తెలంగాణ సోయిలేని చరిత్ర


Sun,April 22, 2018 11:49 PM

పరిశోధనా పరంగా చూసినట్లయితే ఈ గ్రంథంలో తెలంగాణ చరిత్రకు సరైన స్థానం లభించలేదని తెలుస్తుంది. ఈ గ్రంథ రచయితల్లో చాలామంది సీనియర్స్ ఉన్నప్పటికీ, ఆధారాలు గుర్తించి అప్‌డేట్ లేదు. కొంతమందికి ఈ మధ్య కాలంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతిపై వచ్చిన చర్చలు, నూతన ఆధారాల గురించి తెలిసినట్లు లేదు. ముఖ్యమంగా సంపాదకుడికి తెలంగాణపై కచ్చి తమైన అవగాహన లేనట్లు తెలుస్తుంది. ఎందుకంటే స్వతహాగా గత 20 ఏండ్లకుపైగా అయిన తెలంగాణ చరిత్రపై పరిశోధనావ్యాసంగాని, పుస్తకంగాని ప్రచురించలేదు. సమగ్ర చరిత్ర రాసినప్పు డు నూతన ఆధారాలు పరిశోధనా రంగంలో చోటుచేసుకున్న మార్పులను ప్రస్తావించడం అవసరం. కానీ ఈ పుస్తకంలో అలాంటి ప్రయత్నం జరుగలేదు.

ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ పేరుతో వకుళాభరణం రామకృష్ణ సంపాదకత్వంలో వెలువడి న గ్రంథంపై ద్యావనపల్లి సత్యనారాయణ సమీక్షా వ్యాసం (నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 9)లో కొన్ని కీలకమైన అంశాలను లేవనేత్తాడు. ఈ గ్రంథంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, రచయితలు ఏ విధమైన వివక్షకు, విస్మరణకు గురైంది అనే విషయాలను సోదాహరణంగా వివరించాడు. ముఖ్యంగా గమనించాల్సిన అంశమేమంటే ఈ గ్రంథం టైటిల్ తెలుగు మాట్లాడే ప్రజల చరిత్ర మరియు సంస్కృతి ఆధారాలు, క్రీ.పూ. 500-క్రీ.శ.2016 చాలా అసమంజసంగా ఉంది. డిసెంబర్, 2017 లో ప్రచురించబడిన ఈ గ్రంథం టైటిల్ ముసుగులో తెలంగాణ ప్రాంతీయ చరిత్ర, సంస్కృతిని మరుగున పెట్టా రు. అంతేకాకుండా తెలుగు మాట్లాడేవారు అనేది చాలా అస్పష్టమైన ఉచ్చారణ. దానికి ఒక నిర్దిష్టమైన చారిత్రకత, అస్తిత్వం ప్రత్యేకత లేదు. ఎందుకంటే తెలుగు మాట్లాడే ప్రజలు దేశ, విదేశాల్లో ఉన్నారు. మరి వారందరి చరిత్ర, సంస్కృతి గురించి ఈ గ్రంథంలో ప్రస్తావించలేదు. 2014 లో రెండు తెలుగు రాష్ర్టాలు ఏర్పాటైనాయనేది చారిత్రక వాస్తవం. అట్లాంటప్పుడు ప్రస్తుతం ప్రచురించిన ఈ గ్రంథానికి ఆంధ్ర-తెలంగాణ చరిత్ర, సంస్కృ తి, ఆధారాలుఅని పెట్టినట్లయితే సమంజసంగా ఉండేది. అయి తే ఈ గ్రంథ సంపాదకుడు తెలంగాణ పదాన్ని శీర్షికలో చేర్చడానికి ఎందుకు ఇష్టపడలేదో అర్థం చేసుకోవాలి. దానికీ ఒక నేప థ్యం ఉన్నది.

వకుళాభరణం రామకృష్ణ జనరల్ ఎడిటర్‌గా 2014 తర్వాత ప్రచురితమైన సమగ్ర ఆంధ్రప్రదేశ్ చరిత్ర 6,7 సంపుటాల టైటిల్స్‌లో కూడా తెలంగాణ పదం లేదు. ఆరవ సంపుటం Early Modern Andhra Pradesh and Company Rule, 1724-1857 అనే శీర్షికన ప్రచురితమైంది. ఏడవ సంపుటం Modern Andhra and Hyderabad, 1858-1956 ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే మోడ్రన్ ఆంధ్ర అనే పదం వాడి, తెలంగాణను విస్మరించాడు. అయితే నాతో పాటు కొంతమంది చరిత్రకారులం వాల్యూం టైటిల్స్ సంబంధించి చర్చ లేవనెత్తినప్పుడు మాత్రమే అనివార్యంగా 2016లో ప్రచురితమై 8వ సంపుటానికి సమకాలీన ఆంధ్రప్రదేశ్-తెలంగాణ 1956, 1990 అని పెట్టడం జరిగింది. అట్లాంటప్పుడు 2018 లో వెలువరించిన గ్రంథం శీర్షికలో తెలంగాణ పదం చేర్చకపోవడం యాదృచ్ఛికం కాదనేది స్పష్టమౌతుంది. ఈ గ్రంథ రచనలో తెలంగాణ ప్రాంతం వారికి సముచిత స్థానం కల్పించలేదనే విష యం కూడా గమనించాలి.

ఈ గ్రంథ రచనలోని మొత్తం 22 మందిలో తెలంగాణకు చెందిన వారు ముగ్గురు మాత్రమే ఉన్నా రు. అంతేకాకుండా ఈ 22 మందిలో 12 మంది సంపాదకుని సామాజిక (కుల) వర్గానికి, ప్రాంతానికి చెందినవారుండటం కూడా యాదృచ్ఛికం కాదనేది స్పష్టం. అస్మదీయులకు పెద్దపీట వేసి, తస్మదీయులను విస్మరించడమనేది దుర్మార్గమైన బ్రాహ్మణికల్ సంప్రదాయం, నీతి. ఈ గ్రంథ సంపాదకుడు ఆ నీతిని అమలుచేసినాడనేది గమనించాలి. ఎందుకంటే ఈ గ్రంథ రచయితల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన దళిత, బహుజన మేధావులకు స్థానం కల్పించలేదు. శీర్షికలో తెలంగాణ చేర్చకపోవడం ఈ గ్రం థ రచనలో తెలంగాణ బహుజన స్కాలర్స్‌కు స్థానం కల్పించకపోవడం సంపాదకుని అహంభావానికి నిదర్శనమా? లేక వారిపై ఆయనకున్న ద్వేషమా? అనేది అర్థం కాని విషయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ప్రస్తుత తరుణంలో సబాల్ట్రన్ దృక్పథంతో పలువురు చరిత్రకారులు తెలంగాణ చరిత్ర, సంస్కృతి తిరుగరాయడానికి కృషి చేస్తున్నారు. వారిలో ఈ వ్యాసకర్తతో పాటు భూక్యా భాంగ్యా, జంగం చిన్నయ్య, సుధారాణి, ద్యావనపల్లి సత్యనారాయణ, ఇనుకొండ తిరుపతితో పాటు అనేకమంది ఉన్నారు. ఆం ధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ ఉమ్మడి సంస్థ ఆధ్వర్యంలో ప్రచురించబడిన గ్రంథంలో ప్రాంతీయ, సామాజిక సమతుల్యాన్ని పాటించడం న్యాయ సమ్మతం. తెలుగువారి పేరుతో సంపాదకుడు పక్షపాత వైఖరి అవలంబించడం సహేతుకం కాదు. గ్రంథ రచన అనేది ఒకే ప్రాంతానికి, వర్గానికి చెందిన సమిష్టి ఎకడెమిక్ కృషి. అట్లాంటప్పుడు ఏకపక్షంగా సెలెక్టెడ్ స్కాలర్స్‌ను ఎంచుకోవడం ఆక్షేపణీయం.

వాస్తవానికి వకుళాభరణం రామకృష్ణ జనరల్ ఎడిటర్‌షిప్‌లో ప్రచురితమైన గ్రంథాలు అసమగ్రంగా ఉన్నాయని అనేకమంది తెలంగాణ రచయితలు, మేధావులు 2011నుంచీ ప్రస్తావిస్తున్నారు. అయినప్పటికీ తెలుగువారు ముసుగులో ప్రాంతీయపక్షపాతం చూపడం సంపాదకుని నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది. ద్యావనపల్లి సత్యనారాయణ సమీక్షా వ్యాసంలో పేర్కొన్నట్లు సంపాదకుడు తెలంగాణ రచయితలు రాసిన గ్రంథాలను తెలుసుకునే ప్రయత్నం చేయలేదనేది నిర్వివాదాంశం. ఉదాహరణకు రామకృష్ణ స్వయంగా రాసిన సాహిత్య ఆధారాలు అధ్యాయం లో తెలంగాణ సాహిత్య చరిత్ర రాసిన అనేకమంది ప్రముఖ రచయితలను పేర్కొనలేదు. గడియారం రామకృష్ణశర్మ, ఆదిరాజు వీరభద్ర రావు, బిరుదురాజు రామరాజు, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్, జూలూరి గౌరీశంకర్, కె.శ్రీనివాస్ తదితరుల రచనలను ఈ చాప్టర్ గ్రంథ సూచికలో ప్రస్తావించలేదు. దానిని బట్టి సంపాదకుడి తెలంగాణ స్కాలర్స్ రచనల పట్ల అవగాహన లేదని తెలుస్తుంది. అదేవిధంగా జానపద కళలు-సంస్కృతి అధ్యాయంలో జయధీర్ తిరుమలరావు, యం. భాగ్య మ్మ, చింతల యాదయ్య, రక్నుద్దీన్, కసిరెడ్డి వెంకటరెడ్డి, అంజ మ్మ లాంటి తెలంగాణ రచయితల గ్రంథాలను ప్రస్తావించలేదు. దానికి కారణం ఈ చాప్టర్ రాసిన నలుగురు రచయితలు సీమాం ధ్ర ప్రాంతానికి చెందిన వారు కావడం గమనార్హం. చెప్పుకుంటూ పోతే ఈ గ్రంథంలో అనేక లొసుగులు ఉన్నాయి. అయితే ఆధునిక, సమకాలీన తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఈ గ్రంథం లో పేర్కొన్న విషయాలు చాలా అసమగ్రంగా ఉన్నాయి. పది, పదకొండవ చాప్టర్ బిలో అసఫ్‌జాహీలు, హైదరాబాద్ స్టేట్ బ్రాకెట్‌లో తెలంగాణ చాలా అసంపూర్ణంగా, నిరుత్సాహంగా ఉంది. అసఫ్‌జాహీల అధ్యాయంలో రచయిత తెలంగాణ చరిత్రకు న్యాయం చేయలేదు. ఎందుకంటే ఆ చాప్టర్ తెలంగాణ రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, దళిత, బహుజన ఉద్యమాల ప్రస్తావన లేదు. అయన పేర్కొన్న సెంకడరీ ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా 11-12వ చాప్టర్‌లో ముల్కీ ఉద్యమం, జై తెలంగాణ, తొలి మలిదశ ఉద్యమాల ప్రస్తావన లేదు. మొత్తంగా చూసినట్లయితే అధ్యాయాల్లో తెలంగాణ చరిత్ర, సంస్కృతికి సంబంధించిన ఆధారాల ప్రస్తావన ఆశాజనకంగా లేదు. సంపాదకుడు టైటిల్ పేజీలో క్రీ.పూ.5000-నుంచి క్రీ.శ 2016 వరకు ఆధారాల గురించి ప్రస్తావించినాడు. కాని గ్రంథం లోపల చాప్టర్లలో 2016 వరకు ప్రచురించిన గ్రంథాల ప్రస్తావన లేదు.

పరిశోధనా పరంగా చూసినట్లయితే ఈ గ్రంథంలో తెలంగాణ చరిత్రకు సరైన స్థానం లభించలేదని తెలుస్తుంది. ఈ గ్రంథ రచయితల్లో చాలామంది సీనియర్స్ ఉన్నప్పటికీ, ఆధారాలు గుర్తించి అప్‌డేట్ చేయలేదు. కొంతమందికి ఈ మధ్య కాలంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతిపై వచ్చిన చర్చలు, నూతన ఆధారాల గురించి తెలిసినట్లు లేదు. ముఖ్యమంగా సంపాదకుడికి తెలంగాణపై కచ్చితమైన అవగాహన లేనట్లు తెలుస్తుంది. ఎందుకంటే స్వతహాగా గత 20 ఏండ్లకుపైగా అయిన తెలంగాణ చరిత్రపై పరిశోధనావ్యాసంగాని, పుస్తకంగాని ప్రచురించలేదు. సమగ్ర చరిత్ర రాసినప్పుడు నూతన ఆధారాలు పరిశోధనా రంగంలో చోటుచేసుకున్న మార్పులను ప్రస్తావించడం అవసరం. కానీ ఈ పుస్తకంలో అలాంటి ప్రయత్నం జరుగలేదు. అందువల్ల తెలంగాణ చరిత్ర కోణాల నుంచి పరిశీలించినట్లయితే ఈ గ్రంథం కొత్త సీసాలో పాత సారాయిలా ఉందని చెప్పవచ్చు. ఈ గ్రంథ రచన లో సంపాదకుని వైఖరి పరిశీలించినట్లయితే స్వీయ దృక్కోణంలో సమగ్ర తెలంగాణ చరిత్ర, సంస్కృతిని రాయడం అవశ్యం అని గ్రహించాలి.
- అడపా సత్యనారాయణ,
95734 05551

481
Tags

More News

VIRAL NEWS