి దగ్గరున్నట్లు భావిస్తాం. ఈ తరానికి చెందిన కవులు కొం దరిని కొన్ని కోవలుగా విభజిస్తే అనంత్, నామాడి శ్రీధర్, సిద్ధార్థ, ఎం.ఎస్.నాయుడు, సీతారాం, దెంచనాల శ్రీనివాస్‌ల కోవకు చెం దినవాడు అయిల సైదాచారి. అట్లాగే ఫిడేల్ రాగాలు రాసిన పట్టా భి, వజీర్ రెహమాన్, ఆలూరి బైరాగి కవిత్వంలోని ఛాయలు అయిల సైదాచారిలో కనిపిస్తాయి. నవలా రచయితల్లో ఒడ్డెర ఛండీదాస్ తరహా కనిపిస్తుంది. శిలాలోహిత, రేవతిదేవి మగవాళ్ల ఫిలింగ్స్‌ను ఎంత బలంగా చెప్పారో స్త్రీలకు సంబంధించి కూడా అంతే నిర్భీతిగా అయిల సైదాచారి చెప్పాడు.

మందు పెట్టి మలుపుకుందామన్న
మొహంతో చుట్టేయాలి.. అని నిర్భయంగా కవిత్వం రాస్తాడు.
విడిపోయి మళ్లీ ప్రేమలో పడదామా అన్న కవితలో మొత్తం సమాజంలో ఉన్న మధ్యతరగతి ఆశలు, ఆకాంక్షలు అన్నీ ఇందు లో కనిపిస్తాయి. ప్రేమలో ఉన్నప్పుడు, పెళి ్లచేసుకున్నప్పుడు ఎంత మధురంగా, అద్భుతంగా ఆశలు, ఊహలుంటాయో ఆచరణలో అందుకు భిన్నంగా ఉంటుంది. మార్కెట్ జీవితం మనుషులను మభ్యపెడుతుంది. ప్రలోభాలకు గురి చేస్తుంది. కాబట్టి ప్రేమ తాజాదనంతో ఉండాలంటే మళ్లీ ప్రేమలో పడుదామా అంటాడు.
మార్కెట్ వ్యవస్థ, వాస్తు వ్యామోహం, ఆస్తుల పెంపకాలు, అంతస్తులు నిర్మించుకోవటాలపై కోరికలు రెక్కలు విప్పుతుంటా యి. మార్కెట్ ప్రలోభాలకు గురి చేస్తుంది. కాబట్టి ఈ మార్కెట్ వ్యవస్థపైన ఉన్న కోపం, వ్యతిరేకత లాంటివన్నీ ఈయన కవిత్వం లో కనిపిస్తాయి. మోహన్ ప్రసాద్ మెచ్చుకున్న కవి అయిల సైదాచారి. కంచరి జీవితం, పదజాలం దానికి సంబంధించిన పరిభాష, విశ్వకర్మలకు చెందిన మరుగుభాష సైదాచారి కవిత్వంలో ఉంటా యి. నగర జీవితం, అపార్ట్‌మెంటుల్లో ఉండే వైవిధ్యాలు తన ఊరి తో తన విశాలమైన ఇంటితో పోల్చుకొని చక్కటి కవిత్వం చెప్పా డు సైదాచారి.

ఇంత బలమైన కవిత్వాన్ని తెలుగు సమాజాలకు అందించిన కవి అర్ధాంతరంగా కన్ను మూయడం విషాదం. డామిట్.. తెలుగు సాహిత్యానికి నష్టం జరిగింది.
అంతేనేమో అద్భుతాలను అందించినవాళ్లంతా తక్కువ వయస్సులోనే తమ సంతకాలను చేసిపోయారు. అయిల సైదాచారి కవిత్వాన్ని మనకందించి అనంతలోకాలకు వెళ్లిపోయారు. మరణించటమంటే అంతర్థానం కావటమే. సైదాచారి కవిత్వానికి మరణం లేదు. అది ఇత్తడి బిందెలాగా.. తెల్లటి వెన్నెలలాగా.. తెలుగు సాహిత్యంలో ప్రకాశిస్తూనే ఉంటుంది.
- జూలూరు గౌరీశంకర్, 94401 69896
(అయిల సైదాచారికి నివాళిగా)

532
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles