పుస్తక సంస్కృతి వర్ధిల్లాలి


Sun,April 22, 2018 11:47 PM

వివిధ భాషల సాహిత్య కార్యక్రమాలు, సభలు, గోష్ఠులు, సభలు సమావేశాలతో నిత్యం విలసిల్లే హైదరాబాద్ విశ్వ పుస్తక రాజధాని గౌరవం దక్కించుకోవాలి. పుస్తక సంస్కృతి విస్తరిల్లాలి. పుస్తకం వర్ధిల్లాలి. జయహో పుస్తకం.
మంచి పుస్తకం దగ్గరుంటే మనకు మంచి మిత్రు లు వెంటలేని లోటు కనిపించదు.
- మహాత్మా గాంధీ

Books
గాంధీ పుస్తకాన్ని మంచి స్నేహితులతో పోలిస్తే చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అంటారు కందుకూరి వీరేశలింగం. ఇది పుస్తకానికి దక్కిన గౌర వం. తాళపత్రాల పరిణామ రూపమే నేటి పుస్తకం. కాగితం, అచ్చుయంత్రం గొప్ప విప్లవావిష్కరణలు. గూటెన్ బర్గ్ రూపొందించిన అచ్చుయంత్రం చరిత్ర ఆవిష్కరణల్లో ప్రధానమైనవి. విజ్ఞానం సామాన్యుని చేతుల్లోకి ప్రసరించేందుకు ఇవి మూల మయ్యాయి. ఇవ్వాళ్ళ జెట్, వెబ్ మిషన్లతో నిమిషానికి వేలాది పేజీలు, గంటల్లో వందలాది రంగురంగుల పుటల పుస్తకాలు ముద్రిస్తున్నాం.

ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో కోట్లాది పుస్తకాలు ఏటా అచ్చవుతున్నాయి. ఆంగ్ల పుస్తకాల ప్రచురణలో మనం ప్రపంచంలో నాలుగవ స్థానంలో ఉన్నాం. దేశ భాషల విషయానికి వస్తే తెలుగు ప్రచురణలో మనం గణనీయ స్థానంలోనే ఉన్నాం. హిందీ ప్రచురణ రంగం కొద్దిగా మనకు ముందుంటే బెంగాలీ తో ముందూ వెనకా మనం పోటీపడుతున్నాం. ఇవ్వాళ్ళ మనం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందాం. ట్యాబ్‌లు, కంప్యూట ర్లు, ల్యాప్‌టాప్‌లు, పూర్తిగా పుస్తకాల కోసమే తయారుచేసిన కిండెల్ వంటి ఎన్నో గాడ్జెట్లు వచ్చాయి. ఎంతగా అభివృద్ధి చెంది నా ఇప్పటికీ పుస్తకానికే పెద్దపీట. గతంతో పోలిస్తే తెలుగునాట పుస్తకమేళాల సంస్కృతి బాగా పెరిగింది. నాలుగైదు నెలల గడువులోనే దాదాపు నాలుగు పెద్ద పుస్తకమేళాలు మన హైదరాబాదులో జరిగాయంటే పుస్తకానికి ఉన్న ఆదరణ తెలుస్తున్నది. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన పుస్త క మేళాలో జరిగిన అమ్మకాలు ఒక రికార్డు. ఆ సభలు ముగిసిన వెంటనే హైదరాబాద్ పుస్తక మేళా, వెంటనే మరో పుస్తక మహోత్సవం. నిన్న అంటే, 2018, ఏప్రిల్ 22న ముగిసిన హైదరాబాద్ ఫెస్ట్ పుస్తక మేళాను చూశాం.

మనకు అన్ని సమయ సందర్భాలకు ఒకరోజు ఉన్నట్టే, పుస్తకాలకు ఒక ప్రత్యేకమైనరోజు ఉన్నది. అది 23 ఏప్రిల్. ఈ రోజు ను మనం విశ్వపుస్తక &కాపీరైట్ దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. పుస్తకం, ఆ పుస్తకాల రచయితల గౌరవార్థం ఐక్యరాజ్యసమితి ఏప్రిల్ 23ను విశ్వ పుస్తక, కాపీరైట్ దినోత్సవంగా ప్రకటించింది. 1995లో ప్యారిస్‌లో ఐక్యరాజ్య సమితి మొదటిసారి పుస్తక, కాపీరైట్ దినోత్సవాన్ని నిర్వహించింది. 1611లో ఇదేరోజున ప్రఖ్యాత రచయితలు షేక్‌స్పియర్, గార్సిలా సోడెలా వెగాలు మరణించారు. అంతేగాక ప్రపంచ ప్రఖ్యాత రచయితలు మౌరిస్ డ్రూన్, హల్డర్ కె. లాక్స్‌నెస్, వ్లదిమీర్ నబకోవ్, జోెప్ ప్లా, మాన్యుయెల్ మెజ్‌ఫా వల్లెజో వంటివారి జయంతులు, వద్ధంతులు కూడా అదే రోజు కావడం విశేషం.
2018 సంవత్సరానికి గాను సిటీ ఆఫ్ ఎథెన్స్ విశ్వ పుస్తక రాజధానిగా ఎంపికయ్యింది. చక్కని పుస్తకాల ప్రచురణ, వలస వెల్లిన ప్రజలతో పాటు దేశ ప్రజలందరికి పుస్తకాలను అందుబాటులోకి తెస్తున్నది. పుస్తక ప్రచురణ కార్యక్రమంతో పాటు పుస్తక వికాస కార్యక్రమాలైన రచయితలు, చిత్రకారుల కార్యశాలలు, సదస్సులు, గోష్ఠులు, రచయితలతో ముఖాముఖి, కవితా పఠ నం, కవిత్వ కార్యశాలల వంటి కార్యక్రమాలు నిర్వహించి ఎథె న్స్ ఈ గౌరవాన్ని పొందింది. ఏడాది పాటు పుస్తక వికాసానికి సంబంధించిన కార్యక్రమాలు జరుపబడిన నగరాన్ని ఐక్యరాజ్య సమితి విశ్వ పుస్తక రాజధానిగా చేస్తుంది.

గతంలో మాడ్రిడ్ 2001, అలెక్జాండ్రియా 2002, న్యూ ఢిల్లీ 2003, అన్‌వర్స్ 2004, మాంట్రియల్ 2005, తురిన్ 2006, బొగోటా 2007, ఆమ్‌స్టర్‌డామ్ 2008, బెయిరుట్ 2009, ల్జుబింజా 2010, బ్యూనస్ ఎయిరిస్ 2011, ఎర్వన్ 2012, బ్యాంగ్‌కాక్ 2013, పోర్ట్ హార్‌కోర్ట్ 2014, ఇంచేలోన్ 2015, రోక్లో 2016, కాంక్రీ 2017లో విశ్వ పుస్తక రాజధానులుగా ఎంపికయ్యాయి. ఇదే కోవలో 2019కి గాను షార్జాను విశ్వ పుస్తక రాజధానిగా ప్రకటించారు. షార్జా నగరం వినూత్న పోకడలతో నిర్వహించిన పుస్తక వికాస కార్యక్రమాలకు ఈ గౌరవం దక్కింది. పఠనం, వారసత్వం, ప్రచురణ, బాల సాహిత్య వికా సం వంటి అంశాలపై ప్రత్యేకశ్రద్ధ పెట్టి రీడ్, యూ ఆర్ ఇన్ షార్జా అనే నినాదంతో ఏడాదిపాటు జరిగిన పుస్తకవికాస కార్యక్రమం దీనిని సుసాధ్యం చేసింది.
దేశ రాజధాని ఢిల్లీ ఈ గౌరవాన్ని పొందింది. 2003 భారత దేశానికి ఏవిధంగా గర్వకారణమైన సంవత్సరమో, 2006 కూడా అలాంటిదే. ఫ్రాంక్‌ఫర్డ్ పుస్తక మేళా నిర్వాహకులు భార త దేశాన్ని ఆతిథ్యదేశంగా ఏంపిక చేశారు.

ప్రపంచవ్యాప్తంగా జరిగే పుస్తక మేళాల్లో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్డ్ పుస్తక మేళా రాసి లోనూ, వాసిలోనూ పెద్దది. ముద్రణా రంగంలో సాంకేతిక ప్రగ తి, పరిజ్ఞానాన్ని బట్టి ఈ ఆతిథ్య దేశాలు ఎంపిక చేయబడినా యి. ప్రపంచ దేశాల్లో ఈ గౌరవాన్ని రెండుసార్లు దక్కించుకున్న ఏకైక దేశం మనది. మొదటిసారి ఈ గౌరవం 1986లో దక్కగా, రెండవసారి 2006లో లభించింది.స్వాతంత్య్రానికి పూర్వం అత్యంత ప్రాచుర్యాన్ని, ప్రాముఖ్యాన్ని పొందిన నగరం మన హైదరాబాద్. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అదే కోవలో యేడాదంతా పుస్తక వికాస కార్యక్రమాలు, గోష్ఠులు జరిపి హైదరాబాద్‌ను పుస్తక రాజధానిగా తీర్చిదిద్దాలి. వివిధ భాషల సాహిత్య కార్యక్రమాలు, సభలు, గోష్ఠులు, సభలు సమావేశాలతో నిత్యం విలసిల్లే హైదరాబాద్ విశ్వ పుస్తక రాజధాని గౌరవం దక్కించుకోవాలి. పుస్తక సంస్కృతి విస్తరిల్లాలి. పుస్తకం వర్ధిల్లాలి. జయహో పుస్తకం.

- డాక్టర్ పత్తిపాక మోహన్, 99662 29548
(నేడు విశ్వ పుస్తక, కాపీరైట్ దినోత్సవం)

493
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles