మనకూ ఉంది భావ కవిత


Sun,April 29, 2018 11:23 PM

ఈ సంకలనంలో ఉన్న 538 కవితల్లో దాదాపు 460కి పైచిలుకు కవితలు దేశి, మార్గ ఛందస్సులోనే ఉన్నాయి. ఎక్కువగా సీసము, తేటగీతులలో ఉన్నాయి. ఇవి గానయోగ్యమైనవనే భావన పండితులలో ఉం ది. తెలంగాణలో వెలసిన భావ కవిత్వంలో కులాంతర, మతాంతర ప్రేమలు ధనిక, పేద మధ్య ఉండే ప్రేమ విఫలాలు, సఫలతలు కనిపిస్తాయి.
telangana-vikasam
తెలుగు సమాజాల్లో భావకవిత్వం 20వ శతాబ్దం తొలినాళ్ళలో విస్తరించింది. కానీ ఇంతవరకు మనకు తెలిసిన, మనం చదువుకున్న సాహిత్య చరిత్రలు, పరిశోధనా గ్రం థాలు భావకవిత్వం అంటే ఆంధ్ర కవిత్వం అనే విధంగానే చూపించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో భావకవితా వికాసం అనే సంకలనాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రపంచ తెలుగు మహాసభ ల సందర్భంగా అచ్చువేసింది. దీనికి సామిడి జగన్‌రెడ్డి సంపాదకత్వం వహించారు. జగన్‌రెడ్డి తెలంగాణలో భావకవిత్వాన్ని రెండు దశలుగా విభజించుకొన్నారు. 1920-43 వరకు ఒక దశ, 1948-66 వరకు మరో దశ. వీరు పరిశోధించి, సేకరించి, సంకలనం చేసిన ఈ బృహత్తర గ్రంథం దాదాపు 650 పేజీలతో రాయల్ సైజ్‌లో ఉన్నది. ఇందులో 53 8 కవితలున్నాయి. సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకిషన్‌రావు, కోదాటి రామకిషన్, శేషబట్టర్ రామానుజాచార్యులు, బుక్కపట్టణం తిరుమల నరసింహాచార్య, ఉదయరాజు శేషగిరిరాజు, గవ్వా అమృతరెడ్డి, గార్లపాటి రాఘవరెడ్డి, సిరిగూరు జయరావు, కైరం భూమదాసు, మామునూరు నాగభూషణరావు, సన్నిధానము సూర్యనారాయణశా స్త్రి, గంగుల శాయిరెడ్డి, వానమామలై వరదాచార్యులు, వెల్దుర్తి మాణిక్యరావు, బూర్గుల రంగనాథరావు, దేవులపల్లి రామానుజరావు, బోయినపల్లి రంగారావు, ఊటుకూరు రంగారావు తదితరులను ఈ పుస్తకం అచ్చమైన పరిణతి చెందిన భావకవులుగా నిలిపింది.

సురవరం ప్రతాపరెడ్డి భావకవి రామూర్తి పేరుతో అనేక భావకవిత సమీక్షలు రాశారనీ సంపాదకులు తెలిపారు. వాటన్నిటిని సేకరిస్తే భావకవిత్వం తెలంగాణలో ఇంకెంత విలసిల్లిందో తెలుస్తుంది. భావకవి త్వ చరిత్రను పూర్తిగా మార్చి కొత్త చరిత్ర రాసుకోవలసిన అవసరాన్ని తీసుకువచ్చింది ఈ సంకలనం. ఇందులో అనువాద కవితలూ ఉన్నాయి. అనంతర తెలంగాణలో వెలువడుతున్న భావకవిత్వాన్ని వెక్కిరిస్తూ సురవరం రెండు వ్యంగ్య కవితలు రాశాడని తెలిపారు. కృష్ణ పక్షాన్ని వ్యతిరేకిస్తూ శుక్లపక్షం సంకలనం వచ్చింది. ఈ కోణాల్లో తెలంగాణ భావ కవిత వికాసాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం ఉం ది. 1920లో ఇనుగుర్తి నుంచి వెలువడిన తెనుగు పత్రిక, హనుమకొండ నుంచి వెలువడిన ఆంధ్రాభ్యుదయం, 1926లో ప్రారంభమైన గోలకొండ పత్రిక, 1927 నుంచి ప్రారంభం అయిన సుజాత పత్రికలు తెలంగాణలోని భావ కవిత్వానికి ప్రముఖ స్థానం కల్పించాయి. ఈ పత్రికలను ప్రధాన ఆకరంగా స్వీకరించి జగన్‌రెడ్డి ఈ పుస్తకాన్ని సంకలనం చేశారు.

సుజాత పత్రిక భావకవిత్వాన్ని ఆద్యంతం పెంచి పోషించింది. దీనికి తొలి ఎడిటర్ బి.ఎన్.శర్మ, ప్రింటింగ్ అండ్ పబ్లిషర్ సురవరం ప్రతాపరెడ్డి. తర్వాతి కాలంలో కొండా బాలకృష్ణరెడ్డి ఎడిటర్‌గా ఉన్నారు. పత్రికలే కాకుండా గొలకొండ కవుల సంచిక, సురభి (బుక్కపట్నం తిరుమల నరసింహ), రామగిరి, ప్రణయసౌరభం, నివేదన(బూర్గుల రామకిషన్ రావు), ఉదయలక్ష్మి(శేషాద్రి వెంకటరమణ కవులు), ఋతుసంహారం (గొట్టిముక్కల రాధాకృష్ణమూర్తి), భావప్రపంచం (శేషబట్టరు రామానుజాచార్యులు) ఇతర కవుల ప్రత్యేక సంకలనాలను కొన్నింటిని గ్రహిం చి ఈ పుస్తకాన్ని సంకలనం చేశారు. ఇందులో ప్రత్యేకమైన అంశం మహిళలు భావకవిత్వం రాయడం. మాడపాటి హనుమంతరావు స్మార క ఆంధ్ర బాలికోన్నత పాఠశాల వారు 1934లో వెలువరించిన ఆరు వార్షిక సంచికలో జగన్‌రెడ్డి గారికి ఒకటి లభ్యమైంది. అందులోంచి వెలికి తీసిన స్త్రీల భావకవిత్వాన్ని ఇందులో పొందుపరిచారు. మిగిలిన ఐదు సంకలనాలు దొరికితే మరింత మహిళా భావకవిత్వం వెలుగుచూసే అవకాశం ఉన్నది.

ఈ సంకలనంలో దాదాపు 8 మంది ఆంధ్ర రచయితల కవితలు కూడా ఉన్నాయి. వారి కవితలను స్వీకరించడానికి కారణం వారు తెలంగాణలో 150 సంవత్సరాలకు ముందే స్థిరపడ్డారని సంపాదకుడు వివరించారు. అందులో ముఖ్యంగా రాయప్రోలు సుబ్బారావు ఒకరు. భావకవిత్వానికి ఆద్యులైన వారిలో ఈయన ఒకరు అని చరిత్ర చెబుతుంది. ఈయన భావకవిత్వాన్ని ఎక్కడి నుంచి రాశాడు, ఈయన స్థిర నివాసం ఎక్కడుందనే అంశాలను పరిశీలిస్తే భావకవిత్వం తెలంగాణలోనే ప్రారం భమైంది అన్న వాదన బలంగా నిలబడుతుంది. తెలంగాణలో వెలసిన భావకవిత్వాన్ని సంపాదకులు విభజించిన రీతిలో ప్రణయం, ప్రకృతి, ప్రశంస, మహిళావరణం అని భావించవచ్చు. అయితే ఇందులో ఇంకా వేరే శాఖల కవిత్వాలు కూడా కనిపిస్తున్నాయి. భక్తి, దేశభక్తి అందులో భాగమైన తాత్వికత కూడిన కవితలు కూడా ఉన్నాయి. ముందుగా తెలంగాణలో వచ్చిన ప్రణయ కవిత్వాన్ని పరిశీలిద్దాం. ప్రణయ కవిత్వా న్ని సి.నారాయణరెడ్డి ప్రధానంగా రెండు రకాలుగా విభజించారు. వస్త్వాశ్రయరీతి, ఆత్మాశ్రయరీతి. ప్రణయ కవిత్వం విరివిగా తెలంగాణలోవచ్చింది.

సురవరం ప్రతాపరెడ్డి రాసిన కవిత్వం అత్యంత సౌకుమా ర్యం, రమణీయం, భావగర్భితంగా ఉంది. వస్తువాశ్రయ ప్రణయ కవి త్వం ఈ సంకలనంలో విరివిగా ఉంది. నిశ్చయ చరిత్ర, కుబేర విజయ ము, శుకోపదేశము, గోపికా సాంత్వనము (చంపూరచన), సూతాఖ్యాయిక, ఓరుగల్లు, అనార్క లి మొదలైన కవితలు వస్త్వాశ్రయ ప్రణయ కవిత్వానికి ఉదాహరణలు. ప్రణయ కవిత్వంలో తలపోత కూడా ఒక అంశమే. అంటువంటి తలపోతను గుర్తుచేసే కవితలు చాలానే ఉన్నాయి. భావకవి ఊహలకు ఎల్లలు లేవు, భావకవిత్వాన ని కాలం, స్థలంతో సంబంధం లేదు. స్వేచ్ఛ ఆత్మాశ్రయ కవిత్వంలో ఒక కొత్త పోకడ. అటువంటి కవిత్వ ఛాయలు తెలంగాణలో వెలసిన భావకవిత్వ శాఖలలో కనిపించాయి. ప్రశ్నార్థక రూపంలో కృష్ణశాస్త్రి అటువంటి కవిత్వాన్ని వెలిబుచ్చాడు. అటువంటి రీతిలోనే బూర్గుల రామకిషన్‌రావు ప్రేమగీతిని తెలుపుతున్నాడు. భావకవి తననుతాను ఓదార్చుకున్న తీరులో కూడా ఇక్కడ కవిత్వం కనిపిస్తుంది. సొంపు అనే కవితలో శేషబట్టరు వేంకట రామానుజాచార్యులు ప్రేమ అంటే శృంగారానికి ప్రాధాన్యాన్ని కోరనంటాడు.

ప్రణయినికి కవితలో బూర్గుల రంగనాథరావు ప్రథమ సందర్శముననే ప్రణయమూర్తి జనిస్తుందనే భావాన్ని వ్యక్తం చేశాడు. నాటి ప్రేమాంకురంబు ఈనాడు నింగినంటు శాఖల గల భూరుహముగబెరగె అంటూ ప్రేమ ఎంత బలీయంగా మారుతుందో తెలిపాడు. భావకవిత్వం ప్రేయ సీ ప్రియులమధ్యనే కాదు దంపతుల మధ్య కూడా ఉంటుందని తెలంగాణ నిరూపించింది. బండా ఆంజనేయులు ఉప్పరి దంపతులు ఎంకి పాటలకు ఏ మాత్రం తక్కువకాని రీతిలో ఈ భావగీతం ఉంది. ఉన్నంతలో ఎంత ప్రేమగా ఉంటున్నారో చెబుతూనే అంతర్లీనంగా సామాజిక పరిస్థితులను తెలిపిన గీతం ఇది. భావకవిత్వంలో ప్రకృతి వర్ణనలు కూడా ఒక శాఖ. ఈ సంకలనంలో సామిడి జగన్‌రెడ్డి ప్రకృతి కవిత్వాన్ని కూడా సంకలనం చేశారు. ప్రకృతి కవిత్వంలో ప్రణయ కవిత్వం తొలి మెరుపురూపంలో వి.గోపాలకృష్ణారావు ప్రకటించిన భావుకతను, కోకి లా కవితలో కాళోజీ నారాయణరావు ధ్వన్యాత్మకంగా ప్రకృతి రమణీయకతను తెలిపారు. ఎండకాలపు వాన గురించి రాజయ్య తెలిపారు. భక్తి కవిత్వం కూడా భావకవితా శాఖలలో ఒకటి. నీతి, తాత్తిక కవి త్వం, దేశభక్తి కవిత్వం కూడా భక్తి కవిత్వంలో భాగమే. అటువంటి కవితలలో దేశమాత శీర్షికతో వి.లక్ష్మీదేవమ్మ, శారదా శీర్షికతో మోటుపల్లి కృష్ణమాచార్యులు రాశారు. తెలంగాణలో మహిళలు భావకవిత్వం రాశారని మొట్టమొదటి సారిగా వాటిని జగన్‌రెడ్డి నిరూపించారు. మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాల, వార్షిక సంచికలలో వారి కవిత్వాన్ని కనుగొన్నారు.

భావకవిత్వం 1940వ ప్రాంతాల్లో అంతరించింది అన్న మాట అవాస్తవమని సంపాదకులు నిరూపించారు. దీన్ని ఇంకాస్త పరిశోధనాత్మకం గా చూస్తే తెలంగాణలో భావకవిత్వం వీరనుకుంటున్నట్లు 1966 వరకు విలసిల్లిందని చెప్పవచ్చు. 1948 నుంచి 1966 వరకు 65 కవితలను వీరు పేర్కొన్నారు. మొదటి దశ భావకవిత్వం ఉద్యమంగా వెలువడింది. మలిదశ భావకవిత్వం ఇతర కవిత్వధోరణుల నీడలలో వెలువడింది. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం పరిశీలించాలి. ఇందులో సంపాదకులు కవితలు ఎక్కువభాగం కాలానుసరణ పద్ధతిని అనుసరించి పొందుపరిచారు. చదువరులకు అనుకూలంగా ఉంటుందని భావించి ఉంటారు. అయితే ఇందులో ఏ ఉపవిభాగాలను చేయలేదు. ఒక్క రెండవ దశ భావకవిత్వం, అనుబంధం అనేవి తప్ప. అకాడమిక్ కోణంలో ఈ కవితలను వారు పేర్కొన్న రీతిలోనే ప్రణయం, ప్రకృతి, ప్రశంస, మహిళా కవితావళి ఇంకా ఇతర ఉపవిభాగాలుగా విభజించి ఉంటే బాగుండేది. అలా విభజించాక అందులో వారు పొందుపరిచినట్లు కాలానుసరణ పద్ధతి పాటించి ఉంటే భావకవిత్వ తీరుతెన్నులు ఇంకా చాలా సులభం గా అర్ధమయ్యేది. భావకవిత్వం గానయోగ్యమైంది. భావ ప్రధానమైం ది. ఆత్మనాయకము, ఏకభావాశ్రయమైంది.

భావకవులు వియోగ శృం గారముకే ప్రాధాన్యం ఇచ్చారు. తెలంగాణ భావకవిత్వంలో అన్నిరకాల శృంగార భావనలకు ప్రాధాన్యం కనిపిస్తుంది. భావకవిత్వంలో అనుభూతి ఉద్వేగం వ్యక్తమవుతూనే ఏదోఒక నీతినో, తాత్త్వికతనో ధ్వన్యాత్మకంగా తెలుపుతున్న శైలి కనిపిస్తుంది. నిజానికి భావకవిత్వంలో స్వేచ్ఛాయుతమైన వర్ణనలే ఉంటాయి. అలా ఉంటూనే కొత్తరకం భావుకతను ప్రవేశపెట్టిన తీరు కవిపిస్తుంది. ఎన్ని కల్పనల మీద ఆధారపడ్డా అనుభూతి మాత్రమే ప్రధానమైనది. అటువంటి అనుభూతిని వ్యక్తం చేస్తూనే కొత్త కోణంలో తమ భావుకతను వెలిబుచ్చారు తెలంగాణ భావకవులు.

ఈ సంకలనంలో ఉన్న 538 కవితల్లో దాదాపు 460కి పైచిలుకు కవితలు దేశి, మార్గ ఛందస్సులోనే ఉన్నాయి. ఎక్కువగా సీసము, తేటగీతులలో ఉన్నాయి. ఇవి గానయోగ్యమైనవనే భావన పండితులలో ఉం ది. తెలంగాణలో వెలసిన భావకవిత్వంలో కులాంతర, మతాంతర ప్రేమలు ధనిక, పేద మధ్య ఉండే ప్రేమ విఫలాలు, సఫలతలు కనిపిస్తాయి.
- డాక్టర్ మల్లెగోడ గంగాప్రసాద్, 99123 59070

687
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles