ప్రాణికోటి జీవనాంతర్లయ


Sun,April 29, 2018 11:22 PM

అనుభూతులను దృశ్యాలుగా, దృశ్యాలను అనుభూతులుగా చిత్రించే శిల్పవైవిధ్యం ఈ కవితల్లో అభివ్యక్తికి సంబంధించిన విశేషం. నాకు పిడికెడు నిద్ర కావాలి అంటాడు. నిద్ర వస్తువు కాదు. అది అనుభవం మాత్రమే. కాని పిడికెడు అనే మాటలో ఏదో దానం అడుగుతున్నట్లు, అది కరువైనట్లు వెంటనే పాఠకుని మనసులో నిలిచిపోతుంది.
aksharala-chelimi
వారాల ఆనంద్ లయ కవితా సంపుటితో మొదలుపె ట్టి ఇప్పటికి నాలుగైదు కవితా సంపుటాలు వెలువరించారు. కవిత్వంతో పాటు ఆయన సినీరంగానికి సంబంధించిన శోధనలు, విమర్శలు, విశ్లేషణలు అనేకం చేశారు. వారాల ఆనంద్ అనగానే ఎక్కువమందికి సినీ విశ్లేషకులుగా పరిచయం. కాని ఆయన తొలుత కవి. ఇప్పటికీ ఆయన ఆత్మ కవితాకళ యే. కవిత్వం ఆయన మౌలికమైన కళారూపం. ఇప్పుడు వెలువరించిన అక్షరాల చెలిమె తన కవిత్వంలోనూ, ఈనాటి సమకాలీన కవిత్వంలోనూ విలక్షణమైనది. అక్షరాల చెలిమె అని పేరుపెట్టడం వెనుక ఆరని తడి ఒకటి ఉం దనే సూచన ఉంది. ఈ ఆరని తడియే వేదన. వేదన నుంచే వేదాలు, రామాయాణాది కావ్యా లూ వెలువడ్డాయి. మనిషికి జీవధాతువు వేదనయే. దాన్ని కవిత్వం చేయడం కళ. అది చెలిమెగా కవితాక్షరాలను ఊరించి సాహితీ పిపాసువులకు కవితాదాహార్తిని తీర్చే కవిత్వం ఇం దులో ఉంది.

కవులు దృశ్యాలకు, సంఘటనలకు స్పందిం చి తమవైన అనుభూతులను, స్పందనలను అందించడం కనపడుతుంది. అవి రాజకీయాలు, ప్రకృతి విధ్వంసం, పల్లెల్లో మార్పులు, కుల,మత,ధన భేదాలవల్ల కలుగుతున్న అసమానతలు.. ఇట్లాంటి వస్తువులు ఎక్కువగా కనిపిస్తాయి. లేదా సమకాలీనమైన ఉద్య మంచోటు చేసుకుంటుంది. ఆనంద్‌లో వీటన్నిటికంటే విలక్షణంగా మానవాత్మలో కదిలే అత్యంత లోతైన అనుభూతులను, తన నుంచి అందరికీ, అందరి నుంచి తనకు ప్రసా రం చేసే ఒక విలక్షణమైన అభివ్యక్తి ఉంది. ఇందులో వస్తువూ, అభివ్యక్తీ రెండూ భిన్నంగా సాగినాయి. 72 కవితల ఈ సంకలనంలో కవిత్వాన్ని గురించి తనదైన ఆలోచనను, దృక్పథాన్ని, తత్త్వాన్ని తెలియజేసేశారు.
యమయాతన/తెల్లకాగితంపై నాలుగక్షరాలు పొదగడానికి/ నాలుగు మాటలు అల్లడానికి
నాలోకి నేను ప్రవేశిస్తాను/.............. మనసులోకి వెళ్ళాను/ ఆత్మలోకి తొంగిచూశాను
నిజంగానే నాకు తెలీని విషయాలు/నాలోనూ వున్నాయి......

ఇది తనను తాను అన్వేషించుకోవడం. ఒకవిధంగా ఆత్మాన్వేష ణ. అయితే ఇందులో దైవం, పరమాత్మ వంటివాటి ప్రస్తావన ఉం డదు. మనిషిని గురించి ఎన్నో అంశాలున్నాయని, అవి తనలో ఉం డికూడా తానే గ్రహించలేకపోయానని వాటిని ఇప్పుడు తనతోపాటు మనకూ అందించాలనే ఒక తపన కనపడుతుంది. అయితే ఇది నాలో అని చెప్పడం ఆత్మాశ్రయం. ఒకప్పుడు భావకవులు ఈ ఆత్మాశ్రయ పద్ధతిని ఎక్కువగా వాడుకున్నారు. కాని అది కల్పిత భావనలకే పరిమితమైంది. ఊహాసుందరులు, కల్పితదుఃఖాలు, భావకవిత్వంలో ఉండి తాత్కాలికంగా కదిలించినా స్థిరంగా నిలువలేవు. ఆనం ద్ ఆత్మాశ్రయ పద్ధతిలో వ్యక్తీకరించడం మాన వ సహజానుభూతులను మాత్రమే కాని కల్పితాలను, ఊహలను, భ్రమలను, రాని కాని కలలను గురించి కాదు.

కవిత్వం అనే శీర్షికలో కవిని గదా/ చీకటిని ఆహ్వానించాను/ వచ్చేయి నీ బయటి ప్రపంచాన్ని వదిలేసి/ ఇక్కడ పోగొట్టుకునేది ఏదీ లేదు/ పోగొట్టుకున్నది వెతుక్కోవడానికి కాదు కవిత్వం/ పోగొట్టుకున్నది కూడా మన వెంటుండడమే కవిత్వం అని కవితానిర్వచనం మరో విధంగా. ఇక్కడ కూడా తననుతాను పట్టుకోవడమే, అది వెంటబెట్టుకోవడమే కవిత్వం అంటారు. భౌతిక సంపదలా? మనోవేదనలా? జ్ఞాపకాలా? చరిత్ర చెప్పిన అశేషవిశేష సారాంశాలా? వైయక్తికమా? సామూహికమా? దేనికైనా వర్తించవచ్చు. ఇట్లా బహుళార్థకంగా ప్రయోగించడమే కవిత్వంలో ఒక నేర్పరిత నం. కవిత్వం ఆర్ట్ మాత్రమే కాదు అది నిత్యం సాధనచేసే క్రాఫ్ట్‌గా చూపించారు ఆనంద్.

భావాలు అక్షరాలుగా రూపాంతరం దాల్చినప్పుడుగదా/ నేను సంభాషించడం మొదలుపెట్టింది/ అక్షరాల చెలిమెలోంచి/ నన్ను అందరూ వినడం ఆరంభించింది. అని తన ఆత్మపలికిన భావాలకు అక్షరరూపం ఇచ్చినవే ఈ కవితలు. ఒకవిధంగా ఇందులో అనేకం కవిత్వం గురించి చెప్పిన మాటలు కవిత్వం మీద కవిత్వం చెప్పినట్టుగా కనిపిస్తాయి. అలంకార శాస్త్ర ప్రమాణాలతో, ఆధునిక పాశ్చా త్య సాహిత్య ప్రమాణాలతో నిర్మాణ శిల్పాలను కొలువవచ్చుగాని అనుభూతుల లోతులను అందించలేవు. అది కవిత్వం మాత్రమే చేసే కళ. దాన్ని నిర్వచిస్తే దాని కళారూపం చిన్నబోతుంది.

కాలం, లయ, గమనం, నిద్ర, చుక్కల్లోకి, నిరంతరం, దారి, కక్ష, కన్నీటిధార, దిగులు పేజి, అలిఖిత, మొలక, మూలం, హృద యం, తెరచాప ఇవీ ఆయన కవితా సామగ్రి. కవితల వస్తువులన్నీ హృదగతాలే. భౌతిక వస్తువును తీసుకున్నా అది పోలికగానో, రూపకంగానో కనిపిస్తుంది తప్ప అసలు వస్తువు కాదు. ఆయా వస్తువుల ను గురించిన కవిత్వం ఉండదు. ఉదాహరణకు కాపలాదారులు అనే ఒక కవితలో చంద్రుడు రాత్రంతా అందాన్ని వెదుకుతున్నాడ ని, సూర్యుడు పగలంతా ప్రాణుల్లో ఆనందాన్ని వెతుకుతున్నాడనీ అంటారు. ఇందులో సూర్యచంద్రులు కనిపించినా చెప్పదలచుకున్నది మాత్రం జీవుల్లోని అందం, ఆనందం గురించి మాత్రమే. ఏది అందం? ఏది ఆనందం? అవి ఎక్కడ ఉన్నాయి? ఎట్లా ఉన్నాయి? ఎట్లా ఉంటాయి? జీవితంలో ఈ రెండు ప్రతి ప్రాణికీ అవసరమనే మహార్థాన్ని ఈ కవిత్వం వ్యంజింపజేస్తుంది. ఇది తెలుగువాళ్ళకో తెలంగాణ వాళ్ళకో మాత్రమే కాదు. యావత్ మానవాళికి, ప్రాణికోటికి సంబంధించినది.

అనుభూతులను దృశ్యాలుగా, దృశ్యాలను అనుభూతులుగా చిత్రించే శిల్పవైవిధ్యం ఈ కవితల్లో అభివ్యక్తికి సంబంధించిన విశేషం. నాకు పిడికెడు నిద్ర కావాలి అంటాడు. నిద్ర వస్తువు కాదు. అది అనుభవం మాత్రమే. కాని పిడికెడు అనే మాటలో ఏదో దానం అడుగుతున్నట్లు, అది కరువైనట్లు వెంటనే పాఠకుని మనసులో నిలిచిపోతుంది. లయ అనే కవితలో ఇంట్లో ప్రాణవాయువులా కదలాడే కవిత్వం అంటారు. ఇదేదో కదలాడే ప్రాణివలె రూపింపజేస్తారు. కాని ఇది అరూపమై ఆవరించిన అనుభూతి మాత్రమే.ఈ కవిత్వానికి నిర్వచనం చెప్పుకోవడమంటే మళ్ళీ ఆత్మలోయల్లోకి దిగటమే. అక్కడే ఒక విషాదం నిండి ఆనందాన్నందించే రసానుభూతి కలుగుతుంది.

ఆనంద్ కవితల నిండా ప్రధానంగా కనిపించేది తడి ఉన్న అంతర్లయ కోసం పడే వేదన. అయితే నిరాశ, నిస్పృహ లేదు. గమన మూ, దారీ, గమ్యమూ అన్నీ నేనుగా అంటే మానవునిగా సాధించే అచంచలమైన ఆత్మవిశ్వాస ప్రకటన ఉంది.
నువ్వేమో నిరంతరం/ప్రయాణిస్తున్న దారివి
గమ్యం తెలిసిన రహదారివి
........................
దేహాల్ని చిదిమేస్తే/ మరణాలు సంభవిస్తాయా?
చెట్టుకొమ్మలమీద/ పూల రెమ్మల మీద
నీ పాటింకా వినిపిస్తూనే ఉంది/తడి ఉన్న గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. అంతర్లయగా వ్యాపిస్తూనే ఉంది.
కవిత్వం నిండా మానవ జీవనయానంలోని నిత్య జీవనార్ద్రత అంతర్లయగా విని పంచిన కవితలు అక్షరాల చెలిమె.
- డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, 98493 28036

424
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles